చెన్నై, చెంగల్పట్ పరిసర ప్రాంతాలను పల్లవుల కాలంలో తొండైనాడుగా వ్యవహరించేవారు. అలాటి తొండైనాడులోని పుణ్యక్షేత్రాలలో ప్రముఖమైనది తిరుక్కలికుండ్రం. నాలుగు యుగాలుగా ఈ క్షేత్రం వున్నట్లు స్థల పురాణం వివరిస్తోంది.
పూర్వకాలంలో ఋక్, యజుర్, సామ, అధర్వణ వేదాలు నాలుగూ తమ నాయకుడు ఎవరో తెలుసుకోవాలని భూలోక సంచారం చేసాయట. ఆ సమయంలో యీ క్షేత్రంలో వెలసియున్న పరమశివుని దర్శించి, అక్కడ తమ సందేహ నివృత్తికాగా అక్కడే కొండరూపాన్ని దాల్చి శివార్చన చేసేవి. అందువలన ఇక్కడ కొలువైన ఈశ్వరునికి వేదగిరీశ్వరుడని పేరు. అధర్వణ కొండ శిఖరాన వేదగిరీశ్వరుడు కొలువై అనుగ్రహిస్తున్నాడు అని స్ధలపురాణ కధ.
ఈ క్షేత్రానికి వేదగిరి, పక్షి తీర్ధం, రుద్రకోటి, కళుగాచలం, ఉలఘళందచోళపురం, కదళీవనం, శంఖుపురం అని పలుపేర్లు వున్నవి. నాలుగు యుగాలుగా ఓ రెండు గ్రద్దలు నిత్యమూ యీ కొండకు వచ్చి ఈశ్వరుని
పూజించడం వలన యీ కొండకి 'తిరుక్కళ్ కున్డ్రమ్' అనే పేరు వచ్చింది.
కృతయుగంలో చండ, ప్రచండులనే గ్రద్దలు, త్రేతాయుగంలో సంపాతి, జటాయువు అనే గ్రద్దలు, ద్వాపర యుగంలో శంభుకుత్తన్, మాకుత్తన్ అనే గ్రద్దలు కలియుగంలో శంభు, ఆది అనే గ్రద్దలు మధ్యహ్న సమయాన కొండ శిఖరాన వున్న ఈశ్వరుని పూజించి తమ శాప విమోచనం పొందినట్లు స్ధలపురాణ కధ వివరిస్తున్నది.
సుమారు 4 కి.మీ.చుట్టు కొలత, 500 అడుగుల ఎత్తుగల ఈ కొండ మీదకు వెళ్ళడానికి ఏటవాలుగా మెట్లున్నవి. మెట్లు ఎక్కగానే రాజగోపురం. ఒక ఆవరణలో ఆలయం వున్నది. గర్భగుడి లో వేదగిరీశ్వరుడు లింగరూపంలో దర్శనం ప్రసాదిస్తున్నాడు. అరటిపువ్వు ఆకారంలో స్వయంభూలింగ మూర్తిగా దర్శనమిస్తున్నాడు.
ఇక్కడి అమ్మవారికి "చొక్కనాయకి" "పెణ్ణిన్ నల్లాళమ్మై" అని పేర్లు. అరుణాచలంలో లాగా ఇక్కడ కూడా కొండ శిఖరం మీద వెలిగించే కార్తీక దీపం మిక్కిలి ప్రసిద్ధిచెందినది. శిఖరం మీది ఆలయం నుండి దిగడానికి మరియొక వైపున కూడా మెట్లు వున్నవి. కొండ క్రింద ఊరు మధ్యలో బ్రహ్మాండమైన ఆలయం వున్నది. ఈ ఆలయ తూర్పు గోపురం ఏడు అంతస్తులుగా నిర్మించబడినది. ఈ ఆలయంలో ఈశ్వరుడు భక్తవత్సలేశ్వరునిగా పిలువబడుతున్నాడు.
అమ్మవారు నిలబడిన భంగిమలో త్రిపుర సుందరి అనే పేరుతో అనుగ్రహిస్తున్నది. శ్రీ చక్రపతకం ధరించిన యీ దేవిని దర్శిస్తే పాపాలు తొలగిపోతాయని ఐహీకం. ఇక్కడ అమ్మవారికి నిత్యం పాదాభిషేకం మాత్రమే జరుగుతుంది. ఆషాఢ పుబ్బ నక్షత్రం రోజున, నవరాత్రి 9వ రోజున, ఫాల్గుణ ఉత్తరా నక్షత్రం రోజున జరిగే పూజలలో మాత్రమే విగ్రహానికి అభిషేకం చేసే ఆచారం వున్నది. అపూర్వమైన శిలతో ఈ విగ్రహం చెక్కబడినందున, ఈ నియమాన్ని అనుసరిస్తున్నట్లు చెపుతారు.
అందమైన మండపాలు , కళాచాతుర్యం వుట్టిపడే శిల్పలతో నిర్మించబడిన ఈ ఆలయంలో నందితీర్ధం ఒడ్డున ఒక నంది విగ్రహం వున్నది. ఆలయ ఆవరణలో పరివార దేవతలు, ఉత్సవ విగ్రహాలు దర్శిస్తాము. ఈ క్షేత్రంలో ఇంద్రతీర్ధం,శంఖుతీర్ధం, శంభుతీర్ధం, రుద్రతీర్ధం, వశిష్టతీర్ధం, అగస్త్యతీర్ధం, వరుణతీర్ధం, అహల్యాతీర్దం, పక్షితీర్ధం అని 12 తీర్ధాలు ప్రసిద్ధి చెందినవి.
ముఖ్యంగా శంఖు తీర్ధం అద్భుతమైనది.. తిళ ఆలయ గోపురానికి ఎదురుగా వున్నది శంఖు తీర్ధం. మార్కండేయ మహర్షి ఈశ్వరుని అభిషేకించడానికి తగిన పాత్రలేక అవస్ధపడుతున్నప్పుడు ఈశ్వరుడు ఈ తీర్థం లోనికి ఒకశంఖాన్ని రప్పించినట్లు స్ధలపురాణ కధ.
12 సంవత్సరాలకి ఒక సారి ఈ తీర్ధం లో ఒక శంఖం ఆవిర్భవిస్తుందని అంటారు. ఇటీవలి కాలంలో, 2011 లో ఇక్కడి పుష్కరిణిలో ఒక శంఖం ఆవిర్భవించినదట. మంచి నీటి తీర్ధాలలో శంఖాలు ఉద్భవించడం
విశేషమంటారు.
ఈ తీర్ధంలో స్నానం చేసి గిరికి ప్రదక్షిణం చేసి భక్తవత్సలుని, వేదగ్రీశ్వరుని పూజించినవారికి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు నయమౌతాయని, తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల ధృఢ నమ్మకం. ఈ క్షేత్రంలో చైత్రమాస రధయాత్ర, కార్తీక మాసంలో 10,108 శంఖాలతో శంఖాభిషేకం శిష్టమైన పూజలు.
ప్రతి సంవత్సరం దేవేంద్రుడు మెరుపు రూపంలో ఇక్కడ ఈశ్వరుని పూజిస్తాడని ఐహీకం. 12సంవత్సరాలకు ఒకసారి గురువు కన్యారాశిలో ప్రవేశించిన రోజున ఇక్కడ లక్ష దీపార్చన జరుపుతారు...
No comments:
Post a Comment