పుష్పగిరి క్షేత్రం ~ దైవదర్శనం

పుష్పగిరి క్షేత్రం


ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా విరాజిల్లుతున్న పుష్పగిరి క్షేత్రం కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద గ్రామం ఉంది. ఇది హరిహరాదులక్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.. పుష్పగిరి క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది.
పుష్పగిరి ఆలయం ఎదురుగానే పుష్పగిరి మఠం ఉంది. ఈ క్షేత్రాన్ని వైష్ణవులు మధ్య ఆహోబిలం అనీ, శైవులు మధ్య కైలాసం అని పిలుస్తూ ఉంటారు. రాష్ట్రంలో శంకరాచార్య మఠం ఇదొక్కటే. ఈ మఠానికి ఎదురుగా త్రికూటేశ్వరాలయం ఉంది. కమలేశ్వర, హచాలేశ్వర, పల్లవేశ్వర ఆలయాలు 1255లో ప్రతిష్టించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలకూ ఉమ్మడి ముఖమంటపం ఉంది.
అలాగే, చోళ రాజుల కాలంలో నిర్మించిన వైద్యనాథ ఆలయం పశ్చిమం వైపు ముఖం కలిగి ఉంది. పుష్పగిరి శిల్పకళా సంపదకు పేరొందింది. ఆలయం గోడలపై శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఏనుగుల వరసలు,గుర్రాల మీద వీరుల విన్యాసాల దృశ్యాలు చూడముచ్చటగా ఉంటాయి. వైద్యనాదేశ్వరుణ్ణి శైవులు, చెన్నకేశవస్వామిని వైష్ణవులు అర్చిస్తారు.

జనమేజయుడు చేసిన సర్పయాగా పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పౌరాణిక గాథప్రచారంలో ఉంది. చోళులు, పల్లవులు,కృష్ణదేవరాయులు ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధిపర్చారు.

పుష్పగిరి కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం నెలకొని ఉండటం విశేషం.పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాదేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలు ఉన్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండమీద ఉన్నాయి.

పవిత్ర పినాకినీ నదీ తీరంలో వెలసిన ఈ కేత్రానికి కడప నుంచి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా చేరుకోవచ్చు. ఖాజీపేట నుంచి చింతలపత్తూరు మీదుగా వెళ్ళేందుకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. జాతీయ రహదారిపై తాడిపత్రి నుంచి వల్లూరు మీదుగా పుష్పగిరి చేరుకోవచ్చు.

పుష్పగిరిలో అమృత సరోవరం ఉంది. దీనికి సంబంధించిన పురాణగాథ ప్రచారంలో ఉంది. గరుత్మంతుడు ఇంద్రుని అమృత భాండాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఇంద్రుడు అడ్డగించగా, ఆ భాండంలోని కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగేవారికి యవ్వనం లభించేది. అమరత్వమూ సిద్ధించేది. దాంతో భయపడిన దేవతలు శివుణ్ణి ఆశ్రయించగా, ఆయన వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పంలా తేలింది. అదే పుష్పగిరి అయిందట. పుష్పగిరి వద్ద పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. దాంతో పుష్పగిరికి పంచనదీ క్షేత్రంగా పేరొచ్చింది.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List