కవళీ మాత లేక కౌడీ బాయి మందిరం. ~ దైవదర్శనం

కవళీ మాత లేక కౌడీ బాయి మందిరం.

కవళీ మాతని గవ్వలమ్మ అని కూడా అంటారు. ఈమెని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదని అంటారు. ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు. అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు.

కవళీ మాత ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదావిశ్వేశ్వరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం, తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే, ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం, తిరిగి హరిజనుడు స్పృజించడం, తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది.

ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక, ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు, కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండరాదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళినందుకు, విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోతున్నందుకు చింతిస్తూ శివుని గురించి తపస్సు చేసింది.

ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షం కాగా "ఈశ్వరా! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను?" అని ఆవేదనపడింది. ఈశ్వరుడు "కవళీ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపస్సుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు" అని చెప్పి అదృశ్యం అయ్యాడట.

అప్పటి నుండీ కవళీ "కవళీ మాత" అయింది. కనుక, భక్తులు కాశీ విశ్వేశ్వరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని, ఆమెతో "ఈ గవ్వలు నీకు, కాశీ ఫలితం నాకు" అని ప్రార్ధించిన భక్తులకు కాశీ వెళ్లిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా తప్పకుండా దర్శించుకుంటారు. ఈమెను విశ్వనాధుడికి సోదరిగా భావిస్తారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List