లంకమల్ల అభయారణ్యంలో కొలువుదీరి శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం.. ~ దైవదర్శనం

లంకమల్ల అభయారణ్యంలో కొలువుదీరి శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం..

కీకారణ్యం లో వెలసిన మహిమాన్వితమైన శివాలయం..
ప్రతి నిత్యము గంధర్వులు, నాగులు, యక్షులు దేవతలు కొలిచే శివలింగం.. 
శివలింగం నుంచి అలల శబ్దం, ఓం నమశ్శివాయ శబ్దం...
.
ప్రకృతి పరిచిన పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు, భారి వృక్షాల నడుమ ప్రయాణం, జలపాత సోయగాలు వర్ణనాతీతం. నిత్యం పుజలందుకునే మా నిత్య పుజయ్య స్వామీ వెలసిన పరమ పవిత్ర క్షేత్రం. దట్టమైన అడవి ,కొండలు, జలపాతాలు, గుహలు, మన రాయలసీమ ప్రాంత నేపధ్యం ఉన్న ఆలయం. సినిమాల్లో,కధల్లోనే గాక డీస్కావరీ చానల్లో చూసే వింతలు,అద్బుతాలు నిజంగానే ఇక్కడ చూడవచ్చు. దట్టమైన లంకమల్ల అభయారణ్యంలో ... ప్రకృతి రమణీయతతో... ఎత్తైన కొండపై నుండి దూకే జలపాతం... కోనేరు... రెండు కొండల మధ్య పారే సన్నని సెలయేరు, ఎత్తైన భారీ వృక్షాలు... అప్పుడప్పుడు తొంగిచూసే సూర్యుని కిరణాలు... చుట్టూ పర్వతాలు, మధ్యలో సెలయేళ్లు, జలపాతాలు, ఎనిమిది దిక్కుల్లో నీటి గుండాలతో ప్రకృతి అందాలు..మనస్సుకు ప్రశాంతతను కలుగజేస్తాయి... అడుగు ఎత్తున్న రాళ్ళ మధ్య ప్రయాణం... ప్రమాదవశాత్తూ కొండపై నుండి రాళ్ళు పడుతున్నప్పుడు శివనామస్మరణతో ఆ రాళ్ళు పక్కకు వైదోలిగే వింతలు.. భూఉపరితలానికి దాదాపు మూడు వేల అడుగులు ఉండే దట్టమైన నల్లమల అడవుల్లో రాళ్లు, రప్పలు దాటుకుంటూ వెళితే చేరుకొనే క్షేత్రం నిత్యపూజ కోన. ఒకవైపు లోయ, మరోవైపు బండ రాళ్ళ మధ్య నిత్య పూజా స్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు స్వామివారిని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. అలాగే కొంత దూరం ముందుకు వెళితే అక్కదేవతల కోనకు చేరుకోవచ్చు. శ్రీ నిత్యపూజ స్వామి క్షేత్రానికి చేరుకోవాలంటే మొత్తం నాలుగు కొండలపై ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. మాల ఆకారంలో దాదాపు 4 కిలోమీటర్లు రాళ్లపైనే నడిచి వెళ్లాల్సి ఉంటుంది. పంచలింగాల నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.
.
శ్రీశైలంకు దక్షిణ ద్వారంగా పిలువ బడే కడప జిల్లా, సిద్దవటం మండలంలోని దట్టమైన లంకమల్ల అభయారణ్యంలోని ఎత్తయిన గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం నిత్యం దేవతలు అర్చించే స్వామి శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం. ఋషి అవతారము దాల్చి సాక్షాత్తూ శివపరమాత్ముడే కొండపైన పేటు క్రింద సొరంగమార్గంలోని ఓ గుహలో తపస్సునాచరిస్తూ ఊద్భవలింగంగా మారినట్లు చెబుతారు. శ్రీ స్వామి వారిని దేవతలు, ఋషులు ప్రతి నిత్యం పూజించడము వలన నిత్యపూజస్వామిగా ప్రసిద్ధి చెందినట్లు, కొండదిగువున ఉన్న అక్కదేవతలు ఊద్భవలింగాకారంలో వున్న పరమశివుని పూజించేవారని అంటారు. ఈ స్వామికి అభిషేకము చేసి, పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతానము నొసగే స్వామిగా.. శరణు కోరిన వారికి వెన్నంటి నిలుస్తాడని భక్తుల నమ్మకం.
.
పరమ శివుని వెతుకుతూ వచ్చిన బ్రహ్మ, విష్ణు, సుబ్రమణ్య స్వామి, శ్రీ కృష్ణుడు రాధా, భద్రకాళి, కనకదుర్గ, గణపతి దేవుళ్లు కూడా ఈ గుహలలో కొలువు దీరినారు. ఈ కీకారణ్యం లో వెలసిన దేవుళ్లను కొన్ని యుగాల క్రితం పగలు ఆ ప్రాంతలో ఆటవికులు, వన్య మృగాలు పూజించేవట, రాత్రి వేళలో గంధర్వులు, నాగులు, యక్షులు దేవతలు కొలిచేవారట. ఆ రోజుల్లో కాల క్రమేణా ఆనోటా, ఈ నోటా ప్రజలకు చేరి కాలి బాటన వెళ్లే యాత్రికులు ఇక్కడ పూజలు చేసి వెళ్ళేవారట. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించే కాలం లో ఆయన ఇక్కడ స్వామి వార్ల విషయం తెలిసి వచ్చి ప్రత్యేక పూజలు చేయగా, ఆయనకు పలు విజయాలు దక్కినట్లు ఆధారాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయం ప్రక్కన చుక్కల పర్వతం నుండి కిందకు జారే జలపాతం ఒడ్డున వద్ద అరచేతులు రెండు చాపి కూర్చుంటే చేతులలో నీటి బిందువులు పడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట, ఈ ఆలయం కు దగ్గరలో కొండలో అక్కదేవతల ఆలయం దగ్గర గల గుండం నీరు లో అనేక రకాల ఔషద గుణాలు ఉన్నట్లు ,ఈ నీటి లో స్నాన మాచరిస్తే సమస్త రోగాలు నయమవుతాయని నమ్మకం. ప్రతి పౌర్ణమి రోజు స్వామివారు నాగుపాము రూపం లో ఈ గుహ నుండి బయటకు వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించి తిరిగి గుహలోకి వెళ్తుందని చెపుతారు. గుహ వద్ద చెవి పెట్టి వింటే సముద్ర అలల శబ్దం తో కూడిన ఓం నమశ్శివాయ అనే శబ్దం వినిపిస్తుందట, మరియు సుగంధ ద్రవ్యాల సువాసన గుప్పున వస్తుందని చెపుతారు. మరియు. ఇప్పటికి ఈ ఆలయ పరిసరాల్లో విద్యుత్ సౌకర్యం కూడ ఉండదు.
.
భక్తులందరు జలపాతంలో స్నానమాచరించి మెట్ల దారి గుండా నిత్యపూజయ్య స్వామి దర్శనానికి బయుదేరతారు మెట్ల చివరకు ఒక పక్క లోయ... మరో పక్క పెద్ద బండరాళ్ళ క్రింద మనకు నిత్యపూజలన్దుకునే పరమ శివుడు కనిపిస్తారు.. దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత మనకు గుహలో ఉద్భవించిన శివలింగం కనిపిస్తుంది ఈ గుహలో ప్రవేశం చాలా కష్టదాయకం.
.
సిద్ధవటం మండం మూలపల్లె గ్రామమునకు చెందిన అయ్యవారయ్య పశువులను మేపుకొంటూ ఉండేవాడు.. పశువుల మందలోని ఒక ఆవు ఉదయం, సాయంత్రం పాలు ఇవ్వకపోవడంతో అయ్యవారయ్య ఆ ఆవును పరిశీలించగా... ఆ ఆవు కొండ సొరంగ మార్గంలోని పేటు క్రింద తపస్సు చేస్తున్న శివపరమాత్ముడి దగ్గరకు వెళ్ళి పాలు ఇవ్వటం గమనించి అయ్యవారయ్య శ్రీ స్వామివారి సేవలోనే ఆరు నెలల కాలం గడుపుతాడు... స్వామి వారి కోరిక మేరకు అయ్యవారయ్య స్వగ్రామమైన మూలపల్లెకు చేరి స్వామి వారి గురించి గ్రామంలో అందరికి వివరించగా... శ్రీ స్వామి వారి ప్రసిద్ధి అందరికి తెలిసినది. అయ్యవారయ్య పెన్నానది ఒడ్డున వున్న తన స్వగ్రామమైన మూలపల్లెలోనే సజీవ సమాధి నొందాడు. నిత్యపూజయ్య స్వామిని దర్శించుకొన్న భక్తులు మూలపల్లెలోని అయ్యవారురెడ్డిని కూడా దర్శించుకుంటారు.
.
అక్కదేవతల కోన... నిత్య పూజయ్య స్వామిని దర్శించుకున్న తర్వాత అక్కదేవతల కోన వెళ్ళటానికి ఒక దారి కూడా ఉన్నది. అక్కదేవతల కోన దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ అక్కదేవతల కోన చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ఉంటాయి. ఈ ప్రదేశంలోని ఒక చిన్న గుడిలో అక్కదేవత లు కొలువై ఉంటారు. వీరు నిత్యం స్వామిని కొలుస్తుంటారని ప్రతీతి.
.
కడప నుండి సుమారుగా ౩౩ కిలోమీటర్ల దూరంలో సిద్ధవటం మీదుగా వెళితే దట్టమైన లంకమల్ల అడవిలో నిత్యపూజా కోన వెలసి ఉంది. కొండ కింద పంచలింగాల వరకు రవాణా సౌకర్యముంది. పంచలింగాల గుడి నుంచి ప్రధాన గుడి వరకు కాలినడకతో పెద్ద పెద్ద బండరాళ్ల నడుమ ప్రయాణం సాగించాలి. నడక ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి సోమవారం ఆర్.టి.సి. కడప నుండి ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు..మిగతా రోజులలో ప్రైవేటు వాహనాలలోనే వెళ్ళాలి.
.
రచన..
మీ..
ఆర్.బి. వెంకటరెడ్డి .
Don't Copy-Paste This Story
All Copyright Reserved 2017
RB. VENKATA REDDY
reddemb@gmail.com
https://www.facebook.com/rb.venkatareddy
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List