భగవంతుని సాన్నిధ్యాన్ని చేరటాని కొకటి గాదు చాలా మార్గాలున్నాయని వర్ణిస్తారు. వాటన్నిటిలో భక్తి ఒకటి, జ్ఞాన మొకటి చాలా ప్రశస్తమైనవని కూడా పేర్కొంటారు. అయితే అవి రెండూ దేని పాటి కది స్వతంత్రమైన మార్గాలా లేక ఒకే మార్గంలో వచ్చే రెండు మజిలీలా. మజిలీలే అయిన నాడు ఏది ముందు ఏది వెనుక అని ప్రశ్న వస్తుంది.
.
దీనికి సమాధాన మివ్వాలంటే అసలు భక్తి అంటే ఏమిటో, జ్ఞానమంటే ఏమిటో ఆ రెండు మాటలకు నిర్వచనం చేయవలసి వస్తుంది. భక్తి అంటే భజించట మని అక్షరార్ధం. దీనికి వ్యతిరిక్తమైనమాట విభజించటం. విభజించట మంటే ఏమిటో తెలుసు మనకు. విడదీయటమని అర్ధం. దీన్ని బట్టి భజించట మంటే అప్పటికి కలుసుకోవటమని అర్ధమవుతున్నది.
.
ఈ కలుసుకోవసింది ఎవరు ఎవరిని. జీవుడు ఈశ్వరుణ్ణి. జీవుడనే వాడు ఈశ్వరుడిలాగా పరిపూర్ణుడు గాడు. శరీరాదులైన ఉపాధుల మూలంగా పరిచ్చిన్నుడయి కూచొన్నాడు. తన్నిమిత్తంగా సంసార బాధలకు గురై జనన మరణాల ననుభవిస్తున్నాడు. ఈ విష వలయం నుంచి తప్పించుకొని బయట పడాలంటే ఎప్పటికైనా ఏ జన్మకైనా ఆ ఈశ్వరుణ్ణీ భజించక తప్పదు. భజిస్తే అది పరిపూర్ణమైన తత్త్వం కాబట్టి దాని నంటిపెట్టుకొన్న ఈ జీవుడు కూడా భ్రమరకీట న్యాయంగా పరిపూర్ణుడే అవుతాడు. దానితో అపారమైన సంసారసాగరాన్ని ఈది మోక్షతీరాన్నిచేరగలడు.
.
మానవ జన్మ సార్ధకత మోక్ష పురుషార్ధములోనే ఉన్నది. వేదాంత పరంగా చూస్తే “అహమస్మి” అనే అనుభవపూర్వకమైన జ్ఞానమే మోక్షం. ఈ గమ్యం చేరుకోడానికి సాధన మార్గములేవి? అని చూస్తే కర్మ యోగం, జ్ఞాన యోగం, సమాధి యోగం మరియు భక్తి యోగములని మనం విన్నాము. ఇక్కడ భక్తి అంటే సగుణ ఈశ్వర భక్తి అని అర్ధము. అన్ని నదులు సముద్రములో చేరినట్లు ఈ నాలుగు మార్గములలో ఏ మార్గమును తీసుకున్ననూ మనము మోక్షం పొందగలమని మనలో ఒక సాధారణ నమ్మకమున్నది.
.
కాని అద్వైత పరముగా చూస్తే “జ్ఞానాదేవతు కైవల్యం” అనేది ఉపనిషద్వాక్యం. అంటే జ్ఞానము తప్ప వేరొక మార్గములేదని అద్వైతము చెబుతున్నది. భగవద్గీతలో కర్మయోగం ద్వారా జ్ఞానయోగ్యత సంపాదించి, జ్ఞానయోగం ద్వారా జ్ఞాన ప్రాప్తిపొంది మోక్షమును పొందమని కృష్ణ భగవానుడు మనకిచ్చిన ఉపదేశం. జ్ఞానమే మోక్షసాధనకు దారి అని “సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే” అన్ని కర్మలు జ్ఞానంలో పరిసమాప్తమని కృష్ణుని బోధన. ఆత్మ జ్ఞానమే మోక్షమునకు మార్గమనే దానికి వేదమే ప్రమాణము. పురుషసూక్తము విద్య తప్ప అన్య మార్గము లేదని అంటుంది.
No comments:
Post a Comment