మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం మహానంది. ~ దైవదర్శనం

మహాశివుడు నంది రూపంలో వెలసిన పుణ్య క్షేత్రం మహానంది.




* నవనందుల దర్శనం - మోక్షానికి మార్గం..


మన పూర్వీకుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ఎన్నో అందాలు, అద్భుతాలు, రహస్యాలు దాగి ఉన్నాయి. అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో అనేక అద్భుతాలు దాగి ఉన్నాయి.


అందులో ఒక దేవాలయమే మహానంది పుణ్యక్షేత్రం. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉండే ఈ ఆలయంలో ఇప్పటికీ వీడని మిస్టరీలెన్నో ఉన్నాయి. ఇక్కడ 365 రోజుల పాటు నీరు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడి నీటిని తీర్థంగా భావిస్తారు.


శివలింగం ప్రత్యేకత.. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో మహానంది పుణ్యక్షేత్రంలో కొలువై ఉన్న శివలింగానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పురాణాల ప్రకారం...ఓ గాథ వుంది..


పూర్వం కర్నూలు మండలం లోని కొంత ప్రాంతాన్నినందనరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు. అతను నిత్యవచనుడు, పరమ దయా భాసురుడు, పరమేశ్వర భక్తుడు.


నత్యము శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమనిష్టాపరుడు. అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు. అందుకే ప్రత్యేకంగా ఆవులమందను పోషించేవాడు.


అన్ని ఆవులలోను ఓ కపిలక్షీరము ప్రత్యేకంగా అభిషేకానికై వినియోగించేవాడు. ఆ గోసంరక్షణకు గోపాలుడనే అతి నమ్మకమైన బంటును నియమించాడు.


గోపాలుడు ప్రతి దినము ఉదయమే ఆవులను తోలుకొని అడవికి వెళ్లేవాడు. చక్కని పచ్చిక బయళ్లతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు. క్షీరములు రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్లేవాడు. అదే అతని నిత్యకృత్యము. శివార్చనకై వినియోగించే క్షీరప్రసాదిని కపిల. ఆ కపిల సొగసే సొగసు. సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది. భువన రక్ష చేసే జగన్మాతలా ఉండేది. సర్వప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది. ఆ గోవుపాలు గంటెడు తాగినా అమృతపానం.


చక్కని కొమ్ములతో, అతి చక్కని మూపురంతో నంది నాట్యమాడినట్లు నడిచే నడకలతో పరమేశ్వరానుగ్రహ వాహకములైన నల్లని కళ్లతో సాక్షాత్తు నంది దేనువులా ఉండేది ఆ కపిల. ఒక రోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యధారీతి పాలు తీయుటకు వెళ్లగా అమావాస్యనాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు. పలకై వదిలిన దూడను తన్నినది గోవు. పాలు తీయుటకు వెళ్లిన గోపాలునీ తన్నినది. తల్లిని మించిన తల్లి. సాధువులలో సాధువు. నా తల్లి నన్నేల తన్నినది, కుంభంలా ఉండే పొదుగేల చిక్కినది. పాలేమైనవి.


అర్ధంకాని గోపాలుడు ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నవించాడు. వ్రతభంగానికి రాజు చింతించి దిష్టి తీయించినాడు. ఆవుకు సేవలు చేసినాడు. మరుసటి రోజు యధాప్రకారమే అయినది. మూడవ రోజునా అంతే జరిగినది. రాజునకు కోపం వచ్చి గోపాలుని శిక్షించలేక, వ్రత భంగమునకు ఓర్వ లేక గోపాలుని కఠినంగా శాసించాడు.


మూడు రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు. ఎవరో తనను మోసగించి పాలు పిదుకుకొని వెళుచున్నారని వూహించిన గోపాలుడు ఆ రోజు ఎవరూ ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడినాడు.

సాయంకాలమైంది. ఆవులనన్నింటిని మళ్లించుకొని రాజకోష్టము వెళ్లినాడు. కానీ కధ యధాప్రకారమైనది.


రాజు గారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు. వికల మనస్కుడై ఇంటికి చేరినాడు. ఎప్పుడూ జరగనది ఇలా జరుగుతున్నదేమిటి. ఎవరు దీనికి కారకులు. మనుషులా... దైవమాయా.. ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను. ఆవు పొదుగు పిండనిదే పాలు ఎలా మాయమవుతాయి. ఇదేదో చిత్రంగా ఉంది అనుకున్నాడు. ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు గోపాలుడు. అతనికన్నీ కలలే. కల నిండా గో సమూహము అన్నీ కపిలలే. ఎటు చూసినా గోక్షీరం క్షీర సముద్రంలాగా పాలమయం.


ఆ పాల మధ్య పరమేశ్వర సమేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలునిలా మారి పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు. తెల్లవారింది. కల అర్ధం తెలియక ఆందోళనతో ఆనాడు విషయం తెలుకోవాలనే పట్టుదలతో ఆవుల మందతో వెళ్లాడు గోపాలుడు. 


అన్ని ఆవులను తప్పించుకొని వెళ్లసాగింది కపిల. దానిని అనుసరించాడు గోపాలుడు. అది వెళ్లి వెళ్లి ఓ పుట్ట వద్ద నిలిచింది. సరిగా పుట్టపై నిలిచింది. వల్మీకాగృంలో ఓ పసిబాలుని ముఖం కనిపించింది.


గోవు ధారగా పాలు పితక సాగింది. జగమంతా ఆకలితో ఉన్నట్లు ఆ బాలుడు ఆ క్షీరాన్ని త్రాగసాగాడు. అద్బుతం...ఆశ్చర్యం... ఆనందం... పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది. యధావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు. నందనరాజుకు విషయం తెలియలేదు. ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు.


ఆ రోజు రాత్రి నాల్గవ జాములో పరమేశ్వరీ సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమైనాడు. నందనరాజా నీవు ధన్యుడవు. నీ రాజ్యము ధన్యము. నీ గోవూ గోపాలుడూ ధన్యులే. ఆ పాలు తాగిన పసిబాలుడు ఎవరో కాదు నేనే.


నిన్నూ నీ రాజ్యాన్ని అనుగ్రహించటానికే వచ్చాను. ఆ పుట్ట ఉన్నచోటే నాకొక ఆలయాన్ని నిర్మించు. అక్కడే ఒక కోనేరు త్రవ్వించు. నా దేవి గంగాభవాని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలుకువ వచ్చింది. నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్లాడు. సాయంకాలం దాకా కాచుకొని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు.


ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది. ఆ అడుగు పుట్టపై పడింది. ఆ కపిల ఆ బాలుడు అదృశ్యమైనారు. రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నారు. తరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు  ప్రవీణులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు. సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు. ఆ పుట్టలో వెలసియున్న శివ లింగరూపుడు మహానందీశ్వరుడు. ఆ క్షేత్రమే మహానంది దివ్యక్షేత్రము.


దింతో అలా స్వామి వారి శివలింగంపైన ఆవు యొక్క పాదముద్ర పడుతుంది. అందుకే ఇక్కడ ఉన్న శివలింగం ఎత్తుగా కాకుండా కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ లింగం కింద నుండి నీరు ఊరుతూ.. ఆ నీరు పుష్కరిణిలో చేరుతుంది.


స్వచ్ఛమైన నీరు..


అక్కడకు వచ్చే నీరు గాలి గోపురం ముందు వైపు రెండు గుండాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల అక్కడుండే పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా.. పరిశుభ్రంగా ఉంటుంది. శివుని యొక్క లింగం నుండి వచ్చే ఈ నీళ్లు సంవత్సరం పొడవునా ఎన్నో ఔషధాలు ఉన్న నీరు ప్రవహిస్తూ ఉంటాయి. ఇవి వేసవికాలంలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా.. వర్షాకాలంలో మలినాల్లేకుండా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.


స్పష్టంగా కనిపించే నాణేలు..


ఇక్కడ ఉన్న నీటిలోకి మనం ఏదైనా నాణేన్ని వేసినా.. లేదా చిన్న గుండుసూది వేసినా కూడా ఐదు అడుగుల లోతులో ఉన్న నీటిలో నుండి అవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి.


ఈ దేవాలయం ఆవరణంలోని బావులలోకి ఈ స్వచ్ఛమైన నీరు మనకు కనబడుతుంది. ఈ నీటిని భక్తులందరూ తీర్థంగా భావిస్తారు. ఈ మహానంది క్షేత్రంలోని నీరే సుమారు 3 వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తోంది.


ఇతర ఆలయాలు..


ఇదే పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయం, కామేశ్వరీ దేవి ఆలయం ఇతర దర్శనీయ ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని రుద్ర పుష్కరిణులు ఉన్నాయి. గర్భాలయం ఎదుట ఉన్న పెద్ద నంది దాని ఎదుట ఉన్న చక్కని పుష్కరిణి వీటిని కలిపి ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది. ఈ మహా నందికి 18 కిలోమీటర్ల దూరంలో తొమ్మిది నంది ఆలయాలు కూడా ఉన్నాయి. అవీ...


ప్రథమ నంది..


నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది.


విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు.


ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.


నాగనంది..


నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే. ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు. 


సోమనంది..


నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.


శివనంది..


నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం... విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు.


విష్ణునంది లేక కృష్ణ నంది..


శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం.. ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.


విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.


లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి.


ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.


సూర్యనంది..


నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.


గరుడ నంది..


సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.


వినాయక నంది..


మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.


మహానంది..


మనం ముందే చెప్పుకున్నట్లు ఈ నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది.


ఈ క్షేత్రానికి ఉన్న మరో స్థలపురాణం ప్రకారం..


పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు. సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. 


"సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి.


సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం..

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List