ప్రకాశం జిల్లా కందుకూరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వున్న మొగలిచెర్ల గ్రామం గురించి గతంలో ఆంధ్రప్రదేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు కానీ ఈనాడు మొగలిచెర్ల ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటి కావడం విశేషం.
మాలకొండ (మాల్యాద్రి) లక్ష్మీనృసింహస్వామి దివ్యక్షేత్రానికి దక్షిణంగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో వున్న గ్రామం మొగలిచెర్ల. మాలకొండలో తపస్సు చేసుకుంటూ శేష తపస్సును సాగించేందుకు మొగలిచెర్ల వచ్చి శివైక్యం పొందిన దత్తాత్రేయ స్వామి వల్ల మొగలిచర్ల దివ్యక్షేత్రంగా మారింది.
దత్తాత్రేయ స్వామి వారి అసలు పేరు వేణుగోపాలస్వామి. ఆయన కడప జిల్లా ఇసకపల్లి నివాసులైన తుమ్మల వేమయ్య నాయుడు, వెంకటసుబ్బమ్మ దంపతుల అయిదుగురు, మగ సంతానంలో నాల్గవవాడు.
ఆయన చిన్న వయసులోనే తండ్రి మరణించారు. అనంతరం వారి కుటుంబం ఉదయగిరి తాలూకా తూర్పు యర్రబల్లె గ్రామానికి వచ్చి స్థిరపడింది. బాల్యం నుండి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగల వేణుగోపాలస్వామి చదువుపైన శ్రద్ధ చూపేవారుకాదు. ఎప్పుడూ ఏకాంతంగా ధ్యానం చేసుకుంటూనో, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడమో చేసేవారు.
ఆథ్యాత్మిక మార్గాల కోసం భైరాగుల వెంట తిరిగేవారు. అన్నదమ్ములు మందలించి మెట్రిక్ చదవమని బలవంత పెట్టడంతో ఆయన తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్దనున్న 'ఏర్పేడు’ వ్యాసాశ్రమానికి వెళ్ళిపోయారు.
కొంతకాలం ఆశ్రమంలో వుండి ఆధ్యాత్మిక గ్రంథాలను కంఠస్థం చేశారు. ఆయన ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ముగ్ధులై ఆశ్రమ గురువులు గురుపీఠాన్ని అప్పగిస్తామని కోరగా నిరాకరించారు. అక్కడి నుండి ఆయన మాలకొండకు వచ్చి తీవ్ర తపస్సు ఆచరించాడు. ముప్పై ఏళ్ళలోపు సిద్ధ పురుషుడయ్యాడు.
వేణుగోపాలస్వామి శేషతపస్సుకు అనువైన మార్గంకోసం అన్వేషిస్తున్న తరుణంలో మొగలిచెర్ల గ్రామ కాపురస్తులు శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతులు అనుకోకుండా ఆయనను చూడటం జరిగింది. శ్రీధరరావు తన తపస్సాధనకు ఉపకరిస్తారని భావించిన స్వామి వారు ఆయనకు తన కోర్కెను మౌనభాషలో తెలిపి కాగితంమీద వ్రాసి యిచ్చారు. స్వామివారి కోరిక మేరకు శ్రీధరరావు దంపతులు 1974లో ఆయన కోరిన చోట మొగలిచెర్లకు సుమారు 2 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాల స్థలం యిచ్చారు.
ఈ స్థలంలో ఆశ్రమం నిర్మించారు. 1974లో స్వామివారు మొగలిచెర్ల వచ్చి సుమారు సంవత్సరంన్నరపాటు దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తూ తపస్సు చేశారు. శ్రీధరరావు దంపతులు తనను సజీవ సమాధి చేసేందుకు నిరాకరించినందున తాను దత్తాత్రేయ అవతారంగా మారుతున్నానని, ఇకమీదట తన నామధేయం దత్తాత్రేయస్వామి అని వ్రాసి పెట్టి 1975 మే 6వ తేదీన కపాలమోక్షం ద్వారా తనువుచాలించారు. ఆయన సమాధి నిర్మింపబడింది. అది మొదలు మొగలిచెర్ల దివ్యక్షేత్రంగా మారింది.
No comments:
Post a Comment