భారతదేశం విభిన్న సంస్కృతి సాంప్రదాయాల సంగమం. దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజల కట్టుబొట్లు, ఆచార వ్యవహారాలు వేరైనా ఆయా రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పండుగలు మాత్రం ఒక్కటే. దసర, దీపావళి, సంక్రాంతి, ఉగాది, క్రిస్‌మస్, రంజాన్ ఇలా ప్రతీ పండుగను దేశవ్యాప్తంగా అందరు జరుపుకోవడం సహజం. కాని పండుగల్లోనూ ఓ ప్రత్యేకతను చాటుకుంటూ సంప్రదాయానికి పెద్దపీఠ వేసే గ్రామాల ప్రజలు నేటికి ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. నాగపంచమి... అంటే నాగుపాముల నుంచి రక్షణ పొంది, నాగదోషం కలగకుండా పిల్లలను కాపాడుకునేందుకు చేసేపూజ. ఈ నాగుల పంచమి రోజున మహిళలు పుట్టలో పాలు పోసి నాగదోషం లేకుండా చేయాలని మొక్కుతారు. ముఖ్యంగా రాష్ట్రంలో నాగుల పంచమి పండగా ప్రతిఏటా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. కాని సరిగ్గా ఇదే... నాగపంచమి రోజున పాములకు బదులు తేళ్లకు నైవేద్యాలు పెట్టి వాటిని దేవుళ్లుగా భావించి తేళ్ల పండగ జరుపుకోవడం కర్నాటక రాష్ట్రం యాద్గీర్ తాలుకా కందుకూరు గ్రామస్థుల సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దున గల యాద్గీర్ తాలుకా కందుకూరు గ్రామమది. రెండువేల జనాభా ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట డివిజన్ కేంద్రానికి సరిగ్గా 25కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ గ్రామం. ప్రతి ఏటా నాగుల పంచమి రోజున దేశవ్యాప్తంగా అందరు పుట్టలో, నాగుల విగ్రహాలకు పాలుపోసి నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటే కందుకూరు గ్రామంలో మాత్రం తేళ్ల విగ్రహాలకు నైవేద్యాలు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. మొక్కులు తీర్చుకుంటే పర్వాలేదు. తేళ్లను ఒంటిపై పెట్టుకొని, మెడలో, నోట్లో వేసుకొని వాటితో ఆటలాడుతుంటారు. కందుకూరు గ్రామ శివారులోని కొండెమ్మ గుట్టపై ప్రతి ఏటా నాగుల పంచమి రోజున ఈ తేళ్ల పంచమి పండుగను గ్రామస్థులు పసికందు నుంచి కుటుంబ సభ్యులంతా వెళ్లి ఘనంగా జరుపుకుంటారు. పంచమి రోజున ఆ గుట్టపై ఏ రాయిని కదిలించి చూసినా తేళ్లు బయటకు వస్తాయి. వాటిని చిన్నచిన్న పిల్లలు చేతులపై, శరీరంపై వేసుకుంటూ వాటితో ఆటలాడుతారు. పంచమిరోజు తమను తేళ్లు కరవవని వారి నమ్మకం. ఒకవేళ కరిచినా ఆదారం (కుంకుమ) వేసుకుంటే సరిపోతుందని గ్రామస్థులు చెబుతున్నారు. తేళ్లూ... దేవుళ్లని నమ్ముతున్న ఆ ఊరి జనం తేళ్ల విగ్రహాలకు ఏకంగా గుడిని కూడా కట్టారు. గుడిలో కొండ మహేశ్వరి దేవత (తేళ్లు) విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రతిఏటా నాగుల పంచమి రోజు ఆ విగ్రహాలకు నైవేద్యాలు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. తాజాగా శనివారం అందరు పుట్టలో పాలుపోసి నాగుల పంచమిని జరుపుకుంటే ఈ గ్రామస్థులు తేళ్ల పంచమిని జరుపుకున్నారు.
https://www.facebook.com/rb.venkatareddy
No comments:
Post a Comment