సముద్రం మధ్యలో ఆలయం ఉంటుంది.స్వామి దర్శనానికి ప్రతీరోజు మధ్యాహ్నం నుండి భక్తులకు దారి ఇచ్చినట్టుగా వెనుకకు వెళ్లే సముద్రుడు. ఉదయం కొలియాక్ తీరం నుండి చూస్తే ఆలయం సముద్రంలో మునిగి ఉండి ఉంటుంది. కేవలం ధ్వజస్తంభం పై ఉన్న జండా మాత్రమే నీటిపైన కనపడుతుంది. శివయ్య ను దర్శించాలనే భక్తులు ఉదయం నుండి సముద్రుడు దారి ఇచ్చే అపూర్వదృశ్యం చూడటం కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
మధ్యాహ్నం11 గంటల నుండి సముద్రుడు దారి వదులుతూ వెనుకకు వెళ్లడం ప్రారంభించడం మొదలుపెట్టి ఒంటిగంట సమయానికి పూర్తిగా ఆలయం సముద్రనీటి నుండి బయల్పడి దర్శనానికి అనుకూలంగా మారుతుంది. తీరం నుండి ఏర్పాటు చేసిన తాళ్ళు సహాయంతో భక్తులు శివనామస్మరణతో వాటిని పుచ్చుకుని ఆలయానికి చేరుకుంటారు.
ముందుగా అక్కడ ఉన్న పాండవ కొలనులో పాదప్రక్షాళన చేసుకుని స్వామి దర్శనానికి వెళతారు. ఈ ప్రాంతంలో ఐదు శివలింగాలు తో పాటు ప్రతీ లింగాకృతి ముందు ఒక్కో నందీశ్వరుడు తో కూడి ఉంటారు.
భక్తులే స్వయంగా పళ్ళు,పూలు తో పూజించి పాలు,జలం తో అభిషేకించు కుంటారు. భీకర అలల మధ్య తీరం నుండి సముద్రం లోనికి ఉండే ఈ ఆలయం లో రాత్రి 7 గంటల లోపు దర్శనం ముగించుకుని భక్తులు వెనుకకు రావాల్సి ఉంటుంది.
రాత్రి ఏడు గంటలనుండి అర్ధరాత్రి లోపు ఆలయం తిరిగి పూర్తిగా సముద్రంలో కలిసిపోయి జండా మాత్రమే కనిపించే స్థితికి చేరుతుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ జండా ను మారుస్తారు. పౌర్ణమి,అమావాస్య తిధుల్లో మహాశివరాత్రి పర్వదినాల్లో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామిని దర్శిస్తారు.
కురుక్షేత్రయుద్ధ అనంతరం బంధువులు,సన్నిహితులు,సోదరులను యుద్ధనీతిలో భాగంగా సంహరించినా ఏదో తెలియని మానసిక అశాంతికి లోనైన పాండవులు తమ మార్గదర్శి అయిన శ్రీకృష్ణ పరమాత్మునితో యుద్ధం వల్ల జరిగిన మారణకాండ వల్ల సంక్రమించిన పాప ప్రక్షాళనకు మార్గం చూపమని వినమ్రంగా కోరినపుడు
శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి నల్లనిగోవు ఆ గోమాతపై నల్లని జండా తో ఇచ్చి గోవుని వదిలి ఆ గోవు వెనుక వెడలమని ఏ ప్రాంతంలో అయితే ఆ గోవు,జండా రెండూ శ్వేతవర్ణం(తెల్లని రంగు) కు మారుతాయో ఆ ప్రాంతంలో పరమేశ్వరుని ధ్యానించమని తరుణోపాయం వివరించగా అదే విదంగా చేసిన పాండవులు ఈ కొలియాక్ సముద్రతీరం లోనికి గోవు ప్రవేశించిన తక్షణం తెల్లని రంగులోనికి రెండూ మారడంతో ఇక్కడ పాండవులు విడివిడిగా తపస్సు చేయగా ఎవరికి వారికే పరమేశ్వరుడు విడి విడిగా దర్శనమిచ్చి పాపప్రక్షాళన అనుగ్రహించి ఎక్కడి కక్కడే ఐదు లింగాకృతిలలో స్వయంభూ గా నిలిచారు.అదే ఈ దివ్యక్షేత్రం.
నిష్కలంక అంటే...కళంకం లేని స్థితి..వ్యవహరికం లో పాపము లేని ఉన్నతస్థితి. పాపప్రక్షాళన పాండవులకు జరిగిన ప్రదేశం మాత్రమే కాదు కోరి,కొలిచి,దర్శించిన ప్రతీ ఒక్కరికీ స్వామి ఇచ్చే అనుగ్రహం కాబట్టి నిష్కలంక మహాదేవ్ గా భక్తులు స్వామిని పిలుస్తారు. నిష్కళంక మహదేవ్ భక్తితో పూజించే వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు.
500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఇక్కడే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి. చిన్న సరస్సు అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి. ఉదయం 11 నుండి రాత్రి 7,వరకు మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రపోటు ఎక్కువగా ఉన్నా వెనక్కు వెళ్లే సమయమూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు.
ప్రతి శ్రావణ మాసంలో 17వ శతాబ్దంలో భావ్‌నగర్ మహారాజు భావ్‌సింగ్ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు.
ధ్వజస్తంభం ఆ రోజు భావ్‌నగర్ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు. స్థానికులు తర్వాత సంవత్సరం మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలతో సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు. దివంగతులయిన తమ పెద్దల ఆస్తికలను ఈ ప్రదేశంలోని సముద్రంలో కలపడం కూడా భక్తులు ఏంతో శ్రద్ధాభక్తులు తో ఆచరిస్తారు.
సముద్రపు అలలు,చల్లని గాలి తో కూడిన నీటితుంపరులు పడుతూ ఉండగా చుట్టూ నీరు మధ్యలో శివయ్య ఎదురుగా కూర్చొని స్వామిని స్వయంగా అభిషేకించి, పూజించే అదృష్టం లభించిన భక్తులు తమ స్వామి దర్శనానికి దారి ఇచ్చి ఆదరించిన సముద్రుడికి కూడా ప్రణమిల్లి వెలకట్టలేని తృప్తితో తిరిగి ఒడ్డుకు చేరతారు హర హర మహాదేవ్ అంటూ..
(శ్రీ నిష్కలంక మహాదేవ్ ఆలయం భావ్ నగర్ గుజరాత్)
No comments:
Post a Comment