మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి. ఆయనకు దక్షప్రజాపతి కుమార్తెలు పదమూడు మంది ఆయనకు భార్యలు. కశ్యప ప్రజాపతి భార్యలలో దితి - అదితికి ఉన్నంత ప్రాశస్త్యం మిగిలిన భార్యలకు కనపడదు. దితి భావనలు శ్రీమన్నారాయణుని దుష్టశిక్షణకు అనేకమయిన అవతారములు తీసుకునేటట్లుగా చేసాయి. దితియందు మార్పురాలేదు. క్షేత్రమునందే తేడా ఉన్నది. కశ్యపప్రజాపతిని ‘నాకు ఇంద్రుడిని చంపే పిల్లవాడు కావాలని అడిగితే అపుడు ప్రజాపతి నవ్వి ‘నీ కోరిక తీర్చగలిగిన వాడిని నేను కాదు ఈశ్వరుని సేవించు. నీవొక గొప్ప తపస్సు చెయ్యి తపస్సు చేస్తున్నప్పుడు ధర్మంలో లోపం రాకూడదు. నీకు బిడ్డ పుట్టేవరకూ అలా ఉండగలిగితే నీకు ఇంద్రుడిని సంహరించగలిగిన కుమారుడు పుడతాడు’ అని చెప్పాడు. ఆవిడ లోపలి కశ్యప ప్రజాపతి తేజము ప్రవేశించింది. ఆవిడ గర్భిణి అయింది. లోపల గర్భం పెరుగుతోంది. ఇది ఇంద్రుడికి తెలిసి ఆవిడ దగ్గరకు వచ్చి ‘అమ్మా ! నీకు సేవచేస్తాను’ అన్నాడు. ఆవిడ ధర్మం పాటించి ఇంద్రుడిని సేవ చేయడానికి అంగీకరించింది.
ఒకనాడు ఆవిడ మిట్టమధ్యాహ్నం వేళ తల విరబోసుకుని కూర్చుని ఉండగా కునుకు వచ్చి మోకాళ్ళ మీదకి తల వాలిపోయింది. జుట్టు వచ్చి పాదములకు తగిలింది. స్త్రీకి అలా తగలకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం జుట్టు చివర ముడివేసి లేకుండా స్త్రీ తిరుగరాదు. జుట్టు అలా పాదముల మీద పడగానే ఇంద్రుడు ఆమె గర్భంలోకి ప్రవేశించి తన వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగానరికేశాడు ‘మారుదః మారుదః – ఏడవకండి’ అంటూ ముక్కలుగా నరికేశాడు. అపుడు దితి ఏడ్చి కనీసం వాళ్ళకి నీదగ్గర పదవులియ్యి అని ఇంద్రుని అడిగింది. మారుదః మారుదః అని కడుపులో ఇంద్రుని చేత చెప్పబడ్డారు కనుక వాళ్ళు ‘మరుత్తులు’ అనే పదవులు పొంది స్వర్గలోకంలో వారి పదవులను అధిష్ఠించారు. దితికి మరల భంగపాటు అయింది.
ఇలా కొన్నాళ్ళు అయిపోయింది. మరల ఆవిడ తన భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి ఒక చిత్రమయిన కోరిక కోరింది. ‘నాకు దేవతలనందరిని గెలవగల కుమారుడు కావాలి’ అని అడిగింది. అపుడు ఆయన ‘పదివేల సంవత్సరములు నియమముతో చతుర్ముఖ బ్రహ్మగురించి తపస్సు చెయ్యాలి. నీకు కోరుకున్న కొడుకు పుడతాడు’ అని చెప్పాడు. తపస్సు బ్రహ్మాండంగా ప్రారంభం చేసింది. కొన్నివేల సంవత్సరములు తపస్సు చేసిన తరువాత బ్రహ్మ అనుగ్రహమును పొందింది. గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ‘వజ్రాంగుడు’ అని పేరు పెట్టారు. వజ్రాంగుడు అనగా వజ్రముల వంటి అంగములు కలిగిన వాడు. వాడికి దేహమునందు బలం ఉన్నది. బుద్ధియందు సంస్కారం ఏర్పడలేదు. ఇతడు బయలుదేరి దేవలోకమునకు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుని జయించి అతడిని పదవీచ్యుతుని చేశాడు. అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. ఇంద్రుడు, వరుణుడు, దిక్పాలకులు మొదలైన దేవతలనందరినీ బంధించి తన కారాగారంలో పారేశాడు. బ్రహ్మ కశ్యప ప్రజాపతిని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చాడు. వారు వస్తే వజ్రాంగుడు లేచి స్తోత్రం చేసి నమస్కారం చేశాడు. సముచితాసనమున కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చాడు. బ్రహ్మ ‘నాయనా! నీవు చేసిన అతిథిమర్యాదకు చాలా సంతోషించాము. దిక్పాలకులకు పదవులను నేను ఇచ్చాను. నీవు వాళ్ళను పట్టుకువచ్చి కారాగారంలో పడేశావు. నువ్వు విజేతవే. అందులో సందేహమేమీ లేదు. కానీ వాళ్ళ పదవులు వాళ్ళను చేసుకొనీ’ అని చెప్పాడు. వాళ్ళమాట మీద వజ్రాంగుడు ఇంద్రుడిని, తాను బంధించిన ఇతర దేవతలను విడిచిపెట్టాడు. వజ్రాంగుడు బ్రహ్మతో ‘మహానుభావా! అనుకోకుండా ఈవేళ నాకోసం ఇలా వచ్చావు. నేను నిన్ను ఒక్కటి ప్రార్థన చేస్తున్నాను. అసలు మనశ్శాంతికి ఏది కారణమో, ఏది నిజమయిన తత్త్వమో, ఏది తెలుసుకోవాలో అది నాకు ఒకసారి దయచేసి బోధ చేయవలసింది. ఉపదేశం చేయవలసింది’ అని అడిగాడు. ఇటువంటి కోరిక కోరేసరికి ఆయన పొంగిపోయి ‘నాయనా! నీవు ఎల్లప్పుడూ సత్త్వ గుణమును పట్టుకుని ఉండు. ఈశ్వరుని నమ్మి ఉండు. నీకు ఏ ఇబ్బంది ఉండదు. నీకు ‘వరాంగి’ అనే ఆమెను భార్యగా నేను సృష్టించి ఇస్తున్నాను. తీసుకో’ అని బ్రహ్మ దగ్గరుండి పౌరోహిత్యం చేసి వజ్రాంగుడికి, వరాంగికి పెళ్ళిచేశారు.
వజ్రాంగుడు తన భార్యతో కలిసి నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు. ఒకరోజున వజ్రాంగుడు భార్యను పిలిచి ‘నీకు ఏమి కావాలనుకుంటున్నావు? ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు’ అని అడిగితే వరాంగి ‘ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాకశాసనుని కన్నుల వెంట నీళ్ళు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు’ అన్నది. వరాంగి వల్ల వజ్రాంగుడు మనశ్శాంతిని కోల్పోయాడు. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. వజ్రాంగుడు నమస్కారం చేసి ‘స్వామీ! వరాంగి కోరిన కొడుకును ఆమెకు ఇప్పించండి’ అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగానే చాలా పెద్ద అల్లరి ప్రారంభం అయింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకు వచ్చి ఆ పిల్లవానికి ‘తారకుడు’ అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవానిని తారకాసురుడు అని పిలిచింది.
తారకుడు పెరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి, వరాంగి మిక్కిలి సంతోషపడి పోతున్నారు. వీళ్ళ కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలుమీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా నూరేళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్రతపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తోంది. దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వీని తపస్సు లోకముల నన్నింటిని కాల్చేస్తోంది. మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభో అన్నారు.
తారకుడి ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమయి నాయనా! ఏమిటి నీ కోరిక? అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు ఒక నమస్కారం పెట్టి ‘దేవతలనందరినీ, మూడు లోకములను గెలవగల శక్తిని నాకు ఈయవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మథుని దహిస్తాడు. ఆయన కామారి. ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కామం కలిగి వీర్య స్ఖలనం అవ్వాలి. అలా అయితే ఆ వీర్యంలోంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను. ఆ మేరకు వరం ఇవ్వవలసింది’ అని అడిగాడు. బ్రహ్మ సాంబసదాశివుని తలుచుకుని తథాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు.
తారకుడిని మూడు లోకములకు రాజ్యాభిషేకం చేసారు. దేవతలందరినీ పిలిచి ఎవరెవరు ఏయే పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలనం చేస్తున్నాడు. వాళ్ళందరూ శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళి నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్ఛి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రమును ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీమహావిష్ణువు అక్కడినుండి తప్పుకున్నాడు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళారు. ‘ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యులం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి’ అని వేడుకున్నారు.
లోకం అంతా నిలబడాలంటే శివుడికి కొడుకు కలగాలి. కుమారసంభవం జరగాలంటే పరమశివుని తేజస్సును స్వీకరించడానికి జగదంబయే ఉండాలి. కామమే లేని పరమేశ్వరుని యందు మన్మథుడు కామప్రచోదనం చేయగలడని తలచి ఇంద్రుడు మన్మథుని పిలిచి శివుని వద్దకు పంపాడు. మన్మథుడు వెళ్ళి బాణ ప్రయోగం చేసే ప్రయత్నంలో ఉండగా శంకరుడు మూడవకన్ను తెరచాడు. ఆ కంటి మంటకు మన్మథుడు భస్మం అయిపోయాడు. ఇంద్రునితో సహా దేవతలందరూ వెళ్ళిపోయారు. రతీదేవి ఒక్కర్తే భర్త పోయాడని ఏడ్చింది. ఏ మన్మథుడు చేతిలో చెరకువిల్లు, పుష్ప బాణములు పట్టుకుంటే శంకరుని కదలించ లేకపోయాడో దాన్ని అమ్మవారు స్వీకరించింది. అలా స్వీకరించినపుడు ఆవిడ శివకామ సుందరి. అమ్మవారు వెళ్లి గొప్ప తపస్సు చేసింది. శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చి తన పెళ్ళి తానే చెడగొట్టుకునే మాటలు చెప్పాడు. అమ్మవారు ధూర్త బ్రహ్మచారీ ! శివ వ్యతిరేకమైన మాటలు విన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీ ప్రాంతమును వదులుతావా వదలవా? అని అదిలించింది. శంకరుడు నిజరూపం చూపించాడు. అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. పార్వతీ కళ్యాణం అయింది. పార్వతీ పరమేశ్వరులిరువురూ తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు.
పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వలన ప్రధాన ప్రయోజనం కుమారసంభవం జరగాలి. అందుకు ప్రకృతియందు ఉన్నది ఒక్కటే ఆధారం. మహా తపస్వి అయిన శంకరుని అమ్మవారు ఆకర్షించింది. వారి దివ్యమైన క్రీడ జరుగుతోంది. దానినే శాస్త్రమునందు మైథునము అని పిలిచారు. శివపార్వతుల దివ్యమైన క్రీడ శత దివ్య వత్సరములు జరిగింది. ఆయన అమ్మవారు ఆడితే ఆడతాడు, పాడితే పాడతాడు. కానీ ఆయన తేజస్సు స్ఖలనం కాదు. అనగా ఆయన కామ మోహితుడు కాలేదు. శతదివ్య వత్సరములు అయిపోయాయి. తారకాసురుడు దేవతలను చితక్కొడుతూనే ఉన్నాడు. శివుని తేజస్సులోంచే కుమారుడు పుట్టి తారకాసురుడిని సంహరించగల మహా వీరుడైన ఒక కుమారుడు కావాలి. కానీ ఆ తేజస్సు పార్వతీ దేవియందు ప్రవేశించకుండా ఉండాలి. శివుడితో ‘నీకు మాత్రమే కుమారుడిగా ఉంటాను’ అని సనత్కుమారుడు అనడం వల్ల పార్వతీదేవి సంబంధం ఉంటుంది కానీ, ఆ తేజస్సు అమ్మవారిలో ప్రవేశించి అమ్మవారి యందు గర్భంగా పెరగడానికి అవకాశం ఉండదు. పరమశివుడు ఇన్నింటిని ఏకకాలమునందు నిలబెట్టగలిగిన వాడు. దీనికోసం లోకం తన మీద నిందలు వేసినా మచ్చపడడానికి సిద్ధంగా ఉన్నవాడు. నూరు దివ్య వర్షములు గడిచిపోయినా ఆయనకు కుమారుడు కలగడానికి వీలుగా ఆయన తేజస్సు స్ఖలనం కాలేదు.
ఈ ముడి విడిపోవడం ఎక్కడో ప్రారంభం కావాలి కదా! అందుకని మొట్టమొదట శివమాయ దేవతలమీద ప్రసరించింది. కుమారసంభవం జరిగితే మొదట ప్రయోజనం పొందేవారు దేవతలు. వాళ్ళు శివ మాయా మోహితులు అయి అక్కర్లేని విషయమును చర్చ మొదలుపెట్టారు. బ్రహ్మ కూడా మాయా మోహితుడై పోయాడు. వాళ్ళు ఇప్పుడు అయ్యవారి తేజస్సు జగదంబతో కలిస్తే ఆవిర్భవించబోయే ప్రాణి మహాగొప్ప తేజోమూర్తి అయితే అటువంటి మూర్తి ఈ భూమిమీద నడిస్తే ప్రజలు తట్టుకోగలరా? శివతేజస్సు కదలరాదు అనుకున్నారు.
No comments:
Post a Comment