శివ నగరిలో నారాయణ వైభవం. ~ దైవదర్శనం

శివ నగరిలో నారాయణ వైభవం.


.
హిమాలయాలు శివపార్వతుల నివాస స్థలంగా మన పురాణాలు చెబుతాయి. ఈ కారణంగానే హిమాలయాల్లో ప్రముఖ శైవక్షేత్రాలు మణిమహేష్, బైజ్‌నాథ్, కైలాస మానస సరోవరం, కేదార్‌నాథ్, మాతాస్థానాలయిన బ్రజేశ్వరి, చింతపూర్ణి, నైనాదేవి, జ్వాలాముఖి వంటి ఎన్నో ఆలయాలు శక్తిపీఠాలుగా వెలిశాయి. మణిమహేష్, భర్‌వౌర్ తహసీల్ వంటవి చంబా జిల్లాలో నెలకొన్నందున ఈ జిల్లాను ‘‘శివ నగరి’’గా పిలుస్తున్నారు. మణిమహేష్‌ను ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో లక్షలాది శివభక్తులు ముఖ్యంగా ఉత్తరాది నుంచి వచ్చి దర్శిస్తారు. అలాంటి శివనగరిలో వైష్ణవులకు ప్రీతిపాత్రమైన 11వ శతాబ్దం నాటి పురాతనమైన లక్ష్మినారాయణుని ఆలయం గురించి ఇతర ప్రాంతాల వారికి తెలియదంటే అతిశయోక్తికాదు. ఈ ప్రాంగణంలో ఆరు మందిరాలు, శిఖర శైలిలో ఒక క్రమంలో ఉత్తరం నుండి దక్షిణానికి ఒకదాని తర్వాత ఒకటి నిర్మితమయ్యాయ. హరి,హరులకు అంకితము కావించబడి, ఇవి భక్తులకు శోభాయమానంగా దర్శనమిస్తాయి. వీటిలో లక్ష్మినారాయణ్, రాధాకృష్ణ, లక్ష్మీదామోదర్, చంద్రగుప్త్, గౌరీశంకర్, త్రయంబకేశ్వర్ మందిరాలు మనలో భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయ. ఈ మందిర ప్రాంగణం చంబా పట్టణం (హిమాచల్‌ప్రదేశ్)లోని రావీ నది ఒడ్డున పటాన్‌కోట్ నుండి 110 కి.మీ దూరంలో నెలకొని ఉన్నది. ఈ ఆలయాన్ని చంబా రాజ్యానికి అధిపతి అయన రాజాసాహిల్‌వర్మ 11వ శతాబ్దంలో తన 9మంది పుత్రులను మహావిష్ణువు (లక్ష్మినారాయణుడు) విగ్రహం తయారుచేయడానికి సరిపడే ఉత్తమమైన పాలరాతిని వెతికి తెచ్చేందుకు వింధ్య పర్వతాలకు పంపుతాడు. ఇలా పాలరాయిని సేకరించి విగ్రహాన్ని తయారుచేసినట్లుగా చంబా రాజుల శాసనాల్లో చెక్కబడి యున్నది. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం
సంపాదించుకొన్న ‘‘శిఖర వాస్తు’’ పద్ధతిలో ఈ ఆలయం నిర్మించబడి వున్నదని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఆలయంలో రాతి మండపాలు, చెక్కతో నిర్మించబడిన వరండాలు, వర్షం నుండి రక్షించటానికి గొడుగులు, శిఖరంలో బంగారు నగిషీతో చేయబడిన కలశాలతో కనులకు విందు కలిగిస్తాయ. ‘‘శిఖర శైలి’’ అనగా గర్భగుడి పైభాగం ఒక శిఖరం లాగా నింగిలో ఎగిసేటట్లు నిర్మించబడి ఉండడం. ఈ గర్భగుడి ప్రత్యేకత ఏమంటే- దీనికి నలుదిశలా రాతిగోడలపై, ప్రముఖమైన అన్ని దేవతల విగ్రహాలను, చిన్నచిన్న గుడుల రూపంలో నిర్మించి, అందులో కొలువు తీర్చి ఉండటమే. ఈ విగ్రహాలన్నీ ఏళ్లు గడిచిన కొద్దీ అరిగిపోయి పురాతన వైభవాన్ని చాటిచెప్పుకొనే రీతిలో కనిపిస్తాయి. ఇందులో ముఖ్యంగా సూర్యచంద్రాదులు, ఇంద్రుడు, యముడు, శివపార్వతులు, గణేష్, హనుమాన్, సరస్వతి, బ్రహ్మ, భద్రకాళి, గోపికల నడుమ శ్రీకృష్ణుడు, పాలసంద్రాన్ని చిలుకుతున్న దేవతలు, మరికొన్ని విగ్రహాలు గత వైభవ చిహ్నాలుగా దర్శనమిస్తాయి. వీటిలో నవగ్రహాలు కూడా ఉన్నవి. ఇక్కడి చంద్రశేఖరుని గోపురంలోని శివపార్వతుల ఇత్తడి విగ్రహాలు అత్యంత మనోహరంగా పసిడిని మించి కాంతులు వెదజల్లుతూ, భక్తులకు అభయమిచ్చి ఊరట కలిగిస్తాయి. ఆలయ ముఖద్వారంలో ఎత్తయిన రాతి ధ్వజస్తంభంపై ఇత్తడితో పోత పోసిన గరుడుడు దర్శనమిస్తాడు. ఈ ఆలయ శిఖరాలపై బంగారు పోత పోసిన కలశాలను 16వ శతాబ్దంలో ఔరంగజేబు చంబారాజు ఛత్రసింహ్‌తో తలబడి, వెనుతిరిగిన సందర్భంలో అలంకరించబడినది. ఈ మందిరం సమీపంలో అనేకమంది హస్తకళాకారులు స్వచ్ఛమైన ఇత్తడితో లక్ష్మినారాయణుడి విగ్రహాలను తయారుచేసి భక్తులకు విక్రయిస్తూ కనిపిస్తారు. దీనిని ‘‘చంబాతాళీ’’గా పిలుస్తారు. ‘‘తాళీ’’అంటే హిందీలో పళ్ళెము అని అర్థము. ఇక్కడ శ్రీ లక్ష్మినారాయణుడు, రాధాకృష్ణులు, గణేష్ భగవానుడు, నరసింహుడు, దశావతారాలను ఇత్తడి పలకాలపై ముద్రించి భక్తులకు ఇస్తుంటారు. ఇవి అందరూ కొన గలస్థాయలో ఉండడం తమకు ఎంతో ఆనందదాయకం అని ఇక్కడికి వచ్చే భక్తులు అంటారు. ఆధునిక కాలంలో ప్రతి పట్టణంలో, నగరంలో లక్ష్మినారాయణుడి మందిరాలు లెక్కలేనన్ని నిర్మించినా, 11వ శతాబ్దపు చంబా శ్రీ లక్ష్మినారాయణుని మందిరం తన ప్రత్యేకతను ప్రతి దానిలోనూ కనబరుస్తున్నది. ఈ మందిరం పురాతనత్వం ఒక పక్క మనల్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరోపక్క మందిరంలో కొలువుతీరిన విగ్రహమూర్తులు ఘనమైన చరిత్రకు సాక్షీభూతాలుగా నిలుస్తాయ. ఏటా వేసవిలో చంబాలో జరిగే ‘‘రాష్టస్థ్రాయి మింజర్ మేలా’’లో పాల్గొని శ్రీ లక్ష్మినారాయణుడిని అనేకమంది సందర్శిస్తుంటారు. తరతరాల హస్తకళను, చంబా తాళీని, చంబా రుమాలును, చంబా చెప్పులను ఖరీదుచేసి అంతరించిపోతున్న ప్రాచీన కళలను కూడా ప్రోత్సహించటం మన కనీస ధర్నం. ‘‘భక్తియాత్రలకు కాశీ ప్రయాగలేలనో’’అని సంతృప్తిచెందితే, 11వ శతాబ్దపు లక్ష్మినారాయణుడి ఆలయ దర్శనభాగ్యం మాత్రం లభించదు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List