యగంటి ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. భారత దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో శ్రీ శ్రీబ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి పట్టణానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఈ దేవాలయం వైష్ణవ సంప్రదాయంలో నిర్మింపబడింది. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్కడ ప్రతిష్టించిన నంది విగ్రహం అంతకంతకూ పెరుగుతూ వుంటుంది, ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు ధృవీకరించారు.
ఉమామహేశ్వర స్వామి ఆలయం..
బనగానపల్లె పట్టణానికి 14 కి.మీ.ల దూరంలో ఉన్న పాతపాడు అనే గ్రామం సమీపంలో నెలకొనివుంది. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ, వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేసిన గుహ వంటి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడివున్నాయి. యాగంటి ఆలయంలోని నంది విగ్రహానికి "యాగంటి బసవన్న" అని పేరు. "కలియుగం అంతమయ్యేనాటికి యాగంటి బసవన్న లేచి రంకె వేస్తుందని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు". శ్రీ అగస్త్య మహర్షి శాపం వల్ల ఈ గ్రామంలో కాకులు ఉండవని ప్రతీతి.
ఆలయ చరిత్ర..
యాగంటి దేవాలయం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయలుచే నిర్మింపబడింది.
స్థల పురాణానికి చెందిన ఒక కథ: ..
ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గుహలో తపస్సు చేసిన శ్రీ అగస్త్య మహా మునీశ్వరుడు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం నిర్మించాలని తలపెట్టారు. కానీ ప్రతిష్ఠించదలిచిన విగ్రహం కాలి బొటన వ్రేలు గోరు విరగడం వల్ల స్వామి వారిని ప్రతిష్ఠించ లేదు. నిరాశకు లోనైన మునీశ్వరులు శివుని కొరకు తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై స్థలం కైలాసాన్ని పోలి వున్నందున శివున్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. అపుడు మునీంద్రుడు ఒకే శిలపై పార్వతీ సమేతుడై ఉమామహేశ్వరుడుగా భక్తులకు దర్శనమివ్వాలని శివుని కోరతాడు.
రెండవ కథ:..
చిట్టెప్ప అనే శివ భక్తుడు శివుని కొరకు తపస్సు చేశాడు. శివుడు ఒక పులిలాగ ఆయనకు కనబడతాడు. అపుడు పరమేశ్వరుడు తనకు పులి రూపంలో ప్రత్యక్షమైనాడని గ్రహించిన చిట్టెప్ప "నేగంటి శివను నే కంటి" అంటూ ఆనందంతో నృత్యం చేశాడు. ఆలయానికి దగ్గరలో చిట్టెప్ప గుహ వుంది. ఇది దేశంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. భారత దేశానికి చెందిన గొప్ప రాజవంశాల చేత యాగంటి శ్రీ ఉమామహేశ్వర ఆలయం పోషింపబడింది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. శివుడు, పార్వతి, నంది ఈ ఆలయంలోని దేవతామూర్తులు. ప్రతి సంవత్సరం శివరాత్రినాడు యిక్కడ శివ భక్తులచే ఘనంగా ఆరాధన జరుగుతుంది.
పుష్కరిణి..
ఇక్కడ వున్న నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనది. తరువాత ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరు. ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరు లో చేరుతుంది. ఏ కాలంలో నైనా కోనేరు లోని నీరు ఒకే మట్టంలో వుండడం విశేషం. ఈ కోనేరులోని నీరు పుష్కరిణికి చేరుతుంది. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం. అగస్త్యుడు పుష్కరిణిలో స్నానమాచరించిన తర్వాత శివున్ని ఆరాధించేవారు. పుష్కరిణి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉంది. ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉంది. దీన్ని దాటగానే రంగ మంటపం, ముఖ మంటపం, అంతరాళం, ఉన్నాయి. గర్బాలయంలో లింగ రూపంపై ఉమా మహేశ్వరుల రూపాలు కూడా ఉన్నాయి.
సహజ సిద్ధమైన గుహలు..
యాగంటి గుహాలయ దృశ్యం యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండగుహలు మనని ఆశ్చర్య చకితులను చేస్తాయి. ఆలయానికి ఉత్తరాన శ్రీ అగస్త్య మహాముని వారి గుహ, ఆలయ ముఖద్వారానికి ఉత్తరాన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ, పుష్కరిణికి ఉత్తరాన శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ వున్నాయి.
శ్రీ అగస్త్య మహాముని వారి గుహ..
ఈ గుహలో శ్రీ అగస్త్య మహాముని వారు తపస్సు చేసినట్లు చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి 120 నిటారు మెట్లు వుంటాయి. ఈ గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివలింగం, ఆదిశేషుని ఆకారాలు పడమటి వైపు కనిపిస్తాయి. ఇక్కడి నుండి ఇతర గుహలకు, పలు పుణ్య క్షేత్రాలకు సొరంగ మార్గాలు వున్నట్లు చెబుతారు.
శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుహ..
శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం మొలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగింది. ఈ విధమైన అసంపూర్ణ విగ్రహం పూజలనందుకొనకూడదు. అందువల్ల ఈ విగ్రహాన్ని ఈ గుహలో శ్రీ అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణానికి ముందే ప్రతిష్టింపబడింది.
శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాల ఙ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు. ఈ గుహలోకి వెళ్ళడానికి మెట్లు కొంత సౌకర్యంగా వుంటాయి.
శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుహ..
ఈ గుహలో శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు కాల ఙ్ఞానం రాశారని భక్తులు నమ్ముతారు. దీనిని శంకరగుహ, రోకళ్ళగుహ అనికూడా అంటారు. ఈ గుహలోకి వంగి వెళ్ళవలసి వస్తుంది. ఈ గుహలో నుండి బనగానపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న రవ్వల కొండ గుహలకు దారి వున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఆ దారి మూసి వేయబడి వుంది.
యాగంటి బసవన్న..
ఇక్కడి ముఖ మంటపంలో స్వయంభువుగా వెలసిన బసవన్న విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉందేమోనని అనిపిస్తుంది. ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉంటోందన్న (సంవత్సరానికి ఒక అంగుళం పెరుగుతుంది) మాటని పురావస్తు శాఖ కూడా నిర్ధారణ చేయడంతో మరింత మహిన్వితమైనదిగా వెలుగొందుతోంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి కాలజ్ఞానం లో ప్రస్తావించబడి ఉంది. యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది.
కాకులకు శాపం..
యగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తలంచాడు. విగ్రహాన్ని మలిచే సమయంలో కాలి బొటనవేలు గోరు విరిగిందట. తన సంకల్పంలో లోపమేమో అనే సందేహం తలెత్తడంతో శివుని గురించి తపస్సు చేశాడు. ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో, అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట. అందువల్లనే ఇక్కడ కాకులు కన్పించవని చెబుతుంటారు.
క్షేత్రానికి చేరు మార్గం..
ఈ క్షేత్రానికి రోడ్డు మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలము. యాగంటి క్షేత్రం బనగానపల్లె ప్యాపిలి మార్గంలో మండల కేంద్రమైన బనగానపల్లె పట్టణానికి పడమటి దిక్కున సుమారు 14కి.మీ.ల దూరంలో ఉంది.
కర్నూలుకు దాదాపు 100కి.మీ.ల దూరంలో ఉంటుంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. చారిత్రక స్థలమైన బెలుం గుహలుకు సుమారు 45కి.మీ.ల (1.5గంటల ప్రయాణం) దూరంలో ఉంది..
యాగంటిలో వసతి సౌకర్యాలు వున్నవి. దగ్గర వున్న బనగానపల్లి లో వసతులున్నాయి..
No comments:
Post a Comment