రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి. ~ దైవదర్శనం

రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి.

రాజరాజేశ్వరీ దేవి..సిద్ధిదాత్రి దేవి.
.
.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాథకే,
శరణ్యే త్య్రంబకేదేవి నారాయణి నమోస్తుతే..


అంటూ స్తుతిస్తే అమ్మలగన్న అమ్మ దుర్గాదేవి సర్వసంపదలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ఆ శక్తి స్వరూపిణి, మహేశ్వరి, పరాశక్తి, జగన్మాత లేకుంటే పరమేశ్వరుడైనా ఏమీ చెయ్యలేడని శివునికి యొక్క శక్తి రూపమే ”దుర్గ” అని ఆదిశంకరాచార్యులు అమృతవాక్కులో పేర్కొన్నారు.ఈ దుర్గాదేవి రాత్రి రూపం గలదని, పరమేశ్వరుడు పగలు రూపం గలవాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శివునికి అర్ధాంగిగా పూజలందుకుంటున్న మహేశ్వరిని నవరాత్రుల సందర్భంగా రాత్రి సమయాల్లో అర్చిస్తే.. సర్వపాపాలు తొలగిపోయి, సమస్త కోరికలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు. ఎర్రటి బట్టలు ధరించి...పూజకు రాజరాజేశ్వరి, దుర్గాదేవి ప్రతిమనో లేదా పటమునో నల్లకలువలు, ఎర్రటి పువ్వులు పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి పొంగలి, పులి¬ర, అరటిపండ్లు, దీపారాధనకు 9వత్తులతో కూడిన నువ్వుల దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆరు గంటలకు పూజను ప్రారంభించి...రాజరాజేశ్వరి అష్టకం, మహిషాసుర సంహారములను పఠించడం శ్రేయస్కరం. అలాకాకుంటే…”శ్రీ మాత్రే నమ్ణ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి.. కర్పూర హారతులు సమర్పించుకోవాలి. ఏ శుభకార్యాన్నైనా తిథి, వారము, వర్జ్యము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా.. విజయదశమినాడు చేపట్టిన పని విజయతథ్యమని పురాణాలు చెబుతున్నాయి. ఈ విజయదశమి నాడు స్త్రీలు ఎంతో సుందరంగా బొమ్మల కొలువు తీర్చిదిద్ది ముత్తైదువులను పిలిపించుకుని పేరంటం పెట్టుకుని వారికి వాయినాలతో సత్కరించి వారి ఆశీస్సులను పొందుతారు.
.
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…
.
1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్‍సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.
.
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది. ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన. ఈ దేవీ స్వరూపం కమలంపై ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ, మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.
.
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే. తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ లేదు. ఈ మాత కృపతో ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే సామర్థ్యం లభిస్తుంది.
.
ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి. ఈ మాత దయా ప్రభావంవల్ల అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.
.
నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ దేవి దివ్య లోకంలో విహరిస్తాడు. ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు. అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం ఉండదు.
.
దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ, ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం నిస్సారమని మనకు బోధ పడుతుంది. తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు ప్రాప్తిస్తుంది.

https://www.facebook.com/rb.venkatareddy/posts/10212877288999822
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List