మహాకాళుడు - మాతంగీ దేవి ~ దైవదర్శనం

మహాకాళుడు - మాతంగీ దేవి


పుణ్యక్షేత్రమైన కాశీలో నివసిస్తున్న విమలుడు అనే భక్తునికి వివాహమై  చాలకాలమైనా సంతానభాగ్యం కలగలేదు. వేదనతో తనకి సంతాన భాగ్యం కలగాలని ఈశ్వరుని ప్రార్ధించాడు. ఒకనాడు ఆయన స్వప్నంలో కనిపించిన ఈశ్వరుడు,


"తిరు మహాకాళం"అనే  స్ధలానికి వెళ్ళి అక్కడి ఆలయంలోతమని పూజించమని, అక్కడ మానవ ముఖంతో వున్న వినాయకుని, బాలుని రూపంలో వున్న కుమారస్వామిని, పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పి ఆంతర్ధానమైనాడు.


ఆవిధంగానే దక్షిణదేశంలోని తిరుమహాకాళం అనే స్ధలానికి వచ్చి , ముగ్గురిని పూజించి సంతానభాగ్యం పొందాడు విమలుడు. "కాశికి వెడితే ఖర్మ తొలగిపోతుందని, గంగలోమునిగితే పాపం తొలగి పోతుందని పెద్దలు చెప్తారు". అటువంటి కాశీలో నివసించిన విమలునికి కాశీలో దొరకని వరం తిరు మహాకాళంలోని ఆలయంలో దొరికింది. ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది.


1500 సంవత్సరాల ప్రాచీనమైన ఆలయం. సర్ప దోషాలు వుంటే పరిహారమౌతాయి. ప్రపంచంలోనే దీర్ఘాయువునిచ్చే స్ధలాలు మూడు వున్నాయి.


 1. ఉజ్జయిని మహాకాళం

 2. అంబర్ మహాకాళం

 3. ఇరుమ్బై మహాకాళం. 


శ్రీ రాజమాతంగి అనే శ్రీ భయక్షేమాంబిక సమేత శ్రీ మహాకాళ నాధుడు తిరుమహాకాళం ఆలయంలో దర్శనం ఇస్తూ కటాక్షిస్తున్నాడు. తమిళనాడు తిరువారూరు జిల్లా  పూంతోట్టం సమీపాన కావేరీకి ఉపనది అయిన అరసలారు నదీ తీరాన వున్నదీ ఆలయం. ఇక్కడ తూర్పు ముఖంగా స్వయంభూలింగంగా దర్శన భాగ్యం కలిగిస్తున్నాడు పరమేశ్వరుడు.


ఆనందుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, శంఖపాలుడు,కునిగుడు, పద్ముడు, మహాపద్ముడు, అనే ఎనిమిది సర్పాలు ఇక్కడ భూభారాన్ని వహిస్తున్నట్టు ఐహీకం. వాసుకి సర్పం యీ పరమేశ్వరుని ఆరాధించి శివదోషము నుండి విముక్తి పొంది ప్రత్యేక సన్నిధిలో అనుగ్రహిస్తున్నాడు. 


అందు వలన రాహు-కేతు దోషం, సర్ప దోషం కలవారు ఇక్కడ వున్న వాసుకి నాగదైవానికి పాలాభిషేకం చేసి పూజించి దోష విముక్తులౌతారని  ఐహీకం.


మాతంగ మహర్షి  తపఃఫలం..


మాతంగ మహర్షి సంతాన భాగ్యంకోసం ఈ ఆలయంలో పరమేశ్వరుని ప్రార్ధించగా సాక్షాత్తు అంబికనే తన పుత్రికగా పొందే భాగ్యం పొందాడు. ఆ విధంగా రాజ మాతంగి అనే పేరుతో మహర్షి పుత్రికగా జన్మించి పెరిగిన అంబికకు మహేశ్వరుడు ప్రత్యక్షమై కావలసిన వరం కోరుకొమ్మన్నాడు. 


అందుకు రాజమాతంగి "నేను యీ ఆలయంలో నిత్యమూ కళ్యాణ వధువుగా భక్తులకు దర్శనమివ్వాలని  వరం ప్రసాదించాలని కోరుకున్నది. పరమేశ్వరుడు ఆవిధంగానే వరమనుగ్రహించాడు. అందువలన, తిరు మహాకాళం వివాహ అడ్డంకులు, దోషాలు తొలగించే నివృత్తి స్ధలంగాను, సంతాన భాగ్యం కలిగించే  క్షేత్రంగానూ ప్రసిధ్ధి చెందినది.


63గురు నాయన్మారులలో సోమాసిమార నాయనారు ఒకరు. ఆయన తను చేసే సోమాసి యాగానికి భగవంతుని పిలుచుకురమ్మని సుందరమూర్తి నాయనారుని వేడుకున్నారు. సుందర నాయనారు సమ్మతించాడు.


వైశాఖ మాసం ఆశ్లేషా నక్షత్రం రోజు జరిగే యాగానికి పరమేశ్వరుని తీసుకుని వస్తానని మాట యిచ్చాడు. ఆ విధంగా తిరువారూరు త్యాగరాజేశ్వరుడు నాలుగు వేదాలను నాలుగు శునకాలుగా మార్చి పట్టుకుని యాగానికి వచ్చాడు.


వినాయకుడు మానవ రూపంలో కుడా వచ్చాడు. వీరిని చూసి యాగానికి విఘ్నం కలిగించడానికి వస్తున్నారని.. భావించిన యాగశాలలో వున్న వారంతా భయపడి పారిపోయారు. 


ఆ సమయంలో వారిని ఆడ్డుకుని ఆపి,  వచ్చినది మేము, మా కుటుంబమేనని తెలిపి వారి భయాన్ని పోగొట్టి మానవ ముఖంతో వున్న వినాయకుడు దర్శనమిచ్చి అనుగ్రహించాడు. ఈ ఆలయంలోని వినాయకుని  భయాలు తీర్చే వినాయకునిగా  చెప్తారు. యీ వినాయకుని పూజించిన మనో చాంచల్యము, మనసులో కలిగిన భయాలు తొలగి, శుభాలు కలుగుతాయని భక్తుల ధృఢవిశ్వాసం. 


ఇప్పుడు కుడా వైశాఖ మాసం ఆశ్లేషా నక్షత్రం రోజున సోమయాగం విశిష్టంగా చేస్తారు. ఈ ఉత్సవంలో కాలికి చెప్పులతో, చేతులో మృదంగంతో, మరో చేతిలో మధువు బిందెతో  వున్న పార్వతీ దేవితో  పరమశివుడు దర్శనం ఇవ్వడం విశిష్టమైనది.


తిరువారూరు త్యాగరాజేశ్వరుడు తన కుటుంబంతో యీ ఉత్సవంలో  పాల్గొంటున్నందున ఆనాడు తిరువారూరు లో పరమశివునికి అర్చనాభిషేకాలు జరపరు.


ఈ ఆలయానికి సంబంధించిన మరొక కధ వున్నది. 


ఒకసారి ఆకాశ మార్గాన పయనిస్తున్న దుర్వాస మహర్షిని చూసి, మదలోల అనే స్త్రీ ఆయన మీద మనసుపడి, తన ఇష్టాన్ని తెలిపి పుత్రభాగ్యాన్ని కలిగించమని వేడుకొన్నది. దుర్వాసుడు ఆమెకి ఆ భాగ్యం కలిగించాడు. మదలోల వరం పొందినది, 

గర్భం ధరించినదీ  మధ్యాహ్న వేళ.. దాని ఫలితంగా ఆకాశ మధ్యన ఆమెకు అంబనుడు, అంబాసురుడు  అనే ఇరువురు రాక్షసాంశ కలిగినబిడ్డలను సంతానంగా

పొందినది. తల్లి పిల్లలకి పాలు త్రాగిస్తుండగా, వారు ఆమె రక్తాన్నే త్రాగేశారు.


విరి రాక్షసత్వాన్ని చూసిన మదలోల  బాధపడి, బ్రహ్మపురీశ్వరుని అనుగ్రహం పొందిరమ్మని చెప్పి వారిని వదలి వెళ్ళిపోయింది. ఆవిధంగానే వారు బ్రహ్మపురీశ్వరుని పూజించి అనేక వరాలు పొందారు. కాని వారిరువురూ లోకాన్ని హింసిస్తూ వచ్చారు. దేవతలు, మునులు అందరూ కలసి త్రిమూర్తులను వేడుకొన్నారు.


తనచే పొందిన వరాలతో ఆ రాక్షసులు ఇద్దరూ దుర్వినియోగం చేస్తున్నారని ఈశ్వరుడు గ్రహించగా, ఆయన కంటి సంజ్ఞను అర్ధం చేసుకొన్న అంబిక భూలోకానికి మోహినిగా వచ్చింది. ఆమె అందానికి వ్యామోహపడిన అసురులు తమను వివాహం చేసుకొనమని  విన్నవించుకున్నారు. ఇద్దరని పెళ్ళి చేసుకొనడం కుదరుదు. మీలో ఎవరు అధిక బలాఢ్యులో నిరూపించుకోమన్నది. దానవులు ఇద్దరూ ఘోరాతిఘోరంగా పోట్లాడుకున్నారు. అంబనుడు అంబాసురుని వధించి మోహిని వద్దకు వచ్చాడు.


అంబిక భద్రకాళి అవతారం దాల్చినది. బెదిరిపోయిన అంబనుడు మహిషంగాగా తన రూపు మార్చుకున్నాడు. అయినా అసురుని వెంటాడి వధించినది అంబిక. అంబిక అసురుని వధించిన స్ధలం "కిడా మంగళం" అనే పేరుతో పిలువబడుతున్నది.


అసుర సంహారానంతరం అంబిక దోషపరిహారానికై యీ ఆలయంలో శివ లింగం ప్రతిష్టించి పూజించినట్లు స్ధల పురాణ కధ వివరిస్తున్నది. రాహు - కేతు దోషం, నాగ దోషం, 

బ్రహ్మహత్యా దోషం మొదలైన దోషాలను తొలగించే పరిహార ఆలయం. ప్రత్యేకంగా మృగశిర, మూల, జ్యేష్ట, ఆశ్లేషా నక్షత్రాల వారు  దర్శించి పూజించవలసిన ఆలయం.


మహాకాళ నాధుని అనుగ్రహం వలన, వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి, విద్య, సిరి సంపదలు కలిగి ప్రశాంత జీవితం గడుపుతారు.


మలాడుతురై.. తిరువారూరు మార్గంలో వున్నది పూంతోట్టం. ఈ ఊరి నుండి 3 కి.మీ దూరంలో వున్నది తిరు మహాకాళం ఆలయం...


Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List