*మనసు*:...దీనికి కళ్లెం వేయాలి...అసలు వేయగలమా?
*మనసు*:...పరచిన పానుపు కాదు. *మనసు*:...గులాబీతోట కాదు.
*మనసు*:...శీతల పవనం కాదు.
*మనసు*:...మనం చెప్పినట్లు వినే మన ఇంటి పెంపుడు కుక్కపిల్లా కాదు. మనలోనే ఉండి, మనతోనే ఉండి, మనలను తన ఇష్టం వచ్చినట్లు ఆడించే ఒక శక్తి. దీనికి కళ్లెం వేయాలి...అసలు వేయగలమా?
మనసులో రకరకాల ఆలొచనలు వస్తూ ఉంటాయి. అవి మనలను వేధిస్తూ ఉంటాయి. చాలా ఇబ్బంది పెడుతూంటాయి. మనకు తెలియకుండా మనం వాటికి వసమైపోతూ ఉంటాం. వీటినుంచి విముక్తి పొందేదెలా?
అందరూ యోగులు కారు. యోగులు కాలేరు. కనీసం సాధకులైనా కారు. నిత్యం మనసుతో పోరాటంచేసే సామాన్య మానవులం మనం. జీవితం పోరాటం. జీవనం పోరాటం. మనసుతో హాయిగా విహరించాలని అందరికీ ఉంటుంది. అదే పక్కలో బల్లెమై కాచుకుని ఉంటే ఏం చేయగలం? ఏదైనా దారి ఉందా?....ఉంది.
రోగం ఇచ్చిన భగవంతుడు ఔషదం ఇచ్చేడు. ఆకలిని స్రుష్టించిన అదే భగవంతుడు అన్నం చూపించేడు....అలాగే మనసుకు కళ్లెం వేయటానికి మనిషికి పట్టుదల అనే అస్త్రం ఇచ్చేడు.
మంచి భావనలను ప్రతిసారీ మళ్లీ మళ్లీ ప్రయత్నించటమే పట్టుదల. అయితే దీని ఉనికి మనకు తెలియడంలేదు. ప్రతిదానికీ మనసునే ఆశ్రయిస్తున్నాం.
కూడదు అంటున్నారు పెద్దలు. మన ముందు వెళ్లిన వాళ్లు. మనసును మచ్చికచేసుకో అంటున్నారు కొందరు. మనసుకు అతీతంగా వెళ్లిపో అంటున్నారు మరికొందరు. ఏది నిజం? దాన్ని మనసే చెప్పాలి. ఎందుకంటే మన మనసు ఏదైతే(దేనినైతే) మళ్లీ మళ్లీ చెబుతుందో దాన్నే మనం నమ్ముతాం, ఆచరిస్తాం. అక్కడే ఉంది చిక్కు. అక్కడే మన మనసుకు మనం బానిసలైపోతున్నాం.
ఇలా ఉంటే మనం ముందుకు సాగలేం. అయితే ఈ మనసును ఎలా జయించాలి? దీనికోసమే మనకు ఒక ఆయుధం ఇచ్చేడు భగవంతుడు. పట్టుదల. మనం ఎలా అనుకుంటే అలా ఉండే సంకల్ప శక్తి. ఏ కార్యానికైనా ఇది కావాలి. గట్టిగా ఒక మంచి భావాన్ని పట్టుకుని నిలబడగలిగితే మంచి పనులు చెయ్యగలుగుతాం. ఇదే క్రియా శక్తిగ, ఙ్ఞాన శక్తిగా మారుతుంది. చివరికి అద్భుతాలు సాధిస్తాం.
పట్టుదల నిప్పురవ్వలాంటిది. దాన్ని మనమే రాజేసి, ద్విగుణీక్రుతం చేసి, జ్వాలాయమానంగా చేసి మహా అగ్నిలా మార్చుకోవాలి. అప్పుడు మనం మనసుకు కళ్లెం వేసినట్లే!
No comments:
Post a Comment