భారతీయ హిందూ గురు సంప్రదాయం. ~ దైవదర్శనం

భారతీయ హిందూ గురు సంప్రదాయం.


* గురువు అవసరం ఏమిటి...? గురువు విశిష్టత ...
* భారతీయ గురు సంప్రదాయంలో ఏన్నివిధాల గురువులున్నారు..??
* గురువు యెడల పాటించవలసిన నియమాలు ...
* సరైన గురువులను ఏ విధంగా కనుగొనాలి ..?? గురువులు ఇచ్చే దీక్ష ఎన్నిరకాలు..??
.
.
గోరుముద్దలు తినిపించే అమ్మ, వేలుపట్టి నడిపించే నాన్న తరువాత జీవనపయనాన్ని ముందుకు నడిపించేవాడు, శాసించేవాడు గురువు. అటువంటి గురువు లభించని జీవితం అగమ్యగోచరం అవుతుంది. లౌకిక జీవితానికి ఉపయోగపడే నాలుగుముక్కలూ నేర్చేసుకున్నాక ఆధ్యాత్మిక ప్రగతికి మనసు ఆరాటపడుతున్నవేళ మార్గనిర్దేశనం చేసే గురువు కావాలి. ఎక్కడ దొరుకుతాడు. వేదాంతం చెప్పడానికి ప్రతివాడూ పండితుడే. ఆధ్యాత్మికం నాకు తెలీదన్నవాడు కనబడడు. ఎందరి మాటలని వినగలం? ఎవరిలో ఏముందో ఎలా నమ్మగలం? ప్రతివారూ అనుమానించదగినవారే. దైవం, ఆధ్యాత్మిక మార్గాలపై అపనమ్మకాలతో పెరిగే ఆధునిక మానవుడికి ఆధ్యాత్మిక గురువు వెతికి పట్టుకోవడం గొప్ప ప్రయాస.
.
అజ్ఞానమనే చీకట్లు కమ్ముకున్నప్పుడు జ్ఞానమనే అంజనం కళ్లకు పూసి వెలుగుచూపేవాడు గురువు. భారతీయ గురువులే ప్రపంచ గతినే నిర్దేశిస్తున్నారని అధ్యాత్మ విధులు చెబుతారు. మహాయోగులు, తపస్సంపన్నులు ఎందరో ఈ పుణ్యభూమిపై ఉన్నారు. అయితే అటువంటి పరమగురువులను కలుసుకోవడం అందరికీ సాధ్యపడుతుందా.?
.
వివేకానందుని అన్వేషణ కంటే ముందుగానే రామకృష్ణుల అన్వేషణ మొదలైందట. వివేకానందుని చూడగానే రామకృష్ణులు గుర్తుపట్టి ఒక్కసారి దక్షిణేశ్వరానికి రమ్మని పిలిచారట. కానీ వివేకానందులు దాదాపు అయిదేళ్లవరకూ రామకృష్ణుల వద్దకు వెళ్లనే లేదు. అంటే గురువు సంకల్పమే కాదు.. శిష్యుని అర్హత కూడా జతపడాలి. లాహిరీ మహాశయులను కేవలం మనస్సంకల్పంతో ఆకర్షించారు మహావతార్ బాబా.
అన్నీ అర్ధమయ్యేలా చెప్పేవారే కాదు. మౌనంగా ఉండేవారూ మహాగురువులే. నోరువిప్పి మాటలే మాట్లాడని రమణ మహర్షి వద్దకు ఎందరో విదేశీయులు వచ్చేవారు. గురోర్మౌనం సంశయచ్ఛేదః అన్నట్లు ఆయన మౌనం నుంచే శిష్యులకు కావలసిన సమాధానాలు దొరికేవి. మెహర్ బాబా ఏదైనా మాట్లాడవలసి వస్తే రాసి చూపించేవారు. కుర్తాళ పీఠస్థాపకులు మౌనస్వామి. ఏ మహనీయుని దగ్గరకు వెళ్లగానే సందేహాలు నివృత్తి అవుతాయో, ఏ వ్యక్తి దగ్గర ప్రశాంతత, ఆనందము కలుగుతాయో, ఏ వ్యక్తిమీద నమ్మకము, గురి కలుగుతాయో, ఆ మహనీయుడే నీకు గురువు అని గుర్తుపట్టాలంటారు.
.
.
భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్ధనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం.
భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తి అన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులు, పరశురాముని వద్ద భీష్ముడు, ద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు, వీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్య, రామకృష్ణ పరమహంస వద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. దత్తాత్రేయుని, షిర్డీ సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.
.
.
* గురువు విశిష్టత:..
శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.
.
.
* గురువు యెడల పాటించవలసిన నియమాలు:...
గురువు నిల్చుకొనిన శిష్యుడు కూర్చొని ఉండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు..
ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు..
గురునింద చేయరాదు వినరాదు గురునికప్రియమును గూర్చరాదు..
గురువు ఆజ్ఞను మీరరాదు..
గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు..
శ్రీగురుమూర్తి చూసినవెంటనే నమస్కారము చేయవలయును...
కులము,ధనము తారత్తమ్యము వీడి గురువును ఆశ్రయించాలి...
సుతుడైన హితుడైన సోదరుడైనను గులహీనుడైన కొలువవలయును..
గురునాజ్ఞ అనుసరించి గురువిచ్చుతృణమైన మేరువుగా భావించవలయాను..
గురువును స్వామి దేవర అనుచు లోభ గుణములు వీడి సేవించవలయాను..
.
.
* సరైన గురువులను ఏ విధంగా కనుగొనాలి:...
ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ఆ మహనీయుడే నీకు గురువు...
.
.
* గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు:...
(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.
.
.
* భారతీయ గురు సంప్రదాయంలో ఏడువిధాల గురువులున్నారు:...
సూచక గురువు – చదువు చెప్పేవాడు
వాచక గురువు – కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
బోధక గురువు – మహామంత్రాలను ఉపదేశించేవాడు
నిషిద్ధ గురువు – వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పేవాడు
విహిత గురువు – విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
కారణ గురువు – జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
పరమ గురువు – జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.
ఏ గురువూ తానెవరో చెప్పలేడు. తన గురువు తనకెవరో తెలియాలంటే తాను ఒక్కొక్కమెట్టుగా ఎదగాలి. అతి ఆరాటం, సంశయం శుశ్రూష చేసే శిష్యునికి తగనివి. మర్మం విడిచిపెట్టే గురువు కోసం చేసే అన్వేషణం ఆగకూడనిది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List