"గొడ్రాలి కొండ"... సంతాన భాగ్యాన్ని కలిగిస్తుందనే విషయం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
'గొడ్రాలి కొండ' పై తిరుమలనాథ స్వామిగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులచే పూజలు అందుకుంటూ ఉంటాడు. మహిమాన్వితమైనదిగా చెప్పబడే ఈ క్షేత్రం ప్రకాశం జిల్లా రాజంపల్లి సమీపంలో వెలసింది. శ్రీ తిరుమలనాధ స్వామి క్షేత్రం చారిత్రక ప్రాధాన్యత గల సుప్రసిద్ధ క్షేత్రం.
ఇక ఈ కొండ పేరు వింటేనే ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి వెనుక బలమైన కారణమేదో ఉంటుందని అనిపించక మానదు. ఆసక్తికరమైన ఆ కారణమే ఇక్కడ స్థల పురాణంగా చెప్పుకుంటూ వుంటారు. సంతానం లేని దంపతులు నిష్ఠగా స్వామి వారిని కొలుస్తూ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతానవంతులవుతారని ఈ ప్రాంత భక్తులు అపారమైన నమ్మిక.
ఈ నమ్మికతో పలువురు సంతానం లేని దంపతులు ఇప్పటికీ ఈ క్షేత్రాన్ని దర్శించి వెళుతుంటారు.
స్థల పురాణం..
పూర్వం ఈ ప్రాంతంలో రాజమ్మ - రాజయ్య అనే దంపతులు నివసిస్తూ ఉండేవారు. సంతానం లేకపోవడం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. తనని అంతా గొడ్రాలుగా చూస్తుంటే రాజమ్మకి ఎంతో బాధగా వుండేది. తనకి సంతానాన్ని ఇవ్వమని మనసులో దైవాన్ని ప్రార్ధిస్తూ, ప్రతి రోజు ఆమె ఓ పుట్టలో పాలు పోసి మిగిలినవి అమ్ముకుని వచ్చేది.
రోజు రోజుకీ ఆ పుట్ట పెరిగిపోతూ ఉండటంతో ఆమె పాలు ఎక్కువగా పోయవలసి వచ్చేది. పాలపై రాబడి తగ్గడంతో, విషయం తెలుసుకున్న రాజయ్య ఆమెపై చేయి చేసుకోబోగా వేంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు. జరిగింది రాజయ్యకి వివరించి వారికి సంతానాన్ని ఇస్తున్నట్టుగా చెప్పాడు. రాజమ్మ పాలు పోసిన పుట్ట కాలక్రమంలో కొండగా మారింది. దానిని అందరూ " గొడ్రాలికొండ" గా పిలవసాగారు.
ఈ కొండపై వెలసిన వేంకటేశ్వరుడు పిలిస్తే పలికే దైవంగా పూజలు అందుకుంటున్నాడు. సంతానంలేని వారు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామి వారిని వేడుకుంటే వారి కడుపు పండుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
విశేషమైనటువంటి పర్వదినాల్లో స్వామివారికి జరిగే ఉత్సవాలు ఘనంగా కనువిందుగా వుంటాయి.
No comments:
Post a Comment