హంపీ విరూపాక్ష స్వామిదేవాలయం ఇది కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు నుండి 350 కి.మీ మరియు బళ్లారికి 75 కి.మీ. దూరంలో వుంది. హంపిలోని విరూపాక్ష దేవాలయం శివుడికి అంకితం చేయబడింది. విరూపాక్ష దేవాలయం హంపిలో పురాతనమైనది మరియు ప్రధాన ఆలయం.
ఇది భారతదేశంలోని అత్యంత పురాతన దేవాలయాలలో ఒకటి. మరియు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తించబడింది. హంపిని పంపా క్షేత్రం, కిష్కింధ క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని కూడా అంటారు.
ఆలయ చరిత్ర..
హంపి వీధికి పశ్చిమ చివరన విరూపాక్ష దేవాలయం ఉన్నది. 50 మీటర్ల ఎత్తైన తూర్పు గాలిగోపురం విరూపాక్ష దేవాలయంలోకి స్వాగతం పలుకుతుంది. ఆలయంలో ప్రధాన దేవత విరూపాక్షుడు (పరమేశ్వడు).
పంపదేవి ఆలయం మరియు భువనేశ్వరి దేవి ఆలయం ప్రధాన ఆలయంతో అనుసంధానించబడి ఉన్నాయి. ఈ ఆలయానికి 7వ శతాబ్దం నుండి గొప్ప చరిత్రను కలిగి ఉంది. విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుండే ఈ విరూపాక్ష దేవాలయం ఉందని శీలా శాసనాలు ద్వారా తెలుస్తున్నది. చరిత్రకారులు దీనిని 10-12 శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
చరిత్రక ఆధారాల ప్రకారం, ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు మరియు హొయసలులు మార్పులు చేసారు, అయితే ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. విజయనగర రాజుల పతనం తరువాత, దండయాత్రల వలన 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం చేయబడింది.
అయితే విరూపాక్ష-పంపా ప్రకారం 1565 దండయాత్రల బారి మాత్రం పడలేదు. విరూపాక్ష ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయంపై కప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.
విరుపాక్ష దేవాలయ వర్ణన..
ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9ఖానాలతో 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం లోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. మిగిలిన 7 ఖానాలు ఇటుకతో నిర్మించబడ్డాయి.
తూర్పు ముఖంగా, విరూపాక్షాలయంలో పదకొండు అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజ గోపురం ఉంది. ఈ రాజగోపురంపై స్త్రీ పురుషుల, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. గోపురద్వారం లోపల ఒక పక్క పక్క మూడు తలల నంది, ఇంకొక పక్క మూడు ఒక చిన్న నంది ఉన్నాయి. వీటికి ఎదురుగా మరో గోపురమున్నది.
ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది. దీనిని రాయలవారి గోపురం అంటారు. దీనిని శ్రీ కృష్ణ దేవరాయల వారు నిర్మించినందున దీనిని రాయల గోపురం అని కూడా అంటారు. ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణం.
ఇందులో మధ్యన - ముఖమంటపం, దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి. అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ మరియు శ్రీ వేంకటేశ్వరుడు వంటి దేవతల ఆలయాలున్నాయి.
విరూపాక్ష స్వామి వారికి పంపాపతి అనే మరొక పేరు కలదు. పూర్వం పంపానదిగా పిలువబడినదే ఈ నాటి తుంగభద్రనది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణంలో దీపస్తంభం, ధ్వజస్తంభం, నాలుగు కాళ్ల మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు' నందులున్నాయి.
తర్వాత ముఖమంటపం ఉన్నది. ముఖ మంటపంలోనికి ఎక్కేమెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది. ముఖమంటపం అనేక స్తంభాలతో, వాటిపై అతి సుందర శిల్పాలతో మలచబడి ఉన్నది.
పై కప్పుకు సున్నంతో తాపడం చేసి అందు రంగులతో పులిలాంటి వింత జంతువుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. కాలక్రమేణా చాలా చిత్రాలు చాలావరకు వెలసి పోయినా ఇంకా కొంత మిగిలి ఉన్నాయి. ముఖమండపంలో నుండి గర్భగుడి లోనికి దారి లేదు. ఉగ్రరూపుడైన స్వామి వారికి.
ఎదురుగా వెళ్లకూడదనే నియమాన్ని అనుసరించి స్వామి దర్శనానికి భక్తులు వెళ్ళడానికి గర్భగుడి కిరువైపులా మెట్లదారి ఉంది. గర్భాలయానికి ఇరువైపులా రెండు గదులుఉన్నాయి. అందులో స్వామివారి ఉత్సవ - విగ్రహాలున్నాయి.
గర్భగుడికి కుడిప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్రపటం ఉన్నది. ఈ అసలు కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు చేయించాడు.
ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉన్నది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపజేస్తారు.
గర్భాలయానికి వెనుక బయటకు వెళ్లడానికి మెట్లదారి ఉన్నది. అక్కడ పదిమెట్లు ఎక్కగానే కుడివైపు ఒక చీకటి గది వున్నది. ఆ గదికి తూర్పు వైపు 7 అడుగుల ఎత్తులో రంధ్రం ఉంది. అందులో నుండి వెలుతురు వచ్చి ఎదురుగా ఉన్న గోడపై పడి బయట ఉన్న రాజ గోపురం యొక్క నీడ తలక్రిందులుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
దినికి ఎదురుగా ఒక తెల్లని వస్త్రాన్ని అడ్డం పెడితే దానిమీద కూడా గోపురం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. అందరూ దీన్ని చాలా వింతగా చూస్తారు. అక్కడ వస్తున్నది సూర్య కిరణాలు కాదు, కేవలం వెలుతురుమాత్రమే. ఈ వింత వెలుతురు ఉన్నంత సేపు మాత్రమే ఉంటుంది. ఇది అందరు తప్పక చుడవలసిందే..
ఇక్కడ విరూపాక్షాలయంలో తుంగభద్ర నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి ఆలయ వంటగదికి నీటిని అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్తుంది.
విరూపాక్ష దేవాలయం దగ్గరలో గణపతి విగ్రహం ఉన్నది. ఈ గగణపతి విగ్రహం 15అడుగుల ఎత్తు మరియు విగ్రహం పైభాగంలో శనగబడలవలే బుడిపెలతో కూడుకొని ఉంటుంది. దీనిని శనగలరాయి గణపతి అని అంటారు. దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న బుడిపెలతో కూడుకొని 10 అడుగుల ఎత్తులో ఉంటుంది.
దినిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు. ఈ నగరం చుట్టుప్రక్కల చాలా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి.
ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని తెలియుచున్నది.
ఇచ్చట ఆంజనేయుని ఆలయం, అంజనీదేవి, కేసరిల గుహలు ఉండేవని చెబుతారు. గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ శ్రీ విద్యారణ్యస్వామివారి మఠం, ఆలయం ఉన్నది.
ఈ విద్యారణ్యస్వామి 'విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త. విరూపాక్షాలయానికి పక్కనే ఒక చిన్నగుట్టపై అనేక ఆలయాలు కనిపిస్తాయి.
హేమకుటం..
రాజగోపురం వైపు నుండి వెళితే అక్కడ కోట ద్వారంలా కనిపిస్తుంది. అదే హేమకుటానికి ద్వారం. ఈ హేమకూటంలోని త్రికూటాలయాలు పిరమిడ్ ఆకారంలో ఉన్న రాతి కట్టడమే. ఏ ఆలయంలోనూ విగ్రహంగానీ, శివలింగంగానీ కనిపించవు.
కోదండరామాలయం..
కోదండరామాలయం ముందు నదిని చక్రతీర్థ అంటారు నది ఉదృతిగా ప్రవహించినప్పుడు ఇక్కడ నీళ్లు సుడులు తిరుగుతాయి. అందుకే దీనిని చక్రతీర్థం అంటారు.
ఈ ఆలయానికి ముఖమంటపం, ధ్వజస్తంభం, గర్భాలయం ఉన్నవి. ఇందులోని విశేషమేమిటంటే సీతా, రామ, లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాతిపై చెక్కబడ్డాయి.ఈ ఆలయం వెనుక కొండమధ్యలో యంత్రోద్ధార హనుమంతాలయం ఉన్నది.
ఈ ఆలయం నుండి కొంచెం ముందుకు వెళితే అక్కడ కొండ మలుపులో ఒక చిన్న ఆలయం కనబడుతుంది. దీని ముందు భాగంలో, మహావిష్ణువు, లక్ష్మీదేవి శిల్పం చెక్కబడి ఉన్నది. గర్భాలయంలో అందమైన చిన్న మహావిష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలున్నాయి.
ఇక్కడి నుండి రెండు కొండల మధ్యన విశాలమైన ప్రదేశంలో ఉన్నదే అచ్యుత రామాలయం. ఈ ఆలయం వెనుక ఉన్నదే మా తంగ పర్వతం. ఈ మాతంగ పర్వతం హంపి బజారు నుండి కూడా కనిపిస్తుంది.
దినిపై నున్నది వీరభద్రాలయం. అచ్యుత రాయల ఆలయం ముందు నుండి కొంతదూరం నడిస్తే అక్కడ ఎడంవైపు, పెద్ద రాళ్లకుప్ప కనిపిస్తుంది. ఆ బండ రాళ్ళపై తెల్లటి సున్నం పట్టీలు వేసి కనబడుతుంది అదే సుగ్రీవుని గుహ.
విఠల దేవాలయం..
ఈ విఠలాలయం విజయనగర చారిత్రక కట్టడాలన్నింటిలోకి శిల్పకళ రీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్నది. విఠల్ అనగా శ్రీకృ ష్ణుని రూపమే. ఆ కాలంలో ఇది అన్నింటికన్నా పెద్ద ఆలయం. దీనిని రెండవ దేవరాయలు 1422-1446 సంవత్సరాల మధ్యలోనిర్మించారు.
ఆ తర్వాత క్రీ.శ. 1513లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం విస్తృతపరచబడినది. 500 అడుగుల పొడవు, 310 అడుగుల వెడల్పు గల విశాలమైన ప్రాంగణంలో మూడు గోపుర ద్వారాలతో అత్యద్భుతంగా ఈ ఆలయం , రూపుదిద్దుకుంది.
క్రీ.శ. 1516-1517 మధ్యకాలంలో ప్రధానా లయానికి నైరుతి మూలలో కళింగ గజపతి రాజు పై తన విజయం సాధించిన జ్ఞాపకార్థం లేఖకులు వంద స్తంభాల మంటపాన్ని రాయలవారు నిర్మిం చారు.
గర్భాలయానికి ఆనుకొని సుమారు 6 మండపాలు, ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉన్నాయి. ఆలయంలోని సభా మండపంలోని ఏకశిలాస్తంభాలు, అందులోని శిల్పకళ అత్యంత అద్బుతం.
ప్రతి స్తంభానికి నాలుగువైపులా నాలుగు ఉపస్తంభాలు చెక్కి ఉన్నాయి. అందులో ఒకటైన సంగీతస్తంభాల మండపంలో 56 స్తంభాలున్నవి. ఈ స్తంభాలను మీటితే సప్తస్వరాలు విన్పించుట ఒక విశేషం.
శిలారథం..
ఈ ఏకశిలా రథం విఠల దేవాలయ సముదాయానికి తూర్పు వైపున ఉంది. ఈ రథానికి విశేషం ఏమిటి అంటే ఈ రథానికి కదిలే చక్రాలు ఉండటం.
పాతాళేశ్వర ఆలయం..
పాతాళేశ్వరాలయం ప్రధాన ద్వారం భూమట్టానికి దిగువన ఉన్నందున దీనిని పాతాళేశ్వరాలయం అని పిలుస్తారు. దీని ముఖ ద్వారం కొంత వైవిధ్యంగా ఉన్నది. చతురస్రారాకారం మధ్యలో ద్వారం ఉన్నది. పైన గోపురం లేదు ముందు ధ్వజస్తంభం ఉంది.
దిని ముందు మండపాలు, చుట్టు ఆలయాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ శివాలయాలే. ఇది కూడ శిధిలావస్థలోనే ఉన్నది. అక్కడక్కడ శివ లింగాలు, నంది విగ్రహాలు పడి ఉన్నాయి.
ఈ ఆలయంలో శిల్పకళ అంతగా లేదు. అన్నీ సాధారణ స్థంభాలే. ఈ శైలిని బట్టి, ఇది విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి పూర్వం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో ఈ ఆలయం పూర్తిగా నీటితో నిండి పోతుంది.
శ్రీకృష్ణుని ఆలయం..
క్రీ.శ.1515లో కళింగ రాజు గజపతి రాజుపై విజయం సాధించి బాలకృష్ణుని శిలావిగ్రహాన్ని తీసు కొని వచ్చి ఇక్కడ శ్రీకృష్ణుని ఆలయం నిర్మించి, అందులో ప్రతిష్టించారు. ఈ ఆలయం పంచాయతన పద్ధతిలో కట్టబడినది.
ముఖద్వారంలోనే తెలుగు, సంస్కృతము లలో శాసనాలున్నాయి. ఈ ఆలయానికి రెండు ప్రాకారాలున్నాయి. మొదటి ప్రాకారంలో ముఖ మంటపం, అంతరాళం, సామానుల గది, వంట గది, ఇతర ఉప ఆలయాలు ఉన్నాయి
ముఖ మంటపంలో ఉన్న శిలా స్తంభాలు శిల్పకళా శోభితమై, అందు శ్రీ కృష్ణలీలలు ఘట్టాలు చెక్కబడి ఉన్నాయి. ముఖ మంటపం ప్రక్కనే ఒక గది ఉన్నది. దీని గోడలపై ఎన్నో శాసనాలు చెక్క బడి ఉన్నాయి.
గర్భగుడిలో విగ్రహం లేదు. దీన్ని మద్రాసు మ్యూజియం లో భద్రపరిచారు. మొదటి ఆవరణలో నుండి రెండో ఆవరణ లోనికి వెళ్లడానికి ఒక ద్వారం ఉన్నది. ఈ రెండో ఆవరణలో కట్టడాలేమి లేవు.
అక్కడక్కడా శిధిల శిల్పాలు, పడి ఉన్నాయి. ఈ రెండో ప్రహరీ గోడ గుడి వెనుక వైపు నుండి దక్షిణ వైపుననున్న ద్వారం వరకు ఉన్నది..
(విరూపాక్ష దేవాలయం, హంపి)
No comments:
Post a Comment