శ్రీ కాశీవిశ్వేశ్వర, శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం ~ దైవదర్శనం

శ్రీ కాశీవిశ్వేశ్వర, శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం




శివ కేశవులు ఒకే చోట కొలువుతీరిన అద్భుత ఆలయాలలో ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు కేశవస్వామిపేట లోని ప్రసన్న చెన్నకేశవస్వామి– కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయాలు ప్రధానమైనవిగా చెప్పవచ్చు. ఈ రెండు ఆలయాలు జంట ఆలయాలుగా పేరొందాయి. ఎన్నో ఉపాలయాలతో, నిత్యపూజలతో, అభిషేకాలతో, సుస్వర వేద మంత్ర పఠనాలతో అలరారుతూ భక్తులతో నిత్యం ఈ ఆలయాలు ఒంగోలు నగరానికి ప్రత్యేక ఆకర్షణ.


ఈ దేవాలయములు ఒంగోలు పట్టణ మందు రైల్వేస్టేషనకు 1 కి.మీ. కొండపాదము ప్రక్క ప్రక్కనే నిర్మింపబడియున్నవి. ఇవి ప్రాచీన దేవాలయములు వీనిని పూర్వము ప్రాంతమునేలిన 'ఒంగోలు' రాజులు నిర్మించి దేవతామూర్తులు ప్రతిష్ట గావింపబడినట్లు వినికిడి; శరన్నవ రాత్రులందు స్వామివార్లను రోజుకొక అలంకారముతో  అర్చించి అత్యంత వైభవముగా వేడుకలు చేయబడుతున్నవి.


కార్తీక మాసములో, శివరాత్రికి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయములో-  ధనుర్మాసము, శ్రీరామనవమి మొదలైన వైష్ణవ పర్వదినము లందు శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయమందును విశేష ఉత్సవములు శోభాయమానముగా జరుపబడుచున్నవి.


ఒంగోలు కొండపై 1729లో ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఒంగోలులో నిర్మింపబడిన మొట్టమొదటి ఆలయం దాదాపు ఇదేనని చెప్పవచ్చు. స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో పూర్వం ఒంగోలు రాజుల కోట ఉండేది. ఆ కోటలో ప్రసన్న చెన్నకేశవస్వామివారికి పూజలు నిర్వహించేవారు. అయితే వెంకటగిరి రాజులతో వైరం ఉండడంతో ఎప్పటికైనా వారి వల్ల తమకు ముప్పు తప్పదనే భావంతో ఒంగోలు రాజులు ప్రసన్న చెన్నకేశవస్వామివారి ఆలయాన్ని కొండపై నిర్మించి విగ్రహాన్ని అందులో ప్రతిష్ఠించినట్లు స్థానికులు చెబుతారు.


ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం అద్భుత శిల్పకళా సంపదతో, సుందర కుడ్యచిత్రాలతో భక్తులను ఆకర్షిస్తుంది. శ్రీనివాస కల్యాణంతోపాటు పలు ఘట్టాలను గోడలపై అద్భుత శిల్పాలుగా మలచారు, కప్పుపై చిత్రించిన వటపత్రశాయి చిత్రం భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.


ప్రధాన ఉత్సవాలు :..


ముక్కోటి, విజయదశమి, కృష్ణాష్టమి, సంక్రాంతి వంటి ప్రధాన పండుగలతోపాటు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను 9 రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలు జరుగుతాయి. నిత్యం వేదపారాయణ జరుగుతుంది. ప్రతి శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహిస్తారు. 


ఆలయ సముదాయంలో వెంకటేశ్వరస్వామి, రమావసుంధరా సమేత సత్యనారాయణ స్వామి, ప్రసన్న ఆంజనేయస్వామి ఉపాలయాలున్నాయి. ఆలయ సేవాసమితుల ఆధ్వర్యంలో మాస కల్యాణాలు నిర్వహిస్తున్నారు.


కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం భక్తులకు అలౌకికానందానుభూతిని ప్రసాదిస్తుంది. ఒంగోలు రాజుల కొలువులో మంత్రిగా ఉన్న వంకాయలపాటి వీరన్న పంతులు శివభక్తుడు కావడంతో ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం చెంతనే కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు. రాజులపట్ల గౌరవం వల్ల ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయ రాజగోపురం కంటే కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ రాజగోపురం కొంత తక్కువగా ఉండేలా నిర్మించారు. 


ఆలయంలోని నంది విగ్రహం రాజసాన్ని ఒలకబోస్తూ పరమేశ్వరునివైపే చూస్తూ భక్తులను ఆకర్షిస్తుంది. 

ఆలయంలోని నటరాజ చిత్రంతోపాటు అన్నపూర్ణాదేవి చిత్రం, పార్వతి తపస్సువంటి చిత్రాలు ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో గల నాగలింగ వృక్షం పువ్వులోపల ఉండే బుడిపె తెల్లగా శివలింగం ఆకారంలో ఉండి నాగపడిగ పట్టినట్లుగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం, కుమారస్వామి ఉపాలయాలు ఉన్నాయి.


ఎలా వెళ్లాలి..?


ప్రధానమైన విజయవాడ–చెన్నై రైలుమార్గంలో ఒంగోలు ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాలనుండి రైళ్లద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు.


సమీపంలోని చూడదగిన ప్రదేశాలు: 


⚜️వల్లూరమ్మ ఆలయం, 

⚜️ సంగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, 

⚜️ సంగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 

⚜️ మలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 

⚜️ చదలవాడ రఘునాయకస్వామి ఆలయం, 

⚜️ కత్తపట్టణం సముద్రం, 

⚜️ దవరంపాడు ఉప్పుసత్యాగ్రహ శిబిరం, 

⚜️వటపాలెం సారస్వత నికేతనం ముఖ్యంగా చూడదగినవి. 

ఒంగోలు నుంచి పై ప్రదేశాలకు బస్సులతోపాటు ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కూడా చేరుకోవచ్చు.

 

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List