కాత్యాయని దేవీగా మ‌హాల‌క్ష్మీదేవి అమ్మవారు.. ~ దైవదర్శనం

కాత్యాయని దేవీగా మ‌హాల‌క్ష్మీదేవి అమ్మవారు..


కమలాలు రెండు చేతులలో ధరించి, అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా మూడోరోజు శ్రీమహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు.

మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. 

అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. అమ్మవారు డోలాసురుడు అనే రాక్షసుడిని వధించింది. శక్తి త్రయంలో మధ్య శక్తి, ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా అంటే అన్ని జీవలలోనూ ఉండే లక్ష్మీస్వరూపం దుర్గాదేవని చండీసప్తసతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగల్యాలు కలుగుతాయి. ”ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పూర్ణాలు నివేదన చెయ్యాలి.లక్ష్మి యంత్రాన్ని పూజించాలి, ఎరుపు రంగు పూలతో పూజించాలి, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి.
.
దుర్గామాత ఆరవ స్వరూపం కాత్యాయని. పూర్వం ‘కత’ అనే పేరుగల ఒక గొప్ప మహర్షి ఉండేవాడు. అతని కుమారుడు ‘కాత్య’ మహర్షి. ఈ కాత్యగోత్రజుడే విశ్వవిఖ్యాతుడైన ‘కాత్యాయన’ మహర్షి. ఇతడు ‘పరాంబా’ దేవిని ఉపాసిస్తూ, ఎన్నో సంవత్సరాలు కఠినమైన తపస్సును ఆచరించాడు. భగవతీదేవి లేదా దుర్గాదేవి పుత్రికగా తన ఇంట జన్మించాలని అతని కోరిక. భగవతీ మాత ఆయన ప్రార్థనను అంగీకరిస్తుంది. కొంతకాలం తరువాత ‘మహిషాసురుడు’ అనే రాక్షసుని అత్యాచారాలతో భూలోకం పెచ్చరిల్లిపోతుంది. ఈ మహిషాసురుని సంహరించడానికై బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తమ తేజస్సుల అంశలతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్ట మొదట కాత్యాయన మహర్షి ఈమెను పూజిస్తారు. అందువలన ఈమె ‘కాత్యాయని’ అని ప్రసిద్ధికెక్కింది.
.
ఈమె ‘కాత్యాయన’ మహర్షి ఇంట పుత్రికగా అవతరించిందని మరి ఒక కథ. ఈమె అమాంత భాద్రపద బహుళ చతుర్దశినాడు జన్మించింది (ఉత్తర భారత పౌర్ణిమాంత పంచాంగ సంప్రదాయమును బట్టి ఇది ఆశ్వీయుజ శుద్ధ చతుర్దశి). ఈమె ఆశ్వీయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులలో కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించింది.
.
కాత్యాయనీదేవి అమోఘఫలదాయిని. కృష్ణుడిని పతిగా పొందటానికి గోకులంలో గోపికలందరూ యమునానదీ తీరాన ఈమెనే పూజించారని భాగవతం చెబుతుంది. ఈమె గోకులానికి అధిష్ఠాత్రిగా వెలిసినది. ఈమె స్వరూపము దివ్యమూ, భవ్యమూ. ఈమె శరీరకాంతి బంగారు వన్నెతో తళతళ మెరుస్తూ ఉంటుంది. ఈమె నాలుగు భుజాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఈమె కుడిచేతులలో ఒకటి అభయముద్రనూ, మరొకటి వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఒక ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొక ఎడమ చేతిలో పద్మమూ శోభిల్లుతూ ఉంటాయి. సింహవాహన.
.
దుర్గా నవ రాత్రులలో ఆరవరోజున కాత్యాయనీ స్వరూపం పూజింపబడుతుంది. ఆ దినాన సాధకుడి మనస్సు ఆజ్ఞా చక్రంలో స్థిరమవుతుంది. యోగసాధనలో ఈ ఆజ్ఞా చక్రం యొక్క స్థానం ప్రముఖమైనది. ఈ చక్రంపై స్థిర మనస్సుగల సాధకుడు తన సర్వస్వమును కాత్యాయనీ దేవి చరణాలలో సమర్పిస్తాడు. పరిపూర్ణంగా ఆత్మసమర్పణము చేసిన భక్తుడికి సహజంగానే కాత్యాయనీ మాత దర్శనం లభిస్తుంది. ఈ దేవిని భక్తితో సేవించిన వారికి ధర్మ, అర్థ, కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థముల ఫలములు లభిస్తాయి. అతడు ఈ లోకంలో అలౌకిక తేజస్సులను, ప్రభావములను పొందగలడు. రోగములు, శోకములు, సంతాపములు, భయము మొదలైనవి అతడినుండి సర్వదా దూరమవుతాయి. జన్మజన్మాంతరాల పాపాలు నశించటానికి ఈ దేవి ఉపాసనకంటె సులభమైనా, సరళమైన మార్గం మరొకటి లేదు. ఈమెను ఆరాధించేవారు నిరంతరం ఈమె సాన్నిధ్యం నుండీ, పిమ్మట పరమపదప్రాప్తికీ అర్హులవుతారు. కాబట్టి మనము అన్ని విధాలా ఈ తల్లిని శరణుజొచ్చి, ఈమె పూజలందూ, ఉపాసనయందూ తత్పరులము కావాలి.

https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List