ప్రకాశం జిల్లా మోక్ష గుండంలో తూర్పు కనుమలలో స్వయంభు శ్రీ ముక్తేశ్వరాలయం ప్రాచీనాతి ప్రాచీనాలయ౦. ఈ గ్రామంలో వుండే గుండంలో మునిగితే మోక్షం లభిస్తుందని ప్రాచుర్యంలో ఉన్నది. చివరకు ఆ గ్రామాన్ని" మోక్షగుండం" గా పిలవనారంభించారు.
మోక్షగుండలో పూర్వం “శివానంద ఆశ్రమం” కూడా వున్నట్టు శాసనం ద్వారా తెలుస్తున్నది. 'బ్రహ్మకైలాస శివానందా శ్రమం - మోక్షగుండం వారి ధర్మం” అని శిలా శాసనంపై రాయబడివుంది. మోక్షగుండం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో తూర్పుకొండ లోయలో ముక్తేశ్వర క్షేత్రం వున్నది. గర్భ గృహం లో ఉన్న శివలింగాన్ని వసిష్ట మహర్షి ప్రతిష్టించాడని విశ్వాసం.
స్థలపురాణం..
తండ్రి జమదగ్ని మహర్షి ఆజ్ఞను శిరస్సున దాల్చి తల్లి రేణుకా దేవిని సంహరించాడు పరశురాముడు, ఆ పాప పరిహారం కోసం శివాలయాలను సందర్శిస్తూ వీలైన చోట్ల లింగ ప్రతిష్ట చేశాడ్రు భార్గవ రాముడైన పరశురాముడు.
ఆ సందర్భంలో ఇక్కడికి కూడా వచ్చి శ్రీ ముక్తేశ్వర సేవలో పునీతుడై ముక్తిని పొందటం చేత దీనికి ముక్తేశ్వర క్షేత్రం అనే పేరొచ్చిందని స్థానిక పౌరాణిక కధనం. త్రేతాయుగం లో ఈ ప్రాంతమంతా దట్టమైన దండకారణ్యం .రావణాసురుని ఏలుబడిలో ఉండేది .అప్పుడు రాక్షసులు ఇక్కడ శివ లింగాన్ని ప్రతిష్టించి పూజించారు. రామరావణ యుద్ధం లో రావణ వధ తర్వాత శ్రీ రాముడు బ్రహ్మ హత్యా దోష నివారణకు శివలింగాలను వీలైన చోట్ల ప్రతిస్టించాడు.
శ్రీరాముడు సతీసమేతంగా అరణ్యవాసం చేయు సమయాన తండ్రి సంవత్సరీకము వచ్చింది. ఆ సందర్భంలో నీరు, లభించని కారణంగా బాణం వేసి పాతాళ గంగను పైకి తెచ్చినట్టు పురాణంలో పేర్కొనబడింది. ఆ స్థలంలో నిర్మించిన కోనేరు శ్రీరాముని కోనేరుగా నేటికీ పిలువబడుచున్నది. ఇదే ‘’రామ తీర్ధం ‘’గా ప్రసిద్ధి చెందింది.
రాక్షస పీడ తొలగి మునులు హాయిగా మళ్ళీ ఇక్కడ తపస్సు చేస్తూ యజ్న యాగాదులు నిర్వహించారు.
రామ తీర్ధం లోని మట్టిని నుదుట ధరిస్తే ,అది విభూతిలాగా తెల్లగా మారిపోవటం విశేషం. ఇప్పటికీ ఈ మహాత్మ్యం జరుగుతూనే ఉంది. ఇచ్చటగల అమ్మవారి పేరు భ్రమరాంబగా పిలుస్తారు.
ఒంగోలు నుండి శ్రీశైలం పోయే దారిలో ఒంగోలుకు 25 కిలోమీటర్ల లో రామ తీర్ధం ఉంది ఇక్కడి శివుడిని ‘’మోక్ష రామ లింగేశ్వరుడు ‘’అంటారు. అమ్మవారు పార్వతీ దేవి దక్షిణ ముఖంగా ఉంటుంది.
శివరాత్రికి కార్తీకమాసం లోను భక్తుల రద్దీ అనూహ్యం. ఇక్కడ కల్యాణం జరుగుతుంది . ఈశాన్యం లో గంగాదేవి ఆలయం ఉంది. చైత్ర పౌర్ణమినాడు గంగ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది.
(ప్రకాశం జిల్లా : మోక్షగుండం శ్రీ ముక్తేశ్వరాలయం)
No comments:
Post a Comment