శివక్షేత్రాల్లో ప్రదోషకాల పూజ మరియు ప్రాముఖ్యత గురించి తెలియజెప్పి మొట్టమొదట ప్రదోష పూజ ప్రారంభించిన శివసన్నిధిగా పేరు పొందిన సర్వమంగాళా దేవి ఒడిలో పవళించిన మాహాదేవుడి దివ్యసన్నిధి ఈ దేవాలయం. పళ్లికోండి అంటే..తమిళంలో సతి ఒడిలో విశ్రమించిన పతి అని అర్ధం..ఈ పేరుకు ఈక్షేత్రానికి ఉన్న బంధం తెలుసుకుందాం..
దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని విశ్వకల్యాణార్థం పరమ శివుడు స్వీకరిస్తాడు. అనంతరం పార్వతి, పరమేశ్వరులు తిరిగి కైలాసానికి పయనిస్తూ ఉండగా.. సరిగ్గా పళ్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే అంతటి పరమేశ్వరుడు కూడా విష ప్రభావానికి లోనవుతాడు. స్పృహ తప్పిన పరమశివుడు కాసేపు సర్వమంగళ స్వరూపిని అయిన పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. పరమశివుడు మింగిన విషం గరళ కంఠుని శరీరంలోకి పూర్తిగా జీర్ణం కాకుండా పార్వతీ దేవి శివయ్య కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ గరళాన్ని అమృతంగా మార్చిన పార్వతి దేవిని అముదాంబిక అని పిలుస్తారు. ఈ అద్భుత సంఘటనలకు విగ్రహరూపమే ఈ సురుటుపల్లి దేవాలయం. ఈ ఆలయంలో శివుడు శయనించి దర్శనం ఇస్తున్నందుకు దీన్ని శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు.
శ్రీ పళ్లి కొండేశ్వరస్వామి ఆలయంలో గరళకంఠుడి విగ్రహం దాదాపుగా 12అడుగుల పొడవు ఉంటుంది. ఈ విగ్రహం సమీపంలో దేవతలు, ఋషులు చుట్టూ నిలబడి శివయ్యను ప్రార్థిస్తుండడం.. పార్వతీ దేవి ఒడిలొ ముక్కంటి శయనిస్తూ ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది. అభిషేక ప్రియుడైన శివుడికి.. అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలంతో ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పూస్తారు.
శివుడు గరళాన్ని తీసుకున్న సమయంలో ఈ తైలం పూయడం వలన విషప్రభావం తగ్గిందని ఆలయ చరిత్ర చెబుతుంది.. ఈ ఆలయంలో వెలిసిన దేవతలలో మొదటగా అమ్మవారినే దర్శించుకోవాలని అక్కడి పండితులు చెబుతుంటారు. ఎందుకంటే శివుడి శరీరంలోకి విషం వెళ్లకుండా పార్వతి దేవి రక్షించింది కాబట్టి.. ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకోవాలి. అందుకే అమ్మవారిని లోకాలను కాపాడే జగదాంబ అని పిలుస్తారు..
స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం. ఇక్కడ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు. ఆయన్ని ఆరాధించడం వలన విశేషమైన విద్యా ప్రాప్తి కలుగుతుంది. ప్రదోష వేళలో శ్రీ నందీశ్వరుని ఆరాధనకూ ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.
భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయాన్ని 1344-47 మధ్యకాలంలో విజయనగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మింపజేశారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి.
ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ వుహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగించడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా పేర్కొన్నారు..
(శ్రీ పళ్ళికొండేశ్వర స్వామి - సురుటుపల్లి - చిత్తూరు జిల్లా)
No comments:
Post a Comment