రాజవిద్యారాజగుహ్యయోగము ~ దైవదర్శనం

రాజవిద్యారాజగుహ్యయోగము

అ|| భక్తితో ఏ స్వల్పవస్తువు నొసంగినప్పటికిని తాను సంతుష్టినొందెదనని భగవానుడు పలుకుచున్నారు-   

పత్రం పుష్పం ఫలం తోయం 
యో మే  భక్త్యా ప్రయచ్ఛతి | 
తదహం భక్త్యుపహృతం
అశ్నామి ప్రయతాత్మనః || 

తా:- ఎవడు నాకు భక్తితో ఆకునుగాని,  పువ్వునుగాని, పండునుగాని,  జలమునుగాని, సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాంతఃకరణునియొక్క (లేక, పరమార్థయత్నశీలునియొక్క) భక్తిపూర్వకముగ నొసంగబడిన ఆ పత్రపుష్పాదులను నేను (ప్రీతితో) ఆరగించుచున్నాను (అనుభవించుచున్నాను). 

వ్యాఖ్య:- పైనదెల్పిన పత్రపుష్పాదులు బీదలకు, ధనవంతులకు, పండితులకు, పామరులకు, సర్వులకును అందుబాటులోనున్న వస్తువులు. భగవత్ప్రీతిని బడయుటకు సామాన్యమైన వస్తువునైనను ప్రీతితో, భక్తితో సమర్పించిన చాలునని ఈ శ్లోకముద్వారా వెల్లడియగుచున్నది. శక్తిలేనివారు మేము పెద్దపెద్ద నైవేద్యములను దేవునకు సమర్పింపలేకపొతిమేయని దిగులునొందరాదు. ఏలయనిన  భగవానుడు భక్తిని, హృదయశుద్ధిని ప్రధానముగ నెంచునేకాని వస్తువునుగాదు. వాస్తవముగచూచిన దేవునకు ఒకానొక వస్తువు  ఆవశ్యకత యేమియునులేదు.  బ్రహ్మాండములన్నియు వారి కుక్షియందే  యుండ ఇక వారికేమి కొఱత?! అయినను నిర్మలమనస్కులకు భగవానుడు రెండుషరతులను నియమించిరి. అవియేవి యనిన - 
ఇచ్చువాడు పరిశుద్ధుడై యుండవలెను. 
     (2)  ఇచ్చుదానిని పరమభక్తితో ఇవ్వవలెను. 
   మలినచిత్తము గలవాడు ఏదియొసంగినను, తుదకు రాజ్యాదులను, మేరుపర్వతమంత బంగారమిచ్చినను భగవంతుడు స్వీకరింపరు. శుద్ధచిత్తముగలవాడు, నిర్మలాంతఃకరణుడు కేవల మొక ఆకు ఇచ్చినను, పువ్వు ఇచ్చినను, పండు ఇచ్చినను, గరిటెడు నీరిచ్చినను మహాసంతుష్టితో గ్రహించును. అట్లే భక్తిలేకుండ రత్నరాసులిచ్చినను స్వీకరింపరు. భక్తితో చిల్లిగవ్వ ఇచ్చినను ఆనందముతో తీసుకొనును. ప్రేమగాని, భక్తిగానిలేని దుర్యోధనుని యింట ఆతిథ్యమును నిరాకరించి, దయ, ప్రేమ, ఉట్టిపడుచుండు విదురునియింట శ్రీకృష్ణమూర్తి ఆతిథ్యమును స్వీకరించుట సర్వులకును విదితమే కదా! మఱియు కుచేలుని అటుకులను పరమప్రీతితో వారు గైకొనిన సంగతియు అందఱికిని తెలిసినదే కదా!
      దీనినిబట్టి భగవంతుని యనుగ్రహము మనుజుడిచ్చు వస్తువుయొక్క గొప్పతనముపైగాని, విలువపైగాని ఆధారపడియుండదనియు, ఆతనియొక్క మనస్తత్త్వముపైననే ఆధారపడియుండుననియు స్పష్టమగుచున్నది. ఆతని నిర్మలభక్తి, నిర్మలహృదయము - వీనిపైననే సర్వేశ్వరునికృప ఆధారపడియుండును. కనుకనే ఎంతటి కోటీశ్వరులైనను, రాజాధిరాజులైనను, మహాపండితులైనను, భగవంతుని అనుగ్రహమును కొందఱు పొందలేకుండుటయు, వారి దయకు పాత్రులు కాకుండుటయు;  చిల్లిగవ్వయైనలేక, కౌపీనధారులైయుండువారు పరమాత్మయొక్క అపారకృపకు పాత్రులగుటయు చరిత్రయందు కానంబడుచున్నది. భక్తి, చిత్తశుద్ధి - అను నీరెండే భగవానుని దృష్టిలో ప్రధానములుకాని, తక్కినవికావు. ‘అశ్నామి’ అని చెప్పుటవలన అట్టి భక్తితో ఇవ్వబడిన దానిని పరమాత్మ గ్రహించుటయేకాదు, అనుభవించునని, భుజించునని స్పష్టమగుచున్నది. ఆహా! భక్తులపై భగవానున కెంతటి కరుణయో చూడుడు!
   ‘ప్రయతాత్మనః’ - అను పదమునకు నిర్మలాంతఃకరణుడని, ప్రయత్నశీలుడనియు అర్థములు కలవు. 
     ‘యః’ అని ప్రయోగించుటవలన ఎవరైనను సరియే - జాతిమతకులవిచక్షణగాని, ధనిక దరిద్ర భేదముగాని, స్త్రీపురుష భేదముగాని లేక  - భక్తితోగూడి  నిర్మలచిత్తుడై యుండినచో ఆతడొసంగినది సర్వేశ్వరుడు స్వీకరించునని తేలుచున్నది. 
   భక్తి యనునది, హృదయశుద్ధి యనునది మోక్షప్రయాణమునకు టికెట్టు వంటిది. టిక్కెట్టు చేతగలవారు ఎంతబీదవారైనను, అల్పకులస్థులైనను రైలుపెట్టెలో నిశ్చింతగ, నిర్భయముగ ప్రయాణముచేసి గమ్యస్థానమును చేరగలరు. అట్లుకాక, టిక్కెట్టులేనివారు ఎంత ధనవంతులైనను, అధికారవంతులైనను, పండితులైనను, సౌందర్యవంతులైనను వారిని రైలుపెట్టెలోనుండి దింపివేయుదురు. వారు గమ్యస్థానమును చేరజాలరు. అట్లే మోక్షప్రయాణమున్ను. కాబట్టి భగవత్కృపకు, మోక్షప్రాప్తికి భక్తి, చిత్తనైర్మల్యము అతి ప్రధానములైయున్నవి. ఈ విషయమును భగవానుడు ఈ శ్లోకముద్వారా సుస్పష్టము చేసియున్నారు. ముక్తికి అర్హత, యోగ్యత (MERIT) ప్రధానమే కాని తక్కిన విషయములుకావని ఇట ఋజువుచేయబడినది. ఇట్టి బోధలవలన ప్రపంచములో ప్రతి మానవుడును దైవమార్గమున ప్రయత్నించుటకు అవకాశమేర్పడుచున్నది. దేవునిబిడ్డలని ముద్రవేయబడినవారు ఎక్కడను ఉండరు. అనన్యభక్తిగలవారే, నిర్మలచిత్తముగలవారే దేవుని బిడ్డలు. అట్టివారినే యతడు కరుణించును వారికే ఆత్మజ్ఞానమును ప్రసాదించును. 
   ‘యమేవైషవృణుతే తేన లభ్య స్త స్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్’ అను ఉపనిషద్వాక్యము ఈ సత్యమునే తెలుపుచున్నది. 

భగవంతునకు :

 పత్రమును   -   విదురుడు, ద్రౌపది;
 పుష్పమును  -  గజేంద్రుడు ;
 ఫలమును   - శబరి ;
 తోయమును -  రంతీదేవుడు 

భక్తితో ఒసంగి కృతార్థులైరి. 
      
ప్ర:- భగవంతుడు దేనిని స్వీకరించును?
ఉ:- భక్తితోను, నిర్మలచిత్తముతోనుగూడిన ఏ స్వల్పవస్తువు (పత్రముగాని, పుష్ప

ముగాని, ఫలముగాని, జలముగాని) నొసంగినను ప్రీతితో స్వీకరించును. 
ప్ర:- కాబట్టి భగవత్కృపను సంపాదించవలెననిన ఏది ఆవశ్యకము?
ఉ:- (1) భక్తి, (2) చిత్తశుద్ధి - అను రెండును ఆవశ్యకములు.👏👏
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List