పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ. ~ దైవదర్శనం

పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ.

గురుదేవులైన యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల గురించి ఓ చిన్న పరిచయం మీకు అందించాలనే తపనతో ఓ చిరు ప్రయత్నం ముందుగా.....
 పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ గురుదేవులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు...


"సూర్యుడు ఉదయించిన తరువాత దానిని  చాటవలసిన అవసరం ఏముంది?"

బెంగాలులో ఘుర్ణి గ్రామ కాపురస్తులయిన గౌర్ మోహన్ లాహిరీ, ముక్తకేశీదేవి దంపతులకు ఈ దేవశిశువు క్రీ. శ. 30 సెప్టెంబర్ 1828 న జన్మించాడు. గౌర్ మోహన్ లాహిరీ  గారు సదాచారులు, నిష్టావంతులు, ధర్మపరాయణులు, పూజాపురస్కారాల్లో, పఠన పాఠనాల్లో, ధర్మ చర్చల్లో, సత్సంగంలో ఎప్పుడూ  మునిగి ఉండేవారు, యోగమార్గసాధన పట్ల విశేషంగా మొగ్గుచూపేవారు. ఆయన భార్య ముక్తకేశీదేవి చాలా నిష్టాపరులు, ప్రతిరోజు  కులదేవత అయిన శివుడికి శ్రద్దగా పూజ చేస్తుండేది. ప్రతిరోజు ఈ దేవ శిశువును ఒళ్ళో పెట్టుకొని శివధ్యానంలో మునిగి ఉండేవారు. ఆ సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుని శివుడి మాదిరిగా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవారు. అప్పుడప్పుడు ఆవిడ, కొడుకును ఏటి ఒడ్డున ఇసుకమీద కూర్చోపెట్టి ఇంటిపని చేసుకుంటూ ఉండేవారు. అప్పుడా పిల్లవాడు శివుడి మాదిరిగా ఒంటినిండా దుమ్ముతో, కళ్ళుమూసుకొని కూర్చొని ఉండేవాడు. ఆ పిల్లవాడి హావభావ స్వభావాలు ముద్రలు మొదలయినవి చూసిన బుద్ధిమంతులు "ఆ పిల్లవాడు మామూలువాడు కాదుసుమీ", అనుకునేవారు. అతను ఏదో కాల్పనిక జగత్తులో, లేదా భావలోకంలో విహరిస్తున్నాడేమో అని, అపరిమిత అనంతసత్తతో యోగ సూత్ర స్థాపనకు ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది.

          ఒకనాడు బిడ్డను ఒళ్ళోపెట్టుకొని శివధ్యానంలో మునిగి ఉండగా... హఠాత్తుగా, విశాలకాయుడు జటాజూటధారి సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి ప్రత్యక్షమయి "అమ్మా, ఈ  అబ్బాయి మాములు మానవ శిశువు కాడు. సంతప్తులు సంత్రస్తులూ, సంసార సంబంధమయిన మోసాల్లోనూ, యూతనల్లోనూ  చిక్కుకొని దుఖః భాజనులయిన వేలాదిమంది గృహస్థులకు గోప్యమయిన సాధన ద్వారా మార్గనిర్ధేశం చేయడం కోసమని, నా యోగబలం ద్వారా, నీ పుత్రుడిగా ఈ అబ్బాయిని పంపాను, ఈ అబ్బాయి గృహస్థజీవితం గడుపుతూ చాలామందిని యోగసాధన వైపు ఆకర్షిస్తాడు. ఇందులో భయపడవలసిందేమి లేదు. నేను నీడలా ఎప్పుడూ  నీ బిడ్డ వెంబడే ఉంటాను. అతను  నా నీడలోనే జీవితమంతా తన అంతర్ జ్యోతిని ప్రసరింపజేస్తూ ఉంటాడు, అని చెప్పినాడు.
          శ్యామాచరణునికి ఐదేళ్ళ వయస్సప్పుడు తల్లి ముక్తకేశీదేవి గారు మరణం సంభవించింది. ఈ దుర్ఘటన జరిగిన తరువాతే గౌర్ మోహన్ గారికి సంసారం మీద విరక్తిభావం ఏర్పడింది, మరియు వారు కుటుంబ సమేతంగా కాశీ యాత్ర చేస్తుండేవారు. అలా వారికి కాశీనగరంతో పరిచయం వల్లనో మరియు ఆ కాలంలో వారి ఇల్లు ఏటి ఒడ్డున ఉన్నందువల్ల ఒకసారి పెద్దపెట్టున వరద ముంచుకొచ్చి వారి ఇంటినీ భూమిలో అధికభాగాన్నీ పొట్టన పెట్టుకుంది. ఇలా ఏ కారణంగానో వారు కాశీ నివాసులు కావడానికి నిశ్ఛయించుకొన్నారు. అక్కడ అంతకుముందే వారి పెద్దకొడుకు చంద్రకాంతుడు మదన్ పురాలోని సమన్ చౌహాట్టలో ఒక ఇల్లు కొని ఉంచాడు. కాశీ  వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటుండేది.

          శ్యామాచరణ గారి విద్యాభ్యాసం గరుడేశ్వర్ మొహల్లాలో భూకైలాస రాజయిన జయనారాయణ ఘోషాల్ స్థాపించిన జయనారాయణ ఇంగ్లీషు పాఠశాలతో మొదలైంది. ఆయన ఇంగ్లీషు, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలే కాక ఫార్సిభాష కూడా నేర్చుకున్నారు. ఇంతేకాకుండా, నాగాభట్టనే మహారాష్ట్ర శాస్త్రపండితుని సన్నిధిలో సంస్కృతంతో బాటు వేదం, ఉపనిషత్తులు మొదలయిన శాస్త్రగ్రంధాలు ధార్మిక గ్రంధాలు అధ్యయనం చేశారు.

          కాలేజీలో చదువుతుండే రోజుల్లోనే 18 వ ఏట అంటే క్రీ . శ . 1846 లో శ్యామాచరణులకు మంచి నిష్టాపరులయిన బ్రాహ్మణులు, కాశీలోని పండితుల్లో మంచి పేరుప్రతిష్టలు కలిగిన మరియు గౌర్ మోహన్ గారికి మంచి స్నేహితులు అయిన దేవనారాయణ సన్యాల్ వాచస్పతి గారి కూతురు కాశీమణి తో వివాహమైంది.             

( త్రైలింగస్వామి వారు ( వీరు తెలుగు వారు ) కేవలం నిస్తావంతులయిన బ్రాహ్మణులుగా పేరుగన్న సన్యాల్ గారి ఇంట్లోనే భిక్ష తీసుకునేవారని చెబుతారు. )
          క్రి. శ. 1851 లో 23 ఏళ్ల వయస్సులో శ్యామాచరణులు ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. గాజీపూర్ లో పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంటు వారి మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్ లో గుమస్తాగా చేరారు. ఆ రోజుల్లో సైన్యానికి ఆహార సామాగ్రి సరఫరా చేయడం, రోడ్లువంటివి నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు. ఆ తరువాత మీర్జాపూర్, బక్సార్ , కటువా, గోరఖ్ పుర్ , దానాపూర్, రాణిఖేత్, కాశీ మొదలయిన చోట్లకు శ్యామాచరణులకు బదిలీ అవుతూ వచ్చింది. సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్ ( ఈ రోజుల్లో S.D.O ) పదవిలో ఉండేవారు.

          క్రీ. శ. 1868 నవంబర్ 23 వ తేదీన, శ్యామాచరణులను రాణిఖేత్ కు బదిలీ చేస్తూ ఉత్తరువు వచ్చింది. నవంబర్ 27 న శ్యామాచరణులు భరత వర్షంలో ఉత్తర దిక్కున హిమాలయాల ఒడిలో 5980 అడుగుల ఎత్తున ఉన్న రాణిఖేత్ కు ప్రయాణమయ్యారు . ఒక రోజున శ్యామాచరణులు సాయుధులయిన సిపాయిల్ని, నౌకర్లని వెంటబెట్టుకొని జనసంచారం లేని కొండదారిలో వెళ్తూ ఉండగా... ఒక సన్యాసి తమను పేరు పెట్టి పిలుస్తున్నట్టు గమనించారు. ఆ సన్యాసి కొండ దిగి వచ్చి "నువ్వు ఇదే దారిలో వస్తావని నాకు తెలుసు. నీ కోసమే ఎదురుచూస్తూ ఉన్నా, నువ్వు ఆఫీసు పనులు తొందరగా పూర్తిచేసుకోని నా కుటీరానికి రా..., నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను." అని చెప్పి ఆ సన్యాసి దూరంగా కొండ మీదున్న కుటీరం వైపు చూపిస్తూ వెళ్లిపోయారు. శ్యామాచరణులు ఆఫీసుపని తొందరగా ముగించుకొని ఆ సన్యాసి దగ్గరికి వెళ్లారు.


          "శ్యామాచరణ్, ఇలా రా! నన్ను నువ్వు గుర్తుపట్టడం లేదా?" అని అడిగారు ఆ సన్యాసి గుహలో ఉంచిన పులి చర్మమూ కమండలమూ వంటివి చూపించి, "వీటిని కూడా గుర్తుపట్టలేక పోతున్నావా? అని వారు శ్యామాచరణులను మెల్లగా స్పృశించారు దాంతో వారికి  పూర్వజన్మలోని సాధనమయ జీవనం గుర్తుకు వచ్చింది. ఆ మహామునే పూర్వజన్మలో తమ గురుదేవులని అర్ధమయింది. ఇవి వెనుకటి జన్మలో నువ్వు ఇక్కడే ఉండి సాధన చేస్తూండేవాడివి. ఈ పులిచర్మం, ఈ కమండలం అన్నీ నీవే, వీటిని నీకోసం జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇక్కడే సాధనచేస్తూండగా నీ జీవితం ముగిసిపోయింది. ఆ తరువాత ఘుర్ణి గ్రామంలో గౌర్ మోహన్ గారి కొడుకుగా పుట్టావు. అప్పటినుంచే అన్ని విషయాల్లోనూ నీమీద నా దృష్టి ఉంది. నీకు యోగదీక్ష ఇవ్వడానికి ఈ కొండప్రాంతానికి నేనే బదిలీ చేయించాను అని వారికీ యోగదీక్షాప్రదానం చేశారు.

          శ్యామాచరణులు తమ గురుదేవులను బాబాజీ అని పిలుస్తూండేవారు. కొద్దిరోజులకు బాబాజీ శ్యామాచరణులతో నిన్ను ఇక్కడికి రప్పించిన పని పూర్తయింది. "ఇప్పుడు నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వక్కడ చెయ్యవలసింది చాలా ఉంది." ఒక గృహస్థూయోగ్యతతో, గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోరయోగసాధన చేస్తూ ఒక ఉజ్జ్వల ఆదర్శాన్ని నెలకొల్పాలి. ప్రజలందరూ నీకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ సద్గృహస్తులందరికి నువ్వు ముక్తి మార్గం చూపిస్తావు అని అన్నారు. అలా కొద్దిరోజులకే శ్యామాచరణుల బదిలి ఉత్తరువు వచ్చింది. క్రీ. శ. 1869 జనవరి 15 వ తేదీన ఈ యోగసాధనను మతంతో ప్రమేయం లేకుండా అందరికి ఉపదేశించడానికి అనుమతిని తీసుకొని గురుదేవుల దగ్గర సెలవు తీసుకొని బయలుదేరారు.

సాధనాశక్తి :
          ఇంగ్లాండులో ఉన్న తన భార్యకు చాలా జబ్బుగా ఉందనీ, ఆమె బతకడం కూడా కష్టమని తెలిసింది, అందులోను చాలా రోజులుగా అక్కడి నుండి ఉత్తరం రాకపోవడం వల్ల శ్యామాచరణుల పైఅధికారి చింతాగ్రస్తులయినారు. అది తెలుసుకున్న శ్యామాచరణుల మనస్సు కరుణతో నిండిపోయింది. శ్యామాచరణులు వెంటనే ఆఫీసులోనే ఏకాంతంగా ఉన్న ఒక గదిలోకి వెళ్ళి ధ్యానస్థులయారు. కొద్దిసేపయిన తరువాత గదిలోంచి బయటికి వచ్చి, దొరసాని గారి ఆరోగ్యం బాగుపడిందనీ త్వరలోనే అక్కనుంచి ఉత్తరం వస్తుందనీ, ఆ ఉత్తరంలో ఆమె రాసిన విషయాల్ని కూడా వారు సూచించారు.

          కొన్నాళ్ళకి దొరసాని దగ్గరనించి ఉత్తరం వచ్చింది. అందులో రాసిన విషయాలు శ్యామాచరణులు చెప్పినవే ఉన్నాయి. కొన్ని నెలల తరువాత ఆ దొరగారి భార్య ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఒకనాడు ఆ దొరసాని, తన భర్తను కలుసుకోడానికి ఆఫీసుకు వచ్చింది. అక్కడ శ్యామాచరణులను చూస్తూనే పోల్చుకొని విస్మితురాలయింది. తాను జబ్బులో ఉన్నప్పుడు ఈ మహాత్ములే తన మంచం దగ్గర నిలబడ్డారని వారి కృపవల్లనే తన రోగం నయమయిందని దొరగారికి చెప్పింది. ఇలా శ్యామాచరణులు తమ ప్రేమా, కరుణలను ఎన్నో సార్లు ప్రకటించారు.

          ఒకానొక సందర్భంలో త్రైలింగస్వామి ( వీరు తెలుగు వారు, వీరు సాక్షాత్తు, కాశీలో సజీవంగా సంచరించే విశ్వనాథులుగా పేరు పొందినవారు) వారు "దేన్నీ పొందడానికి సాధువులు సన్యాసులు గోచీగుడ్డతో సహా అన్నీ త్యాగం చెయ్యవలసి వస్తుందో దాన్ని ఈ మహాత్ముడు, గృహస్థాశ్రమంలోనే ఉండి పొందాడు". అని యోగిరాజుల గురించి ఒక పలకమీద రాసి చూపించారు.

యోగదీక్షాప్రదానం :
          శ్యామాచరణులు యోగదీక్షాప్రదానం అనేది వీరు వారు అనకుండా ఇచ్చేవారు. ఒక పూలు అమ్మేవాడు, చెప్పులు కుట్టేవాడు దగ్గరనుంచి పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తుల వరకు రాజులూ, మహారాజులు సైతం, ఎంతో మంది వారి కృపకు పాత్రులయ్యారు.

         శ్యామాచరణులు ప్రచారానికి విముఖులయినందువల్ల ఎన్నడూ ఒక సభలో కానీ వేదిక మీదకాని నిలబడి ఉపన్యాసమిచ్చినవారు కారు. ప్రచారావసరాన్ని గురించి శిష్యులెవరయినా చెప్పినప్పుడు వారు, "సూర్యుడు ఉదయించిన తరువాత దానిని డప్పుకొట్టి చాటవలసిన అవసరం ఏముంది?" అనేవారు. 

          యోగిరాజులు స్వయంగా అనేక మందికి యోగక్రియప్రదానం చేస్తూ, ఆత్మోన్నతిమార్గంలో ప్రగతి సాధించడానికి వాళ్ళకు ప్రేరణ ఇస్తుండేవారు. వారు ఎంతమందికి దీక్షాప్రదానం చేశారో చెప్పడానికి కచ్చితమయిన లెక్కంటూ ఏది లేదు. వాళ్ళలో విఖ్యాత యోగులుగా పరిచితులయినవారు కొందరున్నారు - యోగిరాజుల కుమారులు - ఋషికల్పులు - తీన్ కౌడీ లాహిరీ, దుకౌడీ లాహిరీ, పంచానన భట్టాచార్య, స్వామి ప్రణవానంద గిరి, స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి (శ్రీ పరమహంస యోగానంద గారి గురువు గారు), భూపేంద్రనాథ్ సన్యాల్, స్వామి కేశవానంద, స్వామి కేవలానంద, విశుద్ధానంద సరస్వతి, కాశీనాథశాస్త్రి, నాగేంద్రనాథ్ భాదురీ, ప్రసాద్ దాస్ గోస్వామి, కైలాసచంద్ర వాంద్యోపాధ్యాయ, రామగోపాల్ మజుందార్, మహేంద్రనాథ్ సన్యాల్, రామ్ దయాల్ మజుందార్, హరినారాయణ పాల్ది మొదలయిన వారు ముఖ్యలు. అంతేకాకుండా, కాశీనివాసి భాస్కరానంద సరస్వతి, దేవఘర్ నివాసి బాలానంద బ్రహ్మచారి, నానక్ పంథీ సాయిదాస్ బాబా గార్లు కూడా తమ సాధనామార్గానికి భిన్నమయిన యోగిరాజుల యోగసాధనను అనుష్టించినట్లు వినవస్తుంది. ఆ కాలపు కాశీరాజు, నేపాల్ రాజు, కాశ్మిరరాజు, బర్ ద్వాన్ రాజు, కాళీకృష్ణ ఠాకూర్, సర్ గురుదాస్ వాంద్యోపాధ్యాయ వంటి సమాజంలో ఉన్నతశ్రేణిలో ఉన్న మరికొందరు కూడా వారిదగ్గర యోగదీక్ష పొందారు.
          ఇంతేకాకుండా, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వేలాదిమంది ముక్తిమార్గ సంధానం పొంది కృతకృత్యులయారు. గృహస్థాశ్రమముకంటె గొప్ప ఆశ్రమం ఏది లేదని అంటుండేవారు యోగిరాజులు. గృహస్థాశ్రమం మీదే తక్కిన ఆశ్రమాలన్నీ ఆధారపడి ఏర్పడతాయి. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల భరణపోషణలు చేసేది అదే. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్ఠమయినది.


వీరే కాకుండా ఇంకా ఎంతో మందిని సత్యమార్గంలోకి నడిపించారు, ఇంకా ఎంతో మంది తమ జీవితాలను ఉన్నతంగా మలుచుకున్నారు ఈ క్రియాయోగ సాధనతో. సంసారబంధంలో ఇరుక్కొని కొట్టుకుపోతున్న మనలాంటి వాళ్ళకోసం లాహిరీ మహాశయులు తమ గురుదేవులైన బాబాజీ దగ్గర నుండి క్రియాయోగ సాధనను మొట్టమొదటగా మళ్ళి ఈ ప్రపంచంలోకి తీసుకువచ్చి మనకు అందించారు. అంతేకాకుండా ఈ క్రియాయోగ సాధనను అభ్యసించాలంటే సంసారం వదలాల్సిన అవసరం లేదని తానే సంసార బంధంలో ఉండి ఎలా ఈ సాధన చేసి మోక్షం పొందవచ్చో తన జీవితాన్నే ఒక ప్రామాణికంగా చూపించారు. ఇంతటి గొప్ప యోగిరాజుల జీవిత చరిత్రను ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వారి జీవిత చరిత్ర పుస్తకం అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో  దొరుకుతుంది. ఈ పుస్తకం యొక్క ఫోటో పైన ఇవ్వబడింది. ఈ పుస్తకం యోగిరాజులు స్వయంగా రాసుకున్న 26 డైరీలు మరియు కొంత వారి శిష్యుల ఉత్తరాల నుండి పొందిన సమాచారాల ఆదారంగా మరియు యోగిరాజుల మనవడి (శ్రీ సత్యాచరణ లాహిరీ) సహాయంతో వాచస్పతి అశోక్ కుమార్ చట్తోపాధ్యాయ గారు రచించారు. తప్పక చదవండి, ఈ పురాణపురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరీ మహాశయుల  కృపకు పాత్రులవండి. వారి దృష్టి మీ పై పడుగాక.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List