భక్తి శ్రద్ధలతో కార్తీక క్షీరాబ్ది ద్వాదశి. ~ దైవదర్శనం

భక్తి శ్రద్ధలతో కార్తీక క్షీరాబ్ది ద్వాదశి.


* కార్తీక క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, ఆయుష్షు ప్రాప్తి .....
* హిందూమత సంస్కృతిలో మరో పుణ్యప్రదమైన కార్తీక క్షీరాబ్ది వ్రతం....
.
హిందూమత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మనకున్న మాసాలలో ఎంతో పుణ్యమైనది కార్తీకమాసం. కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన, విశిష్టమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని, చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు. ఈ రోజుని 'తులసి ద్వాదశి' అని కూడా అంటూ వుంటారు. ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్శనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశి రోజు శ్రీమహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట. అందువల్ల ఈ ద్వాదశిని బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృందావనం అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గరకు వస్తారు. ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా వెలిగించక పోయినా ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
.
.
దూర్వాస మహర్షి వారి చేత శపించబడి వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచనతో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మథనం ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించినరోజు కాబట్టి ఇది ‘క్షీరాబ్ది ద్వాదశి’ అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
.
.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణు స్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనే ఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీ రూపంతో అలంకరిస్తారు. సుగంధ ద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
.
.
'క్షీరాబ్ది ద్వాదశి' రోజున తులసి తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ శుభ దినాన శ్రీమహాలక్ష్మితో కలిసి శ్రీమహావిష్ణువు తులసి కోటలోకి ప్రవేశిస్తాడని అంటారు. తులసికోటలో లక్ష్మీనారాయణులు కొలువై వుంటారు గనుక, ఈ రోజున చేసే తులసి పూజ మరింత విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుంది. భక్తి శ్రద్ధలతో తులసిని పూజించి, దీపదానాలు చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయనీ, అపమృత్యు భయాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజు తెల్లవారు జామునే పుణ్యస్త్రీలు తలంటు స్నానం చేయాలి. తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించాలి. తులసికోట దగ్గర దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత పూజా మందిరం చెంత యధావిధిగా నిత్య పూజను జరపాలి. మరలా సాయంత్రం తులసి పూజ అయ్యేంత వరకూ ఉపవాసం వుండాలి. సూర్యాస్తమం తర్వాత తులసిని, విష్ణువును పూజించిన దానాది కార్యక్రమాలు చేసే వారికి కేశవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా దీపదానం చేసేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.
.
.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు. తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
.
.
పురాణగాథ:.....
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి
లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
.
.
తులసి పూజ ఇలా చేయాలి:
తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.
.
.
ఈ పూజలో శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా తులసి మొక్కను, శ్రీ మహా విష్ణువుకు ప్రతీకగా ఉసిరి మొక్కను పెట్టి పూజిస్తారు. కార్తీక మాసం కాబట్టి శివాలయంలో దీపం వెలిగించి, ఇంటికి వచ్చి తులసి, ఉసిరి పూజ జరిపించి పుణ్య ప్రదులవుతారు.
.
పురాణంలో ఒక కథ ఉన్నది. ఒక వేటగాడు తన ఆకలి తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల జంతువులను చంపి తింటాడు. అలా ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటాడు. కానీ ఒకరోజు అడవిలో ఒక పెద్ద చెట్టుకు అనేక పళ్ళు వేలాడుతుండటం చూసి ఆకలి భరించలేక వెంటనే ఆ చెట్టు ఎక్కి పళ్ళు కోసుకుని కడుపు నిండా తిన్నాడు. ఆకలి తీరింది. కానీ దురదృష్టవశాత్తూ వేటగాడు కాలు జారి చెట్టుపై నుండి క్రింద పడి చనిపోయాడు. శవాన్ని నరక లోకానికి తీసుకెళ్ళడానికి యమ దూతలు వచ్చారు. కానీ వారు ఆ వేటగాడి శవాన్ని తాకలేకపోతారు, కనీసం దగ్గరికి కూడా రాలేకపోతారు. వారు ఆశ్చర్యపడి దగ్గరలో ఉన్న ఒక స్వామీజీని కలిసి విషయం చెప్పగా, ఆ స్వామీజీ ఇలా చెప్పారు - "వేటగాడు చనిపోయే ముందు ఉసిరికాయలు తిన్నాడు. ఉసిరికాయలు శ్రీ మహా విష్ణువుకు ప్రతిరూపాలు, మరియు ఆయనకు బహు ఇష్టమైనవి. కనుక వాటిని తిన్న వారు కూడా శ్రీ మహా విష్ణువుకు ఇష్టులవుతారు. కావున ఓ యమ దూతలారా ! వేటగాడు శ్రీ మహా విష్ణువు కృపచే పాప విముక్తుడై, పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్ళాడు. మీరు అతని శవాన్ని తాకి శ్రీ మహా విష్ణువు కోపానికి గురికాకండి" అని చెప్పగా చేసేది లేక యమ దూతలు వెనుతిరిగి పోయారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List