.
జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం కష్టసుఖాల సంగమం. ఆపదల్లో ఉన్నప్పుడు కూడ ఈశ్వర చింతన కలిగి ఉండనివారున్నారీ లోకంలో. అట్టివారు అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు. అలాంటి వారిని నాస్తికులనడమే సమంజసం. వీరు ఎంత కష్టమొచ్చినా ఒక్క క్షణమైనా భగవన్నామోచ్ఛరణ చేయరు. ‘‘జాతస్య మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అంచేత మొండికట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.
.
ఆత్మను గురించి ఏం ఆలోచించగలం? ఏం చెప్పగలం? ఆలోచన మనస్సు పరిధిలోది. 'ఆత్మ' మనస్సు దాటిన తర్వాత కలిగే అనుభూతి. ఆత్మ ఉండీ లేనట్లు, లేకపోయినా ఉన్నట్లు అనిపిస్తుంది. అనుభూతికి మాత్రం అందుతుంది. ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అనేవి మూడూ ఒక్కటే. రూపగుణాలు ఒక్కటే. అవధులు మాత్రం వేర్వేరు. ఒక్కటే అయిన ఆత్మ అవసరానికి 'అంతరాత్మ' అనిపిస్తుంది. పైకి వెళ్లాక 'పరమాత్మ'గా వ్యవహరిస్తుంది. ఆ రహస్యం తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. అసలు ఆత్మను తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మను గురించి మరింతగా తెలుసుకోవడం ఆత్మజ్ఞానం. ఇక్కడ తెలుసుకునేది మనస్సుతో కాదు. అత్మతో - అది ప్రజ్ఞా విశేషం.
.
అయితే 'ఆత్మ' వివేకం ముందు కలగాలి. వివేకానికి జిజ్ఞాస జతపడాలి. అప్పుడు ప్రజ్ఞ బయటకొచ్చి ఆత్మజ్ఞానానికి తుదిమెరుగులు దిద్దుతుంది. 'ఆత్మ'ను గురించిన కనీస అవగాహన ఏర్పడితే అటువైపు దృష్టి సారించవచ్చు. మామూలు దృష్టికి ఆత్మ కనిపించదు, అందుకు అంతర్దృష్టి ఏర్పడాలి. మనస్సును నిద్రపుచ్చి లేదా శూన్యంచేసి ఆలోచనలు తలఎత్తకుండా చేసినప్పుడు ఆత్మ అనుభూతికి అందుతుంది. నిజానికి ఆత్మసహకారం లేనిది 'ఆత్మజ్ఞానం' కలగదు.
No comments:
Post a Comment