మల్లవరం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ~ దైవదర్శనం

మల్లవరం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం






కలౌ స్మరణాన్ ముక్తిః -కలియుగంలో కేవలం దైవ నామస్మరణ చేసినంతనే ముక్తి లభిస్తుంది. అందులో కలౌ వేంకటనాయకః -కలియుగంలో వేంకటేశ్వరుని నామస్మరణ చేసినట్లయితే కష్టాలనుండి విముక్తి లభించడమే గాకుండా జీవన్ముక్తి లభిస్తుంది. అటువంటి నామస్మరణ ఆ దేవుని ఎదురుగా, ఆయన సన్నిధిలో చేసినట్లయితే.. అంతకంటే ముక్తీ, మోక్షం వేరొకటి ఏదీ ఉండదు భక్తులకు. ఆ మహాద్భాగ్యాన్ని ప్రసాదించే వేంకటేశుని దివ్య సన్నిధానాలలో ప్రసిద్ధమైనది మల్లవరంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవాలయం.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో (గుండికానది) గుండ్లకమ్మ తీరాన మల్లవరం కొండపై చాలా ఏండ్ల కిందట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వెలిశారు. ఇది పురాతనంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం. అంతేకాదు, అత్యంత ప్రాచీనమైన క్షేత్రము కూడా. ఇందు విశేషముగా స్వామి వారి పాదములను అభిషేకించుచున్నట్లుగా గుండ్లకమ్మ నది ప్రవహిస్తూ ఉంటుంది. సూర్యోదయ సమయాన సూర్యుని కిరణాలు ఈ నదిమీదుగా నేరుగా స్వామివారి గర్భగుడి ఆవరణలోకి ప్రసరించటం ఈ పుణ్యక్షేత్ర విశేషము.

ప్రతి నెలలో శుద్ధ ఏకాదశినాడు ప్రాతఃకాలం నుంచి అహోరాత్రులూ గోవింద నామస్మరణతో దేవాలయ ప్రాంగణం అంతా మారుమ్రోగుతుంటుంది. సమీప గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు ఉత్సాహంతో పాల్గొని స్వామి కృపకు పాత్రులౌతున్నారు.

స్థల పురాణము..

పిలిచిన పలికే దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు గగనమార్గాన విహరించుచూ గుండికా (గుండ్లకమ్మ) నది సమీపము వేంచేసి, అక్కడి ప్రకృతి రమణీయతకు పరవశులై కొంతసేపు విశ్రమింప దలచినారు. శ్రీవారి కోరికను తీర్చలేని తమ్మవరపు గిరిని ఒక్క తాపుతో గుండ్లకమ్మ నదిలో పడవేసిరి. నేటికినీ మనము ఆ విరిగి పడిన తమ్మవరపు గిరిని గుండ్లకమ్మ నదిలో చూడవచ్చు.

మల్లవర గిరి మాత్రము స్వామివారిని అర్ధించి తన సానువులపై విశ్రాంతి తీసుకొమ్మని ప్రార్ధించి, తన జన్మ పావనము చేయమని వేడుకొన్నది. అంతట స్వామివారు ఆ గిరిపై విశ్రమించారు. మల్లవరగిరి పాదభూమిలో ఒక శిలపై స్వామివారి అశ్వపు డెక్కల గుర్తులు నేటికినీ స్పష్టముగా గుర్తింపబడుతూ, భక్తులచే పూజింపబడుచున్నవి.

తనకు విశ్రాంతి నిచ్చిన మల్లవరగిరిని ఏదైనా కోరుకొమ్మని స్వామివారు అనుగ్రహించగా, ‘శ్రీవారి తేజో అంశమును ఇచ్చట శాశ్వతముగా నెలకొల్పుమని ప్రార్ధించినది’. భక్త వరదుడైన శ్రీనివాసుడు తన నిజ తేజమును గిరిపై నిల్పి, తాను భక్తసులభుడనని నిరూపించారు. ఈ విషయమును గ్రహించిన నారద మునీంద్రులవారు మల్లవరగిరిపై నెలకొన్న శ్రీనివాసుని తేజో అంశమును చూసి, భక్తి పారవశ్యముతో పూజించి, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహ ప్రతిష్ట గావించినారు. నేటికినీ నడి రేయి ఏ జాములోనైనా దేవ ఋషి గణములు స్వామివారి సేవించుచుందురు.

విశాఖ శుద్ధ దశమి మొదలు నవాహ్నికముగా నిచ్చట వార్షికముగా బ్రహ్మోత్సవములు శతాబ్దముల నుంచి జరుగుచున్నది. ఈ బ్రహ్మోత్సముల్లో తరంగా కాలక్షేపము ఒక ప్రత్యేక ఆకర్షణ. ఎందరో నిష్ణాతులైన సంగీత విద్వాంసులు ఇచ్చట తరంగ కాలక్షేపము చేయుట తమ భాగ్యమని భావించెడివారుట. శ్రీ నారాయణ తీర్థ జీవిత చరిత్రలో మల్లవరం తరంగ కాలక్షేపము ప్రసిద్ధిమైనదని లిఖించబడినది.

ప్రతి మాసములో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ అఖండ నామ సంకీర్తనం జరుగుతుంది. వేలకొలది భక్తులు ఈ ఏకాదశి నాడు జరిగే భజనలలో పాల్గొంటారు. ఈ భక్తులకు ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. 20 అడుగుల ఎత్తుగల ఆంజనేయ, గరుడ విగ్రహాలు ఆలయం ముందు నిర్మించారు.

సంతానము లేనివారు గరుడ పతాకమునెత్తు సమయమున, గరుడ పతాకము దించు సందర్భములలో ప్రసాదమును స్వీకరించి ఆ రాత్రి దేవాలయంలో నిద్రించిన వారికి సత్వరమే సంతానము కల్గునని భక్తుల విశ్వాసము. అలాగే ఇచ్చట జరిగే విశిష్ట కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీపద్మావతి, స్వామివార్ల తలంబ్రాలను శిరమున ధరించిన వారికి శీఘ్రముగా వివాహం జరుగునని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కళ్యాణోత్సవములో పాల్గొన్న భక్తులకు భోజన సదుపాయాలు కూడా కలిగించుచున్నారు. ఈ కారణంగా వచ్చు భక్తులకు సేవా కార్యక్రమములు చేయుటకు స్వచ్ఛందంగా భక్తులే కార్యకర్తలుగా మజ్జిగ, పానకము, తాగునీరు అందించుటతోపాటు శీతలోపచారములు గావించుచూ స్వామిపట్ల తమకున్న భక్తిని చాటుకొంటున్నారు.

కళ్యాణోత్సవ అనంతరం సాయంసంధ్య వేళలో కొండకు దిగువన ఈశాన్య దిక్కున గల జలాశయంలో పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై కళ్యాణ వేంకటేశ్వరుడు మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రోచ్ఛారణలు, భక్తకోటి కేరింతలతో ఊరేగించటం చూడచక్కని దృశ్యం. ప్రతినిత్యం స్వామివారికి విశేష సాల గ్రామాలకు క్షీరాభిషేకం, తిరువారాధన, అష్టోత్తరము, సోత్రత నామావళి, హారతి కార్యక్రమాలు, విశేష పూలాలంకరణ నిర్వహిస్తారు.

మల్లవరం వేంకటేశ్వర దేవాలయాన్ని చేరుకోవటానికి ఒంగోలు - తాళ్లూరు మార్గంలో మల్లవరం వద్ద దిగి ఆటోల ద్వారా చేరుకోవచ్చు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List