త్రివేణి సంగమం వేణి అంటే నది. కృష్ణవేణి అంటే కృష్ణానది. ఇక్కడ త్రివేణి సంగమం అంటే మూడు నదుల సంగమం అన్నమాట. ప్రకాశం జిల్లాలోని సురభేశ్వర కొనలో మూడు నదులు కలుస్తాయి.
గుండ్లకమ్మ నది, ఎర్రవాగు, లోతువాగు అనే మూడు నదులు సురభేశ్వర కోన వద్ద కలుస్తాయి.
కనుక ఈ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు.
నల్లమల కొండల మధ్య నుండి ప్రవహిస్తూ వచ్చిన గుండ్లకమ్మ నది ఇక్కడికొచ్చేసరికి ఎర్రవాగు, లోతువాగులతో కలుస్తుంది. నదిని పవిత్రంగా భావించే ప్రజలు రెండు లేదా మూడు నదులు కలిసే సంగమ ప్రాంతాన్ని మరింత పవిత్రమైందిగా తలుస్తారు. ఇంట్లో స్నానం చేయడం కంటే నదీ స్నానాన్ని పుణ్యకార్యంగా వర్ణించాయి ధార్మిక గ్రంధాలు. అందుకే కొందరు ఇప్పటికీ నదీ స్నానాన్ని ఇష్టపడతారు. ఇతర రోజుల్లో వీలు కాకున్నా కనీసం పర్వదినాల్లో నదీస్నానం చేస్తారు. మామూలు నది కంటే కూడా నదీ సంగమ పుణ్యస్థలంలో స్నానం చేయడం మరీ శ్రేయస్కరం. ఈ పరిసర ప్రాంతాలవాళ్ళే కాకుండా ఇతర జిల్లాల వారు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి తరిస్తుంటారు. సాధారణ రోజుల కంటే శివరాత్రి పర్వదినం సందర్భంలో త్రివేణి సంగమాన్ని ఎక్కువమంది దర్శించుకొని ఈ సంగమ స్థలంలో స్నాన మాచరించి పూజలు జరుపుతూ వుంటారు.
పవిత్ర క్షేత్రం కనక సురభేశ్వరాలయం..
అనేక పురాణ ఇతిహాసాలకు, చారిత్రక సంఘటనలకు నిలయం కంభం ప్రాంతం. కంభం మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెలసిన శ్రీ కనక సురభేశ్వర కోన అలనాటి జమదగ్ని మహర్షి క్షేత్రంగా భావించి ప్రజలు యేటా మహాశివరాత్రి పండుగనాడు ఇక్కడి ఆలయాల్లో పూజలు జరుపుతుంటారు.
ఈ క్షేత్రానికి సంబంధించి పలు గాథలు ప్రచారంలో వున్నాయి. ఈ క్షేత్రం త్రేతాయుగం ఉత్తరార్ధంలో నిర్మితమైనట్లు తెలుస్తోంది. ఆ క్షేత్రంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం వుందన్న విశ్వాసంతో దీనిని 'జమదగ్ని' క్షేత్రంగా పిలుస్తుంటారు.
నందీశ్వరుని కథ..
ఈ పుణ్యక్షేత్రంలో గల పాపేశ్వరుని ఆలయానికి తూర్పు ద్వారం ముందున్న నంది విగ్రహానికి సంబంధించిన కథ ఒకటి ఈ ప్రాంతంలో ప్రచారంలో వుంది. యజమాని ఆగ్రహంతో ఎద్దును కొట్టడంతో దాని కాలు విరిగిపోయింది. అంతట ఆ వృషభం విరిగిన కాలితో కుంటుకుంటూ సురభేశ్వర కోనకు రాగా, అక్కడ అడ్డంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది ఆవలి తీరం నుండి ఇవతలి తీరానికి దుమికి, పాపేశ్వరుని ఆలయానికి వచ్చి పాపేశ్వరుని ఆలయానికి తూర్పు డాము ముందుకు వచ్చి కూర్చుని అక్కడే శిలగా మారిపోయిందని కొందరు ప్రజలు చెబుతుండగా, మరికొందరు ఎద్దు ఇవతలి తీరానికి వచ్చి పాపేశ్వరుని గుడిముందు కూర్చుని పాపవిముక్తి కొరకు ఆ ఎద్దు జ్ఞాపకార్థం దాని పోలికలతో కూడిన ప్రతిరూపాన్ని శిలారూపంలో చెక్కించి అక్కడ ప్రతిష్ఠ చేయించారని చెప్పుకుంటుంటారు.
శ్రీ సురభేశ్వర కోనలో అనేక చారిత్రక ఆధారాలు వున్నాయి. ఇక్కడ రాష్ట్ర కూటులు, చోళులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజుల కాలంనాటి అనేక శిలాశాసనాలు వున్నాయి. ఈ శాసనాలతోపాటు ఉన్న శిల్ప సంపద వారి సాంప్రదాయాలకు అద్దంపడతాయి. నాడు రాజులు యుద్ధానికి వెళ్ళినట్లు, ఈ కోనలో వారు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు పురాతత శాస్త్రవేత్తలు తమ సర్వేలో పేర్కొన్నారు. ఇటీవల కొందరు పాశ్చాత్యులు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి, ఫోటోలు తీసుకొని వెళ్ళారు.
ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీ కనకసురభేశ్వర కోనయందలి కొన్ని దేవాలయములు శిథిలములుకాగా, కొన్ని గుండ్లకమ్మ నడి వరదల వల్ల కొట్టుకొనిపోయాయి. ఆలయాల్లోని కొన్ని విగ్రహాలను దొంగలు పెకలించి, ప్రతిష్ఠ సమయంలో లోపల వేసిన బంగారు వెండి తదితర విలువైన సొమ్మును దోచుకొనిపోయారు. తరువాత భక్తులే స్వయంగా విగ్రహాల్ని ప్రతిష్టించుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ క్షేత్రం పూర్వ వైభవంతో భాసిల్లుతోంది.
కోటి లింగాల గట్టు..
శ్రీ కనక సురభేశ్వర కోనలోని పాపనాశనము మందిరానికి సమీపంలో అగుపించే లింగాల సముదాయాన్ని 'కోటిలింగాల గట్టు' అని పిలుస్తారు. పూర్వం విజయనగర రాజు అయిన హరహరరాయలు ఒక సందర్భంలో గోహత్యాపాతకం చేశాడట. ఆ పాప పరిహారార్థం ఆయన కోనకు వచ్చి ఇక్కడ పాపనాశనము అనే మందిరాన్ని నిర్మించి, అందులో శివలింగాన్ని ప్రతిష్టింప జేసి, భక్తి శ్రద్ధలతో లింగానికి అభిషేకం చేసి పాపవిముక్తుడయ్యాడని ప్రతీతి. ఈ ఆలయానికి సమీపంలో వుండే కోటి లింగాలను కూడా వారే ప్రతిష్టించారని ప్రజలు చెపుతారు అందుకే ఆ ప్రదేశంలో నేటికీ ఎక్కడ చూసినా శివలింగాలు అగుపిస్తాయి. పాపనాశనమునకు దక్షిణము వైపున గల ద్వారానికి సుంకద్వారము అని పేరు.
No comments:
Post a Comment