కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి. ~ దైవదర్శనం

కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి.


కాళరాత్రిదేవి ...స‌ర‌స్వ‌తిదేవి.
.
.
శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది. చదువులతల్లి సరస్వతి రూపంలో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు ఇది. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతోభక్తుల అఙ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రులకు ఈమె వాగ్వైభవాన్ని వరంగా ఇచ్చింది. త్రి శక్తి రూపాల్లో అమ్మ మూడో శక్తి రూపం, సంగీత- సాహిత్యాలకు అధిష్టాన దేవత. సకల జీవుల జిహ్మగ్రంపై (నాలుకపై) ఈమె నివాసం ఉంటుంది. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది. అందుకే ఈ రోజున అమ్మను సరస్వతీరూపంలో ప్రత్యేకంగా పిల్లలతో (విద్యార్ధులు) పూజలు చేయిస్తారు. బాసరలో ఙ్ఞాన సరస్వతీదేవికి ఈ దినం విశేషంగా పూజలు జరుగుతాయి.ఈ రోజు అమ్మవారి ఆధ్వర్యంలో మూలా నక్షత్ర యుక్త పూజతో విశేషంగా అక్షరాభ్యాసం చేస్తారు. దీనిని ”విజయారంభం” అని పిలుస్తారు.
.
దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.
.
కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.
.
దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.
.
కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.
.
కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.


https://www.facebook.com/rb.venkatareddy/posts/10212863349531344
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List