బ్రహ్మ సత్యం- జగన్మిథ్య ~ దైవదర్శనం

బ్రహ్మ సత్యం- జగన్మిథ్య

బ్రహ్మము నుండి సృష్టి ఏవిధంగా ఆవిర్భావం జరిగింది...అన్న విషయం పై ...క్రియా యోగాచార్య శ్రీ అశోక్ కుమార్ చటోపాద్యాయ గారి భావనలు చదువగలరు.

 గీత ఏమి చెప్పిందో చూద్దాం. "ఏకాంశేన స్థితో జగత్" అన్నది. ఈ చెప్పిన స్థిర నిశ్చల బ్రహ్మలో ఒక అంశకు చంచలత్వము కలగడం వల్ల, ఆ చంచలత్వం క్రమంగా పెరుగుతూ వచ్చి ఈ జగద్బ్రహ్మాండ సృష్టి జరిగింది. దీంట్లోనే అది నిలదొక్కుకున్నది. ఏకాంశం అన్నదానికి అర్థం, ఆ అనంత బ్రహ్మలోని ఒక భాగం అని అనుకోకూడదు. ఒకవేళ అలా అనుకొంటే, తక్కిన భాగంలో చంచలత్వం లేదని  చెప్పవలసి ఉంటుంది. పోనీ అలాగే అంటామనుకోండి. దాని వల్ల పెద్ద తప్పు అయిపోతుంది. అందువల్ల ఏకాంశం అన్నదానిని, మొత్తంలో నూరింట ఒక పాలు అని గ్రహించాలి.(One per cent among the whole). అంటే అనంతంలో కేవలం ఒక్క శాతం చంచలమయిందన్నమాట. మరి ఆ ఒక్క శాతం చంచలత్వము కూడా తక్కిన 99% నికి మధ్యలోనే ఉండిపోయింది. పూర్ణమయినది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. 100% స్థిరం ఎప్పుడూ 100% గానే ఉంటుంది. దానిని విభజించడం సంభవం కాదు. ఇందువల్లనే 100 శాతానికి మధ్యలో ఒక్క శాతం చంచలమయ్యి, ఆ 100 శాతంలోనే ఉండిపోయింది. ఆతరువాత ఆ ఒక్క శాతము చంచలత్వము క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరిలో పూర్తి చంచలత్వంగా బయలు పడింది. ఈ ప్రకారంగా ఒక్క శాతం చంచలత్వము...సున్న శాతం నుండి 1, 2, 3,4  .....మాదిరిగా పెరుగుతూ వచ్చి పది రెట్లు అయింది.

     మొదటి పది శాతం చంచలం అయినప్పుడు , ఆ స్థితిని "ఆకాశ తత్త్వం" అంటారు. ఇందువల్ల ఆకాశ తత్త్వం చాలా సూక్ష్మమయినది. మరి 10 x  10 = 100 శాతం చంచలమయినప్పుడు , ఆస్థితిని "వాయుతత్త్వం" అంటారు. ఈ వాయుతత్త్వం శూన్యం కంటే స్థూలమైనది కావడం వల్ల , కళ్ళకు కనబడకపోయినా...దాని స్పర్శానుభూతి మనకు కలుగుతుంది. తరువాత 100 x 10 = 1000 తరంగాలు ఏర్పడినప్పుడు  ఆ అవస్థను "తేజస్తత్త్వం" అంటారు. ఈ తేజస్తత్త్వం...వాయు తత్త్వం కంటే స్థూలమైనది. అందువల్ల కళ్ళకు అగ్ని కనిపిస్తుంది...కానీ వేడి కనబడదు. వేడి అనుభూతి వల్ల తెలుస్తుంది. తరువాత 1000 x 10 = 10,000 తరంగాలు ఏర్పడినప్పుడు ఆ అవస్థను "ఆప తత్త్వం" లేదా " జలతత్త్వం" అంటారు. ఈ జలతత్త్వం, తేజస్తత్త్వం కన్నా స్థూలమైనది. అందువల్ల కంటికి కనిపిస్తుంది. 10,000 x 10 = 1,00,000 తరంగాలేర్పడినప్పుడు ఈ అవస్థను ...పృథ్వీ తత్త్వం లేదా భూతత్త్వం అంటారు. ఈ పృథ్వీతత్త్వం...అన్ని తత్త్వాల కంటే స్థూలమైనది. అందువల్ల సమస్త జీవులూ 1,00,000 తరంగ విశిష్టాలై భూతత్త్వంలో నెలకొని ఉన్నాయి. అంటే ప్రాణం తాలూకా 1,00,000 తరంగాల్లో  జడచేతనాలు...రెండూ ఉన్నాయన్నమాట. ఈ చివరి లక్ష తరంగాలవల్లనే సమస్త సృష్టి పూర్తిగా వ్యక్తమయింది. కాబట్టి ప్రతీ ఒక్క జీవికీ ఉనికి లక్ష తరంగాల అవస్థ అనుకోవచ్చు. ఈ స్థితిలోనే స్థూల శరీరం పూర్తిగా తయారవుతుందన్నమాట. శరీరంలోని 49 వాయువులు తయారై పనిచేయడానికి , సమర్థం అవుతాయి. ఈ వాయువులన్నిటి ద్వారా సకల ఇంద్రియాలూ...శత్రువులూ ఉత్పన్నమై, కర్మ సమర్థాలు అవుతాయి. కళ్ళు చూస్తాయి. చెవులు వింటాయి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము...అన్నీ పనిచేస్తాయి. ఇక్కడ స్పష్టం అయ్యే విషయం ఏమిటంటే...ఈ ప్రాణం యొక్క 1,00,000 తరంగాల మూలావస్థ ...స్థిరావస్థయే. ఆ స్థిరావస్థ లేకపోతే తరంగాలు ఉండడం సంభవం కాదు. కాబట్టి స్థిరత్వమే అన్నిటికీ మూలం. ఈ స్థిరత్వాన్నే " బ్రహ్మము" అంటారు. ఈ కారణం చేతనే ఋషులు, "బ్రహ్మ సత్యం, జగన్మిథ్య" అన్నారు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List