కాశీ ఖండం –18 ~ దైవదర్శనం

కాశీ ఖండం –18

ధ్రువ చరిత్ర...  శివ శర్మ విష్ణు గణాలను ‘’ఏక పాదం మీద నిలిచి ,ఏదో ఆలోచిస్తున్నట్లు ,కాంతుల చేత ముల్లోకాలకు మండప స్థంభం వంటి వాడుగా ,కాంతులు వేద జల్లుతూ ,అనంత తేజో విరాజం గా ఉన్న ,ఆకాశం లో సూత్ర ధారిలా ,దాన్ని కొలుస్తున్న వాడిలా .యూప స్థంభం లా నిల బడి ఉన్న ఈ మహా పురుషుడు ఎవరు ?’’అని ప్రశ్నించాడు .ఆ మహనీయుడే ద్రువుడని చెప్పి ధ్రువ చరిత్ర ను తెలియ జేశారు .స్వయం భువునకు ఉత్తాన పాదుడనే కుమారుడున్నాడు .అతనికి సురుచి అనే భార్య వల్ల ఉత్తముడు అనే పెద్ద కొడుకు ,సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు అనే చిన్న కొడుకు కలిగారు .ఒక రోజు సునీతి ఏదో పని లో ఉండి తనకుమారుడు ధ్రువుడిని సర్వాంగ సుందరం గా లంకరించి దాసికి చ్చి  రాజు దగ్గరకు పంపింది .అతను తండ్రికి నమస్కరించి నిల బడ్డాడు .అప్పటికే ఉత్తముడు రాజు గారి తోడ మీద కూర్చుని రాజసం ఒలక బోస్తున్నాడు .బాల్య చాపల్యం చేత ధ్రువుడు కూడా తండ్రి తోడ మీద కూర్చొనే ప్రయత్నం చేస్తు కాళ్ళ మీద నుంచి పాకుతున్నాడు . .అప్పుడు చుప్పనాతి సురుచి ‘’నువ్వు బాలిసుడివి .మహా రాజు అంకాన్ని చేరే అదృష్టం నీకు లేదు .అభాగ్యు రాలి గర్భం లో జన్మించావు .నేల మీద పాకే నువ్వెక్కడ ?సింహాసనం మీద కూర్చునే ఉత్తముడేక్కడ ?’’అని లాగి పారేసింది .రాజు కూడా ఏమీ అనలేక పోయాడు .కానీ లోపలి పోయి కన్నీళ్లు పెట్టు కొన్నాడు రాజు .

             అమాయకుడైన ధ్రువుడు ఏమీ చేయ లేక తండ్రికి నమస్కరించి తల్లి సునీత వద్దకు చేరి ఏడ్చాడు .తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం తనకు ఎందుకు కలగ లేదని ,ఆ అర్హత సంపాదించ టానికి తానేం చేయాలని అడిగాడు .అప్పుడు తల్లి‘’నాయనా ధ్రువా !సురుచి మానవతి అయిన భార్య ..ఆమె అంటే రాజు గారికి అభిమానం ఎక్కువ .నా దురదృష్టం వల్ల నేను ఆయన ప్రేమకు ఎక్కువ గా నోచుకో లేక పోయాను .పుణ్య వశం చేత ఉత్తముడు ఆమె గర్భం లో జన్మించి రాజ యోగ్యుడైనాడు‘’అని చెప్పి పుణ్యం రావాలంటే ఎలా వస్తుందో వివ రించింది సాత్విక మైన మనస్సు ,దయాదృష్టి ,శివ పూజ ,శాస్త్ర జ్ఞానము ,చదువు ,అరిషడ్వర్గాలను జయించటం ,తియ్యని మాట ,పనులలో శ్రద్ధ ,అలస్యం చేయక పోవటం ,గురు భక్తీ ,నిష్కాపట్యం ,దైన్యం లేని సంభాషణ ,శబ్ద పాండిత్యం ,బంధు గణాలను ఆదరించటం ,క్రయ ,విక్రయాలలో కఠినత్వం భార్యతో మృదువు  గా మాట్లాడటం ,తీర్ధాలు సేవించటం ,యుద్ధం లో వీర మరణం ,పిల్లల మీద వాత్సల్యం ,యాచకులకు ,వికలాంగులకు దానం చేయటం ,తల్లి దండ్రుల సేవ ,నిత్య ధర్మా చరణ,ఉత్తమ శీలం ,మంచి వారితో స్నేహం ,ఇతి హాస పురాణాలను వినటం ,ఆపదలలో ధైర్యం ,సంపద చేరినపుడు స్తైర్యం ,యతీశ్వరుల యెడ ఔదార్యం ,దేహాన్ని కృశింప జేసుకోవటం ,ఇంద్రియ జయం ,తపో నియమం అనే  ఉత్తమ గుణాల చేత తపో వృక్షం ఫలిస్తుంది .నువ్వు రాజు గారి కుమారుడవే కాని విశేష పుణ్యం చేయలేదు .నువ్వు చేసిన కర్మ కు తగిన ప్రతి ఫలమే లభిస్తుంది .కనుక దుఖించకు అని ఓదార్చింది .

                 తల్లి సునీతి మాటలు విన్న ధ్రువుడు ‘’అమ్మా !నేను బాలుడిగా మాట్లాడుతున్నానని అనుకో వద్దు .ఉత్తాన పాద రాజు గారి కుమారుడిని కనుక తపస్సు చేస్తాను .తపస్సు సర్వ సంపదలకు కారణం కదా .ఎవరికీ లభించ నంతటి గొప్ప పదవిని నేను సాధిస్తాను .నన్ను ఆశీర్వ డించి పంపించు ‘’అని కోరాడు అప్పుడామె ‘’ధ్రువా !నీకిప్పుడు తోమ్మిదేళ్ళే.నీకు ఆజ్న ఇచ్చే సమర్ధత నాకు లేదు .కానీ నీ మనో నిశ్చయం నాకు సంతృప్తి నిచ్చింది .కన్నీటి తోనే నిన్ను తపస్సుకు అంగీకారిస్తున్నాను‘’అని ఆశీర్వదించి పంపింది .

                ధ్రువ బాలకుడు అక్కడి నుండి బయల్దేరి నిర్జరా రణ్యం ప్రవేశించాడు .దారిలో సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది .వారికి నమస్కరించాడు .తన చరిత్ర అంతా వారికి దీనం గా వివ రించి ,వారి మనసులను దోచాడు .అతడి కోరిక ఏమిటని అడిగారు .అప్పుడు ధ్రువుడు వినయం గా వారితో ‘’నా సోదరుడు ఉత్తముడు మా తండ్రి తోడ మీద కూర్చునే అదృష్టాన్ని పుణ్యం వల్ల  పొందాడు .నాకూ ఆ అర్హత కావాలి మా తండ్రి సింహాసనం వేరొకరికి దక్క రాదు .ఇది ఇతరుల సింహాసనం కంటే ఉన్నత  మైంది .అది ఇంద్రాదులకు కూడా పొంద రానిది .మా తండ్రి వదిలిన సింహా సనం కాదు నాకు కావాల్సింది .నా బలం చేత సాధించుకొన్న సింహాసనం నాకు కావాలి .అది నాకు ఎలా  వస్తుంది ?దాని సాధనకు నేనేమి చేయాలి ‘’అని ప్రార్ధించాడు .అప్పుడు వారిలో మరీచి మహర్షి  ‘’శ్రీ మన్నారాయణుని భజించకుండా ఆ యోగ్యత రాదు .అన్నాడు .అంగీరసుడు ‘’ఈలోకం లో సంపద ను అను భ వించాలంటే కమలాక్షుని సేవిన్చాల్సిందే ‘’అనగా ,పులస్తుడు ‘’ఎవరిని స్మరిస్తే సమస్త పాపాలు నశిస్తాయో అతడే మహా విష్ణువు ‘’అని ,పులహుడు ‘’ఎవని మాయ చేత అంత ప్రవర్తిస్తోందో ఆ అచ్యుతు డే సర్వాన్ని ఇస్తాడు ‘’అని ,క్రతువు ‘’ఈ జగాలకు ఎవరు అంత రాత్మ యో ఆ విష్ణువు సంతోష పడితే ఇవ్వనిది ఉండదు ‘’అని వసిష్ఠ మహర్షి ‘’ఎవరి కను బొమల అజ్ఞచేత అష్ట సిద్ధులు ప్రవర్తిస్తాయో ,ఆ హృషీ కేషుని ఆరాధించు ‘’అని అందరు విష్ణువే ఏదైనా ఇవ్వ గల సమర్ధుడని బోధించారు .

               అప్పుడా ధ్రువ బాలుడు ‘’మహర్షి సత్తము లారా !నిలబడినా ,నడుస్తున్నా ,పడుకొన్నా ,నిద్రిస్తున్నా ,మేలుకొన్నా కూర్చున్నా ,ఎప్పుడూ నారాయణుడిని స్మరించాలి ద్వాదశాక్షరీ మంత్రం వాసు దేవాత్మకం .ఆ జపం తో శ్రీ మన్నారాయనుని జపించి నేను నా కోర్కెను తీచుకొంటాను .ఆయన మనసు కరగిస్తాను .ఈ మంత్రాన్ని పూర్వ బ్రహ్మ ,మునులు ఉపాసిన్చారని తెలుస్తోంది ‘’అన్నాడు మహర్షులు ద్వాదశాక్షర మంత్రం తో వాసు దేవుడిని ప్రసన్నం చేసుకోమని సలహా నిచ్చి మనస్పూర్తిగా ఆశీర్వా దించి అంతర్హితులయ్యారు .ధ్రువుడు వాసు దేవ మనస్కుడై తపస్సు చేసుకోవ టానికి అక్కడి నుండి బయల్దేరాడు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List