సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం. ~ దైవదర్శనం

సర్వదోష నివారణా మహిమాన్విత క్షేత్రం.

సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అశ్వత్థ నారాయణుడిగా కొలువులందుకుంటున్న మహిమాన్విత క్షేత్రం విదురాశ్వత్థ. దేశంలోనే ఓ విలక్షణమైన పుణ్యక్షేత్రంగా అలరారుతున్న ఈ దివ్యథామం స్వామి లీలా విశేషాలతో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. విదురాశ్వత్థ క్షేత్రం మహిమాన్వితమైనది. అటు చారిత్రకంగానూ, ఇటు పౌరాణికంగానూ విశేషమైన ప్రాశస్త్యాన్ని తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది.
విదురాశ్వత్థ క్షేత్రం ఓ చిన్ని గ్రామం. మహాభారతంలో ధర్మజ్ఞుడ్నిగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న విదురుడు ఈ క్షేత్రంలో కొంతకాలం నివసించడంవల్ల ఈ క్షేత్రానికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది. అలాగే ఆ స్వామి ఇక్కడ ఒక అశ్వత్థ వృక్షం నాటి శ్రీహరి సేవలో తరించడంవల్ల ఈ క్షేత్ర ప్రాశస్త్యం మరింత పెరిగింది.
విదురాశ్వత్థ క్షేత్రంలోకి అడుగుపెట్టగానే ఆలయ ద్వారం కనువిందు చేస్తుంది. ఈ ద్వారం మీద అశ్వత్థ నారాయణస్వామివారి మూర్తి భక్తుల చూపు మరల్చనీయదు. ఈ ఆలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణమంతా నాగ శిలాప్రతిమలతో అదో నాగ లోకాన్ని తలపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయం ముందు వినాయకుని చిన్ని మందిరం ఉంది. అశ్వత్థవృక్షం త్రిమూర్త్యాత్మకమైనది. ఆ వృక్ష రాజంలో త్రిమూర్తులు మమేకమై ఉంటారు. దానిని స్ఫురణకు తెచ్చే విధంగా ఇక్కడ ప్రాకారాల మీద త్రిమూర్తుల మూర్తులను పొందుపరిచారు. గర్భాలయం ముందు భాగంలో పంచలోహ సమన్విత నాగ సర్పం ఉంది. స్వామి ఇక్కడ సర్ప రూపంగా కొలువై ఉండడంవల్ల ఇక్కడ నాగ సర్పాన్ని ఉంచారని చెబుతారు. గర్భాలయంలో ఒక పక్క విఘ్న నాయకుడు వినాయకుడు కొలువుదీరగా, మరోపక్క కుమారస్వామి, పరమేశ్వరులు ఆశీనులయ్యారు. ఈ మూర్తులకు సమీపంలో ఎతె్తైన పీఠం శ్రీ అశ్వత్థ నారాయణస్వామి శిలామూర్తి ఉంది. ఇదే ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి వెనుక భాగంలో అశ్వత్థ వృక్షం కానవస్తుంది.
సాక్షాత్తు విదురుడు నాటిన వృక్ష రాజంగా దీనిని చెబుతారు. అయితే ఈ వృక్షరాజం 2001వ సంవత్సరంలో పక్కకు ఒరిగిపోవడంతో దానిని జాగ్రత్తగా కాపాడడానికి తగు చర్యలు చేపట్టారు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వృక్షం నీడలో నారాయణ స్వామివారి మూర్తి ఒకటి కానవస్తుంది. ఈ వృక్ష రాజాన్ని దర్శించినంత మాత్రంచేతనే అనంతకోటి పుణ్యఫలాలు సొంతమవుతాయని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయ ప్రాంగణంలో కుడివైపు భాగంలో అభయాంజనేయస్వామివారి మందిరం ఉంది. ఇందులో కొలువుదీరిన ఆంజనేయస్వామివారు సింధూర వర్ణ శోభితంగా దర్శనమిస్తారు. తిరునామధారియైన అభయాంజనేయస్వామి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావించి కైమోడ్పులర్పిస్తారు.
దీనికి సమీపంలోనే ముడుపుల చెట్టు ఉంది. ఈ ఆలయానికి వచ్చిన కొంతమంది భక్తులు ఇక్కడ ముడుపులు కడతారు. స్వామివారి లీలా విశేషాలకు ఇది తార్కాణంగా నిలిచింది. దీనికి సమీపంలోనే పూర్వకాలం నాటి శివాలయం ఉంది. శివాలయంలో ఉన్న పరమేశ్వర లింగ దర్శనం మాత్రం చేతనే పంచపాతకాలు సైతం మటుమాయమవుతాయంటారు. ఇక్కడ స్వామికి చేసే అర్చనాది కార్యక్రమాలన్నీ విశేష ఫలితాలనిస్తాయంటారు.
ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న మరో ఆలయం శ్రీ నవగ్రహాలయం. నవగ్రహాది దేవతలు కొలువుదీరిన ఈ ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నవగ్రహ దోష నివారణ పూజలు చేయించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోపక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామివారి మందిరం ఉంది. ఈ మందిరంలో వెంకటేశ్వరస్వామి తన ఇరు దేవేరులతో కలసి కొలువుదీరాడు.
విదురాశ్వత్థ శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రం సర్వదోష నివారణా క్షేత్రంగా కూడా విరాజిల్లుతోంది. అలాగే వివాహం కానివారు, సంతానం లేనివారు ఇక్కడ ఈ ప్రాంగణంలో నాగదేవత శిల్పాన్ని ప్రతిష్టించి పూజిస్తే, వెంటనే అభీష్ట సిద్ధి కలుగుతుందన్న నమ్మకం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ కారణంగానే భక్తులు ప్రతిష్టించిన వేలాది నాగ శిల్పాలు ఇక్కడ ఈ ప్రాంగణంలో దర్శనమిస్తాయి. అలాగే పర్వదినాలు, పండుగలపుడు ఈ ఆలయంలోకి సర్పాలు వచ్చి భక్తులను కటాక్షిస్తాయని భక్తులు చెబుతారు. విదురాశ్వత్థ క్షేత్రం చారిత్రకంగా కూడా ప్రసిద్ధిచెందింది.
దక్షిణ భారత దేశపు జలియన్‌వాలాబాగ్ జరిగిన ప్రదేశంగా దీనిని చెబుతారు. స్వాతంత్య్ర సమరంలో భాగంగా జరిగిన మారణకాండలో ఈ గ్రామానికి చెందిన పది మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ అశువులు బాశారని ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఉదంతానికి గుర్తుగా ఇక్కడ ఒక స్మారక స్థూపాన్ని కూడా నెలకొల్పారు. కర్ణాటక రాష్ట్రం, చిక్‌బళ్ళాపూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం గౌరిబిదనూర్ పట్టణానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో ఉంది. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి బెంగళూరునుంచి నేరుగా చేరుకోవచ్చు. అలాగే హిందూపురం వరకూ వచ్చి అక్కడ నుంచి గౌరీబిదనూరు మార్గంలో ఉన్న ఈ క్షేత్రాన్ని సులువుగా చేరుకోవచ్చు. విదురాశ్వత్థ క్షేత్రం చిన్న గ్రామం. కేవలం స్వామివారి లీలా విశేషాలతో మాత్రమే ఇది ఖ్యాతికెక్కింది. ఇక్కడ ఈ క్షేత్రంలో బసచేయడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. అలాగే భోజన సదుపాయం కూడా ఇక్కడ అంతంత మాత్రంగానే ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించాలనుకునే వారు వారివారి ఏర్పాట్లను చేసుకుని మరీ వెళ్ళాల్సి ఉంటుంది.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Recent Posts

Unordered List