12 - 13 శతాబ్ధి మధ్యకాలంలో హోయసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇదే సమయంలో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు నిర్మించాడని అంటారు. ఈ నిర్మాణంలో తన మంత్రి కేతనమల్ల తోడ్పడినాడని, ఇతనితో పాటూ కేసరశెట్టి అను శివభక్తుడు కూడా తోడ్పడినట్టు తెలుస్తుంది. ఈ నిర్మాణం 1160 ప్రాంతంలో పూర్తైంది. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి. అందుకే దీనికి హలెబీడు (శిథిల నగరమని, పాత నివాసమని) అనే పేరు స్థిరపడిపోయింది.
ఇక్కడ ప్రధానాలయం హొయసలేశ్వరాలయం. ఇది ద్వికూటాలయం. ఇందులో రాజా హోయసల పేరు మీదుగా ఒకటి, రాణి శాంతలదేవి పేరు మీదుగా మరొకటి, రెండు శివలింగాలను ప్రతిస్ఠించారు. వీటికి హోయసలేశ్వరుడని, శాంతలేశ్వరుడని పేరు. ఈ రెండు శివలింగాలకు ఎదురుగా రెందు పెద్ద నందులు ఏర్పాటు చేశారు. వీటి చుట్టూ మండపాలు ఉన్నాయి. ఈ నందులు రకరకాల అలంకరణలతో అందంగా చెక్కబడినవి. ఇవి దేశంలో అతి పెద్ద నందులలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నవట.
గర్భగుడి ముఖద్వారం, నంది, బృంగీ విగ్రహాలు, ఆలయంలోపల పై కప్పుపై, వెలుపల ఆలయ గోడలపై హిందూ పూరాణ గాథలను స్ఫురింపజేసే శిల్పాలు, జంతువులు, పక్షులు, నర్తకిల శిల్పాలు బహు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయి. ఇక్కడి శిల్పాలు, కళాకృతులు, హోయసల శిల్ప శైలికి నిలువుటద్దాలు. ఈ దేవాలయాల నిర్మాణానికి సబ్బురాతిని/బలపపు రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం తూర్పు ముఖమై ఉంటుంది. ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. రెందు ద్వారాలు తూర్పు వైపు, ఒకటి ఉత్తరం వైపు, మరోటి దక్షిణం వైపునూ. ఉత్తరం ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలక విగ్రహం ఆకర్షణియంగా ఉంటుంది. ఆలయం వెలుపల ఉద్యానవనంలో గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. ఈ దేవాలయ సముదాయంలో పురావస్తు శాఖ వారి మ్యూజియం, దగ్గరలోనే ఓ పెద్ద సరస్సు ఉన్నాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
హళేబీడు కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హళేబీడు, బేలూరు, శ్రావణబెళగొళను కర్ణాటక పర్యాటక శాఖవారు స్వర్ణ త్రికూటంగా పిలుస్తారు. హళేబీడును, బేలూరును, హోయసలుల జంట పట్టణాలుగా పిలుస్తారు. హళేబీడు మరియు బేలూరు జిల్లా కేంద్రమైన హాసన్‌కు అతి సమీప చిన్న పట్టణాలు. దీనికి పూర్వం దొరసముద్ర, ద్వారసముద్ర అని పేర్లు ఉండేవి. అనగా సముద్రానికి ద్వారం వంటిదని. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో మాలిక్ కాఫర్ దాడులను ఈ ప్రాంతం చవి చూసింది. అనేక శిథిలాలు ఇక్కడ మిగిలిపోయాయి.
హళేబీడుకు బెంగళూరు,మైసూర్, మంగళూరు, జిల్లా కేంద్రమైన హాసన్ నుండి, మరో చారిత్రక ప్రాంతం బేలూరు నుండి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బేలూరుకు 16 కిలో మీటర్ల దూరంలోనూ, హాసన్‌కు 31 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. హాసన్ నుండి ప్రతి 15 నిమిషాలకో బస్సు ఉంటుంది.
No comments:
Post a Comment