కాశీలో జరిగిన ఒక యదార్ధ సంఘటన.. ~ దైవదర్శనం

కాశీలో జరిగిన ఒక యదార్ధ సంఘటన..



ఒక ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది.ఆ ఇంట్లోవారందరూ ధార్మికులు,దైవ భక్తి కలవారు.ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు.వయస్సులో చిన్నవాడైన భక్తిలో మాత్రం అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.తనకి ఆటలయందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు.ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు,అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు.ఆ పసితనం లోనే ఆ పిల్లవాడికి కాశీ దర్శించుకోవాలనే కోరిక మనస్సులో దృడంగా నాటుకుంది.ఎలా వెళ్ళాలో తెలియదు.అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కాశీకి వెళ్ళలేదు.తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు.ఇలా ఉండగా ఒక రోజు పెద్ద వర్షం పడుతుండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కాలగతి చెందారు.అప్పుడు తను ఇంట్లో లేకపోవడం వలన తానొక్కడే బ్రతికాడు.ఇక ఒక్కడే అనాధలా మిగిలిపోయాడు.ఆ చిన్నవాడు రోజూ తన వాళ్ళను తలచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు.ఆ పిల్లాడ్ని చూసి ఆ ఊరివారంతా బాధ పడేవారే కానీ ఓదార్చలేకపోయేవారు.
అప్పుడు అతని ఊరికి ఆ సాధువు మళ్ళీ వచ్చాడు .....
ఆ సాధువు ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి
"ఎందుకు అనవసరంగా బాధపడుతూ కలాన్నంతా వృధా చేసుకుంటావు.ఏ బంధమూ శాశ్వతము కాదు నాయనా.జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్లిపోవచ్చు కానీ ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు అతనే మన తండ్రి.అతను అనాధనాధుడు,అతను ఉండగా ఎవరూ అనాధలు కారు.ఆయన్నే ధ్యానిస్తూ ఉండు నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు" అని చెప్పి వెళ్ళిపోయాడు.ఆ సాధువు మాటలతో సేద తీరి తన దుఃఖాన్ని మరచి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టి నిలిపాడు.

ఒక గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాధుడే తన తల్లి తండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే జీవిత ధ్యేయం అని నమ్మి ఎంతో శ్రమించసాగాడు.చదువులేదు ఏ పని చేతకాదు,ఇది వరకు పని చేసిన అనుభావం కుడా లేకపోవడం వలన ఒక చోట ఒక పనిలో చేరాడు.తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీని దర్శించుకుని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు ... కాశీకి వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలుస్కుని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నాడు.రోజూ మూడు పూటలా భొంచేయడానికి కుడా తన సంపాదన సరిపోయేది కాదు.అయినా తను వాటిలోనే సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు.

అక్కడి విశ్వనాధుడిని,విశాలాక్ష్మి అమ్మవారిని,అన్నపూర్ణా దేవిని,డుండి గణపతిని , కాళ భైరవ స్వామిని తన మనస్సులోనే ఊహించుకుంటూ,ప్రతి రోజు స్నానం చేసేప్పుడు గంగమ్మలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుంతుందో అనుకుంటూ ,అన్నం తినేప్పుడు అన్నపూర్ణమ్మ చేతి వంట తినే మాహాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరం కాశీ ఆలోచలనతోనే గడుపుతుండేవాడు ...

అలా ఇరవై సంవత్సరాలు ఎంతో కష్ట పడి పొదుపు చేసి దాచుకున్న డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకుని ఆనందంతో నిద్రపోయాడు.రాత్రికి రాత్రే అతని ఇంట్లో ఒక దొంగ తను దాచుకున్న డబ్బు దోచుకుని పోయాడు.ఉదయం లేచి కాశీ యాత్రకూ బయలుదేరుదాం అనుకుంటుండగా తను దాచుకున్న డబ్బు కనిపించలేదు ... వేసిన గొళ్ళెం వేసినట్లే ఉంది డబ్బు ఎలా పోయిందో అనుకుంటూ గుడిసంతా ప్రతి అంగుళం వెతికాడు కాని డబ్బు కనిపించలేదు ...

అతని బాధకు అంతే లేదు ... తన ఆశలన్నీ అడియాశలైయ్యాయనీ, శరీరంతో విశ్వేశ్వరుడ్ని కలవలేను కనుక చనిపోయి అయినా విశ్వేశ్వరుడిని కలవాలని అనుకున్నాడు , వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు.మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు ...

తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒకావిడ వొడిలో పడుకుని ఉన్నాడు.ఆవిడ ఎవరో తెలియదు .ఎక్కడ ఉన్నాడో తెలియదు,ఆవిడ అతన్ని ఒక చోటుకి తీసుకుని వెళ్ళింది.అక్కడ ఒకతను ధ్యానంలో కుర్చుని ఉన్నాడు.అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడ్ని చూసాడు తను.వొళ్ళంతా భస్మం రాసుకుని,జుట్టంతా ఎఱ్ఱగా ఉంది ,జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తి భావం కలిగింది." స్వామి మీరెవరు ..... " అని అడగాలనుకున్నాడు కాని అతనికి నోట మాట రావడం లేదు ..

అలా కాసేపు తదేక దృష్టితో చూస్తుండగా ఇతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది.మనసు నెమ్మదించి స్వస్వత పొందింది.కళ్ళు మూతలు పడుతూ ధ్యానస్తుడయ్యాడు.అలా ఎంత సేపు ధ్యానంలో ఉండిపోయాడో కుడా తెలియదు.నిదానంగా ధ్యానం నుండి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తు పట్టాడు.తను చిన్నప్పుడు ఇంట్లో వారి గురించి బాధ పడుతుండగా తన మనస్సును మార్చి విశ్వనాధుని వైపుకి త్రిప్పింది ఈ సాధువే అని జ్ఞాపకానికి వచ్చింది.ఇరవైయేళ్ళ క్రితం చుసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగి,ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో ,ఎవరిని దర్శిస్తుండడం వలన మనస్సు ప్రశాంతత పొందుతోందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను,ఇది నా తండ్రి ఆ విశ్వనాధుని అపార కరుణే అనుకుని , ఆ సాధువుకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలనుకున్నాడు ,కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మళ్ళీ మాటలు రాని పరిస్థితి .అతనికి కలిగిన భావనలు,ఆ ఆనందానుభూతి,గొంతు గద్గదం అవ్వడం ,కళ్ళ నుండి ఆనందాశ్రువులు జాలువారడం ఇవన్నీ అతన్ని ఆశ్చర్యానందాలకు గురిచేస్తుండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి,అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్న ఒకావిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు ...

ఆ గదిలో ఒకావిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది.ఆవిడ మోములో చిరు మందహాసము,ఆమె కన్నులలో కాంతి అమృత కిరణాలను ప్రసరింపజేస్తున్నదా అన్నట్లు ఉన్నది. కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా ఆక్రమించినట్లున్నది .ఈ కుర్రవానికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తజేస్సు నరనరాల్లో ప్రవహిస్తున్న భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు.అతని మదిలో ఎన్నో స్మృతులు తళుక్కుమని మెరుపులా మెరిసి అంతర్ధానం అవుతున్నాయి.అతను జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు.తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బృకుటిలో ఒక జ్యోతి దర్శనం అయ్యింది.అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కుర్చున్నాడు.

అటు తరువాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడినుండి తీసుకుని ఇంకో గదిలో ఉన్న ఒకావిడ దగ్గరకు వెళ్ళింది ,ఆవిడ చూడటానికి పండు ముత్తైదువలా ఉన్నది.ఎర్రటి బొట్టు,తల నిండా కనకాంబరం పువ్వులు,ఎర్రటి అంచున్న తెల్లటి చీర కాసిపోసి కట్టుకుని కుర్చుని ఉన్నది. ఇతన్నిచూస్తూనే రా నాయనా అంటూ నవుతూ పలకరించిది.ఒక్కసారిగా ఆ కుర్రవాడు అయిదారేళ్ళ పసి బాలుడిలా మారిపోయాడు.ఆ పిల్లవాడ్ని దక్కరకు తీసుకుని, తన వొడిలో కూర్చోబెట్టుకుని ఒక తీయ్యటి పదార్ధం తినిపిస్తున్నది. అటువంటి పదార్ధం తను తన జీవితంలో తినలేదు.కడుపు నిండా తిన్న తరువాత ఆ పసివాడికి జోల పాడి నిద్రపుచ్చింది ...

నిద్రలేచేసరికి తన పక్కనే ఒకతను కుర్చుని ఉన్నాడు.అతని చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అతన్నే చూస్తూ కుర్చుని ఉన్నాయి.అతని రూపు చూడటానికి భయంకరంగా ఉన్నా తన మొగములో చిరునవ్వు ఇతన్ని విశేషంగా ఆకర్షించింది.తన ఈ కుర్రవాడితో ఇలా అన్నాడు," కుక్క ఒక విశిష్టమైన జంతువు,విశ్వాసానికి ప్రతీక,తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కుడా లెక్కచేయకుండా ఎంత పెద్ద శత్రువుతోనైనా పోరాడుతుంది.అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు." తరువాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరకు వెళ్ళాడు.ఆ ఏనుగు ఇతన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండ బెట్టుకుని ఆ నగరం అంతా ఉత్సాహంగా తిరిగింది.ఈ నగరాన్ని అతను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు కానీ అణువణువునా పవిత్రతతో భాసిస్తోంది,ఎంత చూసినా తనివి తీరడం లేదు.అలా తిరిగి తిరిగి ఇద్దరు ఆ పెద్దావిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు ఆవిడ ఇద్దరికీ కడుపు నింపి సేదతీర్చింది ...

మళ్ళీ తనుకు మంచి నిద్రపట్టేసింది.

అప్పుడు అతనికి ఒక కల వచ్చింది ... ఆ కలలో తను చుసిన వారంతా మళ్ళీ కనిపించారు ... ఆ సాధువు అతనితో , " నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా ఏవిటో ఇప్పుడు అడుగు అన్నాడు." ... ఆ కుర్రవాడు " స్వామీ,చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాధుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే,మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములు నా తండ్రి వైపు నిలుపగాలిగాను,మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవడం ఎంతో ఆనందంగా ఉన్నది.ఇక్కడ నాకు కలుగుతున్న అనుభూతులను మాటల్లో వర్ణించలేను,నేను చుస్తున్నదంతా కలా నిజమా అనే సంభ్రమాశ్చర్యాలకు గురువతున్నాను ... కానీ నా సందేహాలివి,నేనెక్కడ ఉన్నాను,ఇక్కడకు ఎలా వచ్చాను,మీరంతా ఎవరు అని ప్రశించాడు,ఎందుచేత నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు, మీ అందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి ? అని అడిగాడు ...

అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు ...

నిన్ను బావిలో మునిగిపోతుండగా కాపాడిన ఆవిడే గంగ,నువ్వు ఇన్నేళ్ళు చూడాలని పరితపించిన ఆ విశ్వనాధుడిని నేనే,బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆవిడే విశాలాక్షీ దేవి,నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణా దేవి,కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాళ భైరవుడు,నిన్ను తన మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్న ఏనుగే మా డుండి గణపతి,నువ్వు చుసిన నగరమే ఇన్నేళ్ళు నువ్వు కలలు గన్న పరమ పవిత్ర కాశీ నగరం అని వివరించి ... ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా " అని అడిగాడు ...

అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రువులతో స్వామి వారి పాదాల మీద వ్రాలి స్తుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు ... " తండ్రీ,నాకు చిన్నప్పుడు కనిపించి దిశా నిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువైఉన్న నిన్ను సేవించమని చెప్పావు ,నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్టసుఖాలను లక్ష్యపెట్టక ఇన్ని సంవత్సరాలు ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నామస్మరణ వీడలేదు.అయినా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను ??? "

అప్పుడు స్వామి వారు ఇలా అన్నారు ...

" నాయనా,అంత కంటే ముందు నీ పూర్వ జన్మ వృతాంతం తెలుసుకోవాలి ... నీవు పూర్వ జన్మలో ప్రస్తుతం నువ్వు పని చేస్తున్న జమీందారు ఇంట్లోనే రెండు తరాలకు ముందు జన్మించావు.నీకు ఎంత సంపద ఉన్నప్పటికీ దానధర్మాలు చేసి ఎరుగావు,పరమ లోభివి.ధనమందు నీకు మిక్కిలి పేరాశ ఉండేది.నీ దగ్గర పనిచేస్తున్న వారికి సమయానికి జీతము ఇచ్చేవాడవు కావు.ఇలా నీకు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకూ ధనమందు ఆశ పోలేదు.అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు.నీ అదృష్టవశాత్తూ నువ్వు ఆయన సత్సంగానికి వెళ్లావు.ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడవైనావు."

" నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది.ఆ యోగికి శిష్యుడవైనావు. పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలసి కాశీకి ప్రయాణమైనావు.కానీ నీ వయస్సు సహకరించక మార్గ మధ్యలోనే కాలం చేసావు.నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలని అనుకోవడం వల్లను,ఒక సత్పురుషునికి భోజనం పెట్టుట వల్లను విశేష పుణ్యఫలం లభించింది.కానీ అంతకు ముందు చేసిన పాప కర్మలు కుడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి,పసి వయస్సులోనే అనధావు అయ్యావు.ఎనభై సంవత్సరాలు అందరినీ బాధపెట్టినందుకు అందులో నాలుగవ వంతు అనగా ఇరవై సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు.ప్రతి క్షణం నా గురించి తపించినందువల్ల నేడు నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది."

నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చులకోసమై దాచిన డబ్బును దోచుకున్నది నేనే,"అన్నాడు ఆ మహా దేవుడు.

ఆ కుర్రవాడు," స్వామీ,ఎందుకని మీరు నేను దాచుకున్న డబ్బును దొంగిలించారు ? అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను ? ఏమి మీ ఆట ? అని అడిగాడు ...

అప్పుడు విశ్వనాధుడు ఇలా అన్నాడు , " నేను దొంగిలించినది నీ డబ్బును కాదు ... నీ కర్మను మాత్రమే ... నీ కర్మలకు ప్రతిఫలం ఆ ధనం.కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను.అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే కదా నీ సందేహం ... "

" చెబుతాను విను,పరీక్షించకుండా దేని విలువా బయట పడదు.నన్ను నమ్మిన ప్రతి భక్తుడినీ మొదట పరీక్షిస్తాను అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడు, పుజ్యనీయుడు,అనుసరించుటకు యోగ్యుడు అవుతాడు.నీవు తీవ్ర మనస్తాపానికి గురియై దేహ త్యాగం చేసి నన్ను చేరుకుందాం అనుకున్నావు.కానీ ఆత్మహత్యా దోషం మళ్ళీ జన్మ జన్మాంతరాలు కట్టి కుడిపేస్తుంది.ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యం నాదే.అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది.ఏ ఇతర కారణాల వల్ల అయినా ఏ జీవుడైనా ఆత్మ హత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతి ఫలం అనుభవించాల్సిందే."

" నీవు దేహ త్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీ నగరం ఏర్పడేది.జీవుల ఆలోచనలను,చర్యలను బట్టి కార్యాచరణాలు మారిపోతూ ఉంటాయి.కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీ వాసమే అని గుర్తించు " అని వివరించాడు.

ఆ కుర్రవాడు స్వామి వారి అపార కరుణా వాత్సల్యానికి ఆనందాశ్రువులు కారుస్తూ అలా నిల్చుండిపోయాడు.అప్పుడు స్వామి వారు అతనికి కశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించి యాత్రకు వచ్చేవారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించాడు.ఆ కుర్రవాడు ప్రతి రోజు గంగా స్నానం ఆచరిస్తూ,విశ్వనాధ,విశాలాక్షి,అన్నపూర్ణా దేవిలను సాకారముగా దర్శిస్తూ,కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ అవసానదశలో శివైక్యం చెందాడు.అతని పేరు గుర్తు రావడం లేదు కానీ ఆయన సమాధి ఓక ఘాట్లో ఉన్నదని చెప్పారు.

అందుచేత కాశీ స్మరిస్తూ మనంకూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాం ..
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List