రాజ విద్యా రాజగుహ్య యోగము ~ దైవదర్శనం

రాజ విద్యా రాజగుహ్య యోగము

అ|| భగవత్సాన్నిధ్యముచే ప్రకృతి చరాచరసృష్టినంతయు గావించుచున్నదని వచించుచున్నారు -
మయాఽధ్యక్షేణ ప్రకృతిః 
సూయతే సచరాచరమ్ | 
హేతునానేన కౌన్తేయ 
జగద్విపరివర్తతే || 

తా:- ఓ అర్జునా! అధ్యక్షుడనై (సాక్షిమాత్రుడనై) యున్న నాచేత ప్రకృతి చరాచర ప్రపంచమునంతను సృజించుచున్నది. ఈ కారణముచేతనే జగత్తు ప్రవర్తించుచున్నది.

వ్యాఖ్య:- ప్రకృతి జడమైనది. పరమాత్మ చైతన్యరూపుడు. పరమాత్మసాన్నిధ్యము చేతనే ప్రకృతి చరాచరప్రాణికోట్లను సృజింపగల్గుచున్నది. సూదంటురాయియొక్క సన్నిధానమందు ఇనుపసూది కదలుచున్నను, సూదంటురాతికి ఏ కర్తృత్వమున్ను  లేదు. అది సాక్షిమాత్రమైయున్నది. అట్లే పరమాత్మయు జగద్వ్యవహారమున సాక్షిమాత్రుడై యొప్పుచున్నాడు. ఆతని సన్నిధాన మహిమచే ప్రకృతి సమస్త జగత్కార్యములను జేయుచున్నది. పరమాత్మయొక్క ఇట్టి తాటస్థ్యమును, చైతన్యశక్తిని వర్ణించుటకై ఈ శ్లోకమందు‘అధ్యక్షేణ’ అను చక్కటి పదమొకటి ప్రయోగింపబడినది. ఒక సభలో ఎందఱు సభ్యులు గుమిగూడినను సభకు చైతన్యము రాదు. అధ్యక్షుడు వచ్చి కూర్చొనుట తోనే సభకు చైతన్యము వచ్చును. అట్లే ఒక కోర్టులో తక్కిన వారెందఱున్నప్పటికిని ‘జడ్జీ’ వచ్చి కూర్చొననిదే కార్యక్రమము జరుగదు. ఆతడు వచ్చినతోడనే అతని సాన్నిధ్యము చేతనే కోర్టువ్యవహారమంతయు నడచిపోవును. అట్లే ప్రకృతియు ఈశ్వరసాన్నిధ్యము లేనిచో జడమై, సృజనశక్తిరహితమై యుండును. చిద్ఘనుడగు పరమాత్మవలననే ప్రకృతికి సృష్టిరూపశక్తి ఏర్పడుచున్నది. ఈ హేతువుచేతనే జగత్తంతయు పరివర్తనము గలిగియుండుచున్నది. లేకున్న ఇంజనులేని రైలుపెట్టెలవలె ప్రపంచము నిర్వీర్యమై, నిశ్చేష్టమై యుండగలదు.

      సామాన్యముగ జనులయొక్కదృష్టి స్థూలప్రపంచము వఱకే పోవుచున్నది. గావున దానినే సత్యమనినమ్మి దానివెంటనే పరిగెత్తుచున్నారు. కాని ఈ శ్లోకముద్వారా వారు పొరబడుచున్నారని తెలియగలదు. స్థూలప్రపంచము జడమైనది. దానిని త్రిప్పునట్టిదియు, దానికి చైతన్యశక్తిని ప్రసాదించునదియునగు అతిసూక్ష్మమైన (ఆత్మ) వస్తువు దాని వెనుకగలదు. స్థూలదృష్టికి అది గోచరింపదు. విజ్ఞాననేత్రముచే దానినెఱుంగవలెను. అదియే పరమాత్మ. ప్రపంచమంతయు ఆ పరమాత్మయందు ఆరోపింపబడినది. ఆరోపితవస్తువునకు స్వతః ఏ బలమున్ను, వ్యక్తిత్వమున్ను ఉండదు.అది తనశక్తిని అధిష్ఠానవస్తువు నుండియే పరిగ్రహించును.

అట్లే ఆరోపితమగు జగత్తుయొక్క శక్తి యంతయు అధిష్ఠానమగు పరమాత్మవలననే కలుగుచున్నది. (అయినను పరమాత్మ కర్తృత్వరహితులై, సాక్షిమాత్రులై, ఆ యా జగత్క్రియలయందు నిర్లిప్తులై యున్నారు). దీనినిబట్టి భౌతికశక్తిగాని, మానసికశక్తిగాని ఎంతగొప్పదైనను ఆధ్యాత్మికశక్తియొద్ద తీసికట్టేయగును. ఆత్మశక్తి ప్రధానమైనది. చైతన్యవంతమైనది. తక్కిన శక్తులన్నియు ప్రకృతికి జెందినవే అప్రధానములై యున్నవి.

కావున విజ్ఞుడు స్వల్పస్వల్ప భౌతికశక్తుల సముపార్జనయందే జీవితమును ధారబోయక వానినిజూచి మురిసిపోవక దైవశక్తిని సముపార్జించవలెను. మఱియు చిన్న చిన్న అధ్యక్షపదవులకై అఱ్ఱులు చాచక, జగదధ్యక్షులగు పరమాత్మయొక్క సాన్నిధ్యమునకై, ఐక్యమునకై యత్నించవలెను. ఎద్దానివలన ఈ చరాచరజగత్తంతయు వ్యవహారసమర్థమై యొప్పుచున్నదో అట్టి అధిష్ఠానచైతన్య పరమాత్మ యొక్క సాక్షాత్కారముకొఱకే యత్నించవలెనుగాని, జడములగు దృశ్యవస్తువుల స్వీకరణముచే సంతృప్తిని బొందరాదు.
     
ప్ర:- ఈ జగత్తునకు అధ్యక్షుడెవడు?

ఉ:- పరమాత్మ. ఆతని సాన్నిధ్యము వలననే ఈ చరాచర జగత్తంతయు వ్యవహరించు చున్నది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List