భారతీయుల ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతోన్న పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు, చాలా చోట్ల చోళ రాజుల పేరు వినిపిస్తూ వుంటుంది. అంతగా చోళులు ఆధ్యాత్మికత విషయంలో శ్రద్ధ కనబరిచారు. వైష్ణవ సంబంధమైన ... శైవ సంబంధమైన ఎన్నో ఆలయాలను నిర్మించారు. మరెన్నో ఆలయాలను పునరుద్ధరించారు. తమ తరువాత ఎలాంటి పాలకులు వచ్చినా ఆలయాల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయాల నిర్వహణకు పెద్దమొత్తంలో మాన్యాలను రాసివ్వడంలో తమ విశాల హృదయాలను ఆవిష్కరించారు. ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు శాసనాలు ఈ విషయాలను స్పష్టం చేస్తుంటాయి.
అలా వారి ఏలుబడిలో నిర్మించబడిన అరుదైన ఆలయం ప్రకాశం జిల్లా 'ఉప్పుటూరు'లో దర్శనమిస్తుంది.
సాధారణంగా చోళ రాజుల క్షేత్రాలు ... శివ కేశవ క్షేత్రాలుగా దర్శనమిస్తుంటాయి.
దాదాపు 1600 సంవత్సరాలకు పూర్వమే చోళరాజులచే నిర్మింపబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ధార్మిక చరిత్రలో 'లవణపురి'కి కీర్తి తెచ్చి పెట్టింది. ప్రస్తుతం ఉప్పుటూరుగా పిలువబడే ఒకప్పటి లవణపురి లోని రాజగోపురం సుందరమైంది. ఒకే ప్రాంగణంలో వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిష్టలు జరగడం చాలా అరుదు. ఈ అరుదైన సంఘట ఉప్పుటూరులో జరిగింది.
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ రాజగోపురం వందేళ్ళ క్రితం బెండపూ వీరభద్రయ్య, రామభద్రయ్య సోదరులచే నిర్మింపబడింది. శాలివాహన శకం 1210న బెండపూ వంశీయులైన శివప్ప, నారాయణప్పలు ఉత్సవ మూర్తులను సమర్పించినట్లు శిలాశాసనం వల్ల తెలుస్తోంది. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి 1975 మార్చి నెలలో ఉప్పుటూర ఆలయాన్ని సందర్శించి శిల్పకళా వైభవాన్ని అభినందించారు. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ,శివుడు కొలువై కనిపిస్తుంటారు. అయితే వేంకటేశ్వరస్వామితో పాటు ఇక్కడ చెన్నకేశవ స్వామిని కూడా ప్రతిష్ఠించడం విశేషంగా చెబుతుంటారు.
సువిశాలమైన ప్రదేశంలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించబడిన ఈ ఆలయం ఆనాటి వైభవానికి అద్దం పడుతూ వుంటుంది. చోళుల తరువాత వచ్చిన ఎంతో మంది రాజులు ఇక్కడి ఆలయాలను దర్శించినట్టుగా ఆధారాలు వున్నాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో అటు వైష్ణవ పర్వదినాల్లోను ఇటు శైవ పుణ్య తిథుల్లోను ప్రత్యేక పూజలు ,విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి.
ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. తమ కష్టనష్టాలను హరిహరులకు చెప్పుకుని వారి అనుగ్రహాన్ని ఆశిస్తుంటారు. కానుకలు - మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇక్కడి దైవాలను దర్శించడం వలన విజయాలు ... సంపదలు ... మోక్షం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.
No comments:
Post a Comment