ఇంటిలో పూజా మందిరము (పూజ గది) ~ దైవదర్శనం

ఇంటిలో పూజా మందిరము (పూజ గది)

ప్రాచీన కాలములో ప్రతి గృహములోను " అగ్ని గృహము " అనే ప్రత్యేక గృహము ఉండేది. ఈ కాలము అది దాదాపు కనుమరుగు అయ్యింది. అక్కడక్కడా ఇంకా ఉంది.  కొన్ని  ఇళ్ళలో ఆ అగ్ని గృహము చూసే భాగ్యము నాకు కలిగింది. ఆ అగ్ని గృహములో ’ అగ్నిహోత్రము ’ చేస్తారు.
మరికొందరు, అగ్ని గృహము లేకున్నా, ఒక మూల ’ ఔపాసనా హోమము ’ చేయుటకు వసతి కల్పించుకొని అక్కడ రెండుపూటలా అగ్ని పరిచర్యలు చేస్తుంటారు.

కాలక్రమేణా అనేక కారణాలవల్ల ఈ అగ్ని గృహము కానీ , ఔపాసనా హోమము కానీ అరుదైపోయిది. ఇది మన సనాతనధర్మపు క్షీణత గానే మనము పరిగణించాలి.
ప్రాచీన కాలమునుండే , ఈ అగ్ని గృహముతోపాటూ , మరొక ప్రత్యేక పూజామందిరము కూడా ఉండేది. అవి ఈనాటికీ చాలా ఇళ్ళలో చూస్తున్నాము.
కానీ నాగరికత పెరిగేకొద్దీ, లేక, జనసంఖ్య పెరిగే కొద్దీ, చిన్న ఊళ్ళను వదలి పట్టణాలకు వలస వచ్చేవారి సంఖ్య ఎక్కువవుతోంది, లేదా , చిన్న ఊర్లే పెద్దవిగా మారి, పట్టణ పోకడలు ఎక్కువ అయ్యాయి. ఇళ్ళు చిన్నవి అవుతున్నాయి. దానితో మొదటి వేటు పూజా మందిరము పైన పడుతున్నది.
కొంతకాలము కిందట ,  " మీ బాత్ రూము కూడా ఒక రూమే , దాన్ని కూడా ఇతర గదులవలె ఆధునికముగా కట్టుకోండి " అనే నినాదాలు, ప్రకటనలు పేపర్లలో వచ్చేవి. బాత్‌రూములమీద ఉన్న శ్రద్ధ పూజగదిమీద కొరవడింది.
ఇప్పుడు వస్తున్న ఆధునిక ఇళ్ళసముదాయాలు, ఇళ్ళ సంకీర్ణాలను చూస్తే , వాటిలో మనకు తెలియని, అవసరములేని ఎన్నెన్నో సౌకర్యాలు , సదుపాయాలు ఇస్తున్నారు. కొత్త ఇళ్ళు కట్టుకునేవారు చాలామంది , ఇటువంటి ’ ఆధునిక సౌకర్యాలు’  సమకూర్చుకుంటున్నారే గానీ, పూజగది అంటూ ఒకటి ఉండాలి అన్న విషయము మరచిపోతున్నారు. లేదా నిర్లక్ష్యము చేస్తున్నారు.
పూజగది అనేది మన సనాతన సాంప్రదాయాలకు, ధర్మానికి ఆయువుపట్టు వంటిది. పూజగది లేని ఇల్లు స్మశానము తో సమానము.
పూజగది ఉంటే , కాసేపు అక్కడ కూర్చొని, ఏ ధ్యానమో, జపమో చేసుకోడానికి వీలుగా ఉంటుంది. లేకపోతే , ధ్యానము , జపము , పూజ వంటివి చేయాలని ఉన్నా , సౌకర్యము కాదు గనక, చెయ్యకుండా వదిలేస్తున్నారు. అది అలాగే అలవాటై, మన ధర్మము ఖిలమై , ఆ యింటికి ఒకనాటికి చేటు తెస్తుంది.  పూజ గది ఉంటే , రోజూ కాకపోయినా , కనీసము శెలవు దినాలలో అయినా, లేక దినములొ ఏదో ఒక సమయములోనో అయినా కాసేపు కూర్చొని నామస్మరణ  చేసుకుంటే అది ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.  మన దృష్టిని కేంద్రీకరించి , ఒక్క అయిదు నిమిషాలైనా మన మనసును భగవంతునిపై నిలపగలిగితే అది మనకున్న అనేక శారీరిక, మానసిక రుగ్మతలను పోగొడుతుంది.
ఎలాగంటే ,
మనసును ఒకసారి భగవంతునితో అనుసంధానము చేసుకుంటే , అది ఒక గొప్ప టానిక్ లా పని చేస్తుంది. అంతవరకూ మనసులో ఉన్న కల్లోలాలు , అశాంతులు మాయమవుతాయి. మనకు ఆత్మ విశ్వాసము పెరుగుతుంది. మనలో ప్రవేశించిన ,  ప్రవేశిస్తున్న చెడు ఆలోచనలు , పోకడలకు అడ్డుకట్ట పడుతుంది. మనసు ప్రశాంతతను పోంది, నెమ్మది కలిగి, అన్నివిషయాలపైనా , మనము చేసే పనులపైనా ఏకాగ్రత కలుగుతుంది. దానివల్ల మన సామర్థ్యము హెచ్చుతుంది. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి.  ఆందోళనలు తగ్గుతాయి. దానివల్ల తలనొప్పులు, ఆకలి లేకపోవడాలు , అధిక రక్తపోటు వంటివి నివారింపబడుతాయి. వీటివల్ల కలగబొయే ఇతర జబ్బులు దరికి రావు. మన నడవడి మెరుగై, మనమీద ఇతరులకు నమ్మకము , అభిమానము , ప్రేమ కలుగుతాయి. దానివల్ల మనము చేపట్టే కార్యాలన్నీ విజయవంతమై , మనకు సిరి సంపదలు కలుగుతాయి.
రోజుకు ఒక్క అయిదు నిమిషాల పూజ తో ఇన్ని సత్ఫలితాలు కలుగుతాయి.
కాబట్టి పూజా మందిరపు ప్రాముఖ్యత అర్థము అవుతుంది.

కానీ ఆశ్చర్యముగా , ఇళ్ళు కట్టేవారు దీనికి చాలా తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
అనేకులు పూజా మందిరము కట్టరు. ఆధునిక సౌకర్యాలు ఇచ్చే పెద్ద పెద్ద సంకీర్ణాలలో పూజా గది మృగ్యము. నేను ఈ మధ్య అటువంటి అనేక సంకీర్ణాలను చూశాను. ప్రతి ఒక్కరినీ తప్పకుండా ’ మీరు పూజా గది ఎందుకు ఇవ్వలేదు ? మీకెందుకు ఆ ఆలోచన రాలేదు ?" అని అడిగాను.
" పూజాగదికి డిమాండు లేదు సార్, పైగా కట్టితే ’ అనవసరముగా  వందో రెండు వందలో చదరపు అడుగులు వేస్టు అవుతుంది. అయినా ఎంతమంది వాడుతారు, దాని బదులు ఒక బాత్ రూము ఇస్తే చాలా సౌకర్యము ’ అంటున్నారు.

" మన దేశములో హిందువులు ఎక్కువ కదా , వాడకపోవడము ఏమిటి? మీరు ఇస్తే ఆ ఇళ్ళకు డిమాండు పెరుగుతుంది " అన్నాను. వారు చేదు మింగినట్టు మొహం పెడతారు.
ఇంట్లో కనీసము రోజూ పూజా గది ని చూస్తూ ఉంటే , చిన్న పిల్లలకు ఒక అవగాహన వస్తుంది, ఒక మంచి అలవాటు వస్తుంది. పూజగదితో ఎన్నో ప్రయోజనాలున్నాయే గానీ నష్టము లేదు.
ఈ మధ్య ఒక పెద్ద ప్రాజెక్టులో ఆధునిక వసతులతో కడుతున్న ఒక సంకీర్ణములో ఇళ్ళలో పూజాగృహము డిజైన్ చేసి ఉండటము చూశాను. సంతోషమైంది.
అనేకులు , పూజా గృహము లేకపోతే , ఒక మూల ఒక గూట్లోనో, ఒక టేబుల్ పైనో, ఒక స్టాండు మీదో, ఒక  విగ్రహమో, పటమో పెట్టుకొని అదే పూజాగదిగా అనుకొని ఉపయోగిస్తున్నారు. అలా ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టుకోకూడదు. దానికో కారణము ఉంది.
పూజ గది ప్రత్యేకముగా ఉంటే , అందులోకి ఎప్పుడు వెళ్ళినా శుచీ శుభ్రతలతో, స్నానము చేసి మాత్రమే ప్రవేశిస్తాము. అక్కడ ఇఅతర విషయాల-- అనగా, టీవీ, ఫ్రిజ్ , కంప్యూటర్లు, మొబైళ్ళు , ఇతర సరకులు , డైనింగు టేబుల్ మీద ఎంగిలి పాత్రలు , కంచాలు , మిగిలిన అన్నము, కూరలు---వంటి అనేక వస్తువుల , పదార్థాల ప్రభావము , కాలుష్యము , నెగెటివ్ ప్రకంపనాలు ఉండవు. దానివల్ల మనము ఒకనిమిషమే పూజ చేసినా సంపూర్ణ ప్రభావము ఉంటుంది. ఇలా మూలల్లో పెట్టుకుంటే అలా జరగక , ఫలితము రాదు.  ఒకవేళ విధిలేక , తప్పని సరి అయితే ,  ఏ వంట గదిలోనో  చుట్టూ ఒక చెక్క గోడను అమర్చుకోండి, కనీసము ఒకపట్టు బట్టతో తెర అయినా కట్టండి. చెక్క , లేదా పట్టు  నెగెటివ్ ప్రకంపనాలను తీసుకోవు. రానీకుండా అడ్డుపడతాయి. పాలరాయి వాడకండి. దానికి ఆగుణము లేదు. ఇక , పడకగదిలో పూజా మందిరము పెట్టుకోకండి.

ఒకప్పుడు వాస్తు గురించి ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఈ మధ్య సామాన్యుడి నుండీ మంత్రులవరకూ , బిచ్చగాడి నుండీ సినిమా తారలవరకూ వాస్తు చూస్తున్నారు. పాటిస్తున్నారు.
అలాగే ఈ పూజ గది-అనే అంశాన్ని మనము ప్రాచుర్యములోకి తేవాలి. అద్దె ఇల్లయినా, సొంత‌ఇల్లయినా సరే , పూజ గది ఉంటేనే అందులోకి మారండి. లేకుంటే అవి తీసుకోవద్దు. మనము డిమాండు చేస్తేనే బిల్డర్లలో మార్పు వస్తుంది. అప్పుడు, " ఎవరూ అడగరండీ , ఎవరు తీసుకుంటారండీ , ఎందరు వాడుతున్నారండీ ,ఇంకో బాత్ రూమ్ వస్తుంది కదాండీ " వంటి వాగుడు నిలచిపోతుంది.

పూజగదిని ఇంటిలో ఈశాన్య మూలలో లేదా తూర్పువైపు , అదీ కాదంటే చివరికి ఉత్తరము వైపు పెట్టుకోండి.
ఒక ముఖ్య గమనిక :- పూజ గది , బాత్‌రూము, వంట గది-- ఈ మూడూ పక్కపక్కన ఉండరాదు. వాటి తలుపులు పక్కపక్కన ఉండరాదు.
పూజ గదిలో కనీసము ఇద్దరు పక్కపక్కన కూర్చొనే స్థలము ఉండాలి. సాష్టాంగ నమస్కారము చేసే వీలు ఉండాలి.
పూజ గదికి కిటికీలు పెట్టకండి. పొగ పోవడానికి అతి చిన్న గవాక్షము చాలు. జిగిజిగిజిగేలు మనే లైట్లు , కదలే లైట్లు , కళ్ళు మిరుమిట్లు గొలిపే రంగులు వాడకండి. వీలైనంతవరకు పూజగదిలో విద్యుద్దీపాలు ఉన్నా , వాడవద్దు. శుభ్రము చేసే సమయాల్లో మాత్రమే వాడండి. మిగిలిన సమయాల్లో ఏ ఆముదమో , నువ్వులనూనెనో వేసి దీపాలు వెలిగించి ఉంచండి. కంటికీ , మనసుకూ ఇంపు , ప్రశాంతత. లక్ష్మీ ప్రదము.
|| శుభం భూయాత్ ||
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List