వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం ~ దైవదర్శనం

వల్లీ సుబ్రహ్మణ్యుల కళ్యాణం




ఒకానొక సమయంలో నారదమహర్షి కైలాసపర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకున్న సుబ్రహ్మణ్యుని సన్నిధానమునకు వెళ్ళారు. లోకములలో తాను చూసిన విశేషములను చెప్పడం మొదలు పెట్టాడు. నారదుడు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు. ఒక మహర్షి తేజస్సు వలన అయోనిజయై ఒకపిల్ల అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక భిల్లు నాయకునికి దొరికింది ఆ పిల్లను తీసుకు వచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల పేరు వల్లి. ఆమె రాశీభూతమయిన సౌందర్యము. అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక. ఎప్పుడూ ఆ పిల్ల చుట్టూ పాములు ఉంటాయి. నువ్వు చూసి భయపడకూడదు సుమా! ఎవరు ఆ పిల్ల వొంటిని పట్టిన పాములను చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యమును చూసి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఆ మాటలను విని సుబ్రహ్మణ్యుడు భిల్లపురానికి వెళ్ళాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడికి భిల్లరాజు ఎదురువచ్చాడు. మంచి మంచి పువ్వులు, తేనే, పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెట్టాడు. నారదుడు భిల్లరాజుతో “నీకొక శుభవార్త చెప్తాను. మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపాడు. ఈ వల్లీదేవిని పెళ్ళి చేసుకో బోయేవాడు లోకంలో యౌవనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని అనుకుంటుందో, జగదంబ అందాలు పోసుకున్నవాడు, పరమ సౌందర్యరాశియైన శంకరుని తేజమును పొందిన వాడు, గొప్ప వీరుడు, మహాజ్ఞాని, దేవసేనాధిపతి అయినటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అన్నాడు. భిల్లురాజు నారదుని మాటలు విని చాలా పొంగిపోయాడు.


కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీ దేవి వంక చూసి బహుశః బ్రహ్మ తన సృష్టి శక్తిలోని సౌందర్యమునంతటిని ఒకచోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నాడు. ‘లతాంగీ నన్ను చేపట్టవా?” అని అడిగాడు. ఆవిడ ఈయన వంక చూసి ‘అబ్బో ఇతడు ఎంత అందగాడో’ అనుకుని నారదుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు.


ఈ పిల్లవాడు అందగాడు కావచ్చు కానీ నా మనస్సు నందు పాపపంకిలమయిన భావం కలుగరాదు. నేను సుబ్రహ్మణ్యుడికి చెందినదానను అనుకుని ‘ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. ఏదయినా అడగవలసి వస్తే మా తల్లిదండ్రులను అడగాలి. కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అందువల్ల నా మనస్సు ఆయనకు అర్పించబడిందని చెప్పింది. ఆమె అలా చెప్పగానే సుబ్రహ్మణ్యుడు ఒక్కసారి తన నిజరూపమును చూపించాడు. ఆ తల్లి పొంగిపోయింది. ఇంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనస్సులో ఎక్కడ ఆ మహానుభావుడు? నేను ఒక్కమాట నోరు తెరిచి చెప్పలేదని ఏడుస్తోంది. చెలికత్తె ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు. ఒక ఆకుమీద ఉత్తరం రాసి ఇవ్వు. నేను పట్టుకుని వెళ్లి ఆయనకు ఇస్తాను అన్నది.


సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నాడు. చెలికత్తె వెళ్లి పత్రం చూపించింది. ఆయన చదివి వల్లీదేవి దగ్గరకు వెళదామని అన్నాడు. చెలికత్తె అలా వద్దు నేను పిల్లను తీసుకువస్తానని చెప్పి వెళ్లి వల్లీదేవిని తీసుకువచ్చింది. వారిద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా తెల్లారిపోయింది. పిల్ల కనపడలేదని అందరూ వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనపడ్డారు. భిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉన్నాడు. వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణములు ప్రయోగించాడు. సుబ్రహ్మణ్యుడు హేలగా నవ్వుతూ వాటినన్నింటినీ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రమును ప్రయోగించాడు. అందరూ క్రిందపడి స్పృహ తప్పిపోయారు. వల్లీ దేవి తన వాళ్ళందరూ పడిపోయారని ఏడ్చింది. స్వామివారు అనుగ్రహించేసరికి మరల వారందరికీ స్పృహ వచ్చి లేచారు. వారు లేచి చూసేసరికి శూలం పట్టుకుని నెమలివాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్న సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరించాడు. ఆ భిల్లులందరూ నేలమీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు.


నారదుడు దేవసేనతో, పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వచ్చాడు. నేనెంత భాగ్యవంతురాలినో కదా అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది. సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో, దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తణియందు వెలసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే మన పాపములన్నీ దగ్ధమయిపోతాయి. వంశాభివృద్ధి జరుగుతుంది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List