అయ్యప్ప దీక్ష నియమావళి. ~ దైవదర్శనం

అయ్యప్ప దీక్ష నియమావళి.

దీక్షా సమయంలో అయ్యప్పలు పాటించవలసిన నిత్యనియమావళి :-

1. ప్రతిదినము ఉదయమే సూర్యోదయమునకు ముందుగా మేల్కొని కాల కృత్యములు తీర్చుకుని, చన్నీళ్ళ శిరస్నానం ఆచరించి, స్వామికి దీపారాధన గావించి, స్వామి స్తోత్రములు పఠించి తరువాతనే మంచి నీరైనను త్రాగాలి. సాయంత్రము వేళ కూడా చన్నీళ్ళ శిరస్నానం చేసి, స్వామికి దేవతార్చన జరిపి, రాత్రిపూట భిక్ష చేయాలి.

2. రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఒక దేవాలయమును దర్శించాలి.

3. నల్లని దుస్తులు మాత్రమే ధరించాలి.

4. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి.

5. మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టిపరిస్థితిలోనూ తీయరాదు. అయ్యప్ప సాన్నిధ్యము చేరుటకు కనీసము 48 రోజులు ముందుగా దీక్ష ఆరంభించాలి.

6. దీక్ష కాలమందు గడ్డము గీసుకొనుటగాని క్షవరం చేయించుకొనుట గాని పనికి రాదు. గోళ్ళు కూడా కత్తిరించకొనరాదు.

7. అస్కలిత బ్రహ్మచర్యము పాటించుతూ యోగిగా జీవించుట అయ్యప్పకు ఎంతో అవసరము. ఇంటిలో ఒక వేరు గదిలో వుండుట శ్రేయస్కరము. దాంపత్యజీవితము మనోవాక్కాయకర్మములందు తలచుట కూడ అపరాధము.

8. మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించరాదు. నేల మీద కొత్త చాప పరచుకొని పరుండట ఉత్తమము.

9. అయ్యప్పలు శవమును చూడరాదు. బహిష్టయిన స్త్రీలను చూడరాదు. అట్లు ఒకవేళ చూసిన యెడల ఇంటికి వచ్చి, పంచగవ్య శిరస్నానమాచరించి, స్వామి శరణు ఘోష చెప్పిన పిదపనే మంచి నీరైనా త్రాగవలెను.

10. దీక్షలో 'స్వామియే శరణమయ్యప్ప' అనే మూల మంత్రమును ఎప్పుడూ జపించవలెను.

11. దీక్షా సమయంలో స్త్రీల నందరిన్నీ (భార్యతోసహా) దేవతామూర్తులుగా భావించాలి.

12. తమ పేరు చివర 'అయ్యప్ప' అని పదము చేర్చాలి. ఇతరులను 'అయ్యప్ప' అని పిలవాలి. స్త్రీ అయ్యప్పలను 'మాలికాపురం' లేదా 'మాతా' అని పిలవాలి.

13. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు (భోజనమునకు) పిలిస్తే తిరస్కరించరాదు.

14. అయ్యప్పల నుదుట ఎప్పుడు విభూధి, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి.

15. మద్యము సేవించుటగాని, పొగాకు పీల్చుట వంటి దురలవాటు మానుకొనవలెను. తాంబూలం కూడా నిషిద్ధమే.

16. రోజు అతి సాత్వికాహారమునే భుజింపవలెను. రాత్రులందు అల్పాహారము సేవించవలెను.

17. తరచూ భజనలలో పాల్గొనుట అత్యుత్తము. స్వామి శరణు ఘోష ప్రియుడు కాబట్టి ఎంత శరణు ఘోష జరిపితే స్వామికి అంత ప్రీతి.

18. హింసాత్మక చర్యలకు దూరముగా వుండాలి. అబద్దమాడుట, దుర్బాషలాడుట చేయరాదు. అధిక ప్రసంగములకు దూరముగా వుండాలి.

19. ప్రతి దినము స్వామికి అర్చన చేసి, తర్వాత ఇష్టదైవమును ప్రీతికొద్ది ధ్యానించాలి.

20. అష్టరాగములు, పంచేంద్రియములు, త్రిగుణములు, విద్య, అవిద్యలకు దూరముగా వుండాలి. ఇదే పదునెట్టాంబడి.

21. శక్తి కొలది దీక్షా సమయములో కనీసము ఒకసారైనా నల్గురు అయ్యప్పలకు భిక్ష పెట్టుట మంచిది.

22. స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి.

23. దీక్షా సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు.


1 వ మెట్టు (కామం)

ఈ మెట్టుకు అధి దేవత "గీతా మాత".ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. గతజన్మలో తాను చేసిన పాపపుణ్యకర్మల విచక్షణాజ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు.
"లైంగిక కోరికను" సంస్కృతంలో "కామము" అని అంటారు. ఇంకా విస్తృతంగా కోరిక, వాంఛ అని కూడా అంటారు.

2 వ మెట్టు ( క్రోధం)

ఈ మెట్టుకు అధి దేవత "గంగా దేవి". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగ్తుంది.
"తన కోపమే తన శత్రువు". మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.

3 వ మెట్టు (లోభం)

ఈ మెట్టుకు అధి దేవత "గాయత్రీ మాత". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమగతులు కలుగుతాయి.
అవసరాలకంటే ఎక్కువ కావలనుకునే బుద్ది. కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ దుఖాఃనికి చేటు.

4 వ మెట్టు (మోహం)

ఈ మెట్టుకు అధి దేవత "సీతా దేవి". ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక.
ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబందం భావన.

5వ మెట్టు (మదం)

ఈ మెట్టుకు అధి దేవత "సత్యవతీ మాత". ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక. 4 & 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి.
తాను అనుకున్న లేక నమ్మిన దానినే ఉత్తమమైనదిగా భావించే మనసత్వం.

6వ మెట్టు (మాత్స్యర్యం)

ఈ మెట్టుకు అధి దేవత "సరస్వాతీ దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విష్ణుసాయుజ్యం, సమస్త ధాన ఫలం కలుగుతుంది.
ఇతరుల సంతోషాన్ని కాని ఆనందాన్ని ఒర్వలేని బుద్ది

7వ మెట్టు (దంబం )

ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవిద్యా దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞానయోగాధ్యాయం కలిగి పునర్జన్మ కల్గదు.

8వ మెట్టు (అహంకారం)

ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవల్లీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.
నాకు మాత్రమే తెలుసు లేక నేనే గొప్ప అనుకునే బుద్ది.

9వ మెట్టు (నేత్రములు)

ఈ మెట్టుకు అధి దేవత "త్రిసంధ్యా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది.
దేవుడు సృష్ఠించిన ఈ లోకాన్ని చూడడానికి ఉపయోగపడే ఇంద్రియమే నేత్రములు (నయనాలు లేక అక్షులు) “సర్వేంద్రియానం నయనం ప్రధానం”

10వ మెట్టు (చెవులు)

ఈ మెట్టుకు అధి దేవత "ముక్తిగేహినే దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది. ఇవి మంచిని వినుటకు మాత్రమే ఉపయోగించవలెను.
స్వామి కీర్తనలను, నామాలను వినుటకు ఉపయోగపడే ఇంద్రియమే చెవులు.

11వ మెట్టు (నాసిక)

ఈ మెట్టుకు అధి దేవత "అర్ధమాత్రా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు.
వాసనను గ్రహించే ఇంద్రియమే నాసికం.

12వ మెట్టు (జిహ్వ)

ఈ మెట్టుకు అధి దేవత "చిదానందా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. దీనిని కఠొరంగా మాట్లాడుటకు ఉపయోగించకూడధు.
షడ్రుచులను తెలిపే ఇంద్రియమే జిహ్వ (నాలుక). ఈ ఇంద్రియంతోనే స్వామిని కీర్తనలతో, నామాలతో స్మరించి ఆ రుచిని కూడా పొందాలి.

13వ మెట్టు (స్పర్శ )

ఈ మెట్టుకు అధి దేవత "భవఘ్నీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి.
స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ.

14వ మెట్టు (సత్వం)

ఈ మెట్టుకు అధి దేవత "భయనాశినీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీహత్యాపాతకాలు నశిస్తాయి.
స్వచ్ఛత, ప్రశాంతత, ఆనందం, శక్తి, మంచితనం యొక్క నాణ్యత. కొన్నిసార్లు మంచితనం గా అనువదించబడిన సాత్వ యొక్క దశ తేలిక, శాంతి, పరిశుభ్రత, జ్ఞానం, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.

15వ మెట్టు (తామసం)

ఈ మెట్టుకు అధి దేవత "వేదత్రయూ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి.
అతి నిద్ర , చాలా సోమరి, చీకటి, అజ్ఞానం, మందగతి, విధ్వంసం, భారము, వ్యాధి, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.

16వ మెట్టు (రాజసం)

ఈ మెట్టుకు అధి దేవత "పరాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లభిస్తాయి.
రాజసం యొక్క దశ. చర్య, అభిమానం, సృష్టి, దుడుకు, చురుకు మొదలైన లక్షణములు కలిగి ఉండటం.

17వ మెట్టు (విద్య)

ఈ మెట్టుకు అధి దేవత "అనంతాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి.
అభ్యాసం లేదా అధ్యయనం ద్వార సాధించే ఆధ్యాత్మిక అవలంబనే విద్య.

18వ మెట్టు (అవిద్య)

ఈ మెట్టుకు అధి దేవత "జ్ఞానమంజరీదేవి". ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.
విద్య లేకపొవటమే అవిద్య. విద్య లేని వాడు వింత పశువు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List