శ్రీలంకలోని కదిర్ మలై సమీపమున వున్న సుందరమైన గ్రామం కదిర్ గ్రామమ్. ఈ గ్రామ మహిమలు, గాధలు ప్రాచీన పురాణాలలో వివరించబడ్డాయి. కదిర్ గ్రామమ్ లో పరమేశ్వరుడు వెలసినట్లు, ఆ పరమశివుని దర్శనానికి
కుమారస్వామి వీరబాహునితో శ్రీలంకకి పడవలో వచ్చి, ఉగన్దై అనే తూర్పు తీరాన దిగి కదిర్ మలై కి నడిచి
వచ్చాడని పురాణాలు తెలియచేస్తున్నవి. ఈ కదిర్మలైకి ఎదురుగా దేవతల శత్రువైన శూరపద్ముడి కోట. శూరపద్ముడి సంహారం కోసమే కుమారస్వామి అవతరించాడు. ఆ దానవ సంహారం కోసమే కుమారస్వామి కదిర్ మలైలో పరమేశ్వరుని పూజించి పార్వతీదేవి అనుగ్రహంగా ఆమె శూలాన్ని ధరించి శూరపద్ముని సంహరించినట్లు
స్ధల పురాణం తెలియచేస్తున్నది.
"దక్షిణ కైలాస మహాత్యం" అనే గ్రంధంలో మురుగన్ కదిర్మలై లో అదృశ్యరూపంలో వున్నట్లు అందుకే యిది " జోతిష్కామగిరి' అనే పేరుతో పిలువబడినదని తెలుపుతున్నది. ఇటువంటి మహిమాన్వితమైన కదిర్ గ్రామమ్ లో
ఆషాఢ మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. శ్రీ లంకలోని అనేక ప్రాంతాల నుండి భక్తులు పాదయాత్రగా కదిర్ గ్రామమ్ నకు తరలివస్తారు. మురుగన్ శూరపద్ముని సంహరించడానికి శ్రీ లంకలోని ఉగన్దై అనే ప్రాంతంలో దిగి కదిర్ మలై కి వచ్చాడని స్ధలపురాణ కధనం.
ఆవిధంగా అసుర సంహారం కోసం అవతరించిన మురుగన్ ని దర్శించడానికి అగస్త్య మహర్షి శ్రీలంకకి వచ్చాడు. మురుగన్ వచ్చిన అదే సముద్రతీర మార్గం గుండా నడిచివెళ్ళి కదిర్ మలై చేరుకున్నాడు. ఆ విధంగా కదిర్ గామ భగవంతుని దర్శనానికి ప్రధమంగా పాదయాత్రగా వెళ్ళినవాడు అగస్త్య మహర్షి. ఆ మార్గం గుండానే యీనాటికి యాత్రీకుల పాదయాత్ర సాగుతున్నది.
సుమారు 2,400 సంవత్సరాలకి మునుపు కదిర్ గ్రామమ్ ని ముఖ్యపట్టణంగా ఈ ప్రాంతాన్ని పాండ్యులు పాలించారు. వారిని 'కచ్చిర గామ ప్రభుగళ్' అని మహావంశ గ్రంధం వర్ణించింది.
ఈ ప్రభువులు కదిర్ గ్రామమ్ చుట్టూవున్న గుహలలో నివసించినట్లు ఆ గుహలలోన 20 కు పైనే శిలాశాసనాలు తెలియజేస్తాయి. వాటిపై ఆ ప్రభువులకు చెందిన స్వస్తిక్ చిహ్నము, మత్స్య చిహ్నము చెక్కబడి వున్నవి. ఆవిధంగా పాండ్యరాజులచే కదిర్ గ్రామ మురుగన్ పూజించబడినాడు.
గౌతమ బుధ్ధుడు శ్రీ లంకకు వచ్చిన సమయంలో 16 ప్రాంతాలలో పర్యటించి తన సిధ్ధాంతాలను ప్రచారం చేశాడు. బుధ్ధుడు కదిర్ గ్రామమ్ సందర్శించిన కాలంలో అక్కడ దేవమైందన్ మహాసేన్ అనే రాజు పరిపాలన చేసాడని తెలుస్తున్నది.
ఆ మహాసేనుడే కుమారస్వామి అని, దేవన్ అని చెపుతున్నది పరమేశ్వరుని గురించి అని అంటారు.
శ్రీ లంకలో కోట్టై రాజులు కాలంలో కట్టిన మురుగన్ ఆలయానికి మహాసేనుడి ఆలయం అని పేరు. మహాసేనుడు మురుగన్ ఒకరే అని చరిత్ర పూర్వకంగా నిరూపించబడినది. మురుగన్ వున్న ప్రాంతానికి సిధ్ధులుపొందిన మహాత్ములు, మహర్షులు పాదయాత్ర గా వస్తూంటారు. వారి పాదయాత్ర సెల్వ సన్నిధి అనే ప్రాంతం నుండి ఆరంభమౌతుంది.
సెల్వసన్నిధిలో వీరబాహు దేవర్ మురుగన్ ని పూజించినట్లు శూరపద్మనుని వద్దకు రాయబారం వెళ్ళే సమయాన అక్కడ అడుగు పెట్టిన వీరబాహు సాయం సమయమైనందున అక్కడ తన శూలం పాతిపెట్టి మురుగన్ ని పూజించినట్లు స్ధల పురాణం వివరిస్తున్నది. అటువంటి మహిమాన్వితమైన స్ధలం నుండే యాత్రికుల పాదయాత్ర
ఆరంభమౌతున్నది. అగస్త్య మహర్షి పాదయాత్ర చేసిన మార్గం గుండా , పులస్త్యుడు, ధన్వంతర మహర్షి కపిల మహర్షి, విశ్వవసు మహర్షి, కాక్కైవణ్ణ సిధ్ధర్ , భోఘర్, బాబాజీ పతంజలి, అరుణగిరి నాదర్ మొదలైన పరమ భక్తులు కదిర్ గ్రామమ్ మురుగన్ ను అర్చించి పూజించారు.
ఈ అడవి మార్గం అనేక ఆపదలతో కూడినది. అయినా కదిర్ గామమ్ పాదయాత్ర భక్తులు మాత్రమే యీ మార్గం గుండా నడిచి వెళ్ళవచ్చును. సుమారు 30,000 మంది భక్తులు పాదయాత్రలో పాల్గొంటారు. వారికి మాత్రమే శ్రీ లంక ప్రభుత్వం అనుమతి యిస్తున్నది.
వేల సంవత్సరాలుగా పాదయాత్రలు జరుగుతున్నా కదిర్ గ్రామమ్ వెళ్ళే భక్తులకు ఆ అడవిలోని క్రూరమృగాలు,
ఏనుగులు, విషపురుగుల వలనగాని ఎవరికీ ఏ విధమైన బాధలు కలుగ లేదు. ఇందుకు కుమారస్వామి దయ యే కారణమని భక్తుల ధృఢ విశ్వాసం. నమ్మకమే కాదు, ఇది పరమసత్యం.🙏
No comments:
Post a Comment