కాశీ ఖండం –9 ~ దైవదర్శనం

కాశీ ఖండం –9



గృహ పతిజననం లోపాముద్రా దేవికి అగస్త్యముని బ్రహ్మ లోక వివరాలను తెలియ జేస్తున్నాడు .దానికి ప్రారంభం గా విశ్వానర ,శుచిష్మతి దంపతులకు శివుని వరం గా సంతానం కలిగిన విషయాన్ని చెబుతున్నాడు .చంద్రుడు ఉత్తమ నక్షత్రం లో ఉండగా ,గురుడు కేంద్రం లోఉన్నప్పుడు శుచిష్మతికి ఒక పుత్రుడు జన్మించాడు .ఆ సమయం లో ముల్లోకం లోని జనులు’’గంధధ వాహా ,గంధ వాహా ‘‘’అని ఉచ్చరించారు .అప్పుడు ఆకాశం లోని మేఘాలు ఉత్తమ వాసనలను వర్షించాయి .దేవ దుందుభులు మ్రోగాయి .అంతా నిండి ఉన్న తమస్సు హరించింది .రజోగుణం నాశనమై ,సాత్వికత ఆవ రించింది .అప్పుడు దేవ వేశ్యలైన అప్సరలందరూ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేశారు .అంతటా ఆనందం తాండ వించింది .మరీచి,అత్రి ,పులహుడు ,పులస్త్యుడు ,క్రతువు ,అంగిరసుడు ,వసిష్టుడు ,కశ్యపుడు ,విభాన్దుడు ,లోమషుడు ,చరనుడుడు ,భరద్వాజుడు ,గౌతముడు ,భ్రుగువు ,గాలవుడు ,గర్గుడు ,జాత కర్ణుడు ,పరాశరుడు ,ఆపస్తంభుడు ,యాజ్ఞ వల్క్యుడు ,దక్షుడు ,వాల్మీకి ,ముద్గలుడు ,శాతాతపుడు ,లిఖితుడు ,శిలాదుడు ,శంఖుడు ,జమదగ్ని ,సంవర్తుడు ,మాతంగుడు ,భరతుడు ,అంశుమంతుడు ,వ్యాసుడు ,కాత్యాయనుడు ,కుత్సుడు శౌనకుడు ,సుశ్రుతుడు ,శుకుడు ,రుష్యశ్రుమ్గుడు ,దుర్గాషుడు ,రుచి ,నారదుడు ,తుంబురుడు ,ఉత్తంకుడు ,వామ దేవుడు ,చ్యవనుడు ,ఆశితుడు ,దేవతలుడు ,శాలంకాయనుడు ,హారీతుడు ,విశ్వామిత్రుడు ,భార్గవుడు ,మృకండుడు ,దాల్భ్యుడు ,ఉద్దాలకుడు ,ధౌమ్యుడు ,ఉపమన్యువు ,వత్సుడు ,మొదలైన మునీశ్వరులు ,ముని కన్యలు అక్కడికి చేరారు .బ్రహ్మ ,బృహస్పతి ,విష్ణువు ,నంది భ్రుగులతో శంకరుడు గౌరీదేవి ,దేవేంద్రునితో దేవతలు ,పాతాల వాసులగు నాగులు విలువైన మణులను తెచ్చారు .వీరంతా ఆకాశం లో వెన్నెల లా వ్యాపించారు బ్రహ్మ దేవుడు దగ్గరుండి జాత కర్మ జరిపించి ,,’’ఆగ్నే గృహ పతే ‘’అనే వేదోక్త మంత్రం చేత అందరు ఆశీర్వా దించి ,మళ్ళీ తమ ప్రదేశాలకు వెళ్లి పోయారు .

                   మంచి తేజస్సు ,వర్చస్సు గల ఆ శిశువు ను అందరు పొగిడారు .ఆ తల్లిదండ్రుల భాగ్యమే భాగ్యం అన్నారు’గృహ పతి ‘’అని నామ కారణం చేశారు . నాల్గవ మాసం లో అన్నప్రాశన ,ఏడాదిన్నరకు చూడా కర్మ చేశారు .శ్రవణా నక్షత్రం లో కర్ణ వేధ జరిపించారు .అయిదవ ఏడు న ఉపనయనం చేశారు ,ఉపా కర్మ కూడా చేసి వేద విద్యనునేర్పించటం ప్రారంభించారు తలిదంద్రులైన విశ్వానరుడు శుచిష్మతి దంపతులు .వేదం ప్రారంభించిన మూడేళ్లలో పద,క్రమాదులు పూర్తీ చేశాడు బాలుడు .గురుముఖతా నామ మాత్రమె నేర్చి ,స్వయం కృషి తో వేద విశారదుడని పించుకొన్నాడు ..నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చి కుమారుడైన గృహ పతిని చూసి ,అతని వినయానికి ముచ్చట పడి ,తన ఒడిలో కూర్చో బెట్టుకొన్నాడు ..అతని శరీర లక్షణాలను పరీక్షించాడు దేవముని .దారం తో అతని శరీరావయవాలను కొలిచాడు. అడ్డమూ ,నిలువు కలిపి నూట ఎనిమిది అంగులున్నాడని చెప్పాడు .ఇలాంటి లక్షణం పృధివీ పతికే ఉంటుందని తెలిపాడు అతని అవయవాలలో అయిదు సూక్ష్మాలుగా ,అయిదు దీర్ఘాలుగా ,ఏడు రక్తాలుగా ,ఆరు ఉన్నతాలుగా ,మూడు విశాలం గా ,అయిదు సూక్ష్మాలుగా గంభీరాలుగా ఉన్నాయని తేల్చాడు .ఇలా 32అవయవాలు ఉండాలని సూచించాడు .దీర్ఘావయవాల వల్ల దీర్ఘాయువు కలుగుతుంది .రెండు భుజాలు రెండుకళ్ళు ,దవడలు మోకాళ్ళు ,ముక్కు పొడవుగా ఉండాలి .మెడ ,పిరుదులు ,పురుషాంగం పొట్టి గా ఉండాలి .ధ్వని నాభి గంభీరం గా ఉండాలి .చర్మం కేశాలు వ్రేళ్ళు ,పళ్ళు, వ్రేళ్ళ యందలి పర్వాలు, జానువులు సూక్ష్మం గా ఉండాలి ఇలా ఉంటె దిక్పాలకుడవుతాడు .వక్షస్తలం పొట్ట ,ముంగురులు భుజాలు నోరు చేతులు ఉన్నతం గా ఉంటె ఐశ్వర్య సంపన్నుడవుతాడు .అరచేతులు ,కంటి కొసలు ,దవడలు నాలుక ,కింది పెదవి గోళ్ళు ఎర్రగా ఉంటె రాజ్యాధి పత్యం వస్తుంది .నుదురు నడుము వక్షస్తలం ,విశాలం గా ఉంటె మహా తేజశ్వి అవుతాడు .పిరుదులు తాబేటి చిప్ప లాగా కఠినం గా ఉండి ,చేతులు కాళ్ళు కోమలం గా ఉంటె రాజ్య హేతువులు .కనిష్టిక నుండి తర్జని వరకు అవిచ్చిన్నం గా వ్యాపించిన రేఖ ఉంటె దీర్ఘాయుస్సు .పాదాలు బలం గా ఎర్రగా ,మడమలు చెమట లేకుండా ,బలిష్టం గా ఉంటె ఐశ్వర్య చిహ్నం .హస్త రేఖలు తక్కువ ఉంటె సుఖాన్ని ఎక్కువ గా పొందుతాడు .పురుషావయవం పొట్టిగా ,సన్నగా ఉంటె రాజ రాజే అవుతాడు .పిరుదులు ,పిక్కలు గుండ్రం గా ఉండి,ఎర్రగా దక్షినా వర్తం గా ఉంటె మహాదైశ్వర్య వంతుడవుతాడు వృషణాలు విశాలం గా, పుష్టితో ఉంటె సుఖ వంతుడు .చేతులలో శ్రీ వత్సము ,వజ్రము ,చక్రము ,తామర పూవు ముత్యము ,కొదంతము ,దండ ధారణం మొదలైన రేఖ లుంటే ఇంద్రాది పత్యమే వస్తుంది .ముప్ఫై రెండు పళ్ళు ,భుజం మెడ శంఖా కారం లో ఉండి హంస మేఘ ధ్వని లా స్వరం ఉంటె సర్వేశ్వరుడే అవుతాడు .తేనె కళ్ళున్న వాడికేప్పుడు దరిద్రం కలుగదు .ముఖం మీద అయిదు రేఖలుండి ,సింహం నడుము ఉంటె శుభాలే అన్నీ .పాదాలలో ఊర్ధ్వ రేఖలు పద్మ గంధం వాసన గల నిట్టూర్పులు ఉండి ,సందులేని చేతులు,మంచి గోళ్ళున్న వాడు మహా లక్షణాలు కల చంద్రుని లా విధిని జయిస్తాడు .అని నారదుడు వివ రించి తలి దండ్రులకు చెప్పి ,పన్నెండో ఏడు ‘’విద్యుదగ్ని ‘’వల్ల బాలుడైన వైశ్వానరునికి అంటే గృహ పతికి గండం ఉంటుందని హెచ్చ రించి వెళ్లి పోయాడు .

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List