చక్కని తల్లికి చాంగుభళా! ~ దైవదర్శనం

చక్కని తల్లికి చాంగుభళా!

తిరుమల కొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారు. ఈ అమ్మ తిరుపతి సమీపంలోని తిరుచానూరు (అలిమేలి మంగాపురం)లో కొలువుదీరివున్నారు. ప్రతీ ఏటా తిరుమల శ్రీనివాసునికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే, తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారికి కూడా ప్రతీ సంవత్సరం కార్తీకమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో భాగం ఆ చివరిరోజు పంచమితీర్థం కూడా ఉంటుంది. కార్తీక బ్రహ్మోత్సవాలలో ఈ ఉత్సవానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. లక్షలాది భక్తులు ఈ రోజున అమ్మవారిని దర్శించి ఆశీస్సులు అందుకుంటారు. అయితే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఒక పురాణ గాథ ఉంది.

పూర్వం నైమిశారణ్యంలో మునులందరూ కలసి యజ్ఞాలు చేస్తుండగా, అక్కడికి నారదమహర్షి వచ్చి, “ఈ యాగం ఎవరికోసం చేస్తున్నారు” అని అడిగి, “చేస్తే చేశారు గానీ, దేవతలలో గొప్పవారు ఎవరో ముందుగా తెలుసుకుని, ఈ యాగఫలాన్ని వారికి అర్పించండి” అని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకు భృగుమహర్షి, ఎవరు గొప్పో తేల్చాలని ముందుగా బ్రహ్మలోకానికి, ఆ తరువాత కైలాసానికి వెళ్ళి బ్రహ్మదేవుడు, శివుడు గొప్పవాళ్ళి కాదని నిర్ణయించి చివరకు వైకుంఠానికి వెళ్ళి అక్కడ కూడా నిరాశకు లోనై, కోపం పట్టలేని భృగుమహర్షి శ్రీమహావిష్ణువు వక్షస్థలం మీద కాలితో తన్నుతాడు. అది చూసిన శ్రీమహాలక్ష్మీ ఆవేశంతో అలిగి భూలోకానికి వెళ్ళిపోయి కొల్హాపురం చేరుకుంది. ఆమెను వెదుక్కుంటూ విష్ణుమూర్తి కూడా భూలోకానికి వచ్చి కొల్హాపురంలో శ్రీమహాలక్ష్మీ ఉందని తెలుసుకుని అక్కడుకు వెళ్ళి తపస్సు చేసినా, ఆమె దర్శనం లభించలేదు. ఇంతలో “ఓ శ్రీనివాసా! నీకు ఇక్కడ దర్శనం లభించదు. స్వర్ణముఖీతీరంలో ఒక సరోవరాన్ని ఏర్పాటుచేసి, అక్కడ తపస్సు చేస్తే లక్ష్మీదేవి దర్శనమిస్తుంది” అంటూ ఆకాశవాణి చెబుతుంది. వెంటనే శ్రీనివాసుడు శుకముని ఆశ్రమానికి చేరుకొని, అక్కడ ఒక చెరువు త్రవ్వి, అందులో స్వర్గలోకం నుంచి తెచ్చిన పద్మపుష్పాలను నాటుతాడు. ఆ పుష్పాలు ఎల్లప్పుడూ వికసించి ఉండాలని, అందుకోసం సూర్యదేవుడునికూడా ప్రతిష్టించి పన్నెండేళ్ళ పాటు తపస్సు చేయగా, శ్రీమహాలక్ష్మి పద్మసరోవరంలో బంగారుపద్మంలో పదహారేండ్ల యువతిగా అవతరించింది. పద్మంలో అవతరించినందువల్ల శ్రీమహాలక్ష్మీని పద్మావతిగా పిలుస్తూ దేవతలందరూ ఎన్నోవిధాలుగా స్తుతించి ప్రార్థించారు. మరొక కథ ప్రకారం, ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్న తరవాత, నూతన దంపతులు పర్వతారోహణం చేయరాదని ఆగస్త్యమహాముని చెప్పగా, కోంతకాలంపాటు ఆ కొత్త దంపతులు అగస్త్యమహాముని ఆశ్రమంలోని గడిపారు. అదే శ్రీనివాసమంగాపురం అని చెప్పబడుతోంది. ఆ తదనంతరం కొంతకాలానికి పద్మావతీదేవి తాను తన భర్తతో కలసి వేంకటాచలానికి వెళ్తున్నట్లుగా తన తండ్రికి కబురు చేయగా, ఆకాశరాజు తన కుమార్తెకు వివిధ వస్తువాహనాలను, వస్త్రాభరణాలను, దాసదాసీజనాలను, సారెను ఇచ్చి అల్లుడి వెంట పంపాడు. అలా ఆ నూతనదంపతులు కొండనెక్కుతుండగా, కోంత దూరం ప్రయాణించిన అనంతరం శ్రీనివాసుడు, పద్మావతిని “కరివేపాకు తెచ్చావా?” అని అడిగాడు. ఆమె తేలేదని చెప్పగా, శ్రీనివాసుడు తిరుమలలో కరివేపాకు దొరకదనీ, వెనుకకు వెళ్ళి కరివేపాకును తీసుకుని రమ్మని చెబుతాడు. వెంటనే కరివేపాకు కోసం పద్మావతీదేవి తిరుచానూరు వెళ్ళింది. అక్కడ కరివేపాకు చెట్లు చిన్నవిగా ఉన్నాయి. ఫలితంగా పద్మావతీదేవి కరివేపాకు పంటను పండించడానికి తిరుచానురులోనే కొలువై ఉందట.
తిరుచానూరులో శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించబడుతుంటాయి.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List