బిడ్డల్ని ఎందుకు క్షమించాలి.? ~ దైవదర్శనం

బిడ్డల్ని ఎందుకు క్షమించాలి.?

తప్పుచేసిన  బిడ్డల్ని తల్లితండ్రులు ఎందుకు క్షమిస్తారు? ఎందుకు శిక్షించకూడదు? ఇది తెలియాలంటే తప్పు చేసిన శకుంతలా దుష్యంతులను కణ్వమహర్షి ఎందుకు శపించలేదో తెలియాలి. వ్యాసుడు తల్లి తండ్రులకు చెప్పిన హితబోధ ఈ విధంగా శకుంతోపాఖ్యానంలో ఉంది. 

దుష్యంతుడు వెళ్ళిన కొంతసేపటికి కణ్వమహర్షి తన ఆశ్రమానికి వచ్చాడు. శకుంతల బిడియపడుతూ తండ్రిని గతంలో మాదిరి చేరలేదు.

కొద్దిసేపటి తరువాత మెల్లగా విప్రర్షిని సమీపించింది. తరువాత ఆయనకు కూర్చోవడానికి ఆసనం సమర్పించింది. చేసిన పనికి సిగ్గుపడిన శకుంతల ఆయనతో మాట్లాడలేదు. అప్పటి వరకూ నిప్పు వంటి బ్రహ్మచర్యం అవలంబించిన ఆమె స్వధర్మం నుంచీ జారిపడిపోయానని భయపడిపోయింది.

ఆమె తీరు కొత్తగా ఉండడంతో సిగ్గుపడుతున్న కుమార్తెను చూసి ‘‘ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇది వరకటిలా లేవు. ఏం జరిగిందో చెప్పు భయపడకు‘‘ అన్నాడు తండ్రి.

ఆ మీదట శకుంతల అతికష్టం మీద కాశ్యపునితో ఈ మాటలు అన్నది.

‘‘ తండ్రీ, ఇలిలుని కుమారుడు దుష్యంతుడనే రాజు దైవయోగం వల్ల ఇక్కడకు వచ్చాడు. అతనిని నేను పతిగా వరించాను. కనుక నువ్వు ప్రసన్నుడివి కా. ఆ తరువాతేం జరిగిందో నీ దివ్యదృష్టికి అంతా తెలుస్తుంది. దయచేసి క్షత్రియ కులానికి భయం లేకుండా అనుగ్రహించు‘‘ అని అన్నది.

కణ్వుడు తన దివ్యదృష్టితో జరిగింది తెలుసుకొని సంతోషించాడని వ్యాసుడు చెప్పాడు. తరువాత ఆమెతో ఈవిధంగా అన్నాడు.

‘‘నీవు నన్ను అనాదరించి రహస్యంగా ఆ పురుషుని కలుసుకోవడం సరికాదు‘‘అని స్పష్టంగా మొదటి వాక్యం అన్నాడని వ్యాసుడు చెప్పాడు. ‘‘క్షత్రియులకు గాంధర్వం శ్రేష్ఠమైనదని చెప్పారు. కోరికగల ఆమెకు కోరికగల అతనితో మంత్రరహితంగా *రహస్యంగా* జరిగేది గాంధర్వమని చెబుతారు. దుష్యంతుడు మహాత్ముడు, ధర్మాత్ముడు. *నిన్ను సేవిస్తున్న  అతనిని పతిగా  పొందావు నీవు*(నీ అంతట నీవుగా పొందావు).  నీకు మహాబలుడైన కుమారుడు జన్మిస్తాడు. సముద్రాంతమయిన ఈ భువి సమస్తం అనుభవిస్తాడు‘‘ అన్నాడు.

తండ్రి తెచ్చిన పళ్ళు అందుకొని తగుచోట ఉంచినదామె.  ఆయన తన రెండు కాళ్ళూ కడుగుకొని విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో ఆమె ‘‘ నేను పతిగా వరించిన దుష్యంతుని మంత్రులతో సహా ఆయనను అనుగ్రహించు‘‘ అని కోరింది.

అది విన్న మహర్షి ‘‘ *నీ కోసం* నేను అతని పట్ల ప్రసన్నుడనై ఉన్నాను. నీ యవ్వనకాలం ఎంతో నిష్ప్రయోజనంగా గడిచిపోయింది.  ఇప్పుడది సార్థకం అయింది. నీ వేం పాపం చేయలేదు. నీకు వరం ఇస్తాను కోరుకో‘‘ అన్నాడామహర్షి.

శకుంతల 1) దుష్యంతుని హితం, 2) పౌరవవంశీయులు ధర్మిష్ఠులు అయి ఉండాలని, 3)రాజ్యభ్రష్టత లేకుండా ఉండాలని కోరుకుంది.

ఆయన అలాగే అని అనుగ్రహించి ఆమెను ఆరోజు నుంచీ పతివ్రతాధర్మాన్ని అనుసరించమని చెప్పాడు.

ఇక్కడితో డెబ్భై మూడో అధ్యాయం ముగిసింది.

శకుంతలోపాఖ్యానంలో ఒక ఘట్టం ముగిసింది.

ఆధునిక కాలంలో వివాహాన్ని వ్యాపారం చేసి, వేశ్యావృత్తికన్నా నీచం చేసి, పవిత్రబంధంలో కలిగే బిడ్డలను సంపాదనా మార్గంగా చూస్తున్న  కాపురాలలోని ఆధునికవేశ్యలకు, తనకు పుట్టబోయే బిడ్డకు రాజ్యం దక్కాలని షరతుతో పెళ్ళాడిన శకుంతలకు తేడా ఏమిటనే దానికి జవాబు ఆమె కణ్వుని కోరిన వరంలో ఉంది.

ఆధునిక కాలంలోని మహాపతివ్రతలకు భర్త అవసరం లేదు. అతని శ్రేయస్సు అవసరం లేదు. నేడు డిఎన్ ఏ వంటి పరీక్షలు వచ్చాయి కనుక అతికష్టం మీద కాపురం చేసి నలుసు కడుపులో పడేవరకూ ఉంటున్నారు. వైద్యులు గర్భం వచ్చింది అని చెప్పగానే తమ దారిన తాము పోయి భర్తకు ఎటిఎం కు తేడా లేకుండా చూస్తున్నారు. వీరికి కోర్టులు, బూజుపట్టిన చట్టాలు, వేరేపనిలేని మహిళాసంఘాలు మద్దతుగా నిలిచాయి.

కానీ, శకుంతల తనలోని మహోన్నతశిఖరమైన వ్యక్తిత్వం తండ్రిని అడిగిన వరంతో చాటి చెప్పింది.

తాను చేసింది తప్పు. తండ్రికి కోపం వస్తే తన భర్తను శపించగలడు. ఆగ్రహంతో రాజ్యాన్నీ పరివారాన్నీ కూడా తగులబెట్టగలడు. అది ఆయన చేస్తే తనకే నష్టం కనుక ఆమె తన భర్త దుష్యంతుని హితం మొదట కోరుకుంది. ఇదే ఆమెను నేటి కాపురాలలోని వేశ్యలనుంచీ వేరు చేస్తోంది. ఆమెకు భర్తా కావాలి. అతని రాజ్యం తన కుమారునికి కావాలి. ఆమె సుఖంగా రాజభోగాలు అనుభవించడానికి కాదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే యవ్వనవతి అయ్యేవరకూ బ్రహ్మచర్యంలో ఆశ్రమంలో మగ్గింది. కేవలం కొద్ది నిమిషాల పాటు భర్తతో గడిపింది. ఆ తరువాత నిండు యవ్వనాన్ని వృథా చేస్తూ 15 ఏళ్ళపాటు భర్త పల్లకీ పంపుతాడని ఎదురుచూస్తూ పుట్టింట గడిపింది. నేటి భ్రష్ఠులతో పోల్చి చూస్తే ఆమె తన జీవితంలో భోగాలు అనుభవించింది ఏమీ లేదు. కేవలం తన భర్త శ్రేయస్సు, బిడ్డ శ్రేయస్సు మాత్రమే కోరుకుని త్యాగధనికురాలిగా బ్రతికింది. ఇది నేటి కాపురాలధనపిశాచులకు అర్థం కాదు. అన్నిటికీ మించి శకుంతల తనను పట్టపురాణి చేయమని కోరలేదు. తన కుమారుడి గురించి కోరిందని గమనించాలి.

ఆ తరువాత భర్త వంశం పౌరవులు  అంతాధర్మిష్ఠులు అయి ఉండాలని రెండో వరం కోరుకుంది. దీనికి కారణం కణ్వుని మాటల్లో ఉంది.

శకుంతల, దుష్యంతుని మాటల్లో గాంధర్వం రహస్యవివాహపద్ధతి అనే వివరం లేదు. కేవలం కణ్వమహర్షే *రహస్యం* అనే పదం మొదటిసారి వాడాడు. ఆయన ఆ పదం వాడడం వెనుక ఆమె చేసుకున్న వివాహం పద్ధతి వలన రాబోతున్న కష్టాలు సూచించాడు. ఎప్పుడైతే ఆమె మదిలో  ఉన్న భయం ఆయన మాటల ద్వారా బయటపెట్టాడో ఆమె దుష్యంతుని వంశం వారంతా ధర్మిష్ఠులు కావాలని కోరుకుంది. వంశంలోని వారంతా ధర్మిష్ఠులు అయితే రహస్యవివాహాన్ని వారు ఆమోదిస్తారని ఆమె ఆశించింది.

మహామహర్షిని కష్టపెట్టినా దుష్యంతుడికి, ఆయన వంశంలో వారికీ  రాజ్యభ్రష్టత లేకుండా ఉండాలని కోరుకుంది. ఆమె ఆశయం తన కుమారుడికి రాజ్యం రావడం. కనుక తన కుమారుడు రాజు అయ్యేవరకూ, ఆ తరువాత ఆ వంశం వారికి రాజ్యభ్రష్ఠులు కారాదని ఆమె కోరుకుందన్నమాట.

వివాహం చేసుకున్న కుమార్తెను ఆశీర్వదించాలి. కనుక ఆ సమయంలో కణ్వమహర్షి ఆమెకు వరం ఇచ్చి తప్పు చేసిన బిడ్డల పట్ల తల్లితండ్రులు ఎలా ఉండాలనేదానికి సజీవ సాక్ష్యంగా నిలిచారు. ఇదే నేడు కావలసిన మానసికపరిణామక్రమవిధానాన్ని పురాణాలు చెబుతున్నాయి. వామనపురాణంలో విశ్వకర్మ పెళ్ళికి ముందు ఒక్కటైన కుమార్తె కుమారులను తీవ్రంగా శపించాడు. శుక్రాచార్యుడు అల్లుడు ముసలివాడు కావాలని శపించాడు. ఇలా పరిశీలిస్తే కణ్వమహర్షి చాలా ఉత్తమమైన ప్రవర్తనను ప్రదర్శించి తన కుమార్తెకు అల్లుడికి మనుమడికీ మేలు చేశాడు.

శకుంతల ఆశ్రమాధిపతి పుత్రిగా పెరిగింది. అక్కడ ఉన్నవారంతా పారమార్థికప్రధానులే అయినా ఆమె ధర్మాదివిషయాలలో నిపుణురాలు అయింది. మహారాజును కూడా తన యిష్టానికి అంగీకరింప చేయగల సామర్థ్యం ఉంది. 

దుష్యంతుడి వైపునుంచీ ఆలోచిస్తే, కణ్వుడు గ్రహాంతరం వెళ్ళలేదు. ఆశ్రమానికి సమీపంలోని పళ్ళ సేకరణకు వెళ్ళాడు. ఆగమంది శకుంతల. ఆగవచ్చు. కానీ అతడు ఎందుకు ఆగలేదు?

దుష్యంతుడు ఆగి ఉంటే కణ్వుడు వచ్చి తన కుమార్తెను ఇవ్వడానికి ఇష్టపడకపోతే? దుష్యంతుడికి నష్టమే కదా! ఆశాభంగమే కదా! కణ్వుడు పిల్లను ఇవ్వను అంటే చేయగలిగేది ఏమీ లేదు. ఆయన కన్నా శకుంతలను ఒప్పించడం తేలిక. ఆ తరువాత ఆయన్ను అల్లుడి హోదాలో ఒప్పించవచ్చు. ఒకవిధంగా ఒప్పుకొని తప్పని స్థితికి నెట్టినవాడయ్యాడు. కోపం వచ్చినా కూతురు ముఖం చూసి ఏమీ  చేయలేడు. కనుక ఆయన కోసం ఎదురు చూడకుండా ఆమెను స్వీకరించి, (ఆయన వచ్చేస్తాడు అని ఆమె చెప్పింది కనుక) ఆయన వచ్చేలోపలే ఆయన ఎదురు పడకుండా అక్కడ నుంచీ హడావుడిగా వెళిపోయాడు. దారిలో వెళుతూ కూడా ఏ శాపం ఇస్తాడో అని భయపడుతూనే ఉన్నాడు.

ఇక శకుంతల వైపునుంచీ ఆలోచిస్తే, ఆమె మొదట తండ్రి అనుమతి కావాలనే మాటపైనే నిలిచింది. కానీ తరువాత ఎందుకుమెత్తబడింది?

దుష్యంతుడి రూపం, సామ్రాజ్యాధికావడం, తనపై ప్రేమకురిపించడం, ఆమె మనసుపై పనిచేశాయి. ఆమె మనసుకు ఏది ధర్మం, ఏది అధర్మమో కూడా తెలుసు. అన్నింటికీ మించి కాళ్ళ దగ్గరకు వచ్చిన వాడు పోతే మళ్ళీ దొరికే అవకాశం ఉండకపోవచ్చు. అందులోనూ భారతదేశం మొత్తానికి ఇతడే చక్రవర్తి. అంతటి వాడు ఇతనికి మించిన వాడు మరొకడు లేడు. తాను సాహసిస్తే, తన పుత్రుడూ సమ్రాట్టు అవుతాడు. ఇందువల్ల తన తండ్రి తాత్కాలికంగా కష్టపడినా, తండ్రిని తాను ప్రసన్నం చేసుకోగలదు. తన కుమారుడికి శాశ్వతమైన లబ్ధి కలుగుతుంది. ఈ భావం ఆమెను ప్రేరేపించింది. కనుకనే తన పుత్రుడు తన భర్త శ్రేయస్సు వరాల రూపంలో కోరుకుంది.

నేడు కాపురాల రూపంలో వ్యభిచారం చేస్తున్నవారికీ, శకుంతలకూ తేడా ఈ వెంట్రుక వాసిలో ఉంది.

శకుంతలకు సామ్రాజ్యం అవసరం లేదు. అది తన కుమారుడికి కావాలి. అలాగే ఆమెకు భర్త శ్రేయస్సు కూడా కావాలి. కానీ నేటి స్వైరణులకు భర్త అవసరం లేదు. కాపురం అవసరం లేదు. బిడ్డలు కూడా ఆస్తిసంపాదనకు అవసరం. ఇది ఈ ఇద్దరి మధ్యా ఉన్న ఉచ్ఛత్వం, నీచత్వం.

అయితే శకుంతలాదుష్యంతుల ప్రవర్తన వలన కణ్వునికి కష్టం వేసింది.

కణ్వుని మనసు కష్టపడుతుందని శకుంతల, దుష్యంతుడూ ఇద్దరూ ఊహించారు. వారు ఊహించినట్టే ఆయన మనసు కష్టపడింది. అది ‘‘రహస్యం‘‘ అనే మాట ద్వారా బయటపెట్టాడు. ‘‘నీవు నన్ను అనాదరించి రహస్యంగా ఆ పురుషుని కలుసుకోవడం సరికాదు‘‘ అని సూక్ష్మంగా అన్నాడు.  ‘‘*నీ కోసం నేను* అతని పట్ల ప్రసన్నుడనై ఉన్నాను‘‘ అని కూడా స్పష్టంగా అన్నాడు. నా వారు రాజ్యభ్రష్ఠులు కారాదని కోరినప్పుడు సరే అన్నంత వేగంగా ప్రసన్నుడవు కా అన్నప్పుడు వెంటనే ఖేదం నుంచీ బయటకు రాలేకపోయాడు. ఇది చాలా గంభీరమైన అంశం.

దుష్యంతుడు సకలభారతావనికీ చక్రవర్తే కావచ్చు, కానీ కన్య విషయంలో తన అనుమతి కోసం ఆగి ఉండాలనే ఆయన అంతరంగం. అయితే దుష్యంతుడు గడుసుగా అల్లుడైపోయాడు. కనుక అతడిపట్ల అప్రసన్నుడైతే తన కుమార్తెకే నష్టం. క్షమించి ప్రసన్నుడైతే ఆమెకే లాభం. కనుక నీకోసం అనే మాట ఉపయోగించాడు. అందులోనూ ఆమె తోడుదొంగ అయింది. కనుక అతడొక్కడిదే తప్పుకాదు. కనుక కూడా ఆలోచించి ‘‘నీ కోసం‘‘ అని ఉపయోగించాడు.

ఈ మొత్తం వ్యవహారంలో పిన్నలు తప్పుచేస్తే పెద్దలు ఎందుకు క్షమిస్తారో తెలుస్తుంది. పెద్దలెందుకు కష్టపెట్టుకుంటారో కూడా తెలుస్తుంది. వయసు అనుభవం తొందరపాటుతనం వంటి కారణాల వల్ల పిల్లలు తప్పుచేస్తారు. చిక్కుల్లో పడతారు. తమ పిల్లలు చిక్కులు లేని సుఖాలు అనుభవించాలనే పెద్దలు సదా ఆశిస్తారు. తమ అనుభవాన్ని ఉపయోగించుకోకుండా వారు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారే అని కష్టపడతారు. శ్రేయస్సు కలిగించేవారు ఎవరో తెలుసుకోకుండా స్వార్థపరులను చేరితే మరింత కష్టపడతారని బాధపడతారు. కణ్వుడు చేసిన పెళ్ళైఉంటే శకుంతల కాపురం కేవలం కొద్ది నిమిషాలకే పరిమితమై కచికలైపోయి ఉండేది కాదు. ఆమె 15 సంవత్సరాలు వృథాగా రహస్య పెళ్ళి అయ్యాక అరణ్యంలో కాపురం లేకుండా పుట్టింట మానులా పడి ఉండాల్సి వచ్చేది కాదు. దుష్యంతునితోనే వెంటనే కాపురానికి వెళ్ళి ఉండేది. నవయవ్వనం అంతా అడవిపాలు అయిఉండేది కాదు. అడవి కాచిన వెన్నెలలా దుష్యంతుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూపులతో చిక్కిశల్యం అవ్వాల్సి వచ్చి ఉండేది కాదు.

మహామహుడైన కణ్వమహర్షి  తన కుమార్తె ఈ విధంగా పుట్టింటపడి ఉందే అని ఆమె కన్నా ఆయనే ఎక్కువగా బాధపడ్డాడని  కేవలం కుమార్తెలను కన్నవారికే తెలుస్తుంది. ఆయన అరణ్యంలో ఉన్నా ఒక మహావిశ్వవిద్యాలయమే ఆయన వెనుక ఉంది. వారిలో ఎవరైనా పుట్టింట ఉండి, బహిరంగ వివాహంకాని ఆమె, బిడ్డను కన్న ఆమెను భరిస్తూ,   ఆశ్రమవాసులకు అధిపతిగా ముఖం చూపించలేక ఎలా ఎంత సతమతం అయి ఉంటాడో ఎవరూ ఊహించలేరు.  ఎగదీస్తే అల్లుడికి కోపం, దిగదీస్తే కూతురుకి ద్రోహం కనుక ఏంచేయలేని నిస్సహాయస్థితిలో భూగమనమే ఆపివేయగల శక్తిమంతుడై తాను ఉండిపోవాల్సి వచ్చిందని ఆయన బాధపడుతూ సంయమనంతో ఉండిపోయాడు.
Share:

Related Posts:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...