పరమ శివుడి ప్రేమాలయం నల్లమల అడవులు.. ~ దైవదర్శనం

పరమ శివుడి ప్రేమాలయం నల్లమల అడవులు..

* పరమేశ్వరుడి క్షేత్రం మహిమాన్వితమే...!
* తనంత తాను కుండపెంకు నందు ఆవిర్బవించిన బంగారు లింగమయ్య....
* హటకేశ్వరుని కనిపెట్టుకుని వుండే శ్వేతనాగు....
.
ఈ లోకాలన్నీ ఏలే భగవంతుడు చిత్రాతి చిత్రమైనవాడు. మొట్టమొదట ఆవిర్భవించింది ఆయనేగనుక ఈ లోకాలన్నింటిమీదా అన్ని హక్కులూ ఆయనవే. అందుకే ఆయన తన చిత్ర విచిత్రమైన లీలా వినోదాలలో తననుంచి అనేక రూపాలను ఆవర్భవింప చెయ్యటమేగాక, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కార్యక్రమంలో భాగంగా, ప్రాణులను ధర్మ మార్గాన నడిపించటానికి భక్తుల కోరిక మీద అనేక ప్రదేశాలలో అర్చామూర్తిగా స్వయంగా ఆవిర్భవించాడు. అంతేకాదు, భక్తులకు తన ఉనికిని తెలిపిన అనేక ప్రదేశాలలో, భక్తుల కోరికమీద వెలిసి పూజలందుకుంటున్నాడు.
.
.
పరమేశ్వరుడు తన కంఠంలో నాగుపామును ధరించి వుంటాడు. ఇక ఆ స్వామికి ఆభరణాలుగా చేతులకు ... కాళ్లకు కూడా నాగులు చుట్టుకుని కనిపిస్తుంటాయి. ఆ స్వామి ఎడబాటును క్షణమైనా భరించలేమని అన్నట్టుగా అవి ఆయనని అంటిపెట్టుకుని వుంటాయి. ప్రాచీనకాలానికి చెందిన కొన్ని క్షేత్రాల స్థలపురాణాలను పరిశీలిస్తే, నాగులు స్వామివారిని ప్రత్యక్షంగా సేవించినట్టు తెలుస్తూ వుంటుంది.
.
.
ఆయా క్షేత్రాల శిల్పకళలోను నాగుల ప్రతిమలు ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఆ క్షేత్రాల్లో తమ ప్రత్యేకతను ... ప్రాధాన్యతను చాటుతూ వుంటాయి. కొన్ని క్షేత్రాల్లో గర్భాలయంలోని స్వామివారిని కనిపెట్టుకుని వుంటూనే నాగులు ఆ చుట్టుపక్కల సంచరిస్తూ వుంటాయి. వాటిని దేవతా సర్పాలుగా భావించిన భక్తులు నమస్కరిస్తారే తప్ప హాని తలపెట్టరు. అలా సర్పం స్వామివారిని కనిపెట్టుకుని వుండే క్షేత్రాల్లో ఒకటిగా 'హటకేశ్వరం' కనిపిస్తుంది.
.
.
ఈ క్షేత్రంలో తరచూ ఒక శ్వేతనాగు కనిపిస్తూ ఉంటుందని భక్తులు చెబుతుంటారు. చాలాకాలం నుంచి తరచుగా అది స్వామివారి సన్నిధికి సమీపంలోనే కనబడుతోందని అంటారు. అది స్వామివారిని కనిపెట్టుకునుండే దేవతా సర్పం కావొచ్చనీ ... ఆయనని సేవిస్తూ ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. నాగులతో గల అనుబంధం కారణంగానే సదాశివుడికి 'నాగేశ్వరుడు' అనే పేరుందనీ, అలాంటి నాగులు దర్శనమిచ్చే ఆయన క్షేత్రాలు మరింత మహిమాన్వితమైనవని చెబుతుంటారు.
.
శ్రీశైలంలోని పాలధార - పంచదార సమీపంలో హటకేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఒక భక్తుడికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. మల్లిఖార్జున స్వామి దేవాలయానికి షుమారు 5కిలోమీటర్ల దూరంలో హటకేశ్వరం వుంది. ఒక బంగారు లింగము తనంత తాను కుండపెంకు నందు ఆవిర్బవించిన క్షేత్రం హటకేశ్వరము. ఆ లింగమే హటకేశ్వరుడుగ పూజలందుకుంటుంది. బంగారు బిల్వాలతో హఠకేశ్వరస్వామి ని అత్యంత భక్తితో పూజిస్తే హఠకప్రదుడైన స్వామి ధన కనకాలు ప్రసాదిస్తాడు అని నమ్మకం.
.
.
క్షేత్ర కథ :....
హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ... మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పని సరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప, శ్రీ శైలం సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు.
.
.
శివయ్య దర్శనానికి వెళ్లే వారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ ... దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ వుండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగుపొరుగువారు ... ఓ రాత్రి వేళ అతని కుండలను పగులగొట్టడమే కాకుండా, కుండలను తయారు చేసే 'అటికె'ను కూడా పాడు చేశారు.
.
.
తెల్లారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అటికె పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు. ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు.
.
.
అమ్మడానికి కుండలు లేవు ... తయారు చేయడానికి అటికె లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప, ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికె పై శివుడు ప్రత్యక్షమై, లోపలోకి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా వడ్డించాడు.
.
.
శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List