శివాయ గురవే నమః కృష్ణం వందే జగద్గురుం అస్మద్గురుభ్యో:నమః ~ దైవదర్శనం

శివాయ గురవే నమః కృష్ణం వందే జగద్గురుం అస్మద్గురుభ్యో:నమః

శివాయ గురవే నమః
కృష్ణం వందే జగద్గురుం
అస్మద్గురుభ్యో:నమః
.
.
జ్ఞానదీప౦ వెలిగి౦చేది గురుదేవులు శిష్యునిలో ఉన్న అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించగలవాడు గురువు మాత్రమే. సకల చరాచర సృష్టికి మూలకారణమైన పరమేశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, అన్ని విద్యలకు మూలమైనవాడు. అందుకే ఆయనను ‘శివాయ గురవే నమః’ అంటూ నమస్కరిస్తాము. శివుని మరో రూపమైన దక్షిణామూర్తి సర్వలోకాలకు గురువు. భవరోగాలకు వైద్యుడు. దక్షిణామూర్తి రూపాన్ని ధ్యానించిన వారికి విద్యలన్నీ కరతలామలకం అవుతాయి.
.
అర్జునుడికి బోధిస్తున్నట్లుగా ఈ లోకానికి, భగవద్గీతను అందించిన శ్రీకృష్ణ్భగవానుడు ప్రపంచానికే గరువు. కనుకనే ‘కృష్ణం వందే జగద్గురుం’ అని స్తుతిస్తున్నాము. మహాభారతంలో భాగమైన ఈ భగవద్గీత శ్రీకృష్ణుని ముఖతః వెలువడి విశిష్టగ్రంథమై పూజనీయమైంది.
.
త్రిమూర్తులకు కూడా మూలకారణమైన ఆదిశక్తి, జగన్మాత, గాయత్రిగా సకల విద్యలకు, జ్ఞానానికి ప్రతీకగా కీర్తింపబడుతున్నది. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని ఉపాసించటం ద్వారా ఎందరో వేదవేత్తలు జ్ఞాన సముపార్జన చేయగలుగుతున్నారు. గురు రూపమైన గాయత్రిని పూజించటం, జపించటంవలన జ్ఞానానికి కొదువ ఉండదు.
.
ప్రత్యక్షదైవం, కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు కూడా గురుస్థానంలో పూజింపదగినవాడు. సూర్యోదయం తోటే మన దినచర్య ప్రారంభమవుతుంది. ప్రాతఃకాలంలో సూర్యునికి అర్ఘ్యాన్ని వదిలి, అంజలి ఘటించడం, సూర్య నమస్కారాలు చేయటంవలన ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయి. హనుమంతుడు ఆదిత్యుని గురువుగా భావించి ఆయన వద్ద సకల శాస్త్రాలను అధ్యయనం చేశాడు.
.
కలియుగంలోని మానవులకు జ్ఞానబోధ చేసి అతి సామాన్యునివలె సంచరించి జీవుల ఉన్నతికి కారణభూతుడైన శ్రీదత్తాత్రేయుల వారిని పరమ పూజ్య గురువులుగా అందరూ కీర్తిస్తారు. స్మరించినంతనే కష్టాలను తీర్చి కరుణించే దైవంగా దత్తుని ఆరాధిస్తారు. ఎందరో భక్తులు దత్తచరిత్రను గురుచరిత్రగా పారాయణ చేసి తరిస్తూ ఉంటారు. అందరూ గురువుగా భావించి పూజించే ఆయన తనకు ఇరవై ఒక్కమంది గురువులు ఉన్నారని చెప్పటం విశేషం. తాను ఎవరినుండి ఏ చిన్న అంశాన్ని నేర్చుకున్నా వారిని గురువుగా భావిస్తాను అని పలకటం వారి గొప్ప మనసుకు ఉదాహరణ. ఇది సకల జనులు నేర్చుకోవలసిన ఆదర్శపాఠం.
.
తరువాత శ్రీ షిరిడీ సాయిబాబావారిని చాలామంది గురువుగా భావించి అచంచలమైన భక్తివిశ్వాసాలతో పూజిస్తూ ఉన్నారు. ‘ఓం సమర్థ సద్గురు సాయినాథా’ అని పిలిస్తే పలికే దైవంగా కొలువబడుతున్న శ్రీ సాయినాథులు తన నిరాడంబరమైన జీవితం ద్వారా భక్తులకు ఎన్నో జీవిత సత్యాలను బోధించి గురువుగా పేరుగాంచారు.
.
పరమశివుని అవతారంగా భావింపబడిన ఆదిశంకరాచార్యులు ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటించి మత ఛాందసుల మూఢ నమ్మకాలను తొలగించిన పూజ్యగురువులు. సకల దేవతా స్తోత్ర రత్నాలను మనకు అందించిన మహనీయులు.
.
నవమాసాలు మోసి జన్మనిచ్చినది మొదలు మన ఆలనా, పాలనా అతి జాగ్రత్తగా చూస్తూ ఉగ్గుపాలతోనే మొదలుపెట్టి అడుగడుగునా అనేక విషయాలను నేర్పించే కన్నతల్లి ప్రతి ఒక్కరికీ తొలి గురువు. చిటికెన వేలు పట్టి నడిపిస్తూ గుండెలపై మోస్తూ ఎన్నో మంచి బుద్ధులను, సద్దులను నేర్పించే కన్నతండ్రి కూడా గురువే.
.
ఆచార్యదేవోభవ. గురువు దైవంతో సమానం. విద్యార్థులు గురువులపట్ల వినయ విధేయతలు కలిగి ఉండటం అవసరం. వారి ఆశీస్సులు పొందటంవలన, వారి అడుగుజాడలలో నడవటంవలన ఉన్నతులుగా కీర్తింపబడతారు.
.
వేదములను విభజించటమే గాక మహాభారత, భాగవతాలను మరెన్నో పురాణాలను, ఉపనిషత్తులను, అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను రచించి లోకానికి అందజేసిన మహానుభావుడు వేదవ్యాసుడు. మహాభారత గ్రంథాన్ని వ్యాసమహర్షి చెబుతూ ఉండగా విఘ్నేశ్వరుడు వ్రాయటం విశేషం. పంచమ వేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతంలో వ్యాసుడు తెలియజేసిన ఎన్నో అంశాలు ఎప్పటికీ అందరికీ అనుసరణీయంగాను ఆచరణీయంగాను ఉంటాయి.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List