అన్నమయ్య వేంకటేశుని ఎంతగా వర్ణిస్తాడంటే ఎన్నోసార్లు చెప్పినదే చెప్పి మళ్ళీ మళ్ళీ తలచుకుంటాడు.ఎన్ని సార్లు తలచుకున్నా ఎన్ని సార్లు చెప్పినా పునరుక్తి దోషంగా కనబడదు.
శ్రీ మహావిష్ణువు దశావతారాలను తనివితీరా ఓ యాభై కీర్తనలపైనే వర్ణించి ఉంటాడు. అమ్మ సింగారాలపై, దయామృత హృదయంపై,శ్రీ కృష్ణుని బాల్య చేష్టలలోని విశిష్టతలపై, శ్రీ రామునిపై, వివిధ మానసిక అవస్థలపై , చివరికి అయ్యవారి చేతులపైన, పాదాలపైన కూడ అద్భుతమైన కీర్తనలను రచించాడు.
'బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము'
ఇది బహుళ ప్రచారం పొందిన కీర్తన.శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తన పాదంతో ఏమేమి చేశాడో చెపుతున్నడు అన్నమయ్య.స్వామి ఒక్కొక్క అవతారంలో తన పాదంతో ఒక్కొక్క మహిమను చేశాడట.
'చెలగి వసుధ గొలచిన నీపాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము'
పాదము పేరు తలచుకోగానే ఎవరికైనా గురుతొచ్చేది వామానావతార ఘట్టమే!
బలి చక్రవర్తిని మూడడుగుల నేల దానమడిగి ఆ చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన ఘట్టం.
ఇక్కడ మనము ఓ సంగతి గమనించాలి. బలికి స్వామి విధించినది శిక్ష కాదు. పాతాళానికి అధిపతిగా బలిని అభిషేకించాడు.
ఈ పట్టాభిషేకాన్ని సూచిస్తూ నే అన్నమయ్య 'బ్రహ్మ కడిగిన పాదమన్నాడు'
వామనుడు త్రివిక్రమునిగా మారినప్పుడు మొదటగా ఆకాశాన్ని తన పాదంతో కొలిచాడు. ఆ సందర్భంగా బ్రహ్మ సత్యలోకంలోకి వచ్చిన తన తండ్రి గారి పాదాలను తన కమండలంలోని గంగాజలంతో అభిషేకించాడట.
మహారాజ పట్టాభిషేకాలకు గంగా జలాన్ని వాడడం ఇక్కడే ప్రారంభమయ్యింది. ఆ రకంగా బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అధిపతిగా అభిషేకించిన సంగతిని గుర్తుచేస్తున్నాడు అన్నమయ్య!
తరువాత సగరపుత్రుల పేరుతో గంగను పాతాళానికి పంపాడు. ఇప్పటికీ బలి చక్రవర్తి ప్రతీ సంవత్సరం భూలోకానికి వస్తాడని నమ్మకం! అన్నట్టు నిన్నో మొన్నో కేరళీయులు ఆ బలి చక్రవర్తికి 'ఓణం' స్వాగతం అందించినట్టున్నారు.
'కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము'
త్రేతాయుగములో అహల్య పాపమును క్షాళనం చేసిందీ పాదము. ద్వాపర యుగంలో కాళిందీ నది జలాలను విషపూరితం చేసిన కాళింగుని తలపై తాండవ నృత్యం చేసిందీ పాదమే!
ప్రేమతో శ్రీసతి నిత్యం ఈ పాదాల సేవ చేస్తూ ఉంటుందట! సాధారణంగా శ్రీపతి ప్రయోగం చూస్తూ ఉంటాము. కాని ఇక్కడ అన్నమయ్య 'శ్రీసతి' పదాన్ని వేశాడు.
'పామిడి తురగపు పాదము'
ఈ 'పామిడి' పదం లోకంలో గొప్ప సందేహాన్ని సంచలనాన్ని సృష్టించింది.
పెద్ద పెద్ద పండితులు ఈ పదాన్ని రకరకాలుగా నిర్వచించారు.
కొందరు పామిడి అంటే పాముకు శత్రువు అని అర్ధమని, శ్రీ మహావిష్ణువు కలియుగంలో కల్కిగా అవతరించినప్పుడు తురగాన్ని అధిరోహిస్తాడు కాబట్టి పాముకు శత్రువైన గరుత్మంతుడే తురగమవుతాడని అన్నమయ్య భావమనివివరించారు.
ఒకసారి ఒక సమావేశములో ఒకరు మాట్లాడుతూ పామిడి అనే గ్రామంలోపూర్వము అరేబియా దేశము నుంచి ఉత్తమాశ్వాలను తీసుకువచ్చి అమ్మే వారని అదే అన్నమయ్య సూచించాడని సిద్దాంతం చేశారు.
కాని ఈ విషయాలను పరిశోధించిన సముద్రాల లక్షమయ్య గారు, 'అన్నమయ్య పదకోశాన్ని' రూపొందించిన ఆచార్య రవ్వా శ్రీహరి గారు 'పామిడి' అన్న పదానికి 'అడ్డమాక లేక ఉద్దండంగా తిరిగే గుఱ్ఱము యొక్క పాదము' అని సప్రమాణకంగా నిర్ధారించారు.
'పరమయోగులకు పరి పరి విధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము'
శ్రేష్ఠులైన యోగులందరూ ఈ పాదాలను ఆశ్రయించే యుగాల తరబడి తపస్సులు చేసి పరమపదాన్ని అందుకుంటున్నారు. వారందరికీ తిరు వేంకట నాథుని పాదములే దిక్కు అని అన్నమయ్య సిద్దాంతం చేశాడు.
No comments:
Post a Comment