నేడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి (కుక్కీ సుబ్రహ్మణ్య షష్ఠీ) ~ దైవదర్శనం

నేడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి (కుక్కీ సుబ్రహ్మణ్య షష్ఠీ)


శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామియే కుమారస్వామి, కార్తీకేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహూడు అనే మొదలగు పేర్లుతో పిలవబడుతున్నాడు.


తారకాసుర సంహారం కోసం దేవతల కోరిక మేరకు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు. 


ఈ మార్గశిర షష్టినే సుబ్రహ్మణ్య షష్టి లేదా స్కంద షష్టిగా పిలుస్తారు. చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, అని కూడా అంటారు. 


*దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించిన రోజును "శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి" గాను వ్యవహరిస్తారు. ఆ రోజు శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు, కావడి ఉత్సవం అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు.*


పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు. దీంతో తాను అజేయుడునని, అమరుడునని వర గర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటారు. వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు. అంతట దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.


*_పురాణగాథల ప్రకారం.._*


కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టిన వాడు కాదు. కధా క్రమంలో పుత్రుడిగా పార్వతి పరమేశ్వరులు స్వీకరించారు. ఈ విషయం మహాభారతం అరణ్య పర్వంలో కనబడుతుంది.


పూర్వం మూడులోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న"తారకా సురుడు" అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు విష్ణువును శరణువేడారు.


అప్పుడు ఆ విష్ణువు వారితో ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, బలశాలి, ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణము ఉంటుంది కావున మీరు శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్ధుడు అవుతాడు అని తరుణోపాయం చెప్పాడు.


దేవతలు శివున్ని ఒప్పించి పార్వతితో పెళ్ళి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానందగా ఉన్నసమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమ శివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు.దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడచి పెడతాడు. ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్‌కృత్తికల దేవతల గర్భాన తేజము ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు అంతట ఆరుముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు.


ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, షట్‌కృత్తికలు వానిని పెంచి పెద్దచేసిన కారణం వల్ల మరియు ఆరుముఖాలు కలవాడు అగుటవల్ల షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీశంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు


కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు "శూలం" మొదలైన ఆయుధాలను ఇవ్వగా, ఆ జగన్మాత పార్వతి కుమారుని దీవించి "శక్తి" అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు.


అంతట ఆ స్వామి నెమలి వాహనారూఢుడై ఆరుముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి "సర్పరూపం" దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి ఆరు రోజుల పాటు 

భీకర యుద్ధములో తారకాసురుని సంహరించి విజయుడైనాడు.


సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి తలంటు స్నానమాచరించి పాలు, పంచాదారలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయి. ముఖ్యంగా ఈ ఆచారం తమిళనాడులో విశేషంగా ఆచరణలో ఉన్నది.


స్కంద షష్టి నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం నిర్వహిస్తారు. అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి. అంతేకాదు సత్సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. విశిష్టమైన ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫించినా సత్సంతాన ప్రాప్తి. రాబోయే తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని నమ్మకం.


అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు. ఈ రోజు పుట్టలో పాలు పోస్తే సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.


సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం లో సామాజిక ప్రయోజనం కూడా కనబడుతుంది. ఈ వ్రత విధి విదానంలో దానాలే ప్రధానం అని తెలుస్తుంది.


మార్గశిర మాసమంటే చలి ఎక్కువగా ఉండే మాసం చలి బాధను తట్టుకోలేని,ఆర్ధిక స్తోమతలేని వారు ఇబ్బందులు పడకుండా ఉండాలని మన శక్తి కోలది సాటి వారికి సహయ పడమని, దానం చేయమని సందేశం ఇస్తుంది.


ఈ దానాలు చేసిన వారికి గ్రహ భాదలు తోలగి సుఖ సంతోషాలతో జీవితం సాగుతుందని భావం. పురాణాలు తెలిపినట్టుగా "పరోప కారం మిధం శరీరం" అని భావించి పేదవారికి స్వేటర్లు, కంబళ్ళు, దుప్పట్లు మొదలగు చలి నుండి రక్షించే దుస్తులను, తిను బండారాలను దానం చేయాలని తెలుపుతున్నాయి.


ॐ _ఓం శ్రీ శరవణభవ..🙏

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List