ఆద్యంతాలు కనుగోలేనంతగా భూమ్యాకాశాల నంటుతూ విశ్వరూపం దాల్చి పరబ్రహ్మ స్వరూపుడు మహేశ్వరుడు.
సర్వత్రా లింగరూపంతో దర్శనమిచ్చే పరమశివుడు కొన్ని క్షేత్రాలలో విగ్రహమూర్తిగా దర్శనమిస్తున్నాడు.
అలాటివాటిలో ఒకటి కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి సమీపమున వున్న అజిమల. కేరళ రాష్ట్ర శైవ దేవాలయాలలో అతి పెద్ద శిల్పమూర్తిగా నెలవైన స్ధలం అజిమల. ఆళి అంటే సముద్రం. పశ్చిమాన ఉన్న అరేబియా సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక కొండ మీద వున్నందు వలన అజిమల పరమేశ్వరుడు అనే పేరు వచ్చింది.
సముద్రతీరాన సహజంగా వున్న 20 అడుగుల ఎత్తు మెట్ట మీద వున్నది యీ ఆలయం. సముద్రం, చిన్న కొండతో ఈ ఆలయ వాతావరణం అత్యంత రమణీయంగా ఉంటుంది.
మెట్టపై సుమారు 58 అడుగుల ఈశ్వరుని విగ్రహం గంభీరంగా దర్శనమిస్తుంది. ఈ శిల్పాన్ని చెక్కడానికి 6 సంవత్సరాల కాలం పట్టినది. దేవదత్తా అనే శిల్పి తయారు చేసిన ఈ సిమెంట్ కాంక్రీటు విగ్రహం సముద్రపు ఉప్పు గాలికి శిధిలమవకుండా, చెక్కుచెదరని విధంగా నిర్మించారు.
పరమశివుని ముఖం ఆకాశం వైపుక చూస్తూవున్నట్లు ఉంటుంది. ఆకాశనీలవర్ణం నేపధ్యంగా గల పరమశివుడు లేత బూడిద రంగుతో గంభీర భంగిమలో దర్శనమిస్తున్నాడు.
త్రిశూలం, చంద్రుడు, నాగాభరణాలు రుద్రాక్ష హారాలతో ధృఢమైన దేహాకృతితో వ్రేళ్ళు, గోళ్ళు, సర్వావయవాలు సజీవంగా గోచరిస్తాయి. నాలుగు హస్తాలలో పరమశివుడు రెండు చేతులలో ఢమరుకం త్రిశూలం ధరించాడు. కుడి తొడ మీద ఒక చేయి ఆన్చి మరొక చేతితో ఝటాఝూటమును సరిచేసుకునే భంగిమ చూపరులను పులకింప చేస్తుంది. శిరస్సు పై గంగాదేవి విగ్రహ రూపంలో వున్నది.
ఈ ఆలయంలోని ఈశ్వరుని గంగాధరేశ్వరుడు, జడై అప్పర్, మహాదేవుడని భక్తులు కీర్తిస్తారు. ఆలయ ప్రాంగణంలో మహా గణపతి, మహాదేవుడు పార్వతీ దేవి మొదలైనవారి సన్నిధులు వున్నవి. క్షీరసాగరమధన దృశ్యాలను శిల్పరూపంలో సందర్శించవచ్చును.
ప్రత్యేక సన్నిధిలో వున్న పరమేశ్వరునికి నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతాయి. విశేష పూజల సమయంలో శంఖాభిషేకం, రుద్రాభిషేకం , భక్తుల ఆయుర్దాయం కోసమై చేసే మృత్యుంజయ హోమాలు జరుపుతారు. తులాభార మ్రొక్కుబడులు ఇక్కడ చెల్లించుకుంటారు.
పుష్యమాసంలో అతి వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి . భక్తులు నిమ్మకాయ డిప్పలలో దీపాలు వెలిగించి దీపోత్సవాలు చేస్తారు.
తిరువనంతపురం నుండి సుమారు 21 కి.మీ దూరం లో యీ ఆలయం వున్నది. కేరళలోని ప్రసిద్ధి చెందిన
కోవలమ్ బీచ్కి 6 కి.మీ దూరంలో ఈ ఆలయం వున్నది.
No comments:
Post a Comment