మహిమాన్విత సంగమేశ్వర స్వామి.. ~ దైవదర్శనం

మహిమాన్విత సంగమేశ్వర స్వామి..


ద్వాపర యుగములో కౌరవులు పన్నిన మాయా జూదములో పాండవులు పరాజితులైరి. తత్ఫలితముగ పరిసర అరణ్యములో ఆశ్రమము నిర్మించుకొని నివసించుచుండిరి. వారిని మరింత మనస్తాపాలకు గురిచేసి అవమాన పరచాలని, కనివిని ఎరుగని, అట్టహాసాలను తమ భోగ భాగ్యములను వారి ముందు ప్రదర్శించాలనే తలంపుతో ‘‘ఘోషయాత్ర’’ నెపముతో బయలుదేరిరి. మార్గమధ్యములో గంధర్వులు, కౌరవులను తమ శత్రువులుగా భావించి సంగ్రామ మొనరించి కురువీరులందరినీ పట్టి బంధించిరి.
దుష్ట చతుష్టయమును (దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసన) రథములకు కట్టి గంధర్వ లోకమునకు కొనిపోవుచుండ, విషయము తెలిసిన పాండవాగ్రజుడు అక్కడనే యున్న భీమార్జునులను కౌరవ వీరులందరిని బంధవిముక్తులను గావించిరండని ఆనతిచ్చెను. తత్ఫలితముగ కురువీరులు చెరనుండి వీడి ఘోర పరాభవముతో హస్తినాపురికి చేరిరి.
విషయము తెలిసిన వాసుదేవుడు, పాండవులను చేరి మీరు ఇక్కడ నుంచి బహుదూరములో నున్న దండకారణ్యములో కొంతకాలము గడిపిరండని ఆదేశించాడు. మురారి కోరిక మేరకు దండకారణ్యములో ప్రవేశించిరి. ఆ దండకారణ్యము భయంకర క్రూర జంతు సమూహములతో, మిక్కిలి భయంకరమైన వృక్షావరణతో, వివిధ రకములైన దృశ్యాలతో, మనస్సుయ్యాలలూగు శోభలతో తన్మయపరచు శక్తి సామర్థ్యములు ఆ అటవి ప్రాంతమునకు కలదు. గలగల పారు జలపాతములు, హృదయానందమును కలిగించును. ఇట్టి ప్రాంతము రాక్షసులకు నిలయము. అట్టి అరణ్య ప్రాంతములో సంచరిస్తు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు. అక్కడి ప్రజలను ఆదరిస్తూ, వారి వారి మన్ననలను పొందుతూ సంచార జీవితము గడుపుతున్నారు. అలా సంచరిస్తూ మనసులను ఆహ్లాదపరచే జల విన్యాసములతో అలరారుచున్న కృష్ణ, తుంగభద్రల సంగమము (కూడలి) చేరుకున్నారు.
ప్రకృతి సుందర దృశ్యములు, వివిధ చిత్ర విచిత్ర జీవరాసులు స్వేచ్ఛగా తిరుగుతూ, పరస్పర చెలిమి కలిగి సంచరించుచుండెడివి. ఆ ప్రదేశము వారిని తన్మయులను చేసింది. తాత్కాలిక పర్ణశాల నిర్మించుకొని కృష్ణ తుంగభద్రల కూడలిలో నిష్కాములై ఆనంద పారవశ్యములో తమకు సంభవించిన కష్టములను, బాధలను, అవమానములను సర్వమును మరచి సుఖ జీవితమును సాగించారు పాండవులు. కాలచక్రము తిరుగుచుండ ఒకనాడు ధర్మరాజు పత్నీ సమేతుడై, సోదరులను కూర్చుండబెట్టుకుని, ఇంత సుందర ప్రదేశము మన జీవితములో సుస్థిరముగా నిలిచిపోతుంది. ఇక్కడ రెండు నదుల సంగమము (కూడలి) కావున సంగమేశ్వరుని ప్రతిష్టించి పూజలు చేసి తరించాలని కోరికను వెల్లడించాడు. అగ్రజుని కోరిక నెరవేర్చదలచిన భీమసేనుడు, శక్తిసామర్థ్యములతో కాశి క్షేత్రము చేరి అన్నపూర్ణ, విశ్వనాథస్వాముల ప్రార్థన చేసి అక్కడనున్న ఒక పవిత్ర శివలింగమును తీసుకొని ఆఘమేఘాలమీద కృష్ణా, తుంగభద్రల సంగమమునకు చేరుకున్నాడు. పాండవులు సకల పూజా ద్రవ్యాలు సేకరించి రెండునదుల కలయిక గట్టుపై ఆ శివలింగమును ప్రతిష్టించి, పూజా కార్యక్రమములు సాగించిరి. కొంతకాలము పాండవుల పూజలందుకున్నాడు ఆ సంగమేశ్వరుడు. మీకు విజయములే కాని అపజయములుండవని ఆ సంగమేశ్వరుడు వక్కాణించాడు. పాండవులు అక్కడి నుంచి శ్రీశైల క్షేత్రము వెళుతూ, సంగమ దేవా- ఈ సంగమములో స్నానము చేసి మిమ్ముల దర్శించిన వారినందరిని కాపాడుము. వారి వారి కోరికలను తీరుస్తూ జీవితములు ధన్యము చేయమని ప్రార్థించిరి. తథాస్తు అంటూ పలికాడాభక్త సులభుడు ఈశుడు. అట్టి సమయంలోనే బసవేశ్వరుడను మహాను భావుడు ఉదయంచి అంతరించిపోతున్న మానవ సంస్కా రాలను,్ధర్మాన్ని ప్రోది చేయనారంభించాడు
ఆ తరువాత ఆ సంగమేశ్వరుని చాళుక్యరాజులు కృష్ణా, తుంగభద్రల సంగమమును దర్శించినారు.
తన్మయులైనారు. ఆనంద పారవశ్యులైనారు. ప్రకృతి సుందర దృశ్యాలు ఆ నదులు ఏకమై ఒకే నదిగా ప్రవహిస్తూ అలరింపజేస్తున్న ఆ సుందర దృశ్యములకు ముగ్ధులైనారు. ఆ స్థల విశిష్టతను వౌఖికముగ ప్రచారములోనున్న పురాణ, జానపదుల కథలను విన్నారు. సంగమేశ్వరుని చూడాలని ఆయన అనుగ్రహం పొందాలని వారు తహతహలాడారు.
వారు కోరుకున్న విధంగానే ఆ సంగమేశ్వరుడు వారి స్వప్నములో సాక్షాత్కరించి శాశ్వత గుడి నిర్మాణము చేయమని ఆదేశించారు. ఆ దేవ దేవ సంకల్పమే చాళుక్యులు స్థిరమైన ఆలయము నిర్మించి, పూజలు, వ్రతాలు, దీక్షలు చేసి తమ జన్మలు ధన్యము చేసుకున్నారు. ఆ సంగమేశ్వరుని నిత్య పూజ దూప దీప నైవేద్యములకు భూదానాలు చేసినట్లు చారిత్రక ఆధారములున్నవి.
నాటి నుంచి నేవరకు భక్త జన సందోహము శివ శివ నామస్మరణతో, వీరభద్రుని ఖడ్గాలతో వివిధ మంగళ వాయిద్యాలతో సంగమేశ్వరుడు సర్వజనా హృదయాలలో తేలియాడేవారు. కూడలిలో పవిత్ర స్నానాదులు చేసి, ఉపవాసము చేస్తూ, రాత్రి అంతయు శివకీర్తనలు, నాటకములు, కోలాటములతో తన్మయులై జాగరణ చేసి, తిరిగి స్నానములు చేసి దూప దీప నైవేద్యములు సమర్పించి తమతమ జీవితములు ధన్యము చేసుకొంటున్నారు.
పురావస్తుశాఖవారు సంగమేశ్వరాలయాన్ని కడు జాగ్రత్తతో ఆలయ శిలలను తొలగించి తమ చాకచక్యముతో అలంపుర క్షేత్రములో కూడలి దగ్గర (సంగమము) ఎలా యున్నదో అలానే చూడముచ్చటగా నిర్మించి, వేద పండితులతో సంగమేశ్వరుని పునఃప్రతిష్టించారు.
ఇప్పుడు కూడ ఆనాటివలె జంగమయ్యలు నిత్య దూప దీప నైవేద్యములతో పూజలాచరిస్తున్నారు. బాలబ్రహ్మేశ్వరుని, జోగుళాంబ దేవాలయాల ప్రతిష్ట కూడా అక్కడే జరిగాయ. కాని కిటకిటలాడే భక్తజనసందోహం తగ్గింది. అయనప్పటికీ కొద్ది మంది మాత్రమే నిత్యము దర్శించుకుంటూ తమ జీవనము ధన్యము చేసుకుంటున్నారు. సర్వా భీష్టప్రదాకుడైన ఈశ్వరుడిని ప్రతివారూ దర్శించి పునీతులు కావాలి.
ఎలా చేరుకోవచ్చు..???
కర్నూలు నుండి అలంపురం బస్సులో ప్రయాణించాలి. పిమ్మట అక్కడినుండి కాలినడకన లేక గుఱ్ఱము బండ్ల మీద ప్రయాణించి నేరుగా సంగమేశ్వరము చేరుకోవచ్చును.
పాలమూరువాసులు వయా నాగర్‌కర్నూలు ద్వారా కొల్లాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలి. తర్వాత చెల్లెపాడు బస్సులో ప్రయాణించి అయ్యవారిపల్లెలో దిగాలి. అక్కడి నుంచి కాలినడకన లేక బాడుగ ఎద్దుల బండ్లు కట్టించుకొని 2 కిలోమీటర్లు దూరము పయనించి సంగమేశ్వరం చేరుకోవచ్చును.
కర్నూలు జిల్లాలో ప్రసిద్ధిపొందిన ఆత్మకూరు, తాలూక, నందికొట్కూరు తాలూక ప్రజలు సమీపంలో నెహ్రూనగర్ లేక నాటూరు కొణిదేలకు చేరుకుని, అక్కడి నది ఒడ్డునుంచి పడవలలో ప్రయాణించి చేరవచ్చును. వేసవి కాలంలో అయితే పాద నడకన నదిని దాటి ఆ క్షేత్రాన్ని దర్శించవచ్చు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List