September 2018 ~ దైవదర్శనం
  • శ్రీ మల్లెంకోండేశ్వర స్వామి ఆలయం.. మల్లెంకొండ..

    సేతుబంధనం చేసేముందు శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు శివపురాణం వర్ణిస్తోంది. ఇతర పురాణాల్లో కూడా రాముడు శివలింగాన్ని ఆరాధించిన విషయం కనిపిస్తుంది. కొన్ని చోట్ల హత్యాపాతక నివారణార్థం శివలింగ ప్రతిష్ఠలు చేసిన గాథలున్నాయి వీటిని కాదనలేము..!

  • పంచలింగాల కోన..

    అది శేషాచల అటవీ ప్రాంతం.. దట్టమైనఅడవులు.. రాళ్లూ రప్పలతో కూడిన గుట్టలు... చిన్న చిన్న బాటలు.. ఎటు చూసినా ఎత్తైన చెట్లు.. పక్షుల కిలకిలలారావాలు... వన్యప్రాణులు.. ప్రకృతి అందాలతో అలరారే ఆ క్షేత్రంలో.. సాక్షాత్తూ శివుడు కైలాసం విడిచి ఇక్కడ కొలువైనాడు. లోతైన లోయలో కొలువుదీరిన శివుడిని చేరుకోవడానికి కాలినడకన 9 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే..! ఆ ఆద్భుత స్థలమే పంచలింగాల కోన..!!.

  • ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి

    నల్ల‌మ‌ల ఆడ‌వి లోని ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి కొండ గుహ లెదా వ‌జ్రాల కొండ గుహ ఆని అంటారు. ఈవ‌జ్రాల కొండ గుహ‌లో ఉల్లెడ న‌ర‌సంహాస్వామి గుహ‌, ఆశ్వ‌థ్దామ గుహ‌, వున్నఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ అను మూడు గుహ‌లు క‌ల‌వు. ఉల్లెడ ఉమామహేశ్వ‌ర స్వామి గుహ లో ఒక శివ‌లింగం, మూడు ప‌డ‌గ‌ల నాగుపాము, శంఖం, మ‌రియు వీణ స్వయంబుగా వెలిచినాయి.

  • కాలి నడకన అధ్భుతమైన యాత్ర...

    ఈ ప్ర‌పంచంలో ప్ర‌కృతిని ఆరాధించ‌నివారుండ‌రు. ప్ర‌కృతి అందాల‌ను చూస్తూ త‌మ‌ను తాము మ‌రిచిపోతుంటారు. అలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూసేందుకు ఎంత దూర‌మైనా వెళ్తారు, కొత్త కొత్త ప్ర‌దేశాల కోసం అన్వేషిస్తారు. అలాంటి వారి కోసం నా వంతు స‌హాయాన్ని అందించ‌డానికే ఈ ప్ర‌య‌త్నం. .

  • జ్యోతి శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయం...

    కొన్ని శతాబ్దాలుగా పెన్నానది గర్భంలో దాగి ఉన్న మహిమాన్వితమైన 108 లింగాల శివాలయాల దివ్య క్షేత్రం. రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్య దోశ నివారణలో భాగంగా శ్రీ రాముడు దేశవ్యాప్తంగా శివలింగ ప్రతిష్టాపన జరుపుతూ ఇక్కడ శివలింగాలకు పూజలు నిర్వహించి పాప విమోచనం పోందాడని ప్రతీతి. కాలక్రమంలో ఆలయం పెన్నమ్మ కడుపులో కలిసిపోయి, ఇసుకదిబ్బగా మారిపోయింది.

రాజవిద్యారాజగుహ్యయోగము

అ|| భక్తితో ఏ స్వల్పవస్తువు నొసంగినప్పటికిని తాను సంతుష్టినొందెదనని భగవానుడు పలుకుచున్నారు-   

పత్రం పుష్పం ఫలం తోయం 
యో మే  భక్త్యా ప్రయచ్ఛతి | 
తదహం భక్త్యుపహృతం
అశ్నామి ప్రయతాత్మనః || 

తా:- ఎవడు నాకు భక్తితో ఆకునుగాని,  పువ్వునుగాని, పండునుగాని,  జలమునుగాని, సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరణునియొక్క (లేక, పరమార్థయత్నశీలునియొక్క) భక్తిపూర్వకముగ నొసంగబడిన ఆ పత్రపుష్పాదులను నేను (ప్రీతితో) ఆరగించుచున్నాను (అనుభవించుచున్నాను). 

వ్యాఖ్య:- పైనదెల్పిన పత్రపుష్పాదులు బీదలకు, ధనవంతులకు, పండితులకు, పామరులకు, సర్వులకును అందుబాటులోనున్న వస్తువులు. భగవత్ప్రీతిని బడయుటకు సామాన్యమైన వస్తువునైనను ప్రీతితో, భక్తితో సమర్పించిన చాలునని ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. శక్తిలేనివారు మేము పెద్దపెద్ద నైవేద్యములను దేవునకు సమర్పింపలేకపొతిమేయని దిగులునొందరాదు. ఏలయనిన  భగవానుడు భక్తిని, హృదయశుద్ధిని ప్రధానముగ నెంచునేకాని వస్తువునుగాదు. వాస్తవముగచూచిన దేవునకు ఒకానొక వస్తువు  ఆవశ్యకత యేమియునులేదు.  బ్రహ్మాండములన్నియు వారి కుక్షియందే  యుండ ఇక వారికేమి కొఱత?! అయినను నిర్మలమనస్కులకు భగవానుడు రెండుషరతులను నియమించిరి. అవియేవి యనిన - 
ఇచ్చువాడు పరిశుద్ధుడై యుండవలెను. 
     (2)  ఇచ్చుదానిని పరమభక్తితో ఇవ్వవలెను. 
   మలినచిత్తము గలవాడు ఏదియొసంగినను, తుదకు రాజ్యాదులను, మేరుపర్వతమంత బంగారమిచ్చినను భగవంతుడు స్వీకరింపరు. శుద్ధచిత్తముగలవాడు, నిర్మలాంతఃకరణుడు కేవల మొక ఆకు ఇచ్చినను, పువ్వు ఇచ్చినను, పండు ఇచ్చినను, గరిటెడు నీరిచ్చినను మహాసంతుష్టితో గ్రహించును. అట్లే భక్తిలేకుండ రత్నరాసులిచ్చినను స్వీకరింపరు. భక్తితో చిల్లిగవ్వ ఇచ్చినను ఆనందముతో తీసుకొనును. ప్రేమగాని, భక్తిగానిలేని దుర్యోధనుని యింట ఆతిథ్యమును నిరాకరించి, దయ, ప్రేమ, ఉట్టిపడుచుండు విదురునియింట శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యమును స్వీకరించుట సర్వులకును విదితమే కదా! మఱియు కుచేలుని అటుకులను పరమప్రీతితో వారు గైకొనిన సంగతియు అందఱికిని తెలిసినదే కదా!
      దీనినిబట్టి భగవంతుని యనుగ్రహము మనుజుడిచ్చు వస్తువుయొక్క గొప్పతనముపైగాని, విలువపైగాని ఆధారపడియుండదనియు, ఆతనియొక్క మనస్తత్త్వముపైననే ఆధారపడియుండుననియు స్పష్టమగుచున్నది. ఆతని నిర్మలభక్తి, నిర్మలహృదయము - వీనిపైననే సర్వేశ్వరునికృప ఆధారపడియుండును. కనుకనే ఎంతటి కోటీశ్వరులైనను, రాజాధిరాజులైనను, మహాపండితులైనను, భగవంతుని అనుగ్రహమును కొందఱు పొందలేకుండుటయు, వారి దయకు పాత్రులు కాకుండుటయు;  చిల్లిగవ్వయైనలేక, కౌపీనధారులైయుండువారు పరమాత్మయొక్క అపారకృపకు పాత్రులగుటయు చరిత్రయందు కానంబడుచున్నది. భక్తి, చిత్తశుద్ధి - అను నీరెండే భగవానుని దృష్టిలో ప్రధానములుకాని, తక్కినవికావు. ‘అశ్నామి’ అని చెప్పుటవలన అట్టి భక్తితో ఇవ్వబడిన దానిని పరమాత్మ గ్రహించుటయేకాదు, అనుభవించునని, భుజించునని స్పష్టమగుచున్నది. ఆహా! భక్తులపై భగవానున కెంతటి కరుణయో చూడుడు!
   ‘ప్రయతాత్మనః’ - అను పదమునకు నిర్మలాంతఃకరణుడని, ప్రయత్నశీలుడనియు అర్థములు కలవు. 
     ‘యః’ అని ప్రయోగించుటవలన ఎవరైనను సరియే - జాతిమతకులవిచక్షణగాని, ధనిక దరిద్ర భేదముగాని, స్త్రీపురుష భేదముగాని లేక  - భక్తితోగూడి  నిర్మలచిత్తుడై యుండినచో ఆతడొసంగినది సర్వేశ్వరుడు స్వీకరించునని తేలుచున్నది. 
   భక్తి యనునది, హృదయశుద్ధి యనునది మోక్షప్రయాణమునకు టికెట్టు వంటిది. టిక్కెట్టు చేతగలవారు ఎంతబీదవారైనను, అల్పకులస్థులైనను రైలుపెట్టెలో నిశ్చింతగ, నిర్భయముగ ప్రయాణముచేసి గమ్యస్థానమును చేరగలరు. అట్లుకాక, టిక్కెట్టులేనివారు ఎంత ధనవంతులైనను, అధికారవంతులైనను, పండితులైనను, సౌందర్యవంతులైనను వారిని రైలుపెట్టెలోనుండి దింపివేయుదురు. వారు గమ్యస్థానమును చేరజాలరు. అట్లే మోక్షప్రయాణమున్ను. కాబట్టి భగవత్కృపకు, మోక్షప్రాప్తికి భక్తి, చిత్తనైర్మల్యము అతి ప్రధానములైయున్నవి. ఈ విషయమును భగవానుడు ఈ శ్లోకముద్వారా సుస్పష్టము చేసియున్నారు. ముక్తికి అర్హత, యోగ్యత (MERIT) ప్రధానమే కాని తక్కిన విషయములుకావని ఇట ఋజువుచేయబడినది. ఇట్టి బోధలవలన ప్రపంచములో ప్రతి మానవుడును దైవమార్గమున ప్రయత్నించుటకు అవకాశమేర్పడుచున్నది. దేవునిబిడ్డలని ముద్రవేయబడినవారు ఎక్కడను ఉండరు. అనన్యభక్తిగలవారే, నిర్మలచిత్తముగలవారే దేవుని బిడ్డలు. అట్టివారినే యతడు కరుణించును వారికే ఆత్మజ్ఞానమును ప్రసాదించును. 
   ‘యమేవైషవృణుతే తేన లభ్య స్త స్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్’ అను ఉపనిషద్వాక్యము ఈ సత్యమునే తెలుపుచున్నది. 

భగవంతునకు :

 పత్రమును   -   విదురుడు, ద్రౌపది;
 పుష్పమును  -  గజేంద్రుడు ;
 ఫలమును   - శబరి ;
 తోయమును -  రంతీదేవుడు 

భక్తితో ఒసంగి కృతార్థులైరి. 
      
ప్ర:- భగవంతుడు దేనిని స్వీకరించును?
ఉ:- భక్తితోను, నిర్మలచిత్తముతోనుగూడిన ఏ స్వల్పవస్తువు (పత్రముగాని, పుష్ప

ముగాని, ఫలముగాని, జలముగాని) నొసంగినను ప్రీతితో స్వీకరించును. 
ప్ర:- కాబట్టి భగవత్కృపను సంపాదించవలెననిన ఏది ఆవశ్యకము?
ఉ:- (1) భక్తి, (2) చిత్తశుద్ధి - అను రెండును ఆవశ్యకములు.👏👏
Share:

దసరా ముగిసిందా..ఐతే పాలపిట్టను చూడాల్సిందే.


పశుపక్ష్యాదులను దైవ స్వరూపాలుగా భావించి పూజించడం మన సంప్రదాయం. దసరా మరుసటి రోజున పాలపిట్టను దర్శించి నమస్కరించటం ఇందులో భాగమే. పాలపిట్ట దేవీ స్వరూపమని, అది ఉత్తర దిక్కునుంచి వస్తే శుభం, విజయం కలుగుతాయనీ, దక్షిణ దిశగా వస్తే అశుభ సంకేతమని కూడా భావిస్తారు. తెలంగాణా ప్రాంతంలో దసరా పండగ నాటి సాయంత్రం శమీపూజ ఎంత ముఖ్యమో, పొలానికి వెళ్లి ఈ పక్షిని చూసి మొక్కి రావటం అంతే ముఖ్యం.
.
గుప్పెడంత ఉన్నా పలు రంగులతో కనువిందు చేసే ఈ పక్షి చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే.. ఈ దసరా మరుసటి రోజే దీన్ని ఎందుకు చూడాలంటే.. అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకొని వస్తున్న పాండవులకు హస్తినాపురం పొలిమేరలో ఈ పాలపిట్ట కనపడిందట. నాటి నుంచి వారిని అన్నీ విజయాలే సిద్దించాయట. నాటినుంచి పాలపిట్ట దర్శనం చేసుకోవటం మొదలైందట. తెలుగు రాష్ట్రాలు, కర్నాటక, ఒడిస్సా, బీహార్‌ల రాష్ట్ర పక్షిగా గుర్తింపు పొందినా పట్టణీకరణ మూలంగా పాలపిట్ట జాడ కనుమరుగవుతోంది. పచ్చని చెట్లు పెంచటం ద్వారానే ఈ పరిస్థితిని నివారించగలం. అప్పుడే శుభాలనిచ్చే పాలపిట్టనూ కాపాడుకోగలం.


https://www.facebook.com/rb.venkatareddy
Share:

కంచి సరస్వతి – శృంగేరి భారతి..

ఈరోజు (మహాలయ అమావాస్య) దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం 34 పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి ఆరాధనా మహోత్సవాల సందర్భంగా 

ఇద్దరు జీవన్ముక్తులు సమకాలీనులుగా మహోన్నతములైన రెండు శంకర పీఠములకు దాదాపు 40 సంవత్సరములు అధిపతులుగా ఉండడం ఎంతో అరుదైన విషయం. విచిత్రంగా ఇద్దరి పేర్లు కూడా ఒక్కటే. కంచి మహాస్వామి వారు 1907లో పీఠాధిపత్యానికి వచ్చారు. తరువాతి సంవత్సరము అఖిలాండేశ్వరీ ఆలయ ప్రతిష్ఠకు జంబుకేశ్వరం వెళ్ళారు. అక్కడ భారతీ స్వామి వారి గురువుగారైన శివాభినవ నృసింహభారతీ స్వామివారిని యాదృచ్ఛికంగా చూశారు. వారు కూడా వీరిని చూశారు. ఈ సందర్భంలో కంచి స్వామివారు “వారిని చూడాలని ఆసక్తిగా ఉన్నందువల్ల చూశామనీ, వారికీ చూడాలనిపించిందేమో మరి చూశారనీ” చెప్పారు. మొత్తానికి ఒకరినొకరు చూసుకున్నారు. బహుశః ఆరోజున శ్రీ శివాభినవ నృసింహభారతీ స్వామివారికి కంచి స్వామివారిపై జనించిన ప్రియం వల్లనే తమ అత్యంత ప్రియ అంతేవాసులకు ఆ పేరుంచారేమో! ఆ యోగపట్టా “చంద్రశేఖర భారతీ” అని నృసింహ భారతీ స్వామివారు నిర్ణయించినదేనని “Mystic and Seer” లో స్పష్టపరచబడి ఉంది. శృంగేరీ పీఠపరంపరలో దదాపు 450 సంవత్సరములకు ముందు మాత్రమే ఈ పేరున్న స్వామివారున్నారు. శృంగేరీ సంప్రదాయంలో పది ఆశ్రమ నామాలలో (తీర్థ, అరణ్య, భారతీలాంటివి) ఏవయినా పెట్టుకోవచ్చు. అయితే సరస్వతి అనే అర్థం వచ్చే భారతీ పేరే పెట్టడం కూడా కాకతాళీయమైనా ఎంతో బాగుంది.

ఒక్క పేరులోనే కాదు. ఈ మహాస్వాములిద్దరికీ అనేక పోలికలున్నాయి. వీరిరువురికీ ఒకరిపై వేరొకరికి ఎంతో ఆదరాభిమానాలున్నాయి. భారతీస్వామివారి నిరంతర ఆత్మనిష్ఠను వేనోళ్ళ కొనియాడతారు కంచిస్వామి వారు. వీరి నియమ నిష్ఠలకు, ఆచారానుష్టానాలకు బ్రహ్మరధం పడతారు శృంగగిరి పీఠాధీశ్వరులు. ఇందులో ఒకరు హోయసల కర్ణాటక బ్రాహ్మణులు. తమిళ దేశంలో పీఠాధిపతులయ్యారు. వేరొకరు ములికినాటి తెలుగు బ్రాహ్మణులు. కర్ణాటక దేశంలో పీఠాధీశ్వరులు. కంచిస్వామి వారి పూర్వీకులు కంచి పీఠానికి, శృంగేరీ స్వామివారి పూర్వీకులు శృంగేరీ పీఠానికి ఎనలేని సేవ చేశారు. ఇద్దరు పీఠాధిపతులు మొదట ఇంగ్లీషు చదువులో ప్రవేశ పెట్టబడి అసమాన ధీవిశేషాన్ని ప్రదర్శించారు. ఇద్దరి తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వోద్యోగాలలో ప్రవేశించాలని కోరుకున్నారు. ఇద్దరూ అప్పటి పీఠాధిపతులనే తమ తదనంతర పీఠాధిపతులుగా గుర్తింపబడి పరమాదర పాత్రులయ్యారు. అప్పటి కంచి పీఠాధిపతులు వీరు వచ్చేటప్పటికి కాలవిలంబనమవుతుందని శాస్త్రవిధిన వీరికి కాషాయం, దండం, కమండలం సిద్ధం చేసి ఉంచారు. కంచిస్వామి వారి పెత్తల్లి కుమారునికి పీఠాధిపత్యం ఇచ్చి వారు సిద్ధించారు. అయితే విధి విలాసమో, పరమ గురు సంకల్ప బలమో మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారు అనతి కాలంలోనే సన్నిపాత జ్వరంతో పరమగతి పొందారు. కంచిస్వాములు కలవై చేరేటప్పటికి వారు దీక్ష నిచ్చే స్థితిలో కూడా లేరు. పరమ గురువులు నిర్ణయించిన విధంగా, వారు వీరికి సిద్ధం చేసి ఉంచిన కాషాయదండ కమండాదులతో, తాము లేని పక్షంలో వీరికి ఏ రకంగా సన్యాసం ఇవ్వాలని పరమ గురువులు నిర్ణయించారో ఆవిధంగా సన్యాసమియ్యబడింది. భారతీ స్వామివారికి కూడా వారి గురువు నిర్ణయించిన విధంగా వారు సిద్ధిపొందిన తరువాత 27వ రోజున పీఠాధిపత్యమీయబడింది. ఇరువురికీ గురువుల ప్రత్యక్ష పర్యవేక్షణ లేదు. 

సహజ విరాగులయిన భారతీస్వామి అచిరకాలంలోనే పీఠ వ్యవహారాలను యాజమాన్యంపై వదిలివేసి, బ్రహ్మానుభవమగ్నులై ఎప్పుడో క్వచిత్తుగా మాత్రమే బాహ్య స్మృతిలో ఉండేవారు. కంచి స్వామివారు బ్రహ్మానుభవమగ్నులుగా ఉన్నప్పటికీ, వారణాసీ విజయయాత్ర తరువాత మఠ బాధ్యతలు తగిన వారసునికి అప్పగించి తాను ఏకాంతవాసం చేయాలని ఆకాంక్షను అనేకసార్లు వ్యక్తీకరించినప్పటికీ తమ పీఠ బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని నిరంతర ధర్మ ప్రచారం చేసేవారు. దీనికి వారు భారతీస్వాముల వారి వద్దకు ప్రతినిధులను పంపేవారు. “వారు బాహ్యస్మృతిలో ఉండరే! కలిసేదేలా?” అనుకుంటుంటే కంచిస్వామి ప్రయత్నించండి అనేవారట. అదేమి ఆశ్చర్యమో కంచి ప్రతినిధులు వెళ్ళే రోజునే భారతీ స్వామికి బాహ్యస్మృతి కలిగేది. ఎంతో ఆప్యాయంగా “పెద్దలు మద్యార్జునంలో చాతుర్మాస్యం చేస్తున్నారా” అని ఆరంభించేవారు. ప్రతినిధులు వచ్చిన కార్యం, కంచి స్వామివారి పథకం వివరిచారు. చిరునవ్వులు చిందే ప్రశాంత వదనం ఆనందంతో వెలిగిపోతుంది. మధ్యలో తమ ఆమోదం తెలియజేసే వాక్యాలు సుతిమెత్తగా వచ్చాయి.

“ఆయన ఒకరే ఆత్మానిష్టులయి ఉండి కూడా ప్రపంచం కోసం ఇలాంటి పధకాలు వేయగలరు. ప్రజలనాడి నెరిగి ప్రణాళిక వేస్తారు. అదే సమయంలో శాస్త్ర ఉల్లంఘన కాకుండా జాగ్రత్త తీసుకుంటారు. అందువలనే ఆధునికులు కూడా వారి పథకాలకు ఆకర్షితులవుతున్నారు. వారికి ఏ పధకాలు అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాయో బాగా తెలుసు. వారు ఆ కార్యక్రమాలు మా తరపున కూడా నిర్వహిస్తున్నారు. మా సంపూర్ణ అంగీకారంతో పాటు వారికి కృతజ్ఞతలు కూడా తెలియచేయాల్సి ఉన్నది” అనేవారు. ప్రతినిధులకు సత్కారం కూడా చేసారు. ఇక్కడకు తిరిగి వస్తే ప్రతినిధులకు ఎదుర్కోలు సన్నాహమే జరుగుతుంది. ఆనందంతో వెలిగిపోతున్న కంచిస్వామి అంతటి తేజస్విని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? అదంతా వారి తపోనిష్ఠ ఫలితం – వారి పూర్వాశ్రమం కుటుంబ ఔన్నత్యము, వారి పూర్వ, పీఠాచార్యుల మహోన్నతము కూడా దానికి కారణం అంటూ శ్లాఘిస్తారు. 

ఒకప్పుడు శృంగేరీ పీఠ అనునాయులు, కంచిస్వామి వారు శృంగేరీ పరంపరా ప్రాప్త శిష్యవర్గముండే తిరునల్వేలి ప్రాంతాలతో పర్యటిస్తున్నారని ఫిర్యాదు చేశారట. దానికి శృంగేరీ భారతీస్వామీ ఎంతో సంతోషించి మన పనికూడా వారు చేస్తున్నందుకు కృతజ్ఞత చూపక ఫిర్యాదులెందుకన్నారట. కొంతమంది భక్తులు స్వామిని విస్తృత పర్యటన చేయమని, సందేశాలివ్వమని వత్తిడి చేసేవారట. దానికి వారు “అద్వైత సంప్రదాయానికి మేము, కంచివారు ప్రస్తుత ప్రతినిధులము. వారు చేసే మంచి పనులన్నీ మేము కూడా చేసినట్లే. వారి కీర్తి మన సంప్రదాయానికే సంప్రాప్తిస్తుంది” అనేవారు.

1925 సంవత్సరపు చాతుర్మాస్యాలకు ఈ స్వామివార్లిద్దరూ తమిళనాడు పుదుక్కోట సంస్థానంలో ఉన్న ఇలయాట్రం గుడి, కున్రత్తూరు గ్రామాల్లో విజయం చేసి ఉన్నారు. అక్కడి పండితులిక్కడికీ, ఇక్కడి పండితులక్కడికీ వెళుతుండేవారు. ఇరువురు స్వాములు వారినందరినీ గౌరవించి ఒకరి గురించి ఒకరు గౌరవంగా ప్రస్తుతించేవారట. 

ఇదే కాలంలో శృంగేరీ స్వామి తమ పరంపరా ప్రాప్తమైన శిష్యులున్న పన్రత్తూరు గ్రామంలో విడిది చేసి వెళ్ళిపోయిన రోజున కంచిస్వామికి ఆ ఊరిలో పెద్ద ఎత్తున పట్టణప్రవేశం జరిపించడానికి ఏర్పాట్లు జరిగినాయి. శృంగేరీ అనునాయులు భారతీ స్వామి వద్దకు పోయి ఇది ఉచితం కాదని మనఃస్తాపాన్ని వెలిబుచ్చారు. మరి స్వామివారో! ఎంతో సంతోషంగా ఈ ఊరిలో (తమ ప్రియశిష్యులున్న ఊరిలో) కంచిస్వామి హోదాకు ఏ మాత్రం తక్కువ కానివిధంగా పట్టణ ప్రవేశం జరగాలని కట్టడి చేస్తూ, తమ బోయీలను కంచిస్వామి పల్లకి మోయడానికి పంపారు.

వారి ప్రారబ్ధ కర్మ క్షయమైనది – యీ అవతార శరీరమునకు హేతువైన కర్మక్షయమగుటవలన తామీ దేహమును త్యజించవలసియున్నదని శ్రీ జగద్గురువులు గ్రహించి – పూర్వ మహర్షులు చేసిన విధముగా తామే దేహత్యాగమును చేయుటకు నిశ్చయించిరి. 1954వ సంవత్సరము సెప్టెంబరు 26వ తేదీ ఆదివారం (మహాలయామావాస్య) నాడు బ్రాహ్మీముహూర్తమున నిద్రలేచిరి. అప్పటికింకా చీకటిగానే యున్నది. ఆయన తుంగానది వైపునకు నడచిరి. పరిచారకుడొకడు ఆయనవెంట కొంతదూరము నడచెను. శ్రీ జగద్గురువులు నీటిలో దిగిరి. పరిచారకుడు “అచ్చట చాలలోతు” అనెను. శ్రీ జగద్గురువులు శాంతముగా “నాకు తెలియును” అని ముందుకు సాగి ఒక మునుగు మునిగి లేచి ప్రాణాయామము చేసి సంకల్పము చేసి మరొకసారి మునిగిరి. ఒకటి రెండు సెకండ్లలో ఆయన దేహము నదీ ప్రవాహమున ముందుకు పోయెను. గట్టుపైనున్న పరిచారకుడు ఆందోళనతో నీటదూకి శ్రీ జగద్గురువుల దేహమును పట్టుకొనెనే కాని ఆ ప్రయత్నములో స్మృతి గోల్పోయెను. గట్టుమీద కొంత దూరమునందుండి పరిచారకుడు నదిలో దూకుచు చేసిన ఆర్తనాదమును వినిన మరొక వ్యక్తి నీటదూకి పరిచారకుని శ్రీ జగద్గురువుల దేహమును బయటకు తెచ్చెను. ప్రథమ చికిత్సలో పరిచారకునికి శ్వాస వచ్చినది. తరువాత స్మృతి వచ్చినది. 

శ్రీ జగద్గురువుల దేహమున కట్లు కాలేదు. శ్రీ జగద్గురువుల శరీరము పద్మాసనమున కూర్చుండినట్లుండెను. ప్రథమ చికిత్సలో శ్వాస తెప్పించుటకు జరిగిన ప్రయత్నమున ఆ శరీరము నీటిలో మునిగి శ్వాస ఆడక నీరు మ్రింగినట్లు లేదు. బ్రతుకుకై ప్రయత్నము చేసినట్లు లేనేలేదు. శ్రీ జగద్గురువుల కెట్టి అనారోగ్యము లేదు. ఆయన జీవించి యున్నప్పుడు వైద్యులకు దిగ్భ్రమ కలిగించినట్లే సిద్ధి పొందినప్పుడు కూడ దిగ్భ్రమనే కలిగించిరి. జీవితకాలమునందును, దేహ త్యాగ కాలమందును – ఆయన ఆధ్యాత్మిక అనుభవములను భౌతిక వివరణము కోరు వారందరికీ పరిష్కరింపరాని సమస్యగానే మిగిలిపోయినారు. ఆవిధంగా శ్రీ జగద్గురువులు మన భౌతిక నేత్రములకు కన్పించకుండా వెళ్ళిపోయి యావద్భారతదేశముననున్న ఆయన శిష్య జనమును దుఃఖ సముద్రమున ముంచిరి. ఆయనకు గురువులైన జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వాముల వారి సమాధికి వామభాగమున వీరి భౌతిక శరీరము సమాధి చేయబడినది. ఆయన కనుమరుగైన దినము మహాలయామావాస్య. జయనామ సంవత్సర భాద్రపద అమావాస్య (26.9.1954). ఆనాడు శ్రీ శారదాదేవికి మహాభిషేకము. మరునాడు శ్రీ శారద నవరాత్ర్యుత్సవముల ప్రారంభము. శ్రీ జగద్గురువుల ఆరాధన శ్రీ శారదా దేవి మహాభిషేకముతో కలసిపోయి జరుగుచున్నది. ఆయన శ్రీదేవితో అభిన్నులని చెప్పుటకిది యొక నిదర్శనము.

ఆ జీవన్ముక్తులను ఈరోజు మనమందరమూ తలచుకొని మనల్ని ధర్మాచరణం వైపు నడిపించమని ప్రార్థిద్దాం

సదాత్మధ్యాన నిరతం విషయేభ్యః పరాజ్ఞ్ముఖం!
నౌమి శాస్త్రేషు నిష్ణాతమ్ చంద్రశేఖర భారతీం!!

జయతు జయతు నిత్యం చంద్రమౌళి ర్మహేశో 
జయతు జయతు నిత్యం శారదాభీష్ట దాత్రీ 
జయతు జయతు నిత్యం శంకరో దేశికేంద్రో 
జయతు జయతు నిత్యం చంద్రచూడో గురుర్నః!!


Share:

రాధ అంటే ఎవరు.!!


రాధ ఎవరు.?

రాధ ఎవరు? పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయము అక్కడ ఉంది. కృష్ణావతారసమయములో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానము ఉన్నది. ఆమె లోకాతీతజ్ఞానముతో పుట్టినది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీ గావచ్చి ఆయనతో సాహచర్యము చేసి వెళ్ళినది. ఆమె జ్ఞానాంశ. కృష్ణునితో అభేదము కలిగియున్నది. ఈ ద్వారకా నాథుడు కూడా పరశివ తత్త్వము. కృష్ణుడు ప్రభాస తీర్థములోని సోమనాథుని ఆరాధించాడు. ఆ సమీపములోనే ఆయన మహాపరి నిర్వాణము కూడా జరిగినది. ఆయన లోని విష్ణుతత్త్వము అవతార సమాప్తి కాగానే వైకుంఠమునకు వెడలిపోయినది. శివతత్త్వమే మిగిలిఉన్నది. కృష్ణుడు భూమి మీద అవతరించక ముందే భూలోకములో ఆయనకై వేచియున్న పరాశక్తి రాధ. 

బ్రహ్మ వస్తువు రూపగుణములులేని నిత్య సత్యము. జగత్తు నిత్యమూకాదు, సత్యమూ కాదు. దీని నిర్మాణమునకు ఆ నిర్గుణబ్రహ్మమునుండి పుట్టి అందులోనే లయమయ్యే రెండు తత్త్వములు కారణము. అవి పురుష స్త్రీ తత్త్వములు. మనమున్న 14 లోకముల బ్రహ్మాండ సృష్టికి మహావిష్ణువు అనే పురుషతత్త్వము, బ్రహ్మ, రుద్రుడు అనే మరిరెండు పురుష రూపములు, లక్ష్మి, సరస్వతి, పార్వతి అనే స్త్రీ తత్త్వములు కారణము. ఈ సృష్టిలోని జీవులు ఈ త్రిమూర్తులను ఆరాధించి వరములు పొందుతారు. ఈ లోకములు కాక బ్రహ్మాండమందు గోలోకమనే లోకము ఉన్నది. ఈ లోకములో జీవులు నిత్యులు, ఆనంద స్వరూపులు. ఈ లోక పాలకులు రాధాకృష్ణులు.శుద్ధ ఆనందమైన బ్రహ్మ స్వరూపులు. ద్వాపరాంతమందు వీరే భూమియందు అవతరించినారు. వారి ఉపాసన వలన సర్వ కర్మాతీతమై ఏ కర్మఫలమూ కానటువంటి ఒకానొక ఆనందము మనకు లభిస్తుంది. 

దేవీభాగవతం రాధాదేవి ఉపాసనను వివరిస్తుంది. గోలోకంలో రాధాకృష్ణులను దేవతలందరూ అర్చించారు. సరస్వతి, బ్రహ్మ, శివుడు, లక్ష్మి, దుర్గ, మొదలైన వారందరూ దుర్గా మహోత్సవం జరిపినట్లు, పురాణ కథనం. బ్రహ్మకోరిక మేరకు శివుడు గానం చేయగా, ఆ గానరసంలో రాధాకృష్ణులు కరగి జలమై ప్రవహించారట. ఆ విధముగా గంగయే రాధ. శివుడు తిరిగి స్తుతించిన తరువాత రాధాకృష్ణుల దర్శనం అందరికీ లభించింది. ఈ గంగ భూలోకంలోని రాసమండలంలో ఉద్భవించినదనికూడా చెబుతారు. రాసమండలమంటే శ్రీకృష్ణుడు రాసలీల నిర్వహించిన వర్తులాకార స్థలము. దీని అంతరార్థము రాధాకృష్ణులు కేవలము రసమయ స్వరూపులు. వారి రస తత్త్వము అనురాగ జన్యమైన ఆనందము. భూమిపై అవతరించిన శ్రీకృష్ణుడు రాధయందు గోపికల యందు మానవాతీతమైన అనురాగమును కలిగించినాడు. 

శ్రీకృష్ణుడు తన భార్యలందరినీ సమముగా ప్రేమించినాడు. అందులో ఆశ్చర్యమేమున్నది? అతడు సమస్త ప్రాణికోటినీ సమానముగా ప్రేమిస్తున్నాడు. ఒక సారి కృష్ణుని భార్యలైన మిత్రవింద, కాళింది అనేవారికి ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? అనే సందేహము వచ్చింది. శ్రీకృష్ణుడంటే ఎక్కువ భక్తి కలిగినది రుక్మిణి అని ఎక్కువ ప్రేమ కలిగినది సత్యభామ అనీ వారి అనుమానము. వారినే వాళ్ళు అడిగారు. సత్య సమాధానం "భక్తి, ప్రేమలలో ప్రేమ ప్రధానం. అందరు భార్యలకంటె నేనే ఆయనకు ఇష్టము" అని ఆమె అన్నదట. రుక్మిణి ఇలాచెప్పినది. "ఆయనకు సమస్త జీవరాసులపై సమానమైన ప్రేమ.అట్టివారిలో నేనొకతెను." శ్రీకృష్ణుడు దక్షిణ నాయకుడు, భార్యలందరిపై సమాన ప్రేమ కలవాడు. సత్యభామ, రుక్మిణీ, రాధ వీరి ప్రేమలలో తేడా ఏమిటి? సత్యభామది భూతత్త్వము. ఆమె నిరంతరం ఆయన భౌతిక సాన్నిహిత్యము కోరుతుంది. ఇది తామసిక ప్రేమ. రుక్మిణి అతడు తనవద్దకు వచ్చినప్పుడు పూజిస్తుంది. అతడు దగ్గరలేనప్పుడు హృదయమందు ధ్యానిస్తుంది. ఇది రాజసిక ప్రేమ. రాధ ఎప్పుడూ కృష్ణుని సన్నిధిలోనే ఉన్నట్లు భావించుకుంటుంది. అతడు సన్నిహితముగా లేని భావనయే ఆమెకు ఉండదు. ఆమెది సాత్త్విక ప్రేమ. రాధాకృష్ణుల తత్త్వము అర్ధనారీశ్వర తత్త్వమే. ఒక నాణెమునకు కృష్ణుడు ఒకవైపు, రాధ మరియొకవైపు. వారు సనాతనులు.



రాధ అంటే ఎవరు !! 

ఒకరు ప్రియురాలు అని... మరికొందరు
కృష్ణుని బంధవులు అని... వేరొకరు కన్నయ్యకు అత్త అని..
 ఏవేవో ఉహాలు ...కానీ....
ఒక్క ధ్యాని సాధకుడు యోగి  మాత్రమే  కృష్ణ తత్వాన్ని గ్రహించ గలుగుతాడు .

ధ్యాన స్దితిలో సాధకుడుగా సత్యం ఏమిటి అని ఒక్క క్షణం పరికిస్తే ....

రాధ అంటే భగవంతుని విశేషముగ ఆరాధించునది అని(భక్తీ అని ) అర్ధము.

అనగా అత్యంత భక్తురాలు.

రాధ : ధారా ............ అదో నిరంతర వాహిని

కుండలి నుండి మూలాదార  వరకు జాలువారుతున్న అమృత బిందువులను (విశ్వశక్తిని  )

ధారలా భూలోకము నుండి ( మూలాధారా ) వైకుంఠము (సహస్రారం ) నకు తీసుకుని

వెళ్ళగలిగే ఒక శక్తి ... ధార .....రాధ ......  ఇదో నిరంతర వాహిని ...

ఇదే ధ్యానం ......భక్తీ ...... ప్రేమ....

కృష్ణుడనగా  ఆకర్షించు వాడని యర్ధము:: నిరంతరం ఆత్మ అంతర్ముఖం కమ్మంటుంది

కాని మనం అత్మరాత్మ మాట వినం. ఇంద్రియాలు చెప్పినది చేస్తూ ఉంటాము ..

రాధ యనగా సిద్ధింప చేయునది అని అర్దము (మోక్షం )

కృష్ణ  ( సాధకుడు ) ఎక్కడ ఉంటే ( నిరంతర ) ధార (రాధ ) అక్కడ ఉంటుంది .

నా దేహం వేరు ... నా శ్వాస వేరు అని చెప్పగలమా ?? లేదే

ఇరువురు ఒక్కటే ... ఇలా కృష్ణుని అంతరమైన స్వరూపము రాధగను,
బాహ్య రూపము పురుషుడినియు.

 అలాగే రాధయొక్క అంతర్ స్వరూపము పురుషుడైన కృష్ణుని గాను,
బాహ్య స్వరూపము రాధ.

భగవాన్ కృష్ణ కోసం 16, ౦౦౦ మంది గోపికలు వచ్చారు ..

రాసలీలలు  అని వ్యర్ద ప్రేలాపనలు చెపుతూ ఉంటారు .

యద్బావం తద్బభవతి వారిని మనం మార్చలేము ... కాని సత్యం మాత్రం ఇదే ....

ఎప్పుడు భాహ్య నేత్రాలతో  చూడటమేనా ? ..

ఒక్కసారి అంతర్ముఖులమై మనో నేత్రంతో  ఆత్మ స్దితిలో చుస్తే ...

పరమాత్ముని కోసం పరితపిస్తున్న జీవాత్మలు 16,౦౦౦..

నిరంతర ధ్యాన యజ్ఞంలో సమిధలుగా మారి 

సత్య జ్ఞానాన్ని పొందిన (ఎరుక ) సిద్దులు .

వారు లక్ష్యం వెతుకులాట !!!!

ఆ మహాచైతన్యం కోసం వెతుకులాట!!!!

ఆ పరంధాముని కోసం వెతులాట .. !!!!

ఆ వెతుకులాటలో ధ్యాన మార్గం చూపిన వాడు కృష్ణ

జ్ఞాన మార్గం చూపిన వాడు కృష్ణ

దేముడికి జీవుడికి ఉన్న బంధాన్ని ఎరుక పరచిన వాడు కృష్ణ

శోధన నుండి సాధన వైపు

సత్యాన్ని ఎరుక పరచిన వారు కృష్ణ .........

ఆబాల గోపాలం అంతా సిద్దులు యోగులు తాపసులు

గోకులం అంటే వైకుంఠం అందులో భక్తీ అంటే రాధ

వైకుంఠం + ధ్యానం  +కలిసి యున్నదే బృందావనం ..  

 కాపున బృందావనము అంటే ఓ సమూహం  

జీవ సమూహము. ధ్యాన జీవుల సమూహం ........

ఇకనైనా రాధ మాధవ తత్వాన్ని అర్ధం చేసుకుందాం ....... 

https://www.facebook.com/rb.venkatareddy

Share:

కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి.


కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి.
.
.
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని ”విజయారంభం” అని పిలుస్తారు.
.
దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.
.
కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.
.
దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.
.
కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.
.
కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.


https://www.facebook.com/rb.venkatareddy/posts/10212863349531344
Share:

మహాగౌరిదేవి..మహిషాసుర మర్ధిని.

మహాగౌరిదేవి..మహిషాసుర మర్ధిని....
.
అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే ”మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరిమ్చి, అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ దినాన పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి ¬మం చెయ్యాలి. అమ్మవారికి ”ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహినైస్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. పూజానంతరం చిత్రాన్నం, గారెలు, వడపప్పు, పానకం నివేదనం చెయ్యాలి.కొన్ని ప్రదేశాలలో ఈ రోజున అమ్మవారి ఉగ్రరూపానికి జంతుబలులు ఇస్తారు. కానీ ఇప్పుడు అది బాగా తగ్గిపోయింది.
.
దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి ‘మహాగౌరి’ అని పేరు. ఈమె పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ, శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి. చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ, మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ, మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.
.
జన్మకోటిలగి రగర హమారీ ।
బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ ॥
.
కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి విద్యుత్‍కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని వాసి గాంచింది.
.
దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ, సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు కానీ వారి దరిజేరవు. వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.
.
మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి. ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.


https://www.facebook.com/rb.venkatareddy/posts/10212870226343260
Share:

రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి.

రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి.
.
.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే..


అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి...పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి...రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే…”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.
.
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…
.
1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.
.
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.
.
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.
.
ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.
.
నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.
.
దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

https://www.facebook.com/rb.venkatareddy/posts/10212877288999822
Share:

చివటం అమ్మ..

ఆధ్యాత్మిక దివ్యజ్యోతి అవధూత చివటం అమ్మ.

 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ప్రకృతిలో వివిధ రూపాలలో ఎంత శోభాయమానంగా మన దృష్టిని ఆకట్టుకుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతతో మనల్ని ఆకర్షిస్తాయి. కానీ ఇవన్నీ ఏ ఆకాశములోనయితేవున్నాయో అది వాస్తవానికి వీటన్నిటికంటే అద్భుతమైనదయినా మనలను ఆకట్టుకోదు. పరిపూర్ణ అవధూత స్ధితిలో వున్న మహాత్ములు కూడా, మనలను చిల్లర మహిమలను మంత్ర శక్తులను ప్రదర్శించేవారిలా ఆకర్షించరు. అటువంటి మహాత్ముల కోవకు చెందిన వారే అవధూత చివటం అమ్మ.      సాధు అమ్మగా ప్రసిద్ధి గాంచిన దిగంబరయోగిని చివటం అమ్మ అసలుపేరు అచ్చమ్మ. తణుకు సమీపాన గల చివటం గ్రామములో సాధారణ గృహిణిగా జీవితాన్ని ప్రారంభించిన ఈ తల్లి, భర్త బాధ్యతా రాహిత్యంగా తిరిగినా ఇరుగు పొరిగిండ్లలో పనిచేసి భర్తకు, బిడ్డకు వండిపెట్టేవారు. భర్త దుర్మార్గుడయి కొట్టినా పల్లెత్తి మాట అనేది కాదు. ఆమెకు రామనామమంటే ప్రీతి. గ్రామస్థుల దగ్గర అడిగి తెచ్చిన బియ్యం, పప్పు వండి పిల్లలందరికీ తినిపించటం ఆమెకు ఇష్టమయిన పని. కాలాన్ని వ్యర్ధంగా గడపక, పనిచేసే సమయములో కూడా రామనామాన్ని స్మరిస్తూవుండేవారట. ఖాళీ దొరికితే ధ్యానానికి కూర్చొనేవారు. అటువంటి అచ్చమ్మ ఒక రోజు కొడుకును తన తల్లికి అప్పజెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. కొన్నాళ్లు ఆమె చిన్నాయి గూడెంలో వున్నారు. ఆ రోజులలో ఆ తల్లి నోటివెంట కృష్ణా, రామా అనే పదాలు తప్ప మరేమీ వచ్చేవి కావు. తరువాత మన్నెం జగన్నాధపురం వెళ్ళి ఆ ప్రాంతంలో 12 సంవత్సరాలు మౌనంగా కఠిన దీక్షలు చేసారట. అక్కడ ఎన్నోలీలలు ప్రదర్శించేవారని ఇప్పటికీ చెప్పుకుంటారు. రాజమండ్రి స్త్రీల మఠములో కొంతకాలముండి, చివటం చేరారు.      చివటంలో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక తన్మయస్థితిలో బట్టలు కూడా జారిపోతున్నా తెలియని స్ధితిలో వుండేవారు. ఒక రోజు జారిపోతున్న తన చీరను తీసి ఒకబాలునిపై వేసి అప్పటి నుండి దిగంబరంగా వుండిపోయారు. అమ్మ చివటం సమీపములో జమ్మిచెట్టుక్రింద ధ్యానం చేసుకుంటుండేవారు. ఎవరయినా అడిగితే కాయలు కాయని చెట్టుక్రింద కూర్చోవాలి అనేవారు.      ఎక్కువ కాలం అమ్మ స్మశానములో గడిపేవారు. అప్పుడప్పుడూ మూడు ఇళ్లకు మాత్రమే భిక్షకు వెళ్ళేవారు. భిక్ష చేతిలో వుంచుకుని పరుగులు తీసేవారు. తన గురించి, శరీరస్ప్రహే లేకుండా చిదానంద స్థితిలో వుండే ఆమెకు గ్రామములోనివారే మంచిచెడ్దలు చూసేవారు. శేషమ్మగారని ఒకావిడ బలవంతంగా తీసుకెళ్ళి స్నానము చేపించేవారు. చివటములో అలా 12 సంవత్సరాలు ధ్యానంలో గడిపారు.      మహాత్ములు కూడా ఆమె దర్శనము కోసం వచ్చేవారు. అయితే వచ్చిన వారిపాదాలను తాకి నమస్కరించేవారు అమ్మ. ఎదగటంలో ఎలావొదగాలో సాధకులకు చేసి చూపించారు అమ్మ. సాధూరాం బాబాజీ శిష్యులయిన హఠయోగి అప్పారావుగారికి కూడా అమ్మ అలా నమస్కరించబోగా ఆయన బాధపడి, అమ్మా నువ్వుపండిపోయావు నేనింకా పండవలసినవాడిని అని అన్నారు. ధ్యానం ఎలా చెయ్యాలి అని అడిగిన భక్తులతో, మొదట ఓమ్ కారం చెయ్యాలి ఆ తర్వాత రామరామ అనుకుంటూ మౌనంగా కూర్చోవాలి. ధ్యానములోంచి లేచేటప్పుడు కూడా, ఓంకారం చేయాలి. చీపురు  పెట్టి తుడిస్తే వాకిట్లో ఎంత శుభ్రంగా ఉంటుందో అలాగే ఓంకారం చేసినప్పుడు కూడా మనసులో మాలిన్యము తొలగి పోతుంది అని చెప్పారు. ఆధ్యాత్మికోపన్యాసాలు వినడం *కూర* అంత వినాలి, ధ్యానం *అన్నమంత* చేయాలి అనేవారు. ధ్యానం బంగారు ముద్దవంటిది, దానికి మించినది లేదు. అనిచెప్పేవారు, అండు కొరకు ఎటువంటి నిబంధనలు అక్కరలేదనేవారు. కాలు కడుక్కోక పోయినా పరవాలేదు రామరామా అనుకోండే అనేవారు. నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి ఎంత తాపయత్ర పడతామో అంతకన్నా ఎక్కువ ఆత్రుత పడాలి దైవం కోసం అనేవారు అమ్మ. రామాలయములో నివసిస్తూ స్వయంగా వంట చేసి అందరికీ తల్లిలా తిని పిస్తుండేవారు ఆ మహాత్మురాలు. తన సమాధిని ముందుగానే సూచించారు అమ్మ. మహాసమాధికి వారం రోజుల ముందు తన పంటిని పీకించి సూరమ్మ అనే భక్తురాలికిచ్చి దాచుకోమన్నారు. 1981 జూన్ 8 వతేదీ అర్ధరాత్రి కావస్తుండగా తన భక్తులను కూచోబెట్టుకుని .. ఎవరైనా ఏదన్నా అంటే మనం పది మాటలు అన కూడదు. ఎప్పుడూ దృఢంగా వుండాలి, గుమ్మములోనికి వచ్చిన వారికి ఒక ముద్దచేతిలో పెట్టి నీరు ఇవ్వాలి అని చెప్పారు. తరువాత గీత చదివించుకుని విన్నారు. తరువాత కొబ్బరికాయ కొట్టించి హారతి ఇప్పించుకుని ప్రశాంతంగా దేహత్యాగం చేశారు అమ్మ. సమాధి అయిన వెంటనే వచ్చిన వాడపల్లి బాబుగారు శిరస్శు చూసి అమ్మ కపాలభాగం చిట్లి రక్తం గడ్డకట్టి ఉన్నదని,  అమ్మ బ్రహ్మరంధ్రంగుండా శరీరాన్ని విడిచారని చెప్పారు. ఇక్కడికి ఎందుకొచ్చామే పిడకలెరు కోవటానికా? రామరామ అను కోండే అని తన చుటుపక్కల వారికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఆచరణ ద్వారా చూపిన ఆసద్గురువు పాద పద్మాలకు మనసారా నమస్కరించు కుందాము.

Share:

శాశ్వత సత్యాలు..

ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగినపుడు ఎవరు తప్పు, ఎవరు రైటు అన్న ప్రశ్న ఒక్కటే తప్పు, మిగిలినదంతా రైటే.

 "ఒకడి మీద ఒకడు చిరాకు పడడం, ఎవరికి వారు వేరుగా పని చేసుకోవడం అనేవి ఏర్పడతాయి. ఈ విడిపోవడం సామాన్యంగా కొన్ని సంవత్సరాలు గాని, ఒక్కొక్కడికి ఆజన్మాంతం గాని ఏర్పడుతూ ఉంటాయి.

చిరాకు పడటంలో విషయం ఏమీ ఉండదు. చిరాకు పడడానికి ఎప్పుడూ పాయింటు ఉండదు. చిరాకుకు కారణం పనిలేని చిత్త వృత్తి. కనుక అది ఒక విధమైన వ్యాధి వంటిది.

 దానిని‌ నివారణ చేసుకొన్న వాడికి తప్ప మిగిలిన వారికి తన నిత్య జీవితం కూడా ఇబ్బందులతో నడుస్తుంది. ఇక మహాకార్యాలు సాధించడం అనేది ఉండదు.

 " నీకు గిట్టని వాళ్ళు, గిట్టని సిద్ధాంతాలు నశించటం సత్యం కాదు. కనుక అది ఎన్నటికి జరుగదు. వాటికి నీకు ఉన్న సంబంధం తెలుసుకొని, ఉండవలసిన సంబంధం ఏర్పరుచుకుంటే నీవు వాళ్ళని, వాటిని మలచ గల్గుతావు.

నీ కన్నా తక్కువ తెలిసిన వాళ్ళు నీ వెంట నడవాలంటే, నీవు నీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అడుగుజాడలలో నడవాలి...
Share:

శ్రీ విష్ణు సహస్రనామం..


 స్పష్టమైన రూపము కలవాడు, భక్తులకు దర్శనమొసగువాడు; స్వస్వరూపముతో భక్తులకు దర్శనమిచ్చువాడు. స్వయంప్రకాశకుడు, అవతార మూర్తి, ప్రత్యక్షదైవము; మార్కండేయుడు వంటి యోగులకు యోగముచే కూడా కనుపించు రూపము కలవాడు, తన యధార్ధ స్వరూపమును చూపించువాడు, “నీలమేఘవర్ణంవంటి శరీరం కలవాడు, శ్రీవత్సం అను పుట్టుమచ్ఛ కలవాడు, పద్మం వంటి శరీరమును కలవాడు, మఱ్ఱి ఆకు మీద పడుకొని దర్శనమిచ్చువాడు”. కోట్లమంది యోగులలో యో ఒక్కరుకో తన యధార్ధ స్వరూపమును దర్శనమును అనుగ్రహించువాడు. మాయ తొలిగిన వారికి మాత్రమే తన స్వస్వరూపముతో కనపడువాడు, భగవానుడు మహావిష్ణువు.

మంత్రం:- *ఓం శ్రీ వ్యక్తరూపాయ నమః*
                      *హరే కృష్ణ*
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
Share:

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు..


హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

జై శ్రీరామ్
జై హనుమాన్
Share:

పితృ దేవతలు అంటే ఎవరు..?


కర్మ క్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒక చోట పుడతాడు అన్నది నిజమేనా ??

అలాగయితే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి ??

జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా..

మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు?

పెళ్ళి/పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా..

వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినపుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది?

పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా?

1. పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు.
మనందరి (జీవుల) రాకపోకలను,
వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు..
మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.

2. కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం.
కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము.
ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది.
వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు.
అది ఆ జీవుని యొక్క
సంకల్ప బలం,
తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం
అనే కర్మలపైన
ఆధార పడి ఉంటుంది.

3. ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది.
వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది.
ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు.

ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది.
వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు.
ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది.

ఉదాహరణకు మనం మనీఆర్డరు చేసిన అడ్రసులో ఎవరూ లేకపొతే మనకే తిరిగి వస్తుంది కదా.

కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.

4. ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ,
తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది.
మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు.

5. సంప్రదాయ బద్ధంగా పెళ్ళి జరుగనప్పుడు ఇరువైపుల పితరులు
(ముందు తరాలు,
తరువాతి తరాలు)
అధోగతి చెందుతారన్నది నిజం.
వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు.
అందుకే మనవారు పెళ్ళిళ్ళలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు.
గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివలననో ఉత్తమగతులు మళ్ళీ పొందే అవకాశం ఉంది కానీ ఖచ్ఛితంగా చెప్పలేము. అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటే వారితో తలిదండ్రులు,
బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్ళు.
అది అభిమానం లేక కాదు. వారు, వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా
అలా చేసే వాళ్ళు.

6. ఆ పైన పిల్లలు కలిగి, వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం. అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు. కానీ మన ప్రయత్న లోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు.

దానికి ప్రత్యామ్నాయంగా… దేవతల కళ్యాణాలు,
మరి కొన్ని వ్రతాలు ఉన్నాయి. వాటిని ఆచరించడం వలన ఇది వరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో
 ఆ పాపాలని నాశనం చేసి, వారిని, వారి పితరులను
కూడా తరింపజేసుకోవచ్చు.
Share:

ఎవరు నువ్వు .


మాంస మయమైన ఈ పంజరం నుండి ఒక్కసారి బయటకు తొంగి చూడు ....
ఈ చిన్న పంజరం లో అటు ఇటు పరుగులు తీస్తూ ....
ఇంతకు మించిన విశ్వం వేరెక్కడ లేదంటూ ........

అహంకారం దుస్తులు వేసుకుని
అజ్ఞానం అనే గొంగళి కప్పుకుని ...
ఎంతకాలం బ్రతికేస్తావు .........
పేడలో పురుగులా ........
ఈ పంజరమే  జీవం ఇదే జీవితం అంటూ ..
ఇంతకు మించి ఇంకేమి లేదంటూ ......
నాకు తప్ప ఇంకెవరికి ఏమి తెలియదంటు ...
తెగిన గాలి పతంగం లా .... లేనిది కోరేస్తూ .......
ఉన్నది వదిలేస్తూ ...

ఒక్కసారి నువ్వు ఎవరో పరికించు .......

‘’నీకు ఒకే  దేహం అని లేదు ........
కాలం రూపం లేదు .......
జనన మరణం లేదు .....
పుష్పం లో సుగంధం నువ్వు ......
తొలిపొద్దులో నులివెచ్చని స్పర్స నువ్వు .....
తేనెలో తీపి నువ్వు .....
మంచులో చల్లదనం నువ్వే .......
కంటిలో వెలుగు నువ్వే
కాష్టంలో కాలుతున్న కట్టే  నువ్వే ....


నీ శ్వాసే వేదం .........
నీ పిలుపే ఓంకార నాదం ..........
ఆ నాదం అనే విల్లును పట్టి ........
ధ్యానం అనే బాణం ఎక్కు పెట్టి ............
పరబ్రహ్మం వైపు గురి చూసి కొట్టు ...

అప్పుడే ..............
నీకు నువ్వు ................
గ్రహించే సత్యం ...............

తత్వమసి ‘’ అది నేనై ఉన్నాను ...
ఆ ‘ అది’ నువ్వు .. నువ్వే అది.
Share:

కాశీ ఖండం –21

 బ్రహ్మ చేసిన కాశీ ప్రశంశ..  శివ శర్మ ను విష్ణు దూతలు స్వర్గ లోకం నుండి మహార్లోకానికి తీసుకొని వెళ్లారు ..అక్కడ విష్ణు స్మరణ చేసి ,కల్పాయువు కలిగిన వారు ఉంటారు .ఇక్కడ దేవతా ప్రముఖులు నమస్కార యోగం తొ ఎప్పుడూ తపో సమాధి లో ఉంటారు .అక్కడి నుండి జనో లోకం చేరాడు .ఇక్కడ బ్రహ్మ కుమారులు సనకస నందనాది మహర్షులు ఊర్ధ్వ రేతస్కులయి  ఉంటారు .తర్వాత తపో లోకానికి వెళ్లాడు .ఇక్కడి వారు సదా వాసు దేవుని స్మరిస్తూ ,అన్నీ ఆయనకే అర్పించి ,దాహాదులు కూడా లేకుండా ఉంటారు .రోళ్ళ దగ్గర దంచు తున్నప్పుడు యెగిరి పడిన గింజలను మాత్రమె ఏరుకొని తింటారు .రాళ్ళు తిని ,ఎండిన ఆకులను తిని జీవిస్తారు .వేసవిలో పంచాగ్ని మధ్యమ లో నిల బడి మహా తపస్సు చేస్తారు .చాతుర్మాస్య వ్రతాన్ని అవలంబిస్తారు .రెప్ప పాటు లేకుండా జీవిస్తారు .రుతువు అవగానే జలాన్ని మాత్రమె త్రాగుతారు .ఆరు మాసాలు ఉపవాసమే .వర్ష ధారల తొ తడుస్తున్నా రాయి లాగా నిశ్చలం గా ఉంటారు .ఇక్కడికి వచ్చిన వారు మృగాల దురదను గోకి తీర్చిన వారు ,అడవిలో ఉన్న తమ జాడలలో పక్షి గూడులు కట్టిన వారు ,శరీరాలనుంచి సస్యాలు ఉద్భవించిన వారు .వీరికి బ్రహ్మాయుస్సు ఉంటుంది .

              శివ శర్మ సత్య లోకం చేరుకొన్నాడు .బ్రహ్మ అతడిని  చూసి ‘’ఇక్కడి నుండి త్వరగా వెళ్ళు .నిత్యం నేను ఇక్కడ ప్రళయాన్ని సృష్టిస్తాను .విరాట్ పురుషుని వరకు ఉన్న సృష్టిని అంతటిని హరుడు రోజు సంహరిస్తాడు .అలాంటప్పుడు మరణ ధర్మం ఉన్న మానవుల గురించి చెప్పాల్సిన్దేముంది ?కృత ,త్రేతాది యుగాలకు మనుష్యులకు తగినది ఒక్కటే యుగం .ఆ యుగం లో భారత వర్షం లో మానవులు వికశిస్తారు .మనసు లో కూడా ఇంద్రియాలను జయించి, కామ క్రోధాదులను వదిలి ,తపస్సు చేత యశో సంపద పొంది,తమో గుణాన్ని విసర్జించి ,సంపద మీద ఆసక్తి లేకుండా ,అహంకారాన్ని వదిలి నవారు ,స్మృతులను సమగ్రం గా తెలుసుకొన్న వారు ,స్నేహం తొ ధర్మ సోపాన్ని అధిరోహించిన వారు ,భారత దేశం లో మళ్ళీ మళ్ళీ పుట్టి ,మానవులు అని పించుకొంటారు .

              ‘’ఈ బ్రహ్మాండం లో స్వర్గానికి మించినది లేదు .తపస్సు ,దానము ,వ్రతాలు చేసిన వారు స్వర్గం చేరతారు .స్వర్గం కంటే పాతాళలోకం రమ్యం గా ఉంటుందని నారదుడు చెప్పాడు .దైత్య ,దానవ కన్యల చేత పాతాళలోకం శోభిల్లు తుంది మోక్షాన్ని పొందిన వారు కూడా పాతాళ లోకం లో జన్మిస్తారు .పాతాళం లో పగటి పూట సూర్యుడు ప్రకాశిస్తే ,రాత్రిళ్ళు చంద్రుడు వెలుగు లను చిమ్ముతాడు .చంద్ర కిరణాలలో చల్లదనం ఉండదు .ఇక్కడ విద్యలు కోకిల స్వరాల్లా విని పిస్తుంటాయి .వీణా వేణు మృదంగ ధ్వనులు చెవులకు ఇంపు చేకూరుస్తాయి .ఇక్కడ హా ట కేశ్వర మహా లింగమున్నది .అన్ని కోర్కెలను తీరుస్తుంది .దానవులకు భోగ భూమి ఇది .

                ‘’ పాతాళం కంటే రమ్య మైనది ద్విజ వర్షము .ఇది ఇలా వృతం .ఇక్కడ రత్న సానువు లున్నాయి .పుణ్యాత్ములకు దివ్య భూమి .సత్యం భాషణులు ,పుత్రులున్నవారు ,ఉత్తమ క్షేత్రాలను సందర్శించిన వారు ఇక్కడకు వస్తారు .ఇందులో ద్వీపాలు చాలా ఉన్నాయి .వాటిని సముద్రం చుట్టి ఉంటుంది .

            ‘’జంబూ ద్వీపానికి మించిన ద్వీపం లేదు .ఇక్కడ నవ వర్షాలు దేవతల భోగ భూములు .దేవతలు స్వర్గం నుండి దిగి వచ్చి ఇక్కడ ఉంటారు .ఇది తొమ్మిదివేల  యోజనాల విస్తీర్ణం కలది .దీనిలో మేరు పర్వతానికి దక్షిణం గా ఉన్న భారత వర్షం మొట్ట మొదటిది .హిమవత్ ,వింధ్య పర్వతాల మధ్య ఉన్న ప్రదేశం అత్యంత పవిత్ర మైనది .ఉత్తమ పుణ్య క్షేత్రాలెన్నో ఉన్న భూమి .అందులో కురుక్షేత్రం చాలా గొప్పది .దాని కంటే నైమిశారణ్యం ,గొప్పది దీన్ని తీర్ధ రాజం అంటారు .అన్ని ఒర్కేలను తీర్చేది .నిరంతరం యజ్న యాగాదుల తొ అలరారు తు ఉంటుంది .

             ‘’ సప్త ధాతు మయ మైన మహా పాపాలు శరీరం లోని కేశాలను ఆశ్రయించుకొని గట్టిగా పట్టుకొని ,వదల కుండా ఉంటాయి .కనుక ప్రయాగ లాంటి తీర్ధాలలో ముమ్దనం అంటే గుండు కొట్టించు కొంటె ,పాపాలన్నీ వదిలి పోతాయి .త్రివేణీ సంగమ స్నానం దోషాలన్నిటిని హరించి పుణ్య లోక ప్రాప్తి కల్గిస్తుంది .ఇక్కడ పుణ్యవిధి నిర్వహించిన వారంతా సత్య లోకానికి చేరుకొంటారు .

             ‘’  కాశీ అన్ని టి కంటే గొప్ప ముక్తి క్షేత్రం .ఈ క్షేత్రం ఈశ్వరుని త్రిశూలాగ్రం లో ,భూమికి ,ఆకాశానికి మధ్య ఉన్నది .ఇక్కడ ఎప్పుడూ కృత యుగమే .నిత్యం మహా పర్వదినమే .ఎప్పుడూ ఉత్తరాయణమే .ఎల్లప్పుడు మహోదయమే .కాశిని సృష్టించిన వాడు సాక్షాత్తు మహా శివుడు .కాశీ లో పాపం చేయరాదు ఇక్కడ తులా పురుష దానం లాంటివి చేసిన వారు సత్య లోక వాసులవుతారు .జప ,తప ,ధ్యానదుల వల్ల రాని మోక్షం కాశీ నివాసం తొ ,కాశీలో మరణం తొ కలుగు తుంది .అని బ్రహ్మ దేవుడు కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని వివరించాడు శివ శర్మకు

Share:

కాశీ ఖండం –20


ధ్రువుని నారాయణ స్తుతి... తన ముందు ప్రత్యక్ష మైన వాసు దేవుడిని ధ్రువుడు ఇలా స్తుతించాడు ‘’పరాత్పరా నారాయణుడా !సృష్టి కర్తవు ,హిరణ్య గర్భుడివి ,హిరణ్య రేతస్కుడివి ,హిరణ్య దాతవు ,అయిన నీకు నా ప్రణామం .మనో రణ్యానికి దావాగ్ని వంటి వాడవు .చక్ర దారివైన ,శ్రీ పతివి ,వరాహ రూపం లో భూమిని రక్షించావు.నరకాన్ని హరించే నారాయణుడవు .హరివి ,శౌరివి .అనంత శయనుడవు .రుక్మిణీ పతివి .పుండ రీకాక్షుడవు .జయ స్వరూపుడవు .బలి యజ్న హర్తావు .వర ప్రదాతవాగు నీకు నమస్సులు .వేలకొలది కన్నులు ,వేలకొలది పాదాలు ,వేలాది ఆకారాలు ధరించిన యజ్న పురుషుడవు . భూమిని ధరించి ఉద్ధరించావు .కమలా కాన్తుడవు .కమలహస్తుడవు ,కౌస్తుభ వక్షస్కుడవైన నీకు నమస్కారం .శ్రీ వత్సం ధరించిన వేద వేద వేదాంగ వేద్యుడవు .గుణ రూప వాసుదేవుడవు .పద్మ నాభవుడవు .దేవకీ నందనుడవు .పాంచజన్య ధారివి .వాసుదేవుడవు .ప్రద్యుమ్న ,అని రుద్ధడవు .దామోదర, హృషీ కేశుడవు …వేద త్రయుడవు .వైకుంఠవాసివి ,గరుడ గామినివి ,విష్టర స్రవుడ వైన నీకు వందనం .అండజ ,స్వేద ,ఉద్భిజ ,జరాయుజ రూపుడవు .గ్రహాలలో సూర్యుడవు .దేవతలకు దేవేంద్రుడవు .సముద్రాలలో పాల సముద్రానివి .గోవులలో కామ ధేనువు ,లోహాల్లో బంగారం ,రాళ్ళలో స్పటికం ,పూలలో నల్ల తామర ,వృక్షాలలో తులసి ,శిలలో సాలగ్రామం,ముక్తి క్షేత్రమైన కాశీ ,నీవే ..తీర్ధాలలో ప్రయాగ ,రంగులలో తెలుపు ,మానవులలో బ్రాహ్మణుడు ,పక్షులలో గరుత్మంతుడు ,వ్యవహారాల్లో వాక్ స్వరూపం ,వేదాలలో ఉపనిషత్తు ,మంత్రాలలో ప్రణవం ,అక్షరాలలో ఆకారం ,యజ్ఞం లో సోమరసం ,ప్రజా పతులలో అగ్ని ,నువ్వే .అని వేదాలన్నే ఘోషిస్తున్నాయి .దాతలలో మేఘానివి .ల విత్రులలో పరుడవు .సర్వ శాస్త్రాలలో ధనుస్సువి .వేగం కల వానిలో వాయువువి .ఇంద్రియాలలో మనసువు .భయ రహితులలో ఏనుగువు .వ్యాపక శక్తి కల వాటిలో ఆకాశానివి .యజ్ఞా లలో అశ్వ మేధానివి .దానాలలో అభయం నువ్వే .యుగాలలో కృత యుగానివి .తిధులలో‘’కుహు ‘’వు .నక్షత్రాలలో పుష్యమివి .పర్వాలలో సంక్రమణానివి .యోగాలలో వ్యతీ పాతి వి .గడ్డి రకాలలో దర్భవు .అన్ని యత్నాలలో నిర్వాణం నీవే .బుద్ధులలో ధర్మ బుద్ధివి .వృక్షాలలో అశ్వత్తము నువ్వే .లతలలో సోమ తీగవు .సాధనాలలో ప్రాణా యామానివి .అన్నీ ఇచ్చే వారిలో కాశీ విశ్వేశ్వరుడివి .హితులలో భార్య వంటి వాడవు .బంధువులలో ధర్మం వంటి వాడివి .నువ్వే తల్లీ తండ్రీ గురువు దైవం .నిన్ను ధ్యానిన్చటమే తపస్సు

                      నీకోసం ఖర్చు పెట్టిందే దానం .నీ సేవలో గడిపిందే కాలం .నీవు ఎంతకాలం హృదయం లో ఉంటావో అంతకాలమే జీవితం .నీ సంకీర్తనమే మాంగల్యం ,ధనార్జనం ,జీవిత ఫలం .అదోక్షతుని కంటే వేరే ధర్మం లేదు నారాయణు ని ని కంటే వేరే దానం లేదు .కేశవుని కంటే వేరే కామం లేదు .హరి కంటే మించిన అప వర్గం లేదు .వాసుదేవుని స్మరించ కుండా ఉండటం కంటే వేరే హాని ఉండదు ఆపద లేదు ,దురదృష్టమూలేదు .తెలీకుండానే హరీ అన్నా పాపాలు దహించుకు పోతాయి .నీ ప్రసాదం యజ్ఞం లోనీ పవిత్ర మైన పురోడాశం వంటిది .నీ స్మరణ యజ్ఞం చేసి అవ బృద స్నానం చేసి నంత పుణ్యం .’’అని ధ్రువుడువిష్ణు వు ను మనసారా ,ఆర్తి గా స్తుతించాడు .

                వాసు దేవుడు అత్యంత ప్రీతీ చెంది ధ్రువుని తొ ‘’ధ్రువ బాలకా !నీ స్తిర చిత్తానికి మెచ్చాను .నీ స్తోత్రం పరమాద్భుతం గా ఉంది.భక్తీ భావ బంధురం .కొన్ని విషయాలు చెబుతాను జాగ్రత్త గా విని అర్ధం చేసుకో .అన్నం వల్ల భూతాలు పుడుతున్నాయి .వర్షానికి కారణం సూర్యుడు ఆ సూర్యుడికి నువ్వు ఆధార భూతుడవవు  తావు .జ్యోతిస్చక్రం లో సర్వ గ్రహ ,నక్షత్రా లకు ,ఆకాశం లో సంచ రించే వాటి కన్నిటికి నువ్వు ఆధార భూతుడవు గా ఉంటావు ..పశువును కట్టు గొయ్య కు తాడుతో బంధించి తిప్పి నట్లు నువ్వు జ్యోతిస్చక్రాన్ని త్రిప్పు తావు .ఆ కల్పాంతం నువ్వు ఆ ధ్రువ పదం లో ఉండి పోతావు .నేను పూర్వం ఈశ్వరుని ఆరాధించి ,ఏమేమి పొందానో నువ్వు పొందుతావు .కొంత మంది ఈ పదవిలో నాలుగు యుగాలుంటారు .కొద్ది మంది మన్వంతరాలు ఆ పదివిలో ఉండగలరు .నువ్వు మాత్రం ఈ ధ్రువ పదం లో ఆకల్పాంతం ఉంటావు .ఇదే అత్యుత్తమ పదం .ఇంద్రాదులకు కూడా ఈ పదవి దక్కదు .నీ తల్లి సునీత కూడా నీతో నే ఉండు గాక ..నువ్వు చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠిస్తారో వారింటి వద్ద లక్ష్మీ దేవి ఎప్పుడు కొలువై ఉంటుంది .పాపాలన్నీ నశిస్తాయి . .మాత్రు వియోగం ఉండదు .నా మీద చాలా మంది స్తోత్రాలు చెప్పారు .వాటన్నిటి కంటే నీ ధ్రువ స్తోత్రం సర్వోత్తమ మైనది .సర్వ ఫలదాయక మైనది

        ‘’ ధ్రువా !నాకిప్పుడు మోక్ష కారకుడగు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించాలనే కోరిక తీవ్రం గా ఉంది .కాశి అంటే ఆనంద కాననం .నేను రోజూ వైకుంఠంనుంచి కాశీ వెళ్లి విశ్వ నాధుని దర్శించు కొంటాను .నేను మూడు లోకాలను పాలించ టానికి కావలసిన శక్తి సుదర్శన చక్రం వల్లనే కలుగు తుంది .దాన్ని పరమ శివుడు తన పాదం బొటన వ్రేలిని నేలకు రాసి ఆ చక్రాన్ని సృష్టించి నాకు అనుగ్రహించాడు .ఇది ఈ హరికి ఆ హరుడు ప్రసాదించిన దివ్యా యుధం .ఆ చక్రాన్నే నిన్ను భయ పెట్టె భూతాలను పారద్రోలింది .’’అని చెప్పి ధ్రువుని గరుడ వాహనం పై ఎక్కించుకొని శ్రీ మహా విష్ణువు కాశీ క్షేత్రానికి తీసుకొని వెళ్లాడు .మణి కర్ణిక లో ఇద్దరు స్నానం చేశారు విశ్వ నాద దర్శనం చేశారు .ఆ తర్వాత వాసు దేవుడు ధ్రువుడిని కాశీ లో ఒక లింగాన్ని ప్రతిష్టించి నిష్టగా శివార్చన చేయ మని చెప్పి అదృస్య మయాడు ధ్రువుడు అలానే చేసి శివానుగ్రహాన్ని సాధించుకొన్నాడు .ధ్రువ కుండం లో స్నానం చేసి ద్రువేశ్వర లింగాన్ని అర్చించిన వారికి ధ్రువ లోకం లభిస్తుందని పరమ శివుడు వరమిచ్చాడు .పొందిన వరాలతో, సంతృప్తి చెందిన మనసు తొ ధ్రువ బాలుడు ఇంటికి తిరిగి వెళ్లాడు.
Share:

భాగవతం - 1 వ భాగం

శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.

వ్యాసభగవానుడు ఈ దేశమునకు చేసిన సేవ సామాన్యమయినది కాదు. ఆయన మహోత్కృష్టమయిన సేవ చేశారు. చేసి అంతటితో ఊరుకోలేదు. అల్పాయుర్దాయం కలిగి అనారోగ్యంతో ఉంటూ బుద్ధి ఎప్పుడూ కూడా అర్ధకామములయందు మాత్రమే తగిలి ఉండే సామాన్య జనులు కలియుగంలో వేదములను నాలుగింటిని చదవడం దుస్సాధ్యమనే బుద్ధిచేత వ్యాసభగవానుడు వేదరాశిని నాలుగుగా విభాగం చేశారు. ఆయన వేదరాశినంతటినీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అని నాలుగు భాగములుగా విభాగం చేశారు.

వేదంలో పూర్వభాగం అంతా మనం ఆచరించవలసిన విదివిదానములను గురించి, మనం ఆచరించిన విధివిధానముల వలన మనం పొందే ఇహలౌకిక పారలౌకిక సౌఖ్యములను గూర్చి వివరిస్తుంది. ఉత్తరభాగం అంతాకూడా మళ్ళీ మనం ఒక అమ్మ కడుపులో ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇదే తుట్టతుద జన్మ చేసుకోవడం కోసమని ఏ జ్ఞాన సముపార్జన చేయడం చేత మనకు కైవల్యం లభిస్తుందో దానిని గురించి తెలియజేస్తుంది. ‘జ్ఞానాత్ కేవల కైవల్యం’ జ్ఞానం చేత మాత్రమే కైవల్యం లభిస్తుంది.

పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య సిద్ధి కొరకు ఏ జ్ఞానమును మనం పొందాలో అటువంటి జ్ఞానమును వేదము ఉత్తరభాగం ప్రతిపాదన చేస్తుంది. ఆయన తన శిష్యుడయిన జైమినిచేత వెతమునకు పూర్వభాగమయిన కర్మకు సంబంధించిన, విషయములన్నిటికి వ్యాఖ్యానం చేయించారు. దానిని ‘పూర్వమీమాంస’ అంటారు. ఉత్తరభాగమంతా జ్ఞానమునకు సంబంధించినది. వ్యాసమహర్షియే స్వయంగా బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములనే ‘ఉత్తరమీమాంస’ అని కూడా అంటారు. మరల ఆయన పదునెనిమిది పురాణములను రచించారు. పురాణములను రచించడం అంటే తేలికయిన పనికాదు.

‘సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ!
వంశానుచరితంచైవ పురాణం పంచలక్షణం!!

పురాణమునకు ఐదు లక్షణములు ఉండాలి. సర్గ, ప్రతిసర్గ అని విభాగం ఉండాలి. గొప్పగొప్ప వంశాములను గురించి ప్రస్తావన చేయాలి. అనేక మన్వంతరములలో జరిగిన విశేషములను చెప్పాలి. అది భగవత్సంబంధంగా దానిని ప్రతిపాదన చేయకలిగిన శక్తి ఉండాలి. అటువంటి వాడు తప్ప పురాణమును చెప్పలేదు. అటువంటి పురాణములను రచించిన మహానుభావుడు వేదవ్యాసుడు. మనకి జ్ఞాపకం ఉండడం కోసమని తేలిక సూత్రమునొకదానిని పెద్దలు ప్రతిపాదించారు.

‘మ’ద్వయం ‘భ’ద్వయం చైవ ‘బ్ర’త్రయం ‘వ’చతుష్టయం!

‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ స్కా’ని పురాణాని పృథక్ పృథక్!! (దేవీభాగవతం 1-3-21)
మద్వయం – మకారంతో రెండు పురాణములు ప్రారంభంఅవుతాయి. అందులో ఒకటి మార్కండేయ పురాణము, రెండవది మత్స్య పురాణము.
భద్వయం – భ తో రెండు పురాణములు ప్రారంభమవుతాయి. అవి భాగవత పురాణము, భవిష్య పురాణము.
బ్రత్రయం – బ్ర’ తో మూడు పురాణములు ప్రారంభమవుతాయి. అవి బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము.
వచతుష్టయం – ‘వ’కారంతో నాలుగు పురాణములు ప్రారంభమవుతాయి. అవి వరాహపురాణము, విష్ణు పురాణము, వామన పురాణము, వాయు పురాణము.
అనాపలింగకూస్కాని – అన్నప్పుడు ఒక్కొక్క అక్షరమునకు ఒక్కొక్క పురాణం వస్తుంది.
అ – అగ్నిపురాణం, నా – నారద పురాణం, ప – పద్మ పురాణం, లిం – లింగపురాణం, గ – గరుడ పురాణం, కూ – కూర్మపురాణం, స్కా – స్కాందపురాణం.
వ్యాసభగవానులు వేదములను విభాగం చేసినప్పుడు ఒక్కొక్క వేదమును ఒక్కక్క శిష్యుడికి అప్పచెప్పారు. వ్యాసుడు చేసిన సేవ అంతా ఇంతా కాదు.
Share:

మహిషాసురుని పుట్టుక..

దైత్యవంశానికి ఆశాదీపంలా జన్మించిన ‘మహిషాసురుడు’ తన ఆంతరంగిక మిత్రులతో, సచివులతో సమాలోచన చేసి, మరణంలేని జీవనం కోసం మేరుపర్వతశిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు ప్రారంభించాడు. కాలం కదలికలో అనేక వేల సంవత్సరాలు కదిలి వెళ్లిపోయాయి. మహిషాసురుని అచంచల తపస్సుకు సంతసించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ‘మహిషాసురా.., ఇంక తపస్సు చాలించి ఏ వరం కావాలో కోరుకో’ అన్నాడు.‘పితామహా.,నేను అమరుణ్ణి కావాలి. నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు’ అని కోరాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ‘మహిషాసురా..పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు.., గిట్టిన ప్రాణి మరల పుట్టక తప్పదు. జననమరణాలు సకలప్రాణికోటికి సహజ ధర్మాలు. మహాసముద్రాలకూ, మహాపర్వతాలకూ కూడా ఏదో ఒక సమయంలో వినాశం తప్పదు. ప్రకృతివిరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం. కనుక,నీ మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి, మరే వరమైనా కోరుకో’ అన్నాడు. అప్పుడు మహిషాసురుడు ‘విధాతా..అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు. సరే.. ఆడది నా దృష్టిలో అబల..ఆమెవల్ల నాకే ప్రమాదమూ రాదు. కనుక.,పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు’ అని కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు. వరబలదర్పితుడైన మహిషాసురుడు..తన పరాక్రమ ప్రదర్శనకు ముహూర్తం నిర్ణయించి యుద్ధప్రయత్నాలు ప్రారంభించాడు. చిక్షురుని సేనాధిపతిగా, తామ్రుని కోశాధిపతిగా, అసిలోమ, బిడాల,బాష్కల, త్రినేత్ర, కాలబంధకాది రాక్షసులను దండనాయకులుగా నియమించి జైత్రయాత్రకు బయలుదేరాడు. భూమండలంలోని సకలరాజులు మహిషుని పరాక్రమానికి తలవొంచి, సామంతులై, కప్పాలు కట్టడానికి సిద్ధపడ్డారు.

బ్రాహ్మణులందరూ మహిషునికి వశమై, యఙ్ఞయాగాదులలో దేవతలతో సమానంగా అతనికి హవిర్భాగాన్ని పంచుతున్నారు. పృధ్వీమండలమంతా మహిషుని పాదాక్రాంతం అయింది. ఇప్పుడు మహిషుని దృష్టి స్వర్గం మీదకు మళ్లింది. ధాన్ని స్వాధీనం చేసుకోవాలని సంకల్పించాడు. వెంటనే ఒక దూతను ఇంద్రుని దగ్గరకు పంపాడు. ఆ దూత దేవేంద్రుని దగ్గరకు వెళ్లి ‘మహేంద్రా..నేను మహిషాసురుని దూతను. నా ప్రభువు వెంటనే నిన్ను స్వర్గం విడిచి వెళ్లిపొమ్మన్నాడు. లేదా అమరుడివైనా నీకు మరణం తప్పదని హెచ్చరించమన్నాడు’ అని మౌనం వహించాడు. ధూత మాటలు విని ఇంద్రుడు క్రుద్ధుడై, ‘వరబలం ఉందికదా అని మహిషుడు విర్రవీగుతున్నాడు కాబోలు. మహేంద్రునితో యుద్దం అంటే మృత్యువుతో సమానమని ఎరగడేమో. బుద్దిగా గడ్డితింటూ బ్రతకమను. లేదా, వాడి కొమ్ములు విరిచి ప్రాణాలు తీస్తానని చెప్పు. దూతవు కనుక నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను వెళ్లు’ అన్నాడు. ఆ దూత వెళ్లి ఇంద్రుని ప్రతిసందేశాన్ని యథాతథం మహిషునికి వినిపించాడు. మహిషిసురుడు కుపితుడై.., సర్వసైన్యాన్ని యుద్ధానికి సంసిద్ధం చేసి స్వర్గంమీదకు దండయాత్రకు బయలుదేరాడు. ఈలోగా ఇంద్రుడు సకల దేవగణాలనూ సమావేశపరచి, దేవగురువు బృహస్పతితో సమాలోచన చేసి, మహిషునితో యుద్ధం అనివార్యం అని నిశ్చయించి.. దేవగణాలతో వెంటబెట్టుకుని, త్రిమూర్తులను కలిసి, మహిషునితో జరగబోయే యుద్ధంలో తనకు సహాయంగా రమ్మని అర్థించాడు. త్రిమూర్తులు అంగీకరించి ఇంద్రునితో కలిసి యుద్ధరంగానికి బయలుదేరారు. దేవదానవుల మధ్య భీకరయుధ్ధం ప్రారంభమైంది. ముందుగా చిక్షురుడు గజారూఢుడై ఇంద్రునితో యుద్ధానికి దిగాడుగానీ, ఇంద్రుని దెబ్బకు మరుక్షణంలో మూర్ఛబోయాడు. అదిచూసి బిడాలుడు ముందుకువచ్చి తన అస్త్రవిద్యా పాండిత్యాన్ని ప్రదర్శించాడు. కొంత సేపు భీకర సంగ్రామమే జరిగిందనే చెప్పాలి. కానీ, ఇంద్రుడు తన కుమారుడు జయంతునితో కలిసి బిడాలుని చంపేసాడు. దేవగణాలు ఇంద్రుని మెచ్చుకుని దుందుభులు మ్రోగిస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు. వెంటనే మహిషాసురుడు తామ్రుని పంపాడు. యముడు దండపాణియై ఇంద్రునికి సహాయంగా నిలిచాడు.

యముని దండాయుధ ఘాతానికి తామ్రుడు చలించకుండా నిలబడ్డంచూసి యముడు ఆశ్చర్యపోయాడు. తామ్రుని యుద్ధవిద్యా నైపుణ్యానికి అష్టదిక్పాలకులు ఆశ్చర్యపోయి, ఒక్కుమ్మడిగా విజృంభించి, తామ్రుని సంహరించారు. అదిచూసి, మహిషాసురుడే స్వయంగా యుద్ధానికి దిగాడు. కొంతసేపు తన యుద్ధకళా ప్రతిభను దేవసైన్యానికి ప్రదర్శించాడు. మహేంద్రుడు దేవతలతో కలిసి మహిషునికి గట్టి పోటీనిచ్చాడు. దానితో విసుగు చెందిన మహిషుడు సర్వలోక సంహారకమైన తన శాంబరీవిద్యను ప్రయోగించాడు. అంతే..వందలు, వేలు సంఖ్యలో మహిషాసురులు ఉద్భవించి, దేవ సైన్యంమీద విరుచుకు పడ్డారు. వారి ధాటికి సకల దేవగణాలు చెల్లాచెదురైపోయాయి. ఏం జరుగుతోందో తెలియక ఇంద్రునికి మతిపోయింది. ఏం చేయాలో తోచక దిక్పాలకులు నిశ్చేష్టులై నిలబడిపోయారు. మహేంద్రుడు విష్ణువును శరణుకోరాడు. విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది మహిషుని శాంబరీవిద్యను ఛిన్నాభిన్నం చేసింది. అదిచూసి మహిషుడు..అసిలోమ, త్రినేత్రక, బాష్కల, అంధకాది దండనాయకులతో కలిసి విష్ణువు మీదకు యుధ్ధానికి దిగి, శరవృష్టి కురిపించాడు. విష్ణువు ఆ శరజాలాన్ని తన బాణ పరంపరతో నిరోధించి, తన గదను ప్రయోగించాడు. ఆ గదాఘాతానికి మహిషుడు మూర్ఛబోయి, అంతలోనే తేరుకుని తిరిగి శ్రీహరితో యుద్ధానికి దిగాడు. శివునితో.,అంధకుడు, యమునితో.,త్రినేత్రుడు, వరుణునితో., అసిలోముడు యుద్ధం చేస్తున్నారు. ఎవరికి ఎవరూ తీసిపోవడంలేదు. పదిహేను రోజులు దేవదానవుల మధ్య భీషణ సంగ్రామమం జరిగింది. విసుగు చెందిన మహిషుడు ఒక పరిఘను శ్రీహరి మీదకు విసిరాడు.

ఆ దెబ్బకు శ్రీహరి మూర్ఛబోయాడు. అది చూసి గరుత్మంతుడు శ్రీహరిని వైకుంఠం తీసుకుబోయాడు. అంత వరకూ శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తున్న శంకరుడు., మహిషుని జయించడం అసాద్యమని గుర్తించి త్రిశూలం భుజాన వేసుకుని కైలాసం చేరుకున్నాడు. హరిహరులే పలాయనం చేయగాలేనిది నేను చేస్తే తప్పేమిటి అనుకుని బ్రహ్మదేవుడు హంసవాహనం ఎక్కి సత్యలోకం చేరుకున్నాడు. త్రిమూర్తులు యుద్ధరంగం వదిలి పారిపోవడంతో రాక్షసవీరులు రెట్టించిన ఉత్సాహంతో దేవతలమీద విరుచుకుబడి వీరవిహరం చేసారు. రక్షించేనాథుడు లేక దిక్పాలకులతో సహా దేవసైన్యం భయంతో నాలుగు దిక్కులకు పారిపోయారు. అప్పటికి మహిషుని గెలవలేమని గ్రహించిన మహేంద్రుడు ఐరావతం మీదనుంచి దుమికి పారిపోయాడు. అది చూసి మహిషుడు విజయగర్వంతో వికటాట్టహాసంచేసి, ఐరావతం ఎక్కి స్వర్గం వెళ్లి ఇంద్ర సింహాసనం ఎక్కి, తన దానవులను దేవతల పదవులలో నియమించి, తన తండ్రి ఆశయంమేరకు విశ్వవిజేతయై, త్రిలోకాధిపతిగా అభిషిక్తుడయ్యాడు.

దానవ వంశానికి మూలపురుషుడైన ‘దనువు’కు… రంభుడు, కరంభుడు అని ఇద్దరు కుమారులు. వీరిద్దరు పుట్టుకతో దానవులైనా.. గుణంలో, ప్రవర్తనలో చాలా మంచివాళ్లు అని విశ్వవిఖ్యాతి గడించారు. వీరిద్దరికి ఉన్న ఒకేఒక లోపం సంతానం లేకపోవడం. ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు. కరంభుడు ‘పంచనదం’ అను మడుగులో దిగి ఒంటి కాలిమీద తీవ్రతపస్సు ప్రారంభించాడు. రంభుడు దానికి దగ్గరలోనున్న ఒక సాలవృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్ఠతో అగ్నిదేవుని గూర్చి తపస్సు ప్రారంభించాడు. కాలంతోపాటు వారిరువురి తపస్సుకూడా వేగంగా సాగుతోంది. వారి తీవ్రతపస్సు ఇంద్రుణ్ణి భయభ్రాంతులకు గురిచేసింది. అంతే.., మొసలి రూపం ధరించి, కరంభుడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఇంద్రుడు. అది తెలిసి, రంభుడు తీవ్రవేదనకు గురయ్యాడు. ఇంద్రుని చంపేయాలనిపించింది. కానీ, తపోదీక్షితుడు క్రోధోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి.. శాంతచిత్తుడై ఆలోచించి., తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని., ఎడమచేతితో తన జుత్తు పట్టుకుని, కుడిచేత్తో తలను ఖండించుకోబోయాడు. మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై., ‘రంభాసురా., ఏమిటీ నిరాలోచన కార్యం? నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా? ఈ ప్రయత్నం మానుకో’ అన్నాడు.

‘హుతవాహనా, అసువులు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు. సంతానం కోసమే కానీ, ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు. ఈ సత్యం తెలిసికూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముని చంపి మా దానవజాతికి తీరని మహాపరాథం చేసాడు. అందుకు ప్రతీకారంగా.,సర్వప్రాణిగణాలకు అజేయుడు, కామరూపుడు, మహాపరాక్రమవంతుడు, సకలలోకవందితుడు, త్రిలోకవిజేత అయిన పుత్రుని నాకు వరంగా అనుగ్రహించు’ అని కోరుకున్నాడు రంభాసురుడు. ‘రంభాసురా., నీ మనసు ఏ కామినిమీద కామవశీభూతమౌతుందో, ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు’ అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు. రంభాసురుడు తన ఇంటికి తిరిగివస్తూ మార్గమధ్యంలో యక్షవిహారభూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూసాడు. అక్కడ ఒక మహిషి(గేదె) కామార్తయై విహరిస్తోంది. దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి, దానితో సంగమించాడు. తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయింది. రంభుడు సంతోషించి, ఆ మహిషిని తన పాతాళనగరానికి పట్టమహిషిని చేసి, దాని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు.

ఒకరోజు ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ రాజమహిషి వెంటబడింది. అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగ్రుద్దులు గుద్దాడు. ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడిచింది. దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు. తన భర్త అయిన రంభుడు తన కళ్లముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూంటే, దాని వెంటబడింది ఆ దున్నపోతు. నిండుగర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్షవిహారభూమిని చేరి, అక్కడున్న యక్షులను శరణు కోరింది. యక్షులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది. చివరకు ఎలాగయితేనేం యక్షులు ఆ దున్నపోతును సంహరించారు. అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి, రంభాసురుని మృతదేహాన్ని చితిపైకి చేర్చి, నిప్పుపెట్టారు. తన ప్రాణనాథుని పార్థివదేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతూంటే చూసి తట్టుకోలేక, ఆ రాజమహిషి పరుగుపరుగున వచ్చి, రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది. యక్షులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూండగా., ఆ చితిమంటలనుంచి ‘మహిషాసురుడు’ ఆవిర్భవించాడు. వాడే రంభాసురుని కుమారుడు. మహిష-రాక్షస సంగమ సంజాతుడు. ‘మహిషాసురుడు’ తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళరాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి ‘రక్తబీజుడు’ అనే పేరుతో ‘మహిషాసురుని’ ఆంతరంగిక అనుచరుడయ్యాడు.
Share:

బోధానంద్రేoద్ర సరస్వతి స్వామి..

తెలుగులో మొదటిసారి గా గురుచరిత్ర ను అనువదించి మనకు అందించారు.
1901 సంవత్సరం లో మార్గశీర్ష బహుళ త్రయోదశి రోజు నాడు తల్లిదండ్రులు రామకృష్ణ,కృష్ణ వేణి  అమరావతి పుణ్య క్షేత్రం లో జన్మించారు.తెలుగు,సంస్కృత,ఆంగ్ల భాషలలో చిన్నప్పటి నుంచి పట్టు ఉండేది..వీరుచిన్నప్పడు 11 సంవత్సరల వయస్సు అప్పుడు అమరావతి కి శ్రీ వాసుదేవనంద సరస్వతి స్వామి వచ్చారు.వీరు నమస్కారం చేసుకోగానే "దత్తం యె భజతే నిత్యo ముక్తి యెతి న సంశయ:" అని వీరికి పేపర్ మీద మంత్రం రాసి ఇచ్చారు.వాసుదేవనంద సరస్వతి స్వామి ఆశీస్సులతో వీరు దత్త సంప్రదాయ దీక్షితులు అయ్యారు.అనేక మరాఠీ గ్రంధాలను తెలుగులో అనువదించారు.గురుచరిత్ర, నవనాధుల చరిత్ర, ఏకనాధ భాగవతం,గజానన విజయం,వేదాంత మననం,వృధు చరిత్ర, మొదలగు గ్రంధాలు రచించారు. ఏకనాధ భాగవతం లో 21 వ స్కంధం వివరించాలి అంటే బ్రహ్మవిద్య సంప్రదాయం మీద అవగాహన ఉండాలి.ఇది కృష్ణ,ఉద్ధవ్ సంవాదం. ఏకనాధుని తరువాత వివరించింది వేరే.అంత ఆధ్యాత్మిక ఉన్నత స్థితిలో ఉండేవారు.కొద్దీ ఆహారం తీసుకునేవారు.ముచ్చర్ల అనే గ్రామంలో అనావృష్టి కారణం గా వారు గురుచరిత్ర పారాయణ చేయించి వానలు పడేట్టు చేశారు..సన్మార్గంలో జీవించండి,మానవ జన్మ దుర్లభం,ఆచరించే వాటిని చెప్పేవారు.త్వరలో అఖండ మైన పరమాత్మ లో ఐక్యం అవ్వాలి అన్న కొద్దిరోజుల కు 1997 సంవత్సరంలో ఫల్గుణ బహుళ దశమి రోజు సమాధి చెందారు.దత్త సంప్రదాయం ప్రకారం వీరిని కృష్ణా నదిలో జల సమాధి చేశారు.ఓం శ్రీ సాయిరాం.
Share:

అష్టాక్షరీమహామంత్రం..

ప్రతి అక్షరం బీజాక్షరం, ప్రతి బీజాక్షరం దేవతాశక్తి స్వరూపం. విశ్వచైతన్యం దేవతగా అవతరించినపుడు అతి సూక్ష్మంగా ఆలోక్యమయ్యే అతీంద్రియ శక్తి మంత్రం నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” – ఆత్మ స్వరూపాన్ని, “నమః” – అనే అక్షరాలు – బుద్ధిని, మనస్సుని,“#నారాయణాయ” – అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని”తెలియజేస్తున్నాయి.
అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.
జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,
“#న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
“#ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
“#య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
“#ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే
“#న  అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర”అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ”అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన“నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది
#ధ్యాయేన్నారాయణందేవం
స్నానాదిఘ చ కర్మసు,
ప్రాయశ్చిత్తం హి సర్వస్వ
దుష్కృత స్వేతివైశ్రుతిః!
స్నానపానాదిగల సమస్తకర్మలలో“నారాయణుని” స్మరించు కొన్నట్లయితే, సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగి మంచి మార్గంలో పయనించడానికి వీలవుతుంది.
ఆలోక్య సర్వ శాస్త్రాణీ విచార్యచ పునః పునః
ఇదామేకం సునిప్పన్నం ధ్యేయో నారాయణ సదా!
సమస్తములైన శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చూడగా, నిరంతర‘నారాయణ’ ధ్యానమొక్కటే, సర్వదా, ధ్యేయంగా కనబడుతోంది.
ఆమ్నా యాభ్య  సనాన్యారణ్య రుదితం వేదవ్రతా న్యవ్వహాం
మేద శ్ఛేద ఫలాని పూర్తవిధయస్సర్వే హుతం భస్మని
తీర్థా నామవగాహనాని చ గజస్నానం వినా యతృద
ద్వంద్వామ్భోరుహ సంస్మృతీర్విజయతేదేవస్స నారాయణః
‘శ్రీ మన్నారాయణుని’ స్మరించకుండా చేసిన వేదాభ్యాసం అరణ్యరోదన వంటిది. ఎన్ని ధర్మ కార్యాలను చేసినా బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది, ఎన్ని తీర్థసేవనలు చేసినా గజస్నానమే అవుతుంది (వ్యర్ధమే).
శ్రీమన్నామ ప్రోచ్చ్యనారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాం ఛితం పాపినోపి,
హనః పూర్వం వాక్రు వృత్తాన తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖమ్
‘శ్రీమన్నారాయణ’ నామాన్ని ఉచ్చరించువాడు ఎంతటి పాపి అయినా, దైవకృపతో మోక్షాన్ని పొందుతాడు. అంతటి పుణ్యకార్యాన్ని (నామస్మరణం) గతజన్మలో చేయకపోవడం వలెనే, ఇప్పుడు ‘ఈ దుఃఖభాజకమైన జన్మ’ కలిగింది.
Share:

ఆదిత్య హృదయం సోత్రం ... తాత్పర్యం మీకు తెలుసా ?

తాత్పర్యము:
ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా,  ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు.
సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శృతి:-

రాఘవా!  ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.
అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము!  అని పలికెను.
Share:

భగవద్ సేవ..

  భగవంతుడికి మనం చేసే చిన్న పాటి సేవ కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  ధూప, దీప, పుష్ప, గంధాలతో మనం పరమాత్మకు ప్రతిరోజూ చేసే పూజ కూడా ఎంతో గొప్ప భగవద్ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. తెలిసి చేసిన, తెలియక చేసినా సరే మనం చేసే చిన్నపాటి సేవకి పరమాత్మ విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు.

         జగద్గురు శ్రీల ప్రభుపాదాచార్యుల వారిని ఒకసారి ఒక శిష్యుడు ఒక ప్రశ్న అడిగాడు. “మీరు ప్రతిరోజు కృష్ణుడి పాదాలమీద పువ్వులతో పూజ చేస్తున్నారు కదా, ఒకరోజు తర్వాత వాడిపోతుంది. మరి ఆ పువ్వు పొందే ప్రయోజనం ఏమిటి”. దానికి జగద్గురువులు ఇలా సమాధానం ఇచ్చారు, “ఈ పువ్వు ఏ మొక్కనుంచి వచ్చిందో, ఆ మొక్కలోనున్న జీవుడు వచ్చే జన్మలో ఉత్కృష్టమైన మానవ జన్మని పొందుతుంది”. దీనికి పురాణంలో ఒక కథకూడా ఉంది. ఒక వూరిలో పాడుబడ్డ దేవాలయం మీద ఒక పక్షి ఎగురుతూ వెళ్ళింది. అది ఆలా ఎగిరి వెళ్లడంలో దాని రెక్కల నుంచి వచ్చిన గాలికి గోపురం మీద ఉన్న ధూళి తొలిగి శుభ్రపడింది. తెలియక చేసినాకూడా అదొక గొప్ప భగవద్ సేవ. తర్వాతి జన్మలో ఆ పక్షిలోని జీవుడు ఒక రాజకుమారుడిగా జన్మించాడు.

       ఎప్పుడో ఒక్కసారి చేస్తేనే పరమాత్మ అంత అనుగ్రహిస్తే, అదే మనం నిరంతరం శ్రీమన్నారాయణుడి పాదపద్మములను సేవిస్తే మనల్ని రక్షించడా స్వామి? తప్పక అనుగ్రహిస్తాడు. 84 లక్షల జీవరాసులలో మానవజన్మ పరమోత్కృష్టమైన జన్మ. దేవతలకంటే కూడా మనుష్య జన్మ చాలా గొప్పదని మనకు శాస్త్రమే చెప్తుంది. దేవతలు కూడా పదవీకాలం పూర్తయ్యాక మానవ జన్మని పొందుతారు. మోక్ష సాధనకి మానవ జన్మే చిట్టచివరి జన్మ అవుతుంది.

🌷 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🍀
Share:

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List